S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం

అమరావతి, సెప్టెంబర్ 24: అల్పపీడన ప్రభావంతో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం సాయంత్రం పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని క్రోసూరు, అమరావతి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. క్రోసూరు మండలంలోని పీసపాడు వద్ద పొలాలను ముంచెత్తిన వాగును, అందుకూరు వాగులను పరిశీలించారు. అలాగే క్రోసూరు నుండి మార్గమధ్యలో విప్పర్ల, విప్పర్ల, ఊటుకూరు, బయ్యవరం వాగులను రోడ్‌షో ద్వారా పరిశీలించి పంటనష్టాన్ని పరిశీలించారు. అమరావతి మండలం మునగోడు గ్రామానికి చేరుకునే సరికి చీకటి పడి వర్షం వచ్చే సూచనలు కనిపించడంతో మునగోడు గ్రామంలో ప్రత్యేక వాహనంపై నుండి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జిల్లాలో జరిగిన నష్టంతో పాటుగా పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నామని తెలిపారు. వరద ముంపునకు గురైన ఇళ్లలోకి నీరుచేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు తక్షణమే బియ్యం, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులను సరఫరా చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే పంటనష్టం అంచనావేసి పరిహారం చెల్లించడంతో పాటుగా ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు మళ్లీ విత్తనాలు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధానంగా పెదకూరపాడు నియోజకవర్గంలో వాణిజ్యపంటలైన ప్రత్తి, మిరప ఇతర కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారుల ద్వారా ఇప్పటికే సమాచారం సేకరించినట్లు చెప్పారు. ప్రభుత్వపరంగా వరద బాధితులను తక్షణమే ఆదుకుంటామని సిఎం హామీ ఇచ్చారు. అలాగే రోడ్‌షో ద్వారా అమరావతి మండల పరిధిలోని జూపూడి, మల్లాది, దిడుగు, ధరణికోట, అమరావతి గ్రామాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ తిరుగు ప్రయాణమై గుంటూరు వెళ్లారు. ఈ పర్యటనలో సిఎం చంద్రబాబు వెంట వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులున్నారు.
గెలుపు గుర్రాలకే సీట్లు
* నగర మేయర్ పీఠం టిడిపిదే * మహిళలకు 50 శాతం రిజర్వేషన్
* సీట్లు రాలేదని అసంతృప్తి చెందొద్దు * నామినేటెడ్‌లోప్రాధాన్యత ఉంటుంది

గుంటూరు, సెప్టెంబర్ 24: నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రజాబలం కలిగిన నాయకులకే ప్రాధాన్యం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. పార్టీకి అంకితభావంతో పనిచేసే వారికే సముచిత స్థానం కల్పిస్తామని తేల్చిచెప్పారు. శనివారం జరిగిన తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ నాయకుడైనా, కార్యకర్తయినా డివిజన్ స్థాయిలో ఖచ్చితంగా పనిచేసి పార్టీ విజయం కోసం పాటుపడాలని కోరారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామన్నారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తరువాతే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. అనివార్య కారణాల వల్ల సీట్లు పొందలేని నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి ఇతరత్రా పదవులలో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. గడిచిన రెండున్నరేళ్ల టిడిపి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి కార్యకర్తా తమ డివిజన్లలో ఇప్పటి నుంచే ప్రచారం చేస్తే గెలుపు తథ్యమన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. నగరపాలక సంస్థపై టిడిపి జెండా ఎగురవేసేంత వరకు అహరహం శ్రమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మేయర్ పీఠాన్ని తమ పార్టీ కైవసం చేసుకుంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. జిల్లా టిడిపి అధ్యక్షుడు జివి ఆంజనేయులు, తూర్పునియోజకవర్గ ఇన్‌చార్జి మద్దాళి గిరిధర్, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు సమావేశంలో ప్రసంగించారు.
