S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ద్వారకతిరుమలలోని శ్రీ వేంకటేశ్వర వికలాంగుల, పునరావాస సంస్థకు 10 కోట్లు మూలనిధి

తిరుపతి, ఆగస్టు 2 : ద్వారక తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర వికలాంగుల, పునరావాస సంస్థకు 10 కోట్ల రూపాయలు మూలనిధి ఇవ్వాలని ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం తిరుమల అన్నమయ్యభవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేఖర్లకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5.5 కోట్ల రూపాయలతో స్వామి, అమ్మవార్ల ప్రతిమలు ఉన్న వెండి డాలర్‌ను తయారు చేయడానికి నిర్ణయించామన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వీరభద్రాపురం గ్రామంలోని శ్రీ వీరేశ్వరి ఆలయం మరమ్మతులకు 25 లక్షల రూపాయలు నిధులు కేటాయించామన్నారు. తిరుపతి రాయలచెరువు ప్రాంతంలో 32 లక్షల వ్యయంతో 46 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించామన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి 31.25 లక్షలతో నూతన మహారథాన్ని తయారు చేసేందుకు నిర్ణయించామన్నారు. కడప జిల్లా బద్వేలు మండలం చనంపల్లి గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయానికి 31.25 లక్షలతో మహారథాన్ని తయారు చేయించనున్నట్లు తెలిపారు. 2017 నూతన సంవత్సరానికి 12 పేజీలు కలిగిన క్యాలెండర్లను 18 లక్షలు ముద్రించేందుకు ఆమోదం తెలిపామన్నారు. టిటిడి ప్రచురణలు విక్రయించే పుస్తకాలు, సీడీలు, భారతం, భాగవతం గ్రంథాలు డిస్కౌంట్ పద్ధతిలో నిరంతరం విక్రయించాలని నిర్ణయించామన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో దక్షిణ విభాగంలో వివిధ సౌకర్యాలతో రెండో ప్రవేశమార్గాన్ని అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో ప్లాట్ ఫాం నిర్మాణానికి టిటిడికి చెందిన 0.74 సెంట్లు భూమిని మార్కెట్ ధరకు రైల్వేశాఖకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 12నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుతో పాటు రోజుకు ఒక లక్ష మందికి దర్శనం, అన్నప్రసాదాల వితరణకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపూర్‌లో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించామన్నారు. టిటిడిలో సెక్యూరిటీ, విజిలెన్స్ గార్డులుగా పునర్నియామకం పొందిన సైనిక పింఛన్‌దారుల భార్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించిన పింఛన్ ఉత్తర్వులను అమలుపరచాలని నిర్ణయించామన్నారు. భక్తులు సమర్పించిన తలనీలాలను ఈ-విక్రయాల ద్వారా జరిగిన విక్రయంతో మే మాసంలో 7.92 కోట్ల రూపాయలు, జూన్ 7.42 కోట్ల రూపాయల ఆదాయం లభించిందన్నారు.
నిత్యావసరాల కొనుగోళ్లు
శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించే వేలకలను నాలుగు నెలలకు సంబంధించి కిలో 1200 రూపాయల చొప్పున 34వేల కిలోలు కొనుగోలు చేయడానికి 4.32కోట్లు కేటాయించామన్నారు. అలాగే ఆరు నెలలకు అవసరమయ్యే లక్ష కిలోల ఉద్దిపప్పును కిలో 134.10 చొప్పున కొనుగోలు చేసేందుకు 1.34 కోట్లు నిధులు కేటాయించామన్నారు. అలాగే ఆరు నెలలకు అవసరమయ్యే 3.50 లక్షల కిలోల కందిపప్పును కిలో 108.19 రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు 4.48కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. అలాగే భక్తులకు సబ్సిడీ ధరలకు టిటిడి విక్రయిస్తున్న కొబ్బరికాయలకు సంబంధించి 22 లక్షల టెంకాయలు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో ఒక్కో టెంకాయి 7.11 రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు 1.56 కోట్లు నిధులు కేటాయించామన్నారు. అలాగే 9,500 వేల కేజీల మొదటి రకం మిరియాలను కేజీ 823 రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు 78.18 లక్షలు నిధులు కేటాయించామన్నారు. 24 లక్షల కేజీలు మొదటి రకం శనగపప్పును కిలో 84.69 రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు 20.32 కోట్లు నిధులు కేటాయించామన్నారు. ఇక 45వేల మొదటిరకం ఎండుమిర్చిని కిలో 154.44 రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు 69.49 లక్షల నిధులు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో టిటిడి ఇఓ డాక్టర్ సాంబశివరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కె రాఘవేంద్రరావు, జె శేఖర్‌రెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, కోళ్ల లలితకుమారి, సుచిత్ర ఎల్లా, డాక్టర్ సంపత్వ్రినారాయణ, డి బాలవీరాంజనేయ, డి సుధాకర్‌యాదవ్, ఎవి రమణ, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, డిపి అనంత్, భానుప్రకాష్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, అరికేల నరసారెడ్డి, చీఫ్ సిఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ అండ్ సిఎఓ బాలాజి, టిటిడి ప్రాజెక్టు అధికారి ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.