S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దోమ రహిత జిల్లాగా ‘అనంత’

అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 24: దోమ రహిత జిల్లాగా అనంతను మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈమేరకు నగరంలో శనివారం నిర్వహించిన దోమలపై దండయాత్ర అవగాహన ర్యాలీని మంత్రి కామినేని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, జడ్పీ చైర్మన్ చమన్, ఎంపి నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, గేయానంద్, ఎమ్మెల్యేలు ప్రభాకర చౌదరి, బికె.పార్థసారథి, వరదాపురం సూరి, మేయర్ మదమంచి స్వరూప, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్, డిఇఓ అంజయ్య, డా.అక్బర్, ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు. టవర్‌క్లాక్ సర్కిల్ నుండి నిర్వహించిన ర్యాలీని మంత్రి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దోమ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేందుకు దోమలపై దండయాత్ర అవగాహన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో చేపట్టిన ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. దోమల వల్ల, నీటి కలుషితం వల్ల వచ్చే డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ, టైఫాయిడ్, అతిసార, కామెర్లు మొదలైన వ్యాధుల బారి నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలను తరిమికొట్టాలన్నారు. దోమలపై దండయాత్ర అంటే దోమలను పూర్తిగా నివారించడమేనన్నారు. దీనిపై ప్రజలందరికీ అవగాహన లేని కారణంగా వ్యాధుల బారిన పడుతున్నారని, అవగాహన కల్పిస్తే దోమలను నివారించవచ్చన్నారు. మనకన్నా వెనుకబడ్డ శ్రీలంక దోమరహిత దేశంగా మారిందని, అదేవిధంగా దోమరహిత రాష్ట్రంగా మార్చే క్రమంలో జిల్లా ముందు నిలవాలన్నారు. ప్రతి ఇంట్లో దోమలు, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని, ఖాలీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1006 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ప్ల కార్డులు చేపట్టి పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. టవర్‌క్లాక్ సర్కిల్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రత నినాదాలతో హోరెత్తించారు.

పెద్దాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు
* వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 24: జిల్లాలో నెలకొన్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌లాంటి విష జ్వరాలపై అనంత సర్వజన ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వైద్య, ఆరోగ్య మరియు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాసులు అన్నారు. ఆసుపత్రి డాక్టర్లను, సిబ్బందిని ఆయన అభినందించారు. శనివారం మధ్యాహ్నం సర్వజన ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. జ్వరాలతో బాధపడుతున్న పిల్లలను పరామర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి సమావేశ మందిరంలో డాక్టర్లు, పారా మెడికల్, సిబ్బందితో మంత్రి పల్లె రఘనాథరెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, ఎమ్మెల్సీ గేయానంద్, కలెక్టర్ కోన శశిధర్, మేయర్ మదమంచి స్వరూపతో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ గతంకన్నా రోగులకు మెరుగైన వైద్యం ఇక్కడి సిబ్బంది అందిస్తున్నారన్నారు. 1300మంది నుంచి నుంచి ఈనాడు 2500 వరకు ప్రతి రోజు ఓపికి వస్తున్నారన్నారు. ఇక్కడ వైద్యం బాగా అందించటం మూలంగానే ఇంతమంది వస్తున్నారన్నారు. అయితే పెరుగుతున్న రోగులకు అనుగుణంగా సిబ్బంది లేరన్నది అంగీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు. ఇటీవల ఆసుపత్రుల్లో ఏపిపి పద్ధతిలో శానిటేషన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో బయోమెడికల్, పురుగుల నివారణ, సెక్యూరిటీ తదితరాలతో ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 124జీవో ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించిన ఫైలును పరిశీలించి సిబ్బందిని భర్తీ చేసేందుకు కృషి చేస్తానన్నారు. బయటి నుంచి వచ్చే డాక్టర్లకు జిల్లాకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 212 అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించామన్నారు. త్వరలో మరో పది కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. అనంతపురం జిల్లాకు 19 సెంటర్లు మంజూరైతే అందులో నగరానికే 5 కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. త్వరలో ఇ-అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు రానున్నాయన్నారు. ఆసుపత్రి ఆవరణలో నిరసనలు, ధర్నాలు చేయడం మంచి పద్ధతికాదన్నారు. డిజిపితో మాట్లాడి నిషేధం విధిస్తామని మంత్రి తెలిపారు.
