S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దోమలపై యుద్ధం

తిరుపతి, సెప్టెంబర్ 24: ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో శనివారం చిత్తూరు జిల్లాలో ప్రజలకు అంటువ్యాధులు సోకకుండా దోమలపై యుద్ధం ప్రకటించి ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించింది. ఇందులో భాగంగా శనివారం లక్ష్మీపురం సర్కిల్ నుంచి జరిగిన ర్యాలీలో మంత్రి నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గౌనిగారి శ్రీనివాసులు, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి స్వయంగా కాలువల్లో బురదతీయడం, వీధులు ఊడ్చటం, చెత్తలు ఎత్తడం, ఫాగింగ్ చేయడం, దోమల మందు కొట్టడంలాంటి కార్యక్రమాలు చేపట్టారు. లక్ష్మీపురం కాలనీ వద్ద మంత్రి స్వయంగా ఇళ్లలోకి వెళ్లి అక్కడ ఉన్న అపరిశుభ్రతా పరిస్థితి గుర్తించి వాటి వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు. శుభ్రతను ఎలా పాటించాలోతెలియజేశారు. అనంతరం బైరాగిపట్టెడలోని రామానాయుడు పురపాలక మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలోవిద్యార్థులతో భారీ సభను ఏర్పాటుచేశారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత పాటించాలని విద్యార్థులచే ప్రమాణాలు చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ మాట్లాడుతూ అపరిశుభ్రత వలనే అంటువ్యాధులు ప్రబలుతాయని, వీటిపట్లప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చేతులు శుభ్రపరచుకున్న తరువాతనే భోజనంచేయాలని విద్యార్థులకు హితవుపలికారు. ఒంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే ఇంటి పరిసరప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. అక్టోబర్ 2న రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీల్లో బహిరంగ మలమూత్ర విసర్జనలేని ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన ప్రజలతో విలసిల్లే సమాజం అన్ని రంగాల్లో పురోగమనిస్తుందన్నారు. ప్రాణాంతక వ్యాధులకు కారణం అవుతున్న దోమల నిర్మూలనకు ప్రజలంతా సమిష్టిగా ఉద్యమించాలన్నారు. దోమలపై యుద్దానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏలూరులో నాంది పలికారన్నారు. పొరుగుదేశమైన శ్రీలంకలో దోమలు పూర్తిగా నిర్మూలన జరిగిందన్నారు. ఇళ్లల్లోని కుండీలలో,పాత్రలలో, నీళ్ల తొట్లతో ఎక్కువకాలం నీటి నిలువలేకుండా చూడాలన్నారు. గుంటలు,డ్రెయిన్‌లు, మురికినీటి నిల్వలతో దోమల లార్వాలకు ఆవాసాలుగా మారకుండా నివారించాలన్నారు. ఏ జ్వరానికి ఏ లక్షణాలుంటాయో వాటి బారినపడకుండా పాటించాల్సిన జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను, గోడపత్రికలను ఆవిష్కరించారు. దోమల నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలను విద్యార్థులకు అందజేశారు. అలాగే డెంగీ జ్వరాన్ని గుర్తిస్తే ఎక్కడ సమాచారం ఇవ్వాలో కూడా ఆ కరపత్రాలలోస్పష్టం చేశారు. కలెక్టర్ సిద్దార్థజైన్ మాట్లాడుతూ దోమల నివారణకు ఫిర్యాదులు స్వీకరించడానికి వీలుగా కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి కమిటీ మెంబర్లు నరసింహయాదవ్, దంపూరి భాస్కర్‌యాదవ్, నీలంబాలాజి, డాక్టర్ సుధారాణి,డాక్టర్ ఆశాలత, కమిషనర్ వినయ్‌చంద్, డి ఎం అండ్ హెచ్ ఓ ఎస్.విజయగౌరి, డి ఇ ఓ నాగేశ్వరరావు, జిల్లా పంచాయతీ వైద్య ఆరోగ్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

2019లోపు ప్యాకేజీ నిధులు ఇప్పిస్తే వెంకయ్యకు పాదపూజ
