S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హోరెత్తిన ‘హోదా’ బంద్

శ్రీకాకుళం, ఆగస్టు 2: జిల్లా అంతటా ప్రత్యేక హోదా నిరసనలు హోరెత్తాయి. బిజెపి, టిడిపి తీరును నిరసిస్తూ వైకాపా రాష్టబ్రంద్ పిలుపు మేరకు జిల్లా బంద్ విజయవంతమైంది. వామపక్షాలతో సహా కాంగ్రెస్, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. కానీ, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించిన జిల్లా ఎన్జీవో నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు ఈ బంద్‌లో పాల్గొనలేదు. ఉదయం నాలుగు గంటల నుంచే కార్యకర్తలు బస్సు డిపోల వద్దకు చేరుకుని అడ్డుకున్నారు. పోలీసులు బస్టాండ్‌ల వద్ద నిరసన చేపడుతున్న వారిని అరెస్టులు చేశారు. ప్రత్యేక హోదా కోసం జిల్లా వైకాపా దూకుడు పెంచింది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకునపెట్టే వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి వ్యూహాం సిక్కోల్ జిల్లాలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ప్రజల్లో టిడిపి తీరును ఎండగట్టేందుకు మంగళవారం కేంద్రం వైఖరికి నిరసనగా స్వచ్ఛందంగా వాణిజ్య, వ్యాపార రంగాలకు చెందినవారంతా సహకరించి వారివారి సంస్థలు, దుకాణాలకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు కామ్రేడ్లు, విద్యార్థిసంఘాలు, యువజనసంఘాలు రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్సులు కదలకుండా జిల్లా కేంద్రం శ్రీకాకుళం బస్‌కాంప్లెక్స్ వద్ద వైకాపా నేత తమ్మినేని సీతారాం సారథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భైఠాయించారు.
సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు దుకాణాలన్నీ బంద్ చేయించారు. పోస్ట్ఫాసులు, బ్యాంకులు, వాణిజ్యసముదాయాలు, మాల్స్, చివరికి కూరగాయలు కొట్టులు, కిరణాదుకాణాలు, కిల్లీబడ్డీలు సైతం స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. జిల్లా కేంద్రంలో జి.టి.రోడ్డు, పాలకొండరోడ్డు, సి.బి.రోడ్డు, కళింగరోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి. కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. బంద్‌కు ప్రజలు సహకరించారు. బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి. జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గాలవారీగా ముందస్తు వూహంతో వందలాది మంది వైకాపా కార్యకర్తలు, కామ్రేడ్లు నిరసనకు దిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. వామపక్షనేతలను ఎక్కడిక్కడే పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ బస్సుస్టేషన్ వద్ద బైఠాయించిన వైకాపా నేత తమ్మినేని సీతారాంతో చాలా సమయం డి.ఎస్పీ భార్గవరావునాయుడు చర్చించినప్పటికీ బైఠాయింపు నుంచి తప్పుకోకపోవడంతో తమ్మినేనిని పోలీసులు బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి, అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఎన్ని ధనుంజయరావు, జె.ఎం.శ్రీనివాస్ తదితరులు అరెస్టులు కాగా, ఇచ్ఛాపురంలో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరిలో పిరియాసాయిరాజ్, నర్తు రామారావులతోపాటు కార్యకర్తలు ఉన్నారు. అలాగే పలాసలో 20 మందిని అరెస్టు చేశారు. వీరిలో జుత్తు జగన్నాయుకులు, పైల వెంకటరావు, టెక్కలిలో పేడాడ తిలక్, చింతా గణపతితోపాటు 13 మందిని అరెస్టు చేశారు. పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వి.కళావతి, పాలవలస విక్రాంత్ నేతృత్వంలో బంద్ విజయవంతం అయ్యింది. సిపిఎం., వైకాపా నేతలు సుమారు 30 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిరమండలంలో సి.పి.ఎం.నేతలను, వీరఘట్టంలో వైకాపా నేతలను అరెస్టులు చేశారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులతోపాటు వామపక్షనేతలు మొత్తంగా 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కంబాల జోగులను చాలా సమయం స్టేషన్‌లో నిర్భంధించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి, స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను నెట్టేసి బయటకు రావడంతో మిగిలిన కార్యకర్తలంతా ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తొలుత వీరంతా రాజాం పట్టణంలో విద్యాసంస్థలు, వాణిజ్యసముదాయాలకు తాళాలు వేయించారు. ఆర్టీసీ బస్సులు రొడ్డెక్కకుండా చేశారు. ఇలా.. జిల్లా అంతటా వందలాది మంది వైకాపా, వామపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోల జగన్ ఆధ్వర్యంలో సూర్యమహాల్ జంక్షన్‌లో ధర్నా జరిగింది. అనంతరం మోటార్‌సైకిళ్ళ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నిరసనల్లో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పాల్గొనలేదు. అలాగే, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ హోదా బంద్‌లో పాల్గొనలేదు. మొత్తంమీద ‘హోదా’బంద్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా విజయవంతం అయ్యింది. వామపక్షనేతలు చౌదరి తేజేశ్వరరావు, బవిరి కృష్ణమూర్తి, టి.తిరుపతిరావు, డి.గోవిందరావు, గణేష్, కె.నారాయణరావు, వై.చలపతిరావులు ఉన్నారు. అలాగే వైకాపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి, నేతలు మామిడి శ్రీకాంత్, కోణార్క్ శ్రీను, రఘు, ఎం.వి.పద్మావతి, అలివేలుమంగ, చల్లా రవికుమార్, స్వరూప్, రఫీ తదితరులు పాల్గొన్నారు.