ధూళిపాళ్ల రైల్వే ట్రాక్‌ను పరిశీలించిన సిఎం
సత్తెనపల్లి, సెప్టెంబర్ 24: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెడ్డిగూడెం, దూళ్లిపాళ్ళ గ్రామాలవద్ద వరదలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌ను, రోడ్లను పరిశీలించారు. తొలుత హెలీకాప్టర్‌లో రెడ్డిగూడెం చేరుకొని అక్కడి రోడ్డు దుస్థితిని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి దూళ్లిపాళ్ళకు చేరుకొని అక్కడ యుద్ధప్రాతిపదికన జరుగుతున్న రైల్వేట్రాక్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే సిఇ గౌతం శ్రీనివాస్ డెప్యూటీ సిఇ కెఆర్‌కె రాజు ముఖ్యమంత్రితో కట్టకు మట్టితోలుకొనేందుకు ఇబ్బందిగా ఉందన్నారు. దీనికి చంద్రబాబు వెంటనే స్పందిస్తూ జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, గుంటూరు ఆర్‌డివో శ్రీనివాసురావులను ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నిరోజుల్లో ఈ పనులు పూర్తిచేస్తారని అధికారులను అడుగగా వారం రోజుల సమయం పడుతుందని వివరించారు. సిఎం వెంట మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కాంతీలాల్ దండే, రాష్ట్ర మహిళామండలి చైర్మన్ నన్నపునేని రాజకుమారి, ఎంఎల్‌సి రామకృష్ణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా
దోమలపై దండయాత్ర
* డెప్యూటీ సిఎం చినరాజప్ప
గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 24: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, నేటి నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శనివారం స్థానిక మార్కెట్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన దోమలపై దండయాత్రలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కాంతిలాల్ దండేలతో కలిసి మొక్కలు నాటడంతో పాటు పురపాలకశాఖ ఏర్పాటుచేసిన ఈ-టాయిలెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో చినరాజప్ప మాట్లాడుతూ దోమల ద్వారా అనేక వ్యాధులు సంక్రమిస్తున్న విషయాన్ని రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకొచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని గ్రామస్థాయి నుండి మున్సిపల్ కార్పొరేషన్ వరకు దోమలపై దండయాత్ర వలన డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా వంటి అనేక వ్యాధులు వస్తున్న విషయాన్ని విద్యార్థుల్లో అవగాహన కల్పించి, వారి ద్వారా తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అనేక రకాల అంటువ్యాధులు, జబ్బులకు దోమలే కారణమన్న విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించి, దోమలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం దండయాత్ర ప్రారంభించిందన్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ దోమల వలన కలిగే వ్యాధులు, జబ్బులపై ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి దోమల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రతే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. అనంతరం పలు పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, పుల్లారావు జెండా ఊపి ప్రారంభించారు. పురపాలక సంఘ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ సాయిబాబా, కాపు సంక్షేమ సంస్థ చైర్మన్ రామానుజయ, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సంయుక్త కలెక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పురపాలక సంఘం ఇన్‌చార్జి కమిషనర్ కృష్ణకపర్థి, డిఎంహెచ్‌ఒ డాక్టర్ టి పద్మజారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

కవికోకిల పద్యానికి పట్ట్భాషేకం

* వంద గొంతుకలు ఒక్కటై కమనీయ పద్యాలాపన * ఇనాక్‌కు ఘన సన్మానం
గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 24: తెలుగు పద్యానికి, భాషకు తన కవిత్వంతో నవ్యతను సంతరింపచేసిన కవికోకిల గుర్రం జాషువా రచించిన పద్యాలకు శనివారం నగరంలో అసంఖ్యాకంగా తరలి వచ్చిన సాహిత్యాభిమానుల సమక్షాన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కవులు, రంగస్థల కళాకారులు పట్ట్భాషేకం చేశారు. మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యాన నగరంలోని పోలీసు కల్యాణ మండపం వేదికగా ఐదు గంటల పాటు జరిగిన ఈ సభకు సంధానకర్తగా కళాపీఠం అధ్యక్షుడు, మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ, మూర్తిదేవి అవార్డుకు ఎంపికైన ఆచార్య కొలకలూరి ఇనాక్‌ను ఘనంగా సత్కరించారు. సభకు విచ్చేసిన ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, పాలపర్తి డేవిడ్‌రాజు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జివి ఆంజనేయులు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు జాతిని జాగృతం చేసిన మహా కవులలో తెలుగు నాలుకలపై నర్తించేలా కవిత్వాన్ని రచించిన కవితా విశారదుడు జాషువా అన్నారు. తెలుగు పద్యానికి అత్యుత్తమమైన తన సాహిత్యం ద్వారా ప్రాణంపోసిన మహనీయుడు కూడా జాషువానే అని కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, బంగారనంది అవార్డు గ్రహీత నరాలశెట్టి రవికుమార్, ప్రముఖ రంగస్థల నటీమణి బండారు పద్మ, గాయకులు దేవసహాయం, బద్వేల్ శ్రీహరి, రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రంగస్థల కళాకారులు, కవులు విశ్వనరుడి పద్యానికి పట్ట్భాషేకం చేశారు. చాలా సంవత్సరాల తరువాత గుంటూరు నగరంలో గంటలపాటు రంగస్థల కళాకారులు తమ గాన కళానైపుణ్యంతో జాషువా రచించిన కావ్యాలలోని పద్యాలను, మధురంగా ఆలపించి ఆహ్వానితులను ఉర్రూతరలూగించారు. సభలోప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ పాపినేని శివశంకర్, కళాభూషణ్ బి వేదయ్య, జాషువా సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు నూతక్కి దశరథ తదితరులు పాల్గొన్నారు. అతిథులందరూ తొలుత జాషువా చిత్ర పటానికి పుష్పాంజలి సమర్పించి తెలుగు భాషా వికాసానికి ఆయన చేసిన సేవలను ప్రస్తుతించారు.

జగన్ పర్యటనకు ఏర్పాట్లు
గుంటూరు, సెప్టెంబర్ 24: వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఈనెల 26,27 తేదీల్లో పర్యటించనున్నారని, అందుకు సంబంధించి ర్యూట్‌మ్యాప్‌ను ఖరారుచేసినట్లు ఆ పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. శనివారం అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్‌తో కలిసి నేతలు జగన్ పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దాచేపల్లి మండల పరిధిలోని పొందుగల, ముత్యాలంపాడు, దాచేపల్లిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీ, కారంపూడి మండలంలోని మిరియాలలో పర్యటించి రాత్రి పిడుగురాళ్లలో బస చేయనున్నట్లు తెలిపారు.
27న రాజుపాలెం మండలం, కొండమోడు, అనుపాలెం, రెడ్డిగూడెం, సత్తెనపల్లి మండలంలోని వెన్నాదేవి, ధూళిపాళ, సత్తెనపల్లి, రూరల్ ప్రాంతాల్లో పర్యటించనున్నారని చెప్పారు. సమావేశంలో వైసిపి నేతలు జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, లాలుపురం రాము, కొత్తా చిన్నపరెడ్డి, డైమండ్‌బాబు, అంగడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కొండవీటి వాగును
పరిశీలించిన సుప్రీం కోర్టు న్యాయవాది