తిరుపతి, సెప్టెంబర్ 24: రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్న రూ.2లక్షల కోట్ల నిధులను 2019 సంవత్సరంలోపు కేంద్రం అందిస్తే వెంకయ్యకు రైతన్నల సాక్షిగా పాద పూజ చేస్తానని సిపిఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ప్రత్యేక హోదాపై సిపిఎం, సిపిఐ శనివారం మునిసిపల్ కార్యాలయం ముందు ప్రజాభిప్రాయాల సేకరణ చేయడంలో భాగంగా ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపిఐ నేత నారాయణ మాట్లాడుతూ తనదైన శైలిలో మోదీ, వెంకయ్య, చంద్రబాబులపై సెటైర్లు విసురుతూ విమర్శలు గుప్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించినప్పుడు వారు రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అంటే కాదు పదేళ్లు ఉండాలంటూ వెంకయ్యనాయుడు రాజ్యసభసాక్షిగా బల్లగుద్ది డిమాండ్ చేశారన్నారు. అలా కాదు 15 యేళ్లు కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారన్నారు. అటు తరువాత ఎన్నికల సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ గట్టి హామీ ఇచ్చారన్నారు. ప్రజలుకూడా నమ్మి ఓట్లు వేశారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడని, ప్యాకేజితో రాష్ట్ర ప్రజలను మోసం చేశాడన్నారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబుకూడా ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని, ప్యాకేజి అద్భుతం, అమోఘం అంటూ కల్లబొల్లి మాటలతో మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అయితే ప్రజలు మాత్రం ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ వాస్తవాన్ని చూపిండచం కోసమే వామపక్షాలు ఈ ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
తాను స్వయంగా పాలొ నాలన్నారు. వాస్తవానికి ఇది వామపక్షాల పనికాదన్నారు. అయినప్పటికీ ప్రజా శ్రేయస్సుకోసం తాము ముందుండి ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తూంటే మహిళలు, విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు. హోదా విషయంలో బిజెపి నేతలు ఎన్నిచెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుంని, ప్రత్యేక ప్యాకేజి వస్తే నిధులు పంచుకునే నాయకులు బాగుపడతరన్నారు.
మోదీకి అనుకూలశత్రువు వెంకయ్యనాయుడు అని, మోదికి వెంకయ్యనాయుడు ఒక బకరా అని అభివర్ణించారు. ప్రత్యేక హోదాకోసం ప్రజా ఉద్యమం తప్పదని, ఆ ఉద్యమంలో వెంకయ్య, బాబు కొట్టుకుపోతారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డి, సిపి ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథరెడ్డి, జిల్లా కార్యదర్శి రామానాయుడు, నగర కార్యదర్శి చిన్నపెంచులయ్య, నాయకులు మురళి, సుబ్రహ్మణ్యం, లోక్‌సత్తానాయకులు బాలసుబ్రహ్మణ్యం, బెల్లంకొండ సురేష్, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌నాయకులు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

రుయాలో మరిన్ని సౌకర్యాలు