ఆరోగ్యంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి పల్లె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటి, సమాచార, వైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘనాథరెడ్డి అన్నారు. శనివారం ఉదయం స్థానికి టవర్‌క్లాక్ వద్ద దోమలపై దండయాత్ర -పరిసరాల పరిశుభ్రతపై ర్యాలీ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాను ప్రమాణికంగా తీసుకొని విష జ్వరాల నివారణకు పలు ఆదేశాలు జారీ చేశారన్నారు.
సమాజంలో మహిళల పాత్ర కీలకం
* సత్యసాయి జాతీయ సదస్సులో వక్తలు
పుట్టపర్తి, సెప్టెంబర్ 24: సమాజంలో మహిళలదే కీలక పాత్ర అని సత్యసాయి భారతీయ మహిళా సదస్సులో వక్తలు పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తి ప్రశాంతినిలయంలో సత్యసాయి జాతీయ మహిళా సదస్సు ప్రారంభమైంది. సత్యసాయి జాతీయ మహిళా అధ్యక్షురాలు కమలాపాండే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా భగవాన్ సత్యసాయిబాబా మహాసమాధికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాపాండే, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి నందితాశర్మ ప్రసంగించారు. నేటి సమాజ అభివృద్ధిలో మహిళలే కీలకపాత్ర వహిస్తున్నారన్నారు. ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతున్నారన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ సమర్థవంతమైన అభివృద్దిలో మహిళ పునాది అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 15 మంది మహిళలను సన్మానించారు. ఉదయం, సాయంత్రం కర్ణాటకకు చెందిన బృందం సంగీత కచేరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో ట్రస్టు సభ్యుడు ఆర్‌జె రత్నాకర్, నాగానంద, కార్యదర్శి ప్రసాద్‌రావు, సత్యసాయి సేవాసంస్థల జాతీయ అధ్యక్షులు నిమిష్‌పాండే, మహిళాప్రతినిధులు నీతూకన్నా, శశికళ, తదితరులు పాల్గొన్నారు.

రోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
* మంత్రి పల్లెరఘునాథరెడ్డి
పుట్టపర్తి, సెప్టెంబర్ 24: ఇటీవల ప్రబలుతున్న రోగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పుట్టపర్తిలో దోమలపై దండయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇటీవల ప్రజలను పట్టి పీడిస్తున్న మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, టైఫాయిడ్‌వంటి వ్యాధులు దోమల కారణంగా విజృంభిస్తున్నాయన్నారు. ప్రభుత్వం దోమలపై సమరం ప్రకటించిందన్నారు. ప్రజలు అధైర్యపడవద్దని రోగులకు చికిత్సలు అందించేందుకు మందులు సరఫరా చేసేందుకు ఎన్నికోట్ల నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల అనంతపురం జిల్లా ప్రజలు ఇటీవల రోగాల బారిన పడి అవస్థలు ఎదుర్కొన్న విషయం పట్ల తీవ్రంగా పరిగణించారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రధానంగా పాఠశాల విద్యార్థులకు ముందుగా అవగాహన కల్పించాలని వారి ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా ర్యాలీలు ప్రచార కార్యక్రమాలు చేపట్టారన్నారు. అలాగే జిల్లాలో తాగు, సాగునీటి సమస్య తీర్చేందుకు భూగర్భ జలాలు పెంపొందించేందుకు హంద్రీనీవా కాలువను పూర్తి చేస్తామన్నారు. బుక్కపట్నం చెరువుకు హంద్రీనీవా నీటిని నింపుతామన్నారు. ఓడిసి, అమడగూరు, నల్లమాడ మండలాలకు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులకు నీరందిస్తామన్నారు. ప్రతి నాలుగవ శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో దోమలపై దండయాత్ర ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ పీసీ గంగన్న, వైస్ ఛైర్మన్ కడియాల రాము, పుడా ఛైర్మన్ కడియాల సుధాకర్, ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో సుబహాన్, దేశం నాయకులు చెన్నకేశవులు, గూడూరు ఓబులేసు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
చెరువులకు సాగునీరు ఇవ్వాలి
* మాజీ మంత్రి శైలజానాథ్