తాడేపల్లి, సెప్టెంబర్ 24: రైతులపాలిట దుఖఃదాయనిగా పిలిచే కొండవీటి వాగును శనివారం సుప్రీం కోర్టు న్యాయవాది సంజయ్ ఫారిక్ పరిశీలించారు. తొలుత ఆయన కొండవీటి వాగు హెడ్ సూయజ్‌ను పరిశీలించి అనంతరం ఉండవల్లి గహాలయం వద్ద ఉన్న వాగు మలుపును పక్కనే ఉన్న పంట పొలాలను పరిశీలించారు. అక్కడి నుండి కృష్ణాయపాలెం సమీపంలోని వంతెన వద్ద కొండవీటి వాగు మలుపులు, పాలవాగును పరిశీలించారు. తెలుగు రాకపోయినప్పటికీ తెలుగు భాషలో మాట్లాడి రైతుల వద్ద సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండవీటి వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలను పరిశీలించి రైతులకు న్యాయం జరి పిం చేందుకు ప్రయత్నిస్తానన్నారు. కొండవీటి వాగు పరివాహక ప్రాంతంలో సుభిక్షంగా ఉన్న పంట పొలాలు, కేవలం 18 అడుగుల లోతులోని నీరు లభ్యమవటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో మరికొందరు న్యా యవాదులు, స్థానిక రైతు నాయకులు మల్లెల శేషగిరిరావు, గాంధీ, మానంబోసురెడ్డి, కళ్లం సాంబిరెడ్డి, పద్మనాభరెడ్డి, గంగిరెడ్డి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
దానాల్లో రక్తదానం మిన్న
తాడికొండ, సెప్టెంబర్ 24: అన్ని దానాల్లో రక్తదానం మిన్న అని డా ప్రభాకరరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని లాం చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డా ఎం ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి చేయగలిగిన దానాలలో అతి విలువైన, ముఖ్యమైనవి విద్యాదానం, రక్తదానం అన్నారు. రక్తదానం చేయడం ఒక గొప్ప సేవా కార్యక్రమం అని, ప్రతి విద్యార్థీ తప్పక రక్తదానం చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా పి సురేష్‌బాబు మాట్లాడుతూ జాతీయ సేవా పథకంలో చేరిన ప్రతి విద్యార్థీ ఒక సంపూర్ణ విద్యార్థిగా తయారవుతారని, తద్వారా పొందే సర్ట్ఫికేట్ భవిషత్తులో ఉద్యోగ సాధనలో సహయకారిగాకలదని చెప్పారు. ఎనె్నస్సెస్ సభ్యులు సేవకు మారుపేరైన భారతరత్న మదర్ థెరిస్సాను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 200 మంది బిటెక్ విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ముఖ్య అతిథిని కళాశాల డైరెక్టర్ వినయ్‌కుమార్ జ్ఞాపిక, దుశాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల జాతీయ సేవాపథకం ప్రొగ్రామ్ ఆఫీసర్ డా అర్ శ్రీనివాసులు, కళాశాల డైరెక్టర్ డి వినయ్‌కుమార్, కళాశాల ఇతర విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
హాయ్‌లాండ్‌లో సహస్ర సాధక సమ్మేళనం
మంగళగిరి, సెప్టెంబర్ 24: మండల పరిధిలోని చినకాకానిలో గల హాయ్‌లాండ్ ప్రాంగణంలోప్రభాకర ధ్యాన మండలి (చినకాకాని), సెంట్రల్ లోటస్ కాంగ్రిగేషన్ కమిటీ (కుంభకోణం) సంయుక్త ఆధ్వర్యాన రెండు రోజులపాటు జరిగే మాస్టర్ సివివి భృక్తరహిత తారక రాజయోగ 17వ సహస్ర సాధక సమ్మేళనము శనివారం ప్రారంభ మయింది. ఈ కార్యక్రమంలో కాంగ్రిగేషన్ కమిటీ అధ్యక్షుడు సిఎస్ జయకుమార్ మాట్లాడుతూ సర్వమానవులు వ్యాధి, వృద్ధాప్యం, చావులేకుండా రక్తమాంసాలతో కూడిన భౌతిక శరీరంతో ఈ భూమిమీద శాశ్వతంగా దేవ మానవుడిగా ఉండాలని భుక్తరహిత తారక రాజయోగంను మాస్టర్ సీవీవీ ప్రారంభించారని అన్నారు. మానవుల్లోని లోపాలను, సృష్టిలోని లోపాలను సరిచేయడానికి 1910 మే 29 నుంచి 1922 మే 12 వరకు తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలో తమ శిష్యుల చేత సీవీవీ కొన్ని కోర్సులు చేయించారని, యోగాభివృద్ధి కోసం నాటినుంచి సీవీవీ చెప్పిన విధంగా ప్రపంచమంతటా ఎంతోమంది యోగాసాధన చేస్తున్నారని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి సాధకులు వేలాదిగా తరలివచ్చారు. యోగాసనాలు ప్రదర్శించారు. కాంగ్రిగేషన్ కమిటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌బి శాస్ర్తీ, కన్వీనర్ వైఎస్‌న్ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.