తిరుపతి, సెప్టెంబర్ 24: కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ రుయా ఆసుపత్రిని అభివృద్ధి పరచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి అవసరమైన వౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి నారాయణ, అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం రుయా ఆసుపత్రిలోని పలువార్డులను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రుయాలోచికిత్స పొందుతున్న పలువురు రోగులతో మాట్లాడి వైద్యసేవలకు సంబంధించి ఆరా తీశారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో డెంగీ వ్యాధితో బాధపడుతున్న నలుగురు చిన్నారులను పరామర్శించారు. వారికి బ్లడ్ ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నాయని తెలుసుకొని వారికి తక్షణం అవసరమైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారానికి ఆ పిల్లలంతా ఆరోగ్యంగా ఇంటికి వెళ్తారని వైద్యులు మంత్రికి వివరించారు. అనంతరం ఆయన ఓపి వివరాలను, నమోదుప్రక్రియ రికార్డులను పరిశీలించారు. ఈక్రమంలోరుయా సూపరింటెండెంట్ కార్యాలయంలో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీతో సమావేశమై ఇటీవల మృతిచెందిన చిన్నపిల్లల మరణాల కారణాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈసందర్భంగా ఆసుపత్రిలో ఉన్న పలు సమస్యలపై ఆయన సమీక్షించారు. అనంతరం విలేఖరులతోమాట్లాడుతూ 2016 జనవరి నుంచి వైద్య రంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసి పేద,బడగు,బలహీనవర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. రోగుల నమోదు ప్రక్రియను కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు ప్రక్రియను చేపడతామన్నారు. రుయాకు విద్యుత్ కొరతలేకుండా 11కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను ఏర్పాటుచేయడంతో పాటు జనరేటర్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతామన్నారు. జనరిక్ మందుల దుకాణాలను రుయా ఆవరణలో ఏర్పాటుచేస్తామన్నారు. మంత్రి గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్‌టిఆర్ వైద్యసేవలు, ఉచిత ఆరోగ్యపరీక్షలు, సిటీ స్కాన్, 35 సంవత్సరాలు వయస్సు కలిగిన మహిళలకు ఉచిత వైద్యసేవలు జిల్లాకు ఒక్కటి చొప్పున డయాలసిస్‌కేంద్రాలు ఏర్పాటుచేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొని వాటిని కేబినేట్‌లో ఆమెదముద్రకూడా వేశారన్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీ కాళహస్తిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి మంత్రి కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించామన్నారు. కాగాతెల్లరేషన్‌కార్డు లేనివారు ఎన్టీ ఆర్ వైద్యసేవ ద్వారా ఉచితంగా వైద్యసేవలు పొందడానికి గుర్తించిన జబ్బులకు రుయాలోప్రత్యేకంగా కార్డులు అందజేస్తారన్నారు. ఈసమావేశంలో ఎమ్మెల్సీలు గౌనిగారి శ్రీనివాసులు, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే సుగుణమ్మ, జిల్లాకలెక్టర్ సిద్దార్థజైన్, రుయా సూపరింటెండెంట్ సిద్దానాయక్, సిసి ఆర్ ఎం ఆర్ ఆర్‌రెడ్డి, ఆర్ ఎం ఓ శ్రీహరి, ఎస్వీ మెడికల్‌కాలేజి ప్రిన్సిపల్ కృష్ణారావు, శర్మ,జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రెండో రోజూ కొనసాగిన కక్షిదారుల దీక్షలు
చిత్తూరు, సెప్టెంబర్ 24: పాలసముద్రం, ఎస్‌ఆర్ పురం, వెదురుకుప్పం మండలాలకు సంబంధించిన కేసులను చిత్తూరు కోర్టుకు బదలాయించడంపై జరుగుతున్న జాప్యాన్ని నిరశిస్తూ ఆయా మండలాల కక్షిదారులు రెండో రోజైన శనివారం కూడా తమ దీక్షలను కొనసాగించారు. వీరికి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలోనే చిత్తూరు కోర్టులో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి ఎస్ ప్రవీణ్‌కుమార్ దృష్టికిపై సమస్యను తీసుకెళ్లారు. స్పందించిన న్యాయమూర్తి మాట్లాడుతూ సమస్యను మరో సారి హైకోర్టుకు తీసుకుపోయి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

