బిహార్ స్కాంలో మూడో ర్యాంకర్ అరెస్టు
Published Wednesday, 3 August 2016బిహార్ : బిహార్ టాపర్ల కుంభకోణంలో సైన్స్ విభాగంలో మూడో ర్యాంకు సాధించిన రాహుల్ కుమార్ను బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల విడుదలైన బిహార్ 12వ తరగతి ఫలితాల్లో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో ఇప్పటికే టాపర్ రూబీరాయ్ను అరెస్టు చేయగా ఆమె బెయిల్పై విడుదలయ్యారు.
12వ తరగతి ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులతో స్థానిక మీడియా సంస్థ ఓ ఇంటర్వ్యూ నిర్వహించగా ర్యాంకుల వెనుక అసలు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. టాపర్లకు బిహార్ బోర్డు మరోసారి పరీక్ష నిర్వహించగా రూబీరాయ్ విఫలమైంది. ఆమెను జూన్ 25న అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. ఇటీవలే ఆమెను బెయిల్పై విడుదల చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టి, పలువురు అధికారులు, రాజకీయ నాయకులను అరెస్టు చేసింది. సైన్స్ విభాగంలో మూడో ర్యాంకు సాధించిన రాహుల్ కుమార్ కూడా రీ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో అతడిని బుధవారం అరెస్టు చేశారు.