గార్లదినె్న, సెప్టెంబర్ 24 : నియోజకవర్గంలోని గార్లదినె్న, శింగనమల, నార్పల, బుక్కరాయసముద్రం, యల్లనూరు, పుట్లూరు మండలాల్లోని చెరువులకు నీరందందించాలని మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని ఎంపిఆర్ డ్యామ్ కట్ట వద్ద కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నాగరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ‘మననీళ్లు మనకళ్ల’ ముందే బలమున్న నాయకులు ఇతర జిల్లాలకు తరలిస్తున్నా ప్రజాప్రతినిధులు చూస్తున్నారు తప్ప ఇక్కడి రైతులకు సాగునీరు ఇవ్వాలని ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. ప్రజాప్రతినిధులు చంద్రబాబుకు ఊడిగంచేస్తున్నారే తప్ప ప్రజలకు చేసింది శూన్యమన్నారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని రైతులు వరి పండించి జిల్లాకే అన్నం పెట్టేవారన్నారు. ఇప్పుడు అదే రైతులు గడ్డి కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకే అన్నం పెట్టే రైతన్నలు ఇప్పుడు అన్నంలేక అడుక్కునే పరిస్థితికి రావడం బాధాకరమన్నారు. ఇకపోతే వేరుశెనగ సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించిన ఆయకట్టు రైతులకు నీరివ్వాలని లేనిపక్షంలో డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా సిఐ శివనారాయణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు దాదాగాంధీ, విష్ణునారాయణ, ఆంజనేయులు, రహంతుల్లా, మిద్దె నాగేంద్ర, రమణ, నరసింహులు, రామంజినేయులు, ఎల్లప్ప, పుల్లారెడ్డి, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు
జైలుకెళ్లడం ఖాయం
* వైకాపా రాష్ట్ర నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మడకశిర, సెప్టెంబర్ 24 : ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమని పుంగనూరు ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. శనివారం సాయంత్రం మడకశిరలో నిర్వహించిన కార్యకర్తల సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మొదటి ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటూ తాను నిప్పులాంటి మనిషిని, నిజాయితీ పరుడని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే తనపై వచ్చిన ఆరోపణలను సిబిఐకి అప్పగించి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. గతంలో 23 కేసులు ఉండగా తన నిజాయితీని నిరూపించుకోకుండా ఎందుకు కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకున్నారని ప్రశ్నించారు. పరిటాల రవీంద్ర హత్య కేసులో వైఎస్ జగన్‌పై హత్యానేరం ఆరోపణ వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలను సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించి నిజాయితీ నిరూపించుకోకపోతే జైలుకెళ్లడం ఖాయమ్నారు. ఇకపోతే రాయలసీమ ప్రాంతంలో రెయిన్‌గన్ల ద్వారా 4 లక్షల ఎకరాలకు రక్షకతడులు అందించామని కాకిలెక్కలు చెబుతూ రైతులకు పంట పరిహారం, బీమా అందకుండా చేస్తున్నారన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రైతులకు న్యాయం చేయకపోతే వైకాపా ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 2019లో వైకాపా అధికారం చేపట్టడం ఖాయమన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, నాయకులు ఆనందరంగారెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, రామక్రిష్ణ, హనుమంతరాయప్ప తదితరులు పాల్గొన్నారు.
టిడిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
* డిసిసి అధ్యక్షుడు కోటా సత్యం
రాయదుర్గం, సెప్టెంబర్ 24 : రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని డిసిసి అధ్యక్షుడు కోటా సత్యం పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన పరిస్థితులను వివరిస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభూతకల్పనల ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివధ సంక్షేమ పథకాలను నేటి టిడిపి ప్రభుత్వం రద్దు చేస్తూ బడుగులకు అన్యాయం చేస్తోందన్నారు. ముఖ్యంగా రేషన్‌కార్డులను రద్దు చేయడం సహించరాని విషయమన్నారు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైన పరిస్థితుల్లో గ్రామల్లో పర్యటించి ప్రజలను చైతన్యం చేయడానికి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి మాట్లాడుతూ అబద్దాల వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ పేర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు రేయిన్‌గన్‌ల పేరుతో రైతులను నట్టేటముంచాడన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు కార్యక్రర్తలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం నియోజకవర్గ ఇన్‌చార్జి చిన్నప్పయ్య, నాయకులు హనుమంతరాయుడు, మాసూల శ్రీనివాసు, చంద్ర, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
చెత్త సేకరణలో అక్రమాలు అరికట్టండి