నిరుపేద మహిళలకు తొలిజాబితాలోనే ఇళ్లు ఇవ్వాలి
తిరుపతి, సెప్టెంబర్ 24: 2014 రే హౌసింగ్ స్కీమ్‌కింద తిరుపతికి మంజూరైన ఏడువేల ఇళ్లను నిరుపేద మహిళలకు తొలి జాబితాలోనే ఇచ్చి తీరాల్సిందేనని, లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని, మహిళా ఉద్యమానికి శ్రీకారం చుడతానని తిరుపతి మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్ హెచ్చరించారు. శనివారం ప్రజాహిత కార్యక్రమం పేరుతో ఆయన గతంలో ఇళ్లు మంజూరైన మహిళలతో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ భాగ్యలక్ష్మికు వినతిపత్రం సమర్పించారు. తొలివిడతలోనే గతంలో మంజూరైన వారికి ఇళ్లుకేటాయించాలని కోరారు. ఒక్కో మహిళకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను రూ.4 లక్షలతోనిర్మించి ఇచ్చేందుకు యుపి ఎ ప్రభుత్వం 292 కోట్ల రూపాయల నిధులు మంజూరుచేసిందన్నారు. ఇందులో భాగంగా 42 మురికివాడల్లో నివాసం ఉంటున్న నిరుపేదలైన మహిళల కోసం 72 కోట్ల రూపాయలను కేంద్రం నిధులు విడుదలచేసిందన్నారు. అప్పటికేంద్రమంత్రి జయరాం రమేష్‌పునాది రాయివేశారన్నారు. ఈనేపథ్యంలో వాటిని ఆధారంగా నిరుపేద మహిళలకు ఇళ్లు కేటాయించాలని ఆమెను కోరారు. ఆమె మాట్లాడుతూ తాను ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి తగు చర్యలు చేపడుతామని అన్నారు. అనంతరం చింతామోహన్ విలేఖరులతో మాట్లాడుతూ ఏడువేల మంది నిరుపేద మహిళల గొంతుకోసి స్మార్ట్‌సిటీ సాధించామంటూ సన్మానం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. యుపిఎ ప్రభుత్వం మంజూరుచేసిందన్న ఒక్క కారణంతోకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 7008 వేల ఇళ్లకు మంజూరైన 292 కోట్ల రూపాయల నిధులను నిర్వీర్యంచేశారన్నారు. ప్యాకేజిలోవచ్చే నిధులలో ముందుగా 292 కోట్ల రూపాయలు వేరుచేసి ఈ 7008వేల ఇళ్లు అర్హులైన మహిళలకు బ్యాంక్‌ఖాతాలోవేయాలని డిమాండ్‌చేశారు. స్మార్ట్‌సిటీతోప్రయోజనంలేదన్నారు. ఇదంతా ఓట్లకోసం ఆడే నాటకంలో భాగమన్నారు. తిరుపతిలో 41 మురికివాడలున్నాయని, వాటికి జరిగే మేలు ఏమీ ఉండదన్నారు. అనంతరం ఆయన మహిళలతోకలిసి స్టీల్ తట్టలతో తప్పెట్లు కొడుతూ నిరసనవ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, శాంతి పాల్గొన్నారు.

పూడ్చిపెట్టిన శవానికి మళ్లీ పోస్టుమార్టం
శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 24: అనుమానాస్పద స్థితిలో మరణించిన యువతి మృతదేహానికి శనివారం అధికారుల బృందం ఆధ్వర్యంలో శవపరీక్ష జరిగింది. స్వర్ణముఖి నదిలో గురువారం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి అక్కడే శవపరీక్ష చేశారు. పట్టణంలోని ప్రాజెక్టు వీధికి చెందిన ధనలక్ష్మి (17) బుధవారం ఇంట్లో ఉరివేసుకొని మృతిచెందగా గురువారం కుటుంబ సభ్యులు స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టారు. అయితే ఆ తరువాత అనుమానాలు వ్యక్తం కావడంతో శుక్రవారం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ చిన్నగోవిందు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. శనివారం స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి అక్కడే శవపరీక్ష నిర్వహించారు. స్థానిక ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రమేష్ శవపరీక్ష చేశారు. తహసీల్దార్ రమేష్‌బాబు, సి ఐ చిన్నగోవిందు, స్థానిక ప్రజలు పంచనామాలో పాల్గొన్నారు.

