ఆకాంక్ష
Published Saturday, 24 September 2016మనిషిగా వెళ్లి
మహాత్ముడిగా తిరిగొస్తావని
అచేతన శిఖరాల మధ్య
అంతఃచేతన సాధిస్తావని
పాము కుబుసం విడిచినట్టు
అజ్ఞానాంధకారాన్ని విసర్జిస్తావని
బండరాయిలా దొర్లుతూ వెళ్లి
పాదరసంలా పరిగెత్తుకొస్తావని
చీకటి దారుల వెంట నడిచిన వాడివి
వెలుతురు బాటవై పరచుకొంటావని
ప్రతి మనిషి మనసుని తాకి
పవిత్ర భాగీరథిని చేస్తావని
మంచికీ చెడుకీ మధ్య
నిలువెత్తు గీతవై ప్రకాశిస్తావని
దేనికో ఈ కులమతాల ప్రస్తావన
సమానత్వాన్ని ప్రాణ శ్వాసగా ప్రసాదిస్తావని
పరువు హత్యల సూత్రధారుల బుద్ధికి
రక్తాణువుల విలువ తెలియపరుస్తావని
ప్రకృతి లేని పురుషుని బతుకు
నీరులేని చేప వంటిదని
ఆడపిల్లని బతికించవని బోధిస్తావని
ఎంతైనా మానవమాత్రుడివి కదా
భగవంతుడివి కాలేకపోయినా
మహానుభావుడవైనా అవుతావని!
*