S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పారిశుద్ధ్యం ఇలాగేనా?

పాడేరు, ఆగస్టు 2: పాడేరు ఏరియా ఆసుపత్రిలో పారిశుధ్యం లోపించడంపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం, అసహనాన్ని వ్యక్తం చేసారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఏజెన్సీలో మంగళవారం పర్యటించిన ఆయన స్థానిక ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసారు. ఆసుపత్రిలో దాదాపు గంటన్నర సేపు ఉన్న కలెక్టర్ ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించి వార్డులలో చికిత్స పొందుతున్న ప్రతి రోగిని పరామర్శించి వారు ఏ వ్యాధితో ఆసుపత్రిలో చేరినది అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసారు. వార్డులలో రోగులు పడుకునే మంచాలపై దుప్పట్లు లేకపోవడం, బాత్‌రూంలలో అపారిశుధ్యం నెలకొని దుర్వాసన వెదజల్లడాన్ని పరిశీలించిన ఆయన ఆసుపత్రి వైద్యులపై ఆగ్రహాం వ్యక్తం చేసారు.
ఆసుపత్రి వెలుపల కూడా ఎక్కడ పడితే అక్కడ చెద్దా చెదారం ఉండడాన్ని చూసిన ఆయన ఆసుపత్రి నిర్వహణ తీరు ఇదేనా అంటూ వైద్యులను ప్రశ్నించారు. గ్రామాలలోకి వెళ్లి పారిశుధ్య నిర్వహణపై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఒకవైపు వైద్యులకు చెబుతుంటే ఆసుపత్రి ప్రాంగణం, ఆసుపత్రిలో లోపల అడుగడుగునా అపారిశుధ్యం తాండివిస్తుంటే గిరిజనులకు పారిశుధ్యం కోసం మీరెలా చెబుతారంటూ వైద్యులను నిలదీసారు. వార్డులకు ఆనుకుని ఉన్న బాత్‌రూంలు దుర్వాసన వెదజల్లుతుండంతో మరుగుదొడ్ల పారిశుధ్య పనులను నిర్వహించే కంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ ఇంటిని అయితే ఇలాగే ఉంచుకుంటారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రిలోని మరుగుదొడ్లన్నీ దుర్వాసన వెదజల్లుతూ కంట్రాక్టర్ పట్టించుకోకుండా ఉంటే మీరేమి చేస్తున్నారు? కంట్రాక్టర్‌పై అజమాయషీ చేసి పనిచేయించుకోవడం, బాధ్యతగా పనిచేయడం తెలియదా? అంటూ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆసుపత్రిలో అపారిశుధ్యం నెలకొనడం, మంచాలపై దుప్పట్లు లేకపోవడం సరికాదని, మేము వచ్చి ఇక్కడ పనిచేయాలా అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు. అంతకుముందు ఆసుపత్రిలోని ఎంతమంది వైద్యులు పనిచేస్తున్నారని, వైద్యులంతా స్థానికంగా నివాసం ఉంటున్నారా? ఆసుపత్రికి రోజువారీగా ఎంతమంది రోగులు వస్తున్నారు? ఎంతమంది ఏయే వ్యాధులతో ఆసుపత్రులలో చేరుతున్నారని, ఎటువంటి కేసులు వస్తున్నాయి? మందులు అందుబాటులో ఉంటున్నాయా? లేదా?, రోగులకు ఆసుపత్రిలోనే మందులు పంపిణీ చేస్తున్నారా లేక బైట వారిచేత కొనిపిస్తున్నారా? అంటూ కలెక్టర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కలెక్టర్ అడిగిన అన్ని అంశాలకు వైద్యాధికారి సమాధానం చెప్పి వివరించారు. ఆసుపత్రిలో అతిసారం, సాధారణ జ్వరాలు, పాముకాటు, రక్తహీనత వంటి వ్యాధులతో చికిత్సలు పొందుతున్న రోగులను కలెక్టర్ పరామర్శించి వారు ఏయే గ్రామాల నుంచి ఎప్పుడు ఆసుపత్రిలో చేరినది అడిగి తెలుసుకున్నారు.
అయితే అతిసారంతో బాధపడుతున్న రోగుల గ్రామాలలో వైద్య శిబిరాలను నిర్వహించారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రిలో సరైన నీటి సరఫరా లేకపోవడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చికిత్స పొందుతున్న రోగులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన నీటి సమస్య ఎందుకు ఉందని ప్రశ్నించడంతో వైద్యాధికారులు చెప్పిన సమాధానంపై చిన్న చిన్న అంశాలను కూడా సరిచేసుకోకపోతే ఏలా అంటూ అసహనాన్ని వ్యక్తం చేసారు. తాను మళ్లీ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేస్తానని, అప్పటిలోగా లోపాలను సవరించుకుని రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సరోజిని, పాడేరు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వై.వెంకటేశ్వరరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.