మొరాయించిన సర్వర్లు
శ్రీవారి మెట్లు మార్గంలో
భక్తుల ఆందోళన
తిరుమల, సెప్టెంబర్ 24: తిరుమల శ్రీవారి మెట్లు మార్గంవద్ద భక్తులకు దివ్యదర్శనం టోకన్లను మంజూరు చేసే కౌంటర్లలో శనివారం సర్వర్ల మొరాయించాయి. దీంతో భక్తులు సుమారు రెండు గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు సర్వర్లు పనిచేయకపోవడంతో టిటిడి సిబ్బంది టోకన్లు మంజూరు చేయడం నిలిపివేశారు. ఈ నేపథ్యంలో రెండు గంటలపాటు వేచివున్న భక్తులు ఆగ్రహించిన భక్తులు గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ టికెట్ కేంద్రం ముందు బైఠాయించి నిరసనలు తెలిపారు. విషయం తెలుసుకున్న టిటిడి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని భక్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. భక్తులకు, అధికారులకు మధ్యన కొంత వాగ్వివాదం కూడా చోటుచేసుకుంది. ఎంతసేపటికి సర్వర్లు పనిచేయకపోవడంతో టికెట్ స్కానింగ్ అవసరం లేకుండా అధికారులు టోకన్లు మంజూరు చేయడంతో భక్తులు నిరసనలు విరమించి శాంతించారు.
దోమలపై దండయాత్ర సాగించాల్సిందే :మంత్రి బొజ్జల

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 24: అంటు వ్యాధులు రాకుండా ప్రజలు స్వచ్ఛందంగా దోమలపై దండయాత్ర చేయాలని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఇళ్లనే కాకుండా పరిసరాలను కూడ పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు రావని, తద్వారా మలేరియా, డెంగి లాంటి అంటువ్యాధులు రాకుండా ఉంటాయని వివరించారు. ప్రజలకు మరింత అవగాహన కలిగేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని వార్డుల్లో పరిశుభ్రతా కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని, లేకుంటే సంబంధిత సిబ్బందిపై, అధికారులపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో అంటువ్యాధులు రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యుద్ధ ప్రాతిపదికన దోమలపై దండయాత్ర ప్రారంభించారని, ఈకార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ రాధారెడ్డి, కౌన్సిలర్లు, శ్రీ కాళహస్తి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, కమిషనర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులతో పట్టణాలలో ర్యాలీ నిర్వహించారు. ఎంజి ఎం పాఠశాల ఆధ్వర్యంలోకూడా దోమలపై దండయాత్ర ర్యాలీ జరిగింది. విద్యార్థులు పరిసరాలను శుభ్రంచేసి మురికిగుంటల్లో ఫినాయిల్ చల్లారు. ఈకార్యక్రమంలో డైరెక్టర్ మయూర్, ప్రధానోపాధ్యాయుడు మునిరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
‘పంటలపై ఏనుగుల దాడులను నివారిస్తాం’
రామకుప్పం, సెప్టెంబర్ 24: మండల పరిధిలోని పంద్యాల మడుగు, ఎస్.గొల్లపల్లి, పులిమడుగు తాండ, కావలి మడుగు తదితర గ్రామాల్లో ఇటీవల పంటలపై తరచూ ఏనుగులు దాడులు చేసి బీభత్సం సృష్టిస్తున్నాయని త్వరలోనే దాడులను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్ ఒ శ్యాంప్రసాద్, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. నష్టమైన పంటలను వారు పరిశీలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు చేపట్టిన కందకాలు, సోలార్ కంచెను మరమ్మతులు చేయిస్తామన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పిటిసి మునస్వామి, టిడిపి మండల అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, రేంజర్ కాలప్పనాయుడు, రైతులు, అటవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాహుదానదీ కాల్వ ఆక్రమణలు తొలగిస్తాం