* పందులను శాశ్వతంగా నిర్మూలించాలి
* ‘పురం’ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు
హిందూపురం టౌన్, సెప్టెంబర్ 24 : మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో చెత్త సేకరణ కోసం వినియోగిస్తున్న వాహనాల అక్రమాలను అరికట్టాలని కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం కాకుండా సంబంధిత లీజుదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత కాశ్మీర్ సరిహద్దులో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వీరజవానులకు నివాళులర్పించారు. అనంతరం కౌన్సిలర్ దాదాపీర్ మాట్లాడుతూ చెత్తసేకరణ వాహనాల్లో చెత్త తరలించడంలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. రెండు, మూడు ట్రిప్పులు మాత్రమే తరలించి ఎక్కువ ట్రిప్పులు నమోదు చేసి నిధులు డ్రా చేసుకుంటున్నారని ఆరోపించారు. అదేవిధంగా తన వార్డు పరిధికి 14వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ సమాధానం ఇస్తూ త్వరలోనే మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని వాహనాలకు జిపిఆర్‌ఎస్ పరికరాలను అమర్చి అక్రమాలను అరికడతామన్నారు. దీనికితోడు శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంతకం చేసి ధ్రువీకరించేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అలాగే చెత్త సేకరించే వాహనాలు లోడింగ్ తర్వాత తప్పనిసరిగా కవర్లు ఏర్పాటు చేసుకునేలా ఆదేశించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ జెపికె రాము మాట్లాడుతూ ప్రస్తుతం ఒకే కాంట్రాక్టర్ 18 పనులకు సంబంధించి టెండర్లు దక్కించుకున్నారని, నిర్ణీత కాల వ్యవధిలోపు పనులు పూర్తి చేయకపోతే నిధులు వెనక్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పగా కమిషనర్ స్పందిస్తూ త్వరలోనే ఇ-మాడ్యూల్స్ విధానం అమలులోకి రానున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఎవరైనా కాంట్రాక్టర్ నిర్ణీత గడువులోగా పనులు చేయకపోతే ఆన్‌లైన్‌లోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కాగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పందుల పట్టివేతకు చర్యలు తీసుకోవడం ఓ వైపు అభినందనీయమేనని, అయితే పందులు మళ్లీ పట్టణంలోకి రాకుండా శాశ్వతంగా దూరంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు కోరారు. కాగా అభివృద్ధి పనులను కేవలం కొన్ని వార్డులకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, అన్నివార్డులకు సమానంగా నిధులను కేటాయించాలని పలువురు కౌన్సిలర్లు పేర్కొనగా పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్నివార్డులకు రాజకీయాలకు అతీతంగా నిధులను కేటాయిస్తామని చైర్‌పర్సన్ లక్ష్మి అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజినీర్ రమేష్, డిఇఇలు ఈశ్వరయ్య, వన్నూరస్వామి, మేనేజర్ గిరికుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాలిప్పిస్తామని టోకరా!
* రూ.లక్షల్లో వసూలు
* పోలీసుల అదుపులో తండ్రీకూతురు
కొత్తచెరువు, సెప్టెంబర్ 24: ఒక జిల్లాస్థాయి పోలీసు అధికారి ఇంటిలో పనిచేస్తున్న కామాక్షి అనే మహిళ పలువురు నిరుద్యోగులకు హోమ్‌గార్డు ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి రూ.7.55 లక్షలు వసూలు చేసిన సంఘటన మండల పరిధిలోని కేశాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కేశాపురం గ్రామానికి చెందిన కామాక్షి అనంతపురంలోని ఒక పోలీసు అధికారి ఇంటిలో పనిచేస్తుండేది. కామాక్షి, అతని తండ్రి రామసుబ్బయ్య కలసి కేశాపురం గ్రామంలో పలువురు నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. దాదాపు రూ.7.55 లక్షలు వసూలు చేశారు. కేశప్ప, చలపతి, శీనప్ప, లక్ష్మినారాయణల దగ్గర సదరు మొత్తాన్ని వసూలు చేశారు. ఈ నెల 18న ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న కామాక్షి, తన తండ్రి రామసుబ్బయ్యలు డబ్బులు వెనక్కి ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని రూ.4.50 లక్షల నగదు స్వాధీనపరచుకున్నారు. కేవలం పోలీసు అధికారుల పేరు వాడుకొని హోమ్‌గార్డు పోస్టు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీ్ధర్, ఎస్‌ఐ రాజేశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. నిందితులిద్దరిపైన 420 కేసు నమోదు చేసి పెనుకొండ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.