మదనపల్లె, సెప్టెంబర్ 24: మదనపల్లె పట్టణంలో ప్రధాన కాల్వలు బాహుదానదీ, కురవంక, బుగ్గకాల్వల గట్లు అన్యాక్రాంతమైయ్యాయని, దీంతో కాల్వలలో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని వీటిని పూర్తిగా నిర్మూలించేందుకు నెలరోజుల పాటు పారిశుద్ధ్యంపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మదనపల్లె సబ్‌కలెక్టర్ కృతికబాత్ర వెల్లడించారు. ప్రధానకాల్వగట్లు అన్యాక్రాంతమైయ్యాయని, 150అడుగుల నుంచి 225అడుగుల వరకు కాల్వల వెడల్పులు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సబ్‌కలెక్టర్‌కు సూచించారు. దీనిపై శనివారం మదనపల్లె సబ్‌కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్, కౌన్సిలర్లు బాహుదాకాల్వలో పిచ్చిమొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారం జెసిబితో తొలగించి వాటిని డంపింగ్‌యార్డుకు తరలించే పనులను పరిశీలించారు. పట్టణం మీదుగా ఉన్న బాహుదాకాల్వ, కురవంక, బుగ్గకాల్వలలో పూర్తిగా చెత్తాచెదారం తొలగించి, ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్ కృతికబాత్ర వెల్లడించారు.
పుష్పపల్లకిపై పార్వతీ పుత్రుడు
ఐరాల, సెప్టెంబర్ 24: వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పార్వతి పుత్రుడు పుష్పపల్లకిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పుష్పపల్లకి సేవను తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో తరలి వచ్చారు. ఈ ఉత్సవానికి భాగ్యలక్ష్మమ్మ, దామోదర్‌నాయుడు, విటి రాజన్ అండ్‌బ్రదర్స్, నరసింహారెడ్డి అండ్ సన్స్, ఎం రాజారెడ్డి, ఎం బాలకృష్ణారెడ్డి, ఎం మనోహర్‌నాయుడు బ్రదర్స్ ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం ఉభయదారులు ఆధ్వర్యంలో స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకం చేసి చందన అలంకారం చేసారు. అనంతరం దూప దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. తరువాత భక్తుల దర్శనానికి అనుమతించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరుస తీసుకురాగా సిద్దిబుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేపుచేసి ప్రత్యేక పూజలు చేసారు. 30 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పుతో ప్రత్యేక పుష్ప అలంకరణ, కండ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణతో ప్రత్యేక ఏర్పాట్లుచేసిన పుష్పపల్లకిలో ఉత్సవ మూర్తులను కొలువ తీర్చి అనంతరం మంగళవాయిద్యాల మద్య కాణిపాకం పురవీదుల్లో ఊరేగించారు. ఈకార్యక్రమంలో ఇఒ పూర్ణచంద్రరావు, ఎసి వెంకటేష్, ఎఇఒ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్రబాబు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. పుష్పపల్లకి సేవలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డిఎస్పీ లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో సిఐ ఆదినారాయణ, కాణిపాకం ఎస్సై సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసారు. భక్తుల సౌకర్యార్థం పంచాయతీ అధికారులు మంచినీటి వసతి ఏర్పాటు చేసారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు.
నేటితోప్రత్యేక ఉత్సవాలు ముగింపు
కాణిపాకం వినాయకుని ప్రత్యేక ఉత్సవాల్లో తెపోత్సవం కాగానే ఉత్సవాలు ముగియనున్నాయి. పగలు అభిషేకం, రాత్రి పుష్కరిణిలో స్వామివారు తెపోత్సవంపై ఊరేగనున్నారు. ఈకార్యక్రమానికి శేషాద్రినాయుడు వారి కుమారులు హనుమంతనాయుడు, ఎం రామకృష్ణారెడ్డి కుమారులు, దామోదరనాయుడు, రామచంద్రనాయుడు, మోహన్ బాబు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.