S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆరోగ్యకర సమాజం నిర్మిద్దాం

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 24:ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో భాగంగా ప్రతిఒక్కరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు దోమల నిర్మూలనలో భాగస్వాములు కావాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత’లో భాగంగా శనివారం నగరంలోని పలు విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్ నుంచి డిఎస్‌ఎ స్టేడియం వరకూ భారీ ర్యాలీ చేపట్టి, అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్ల అమాయకులు బలైపోతున్నారని, వాటిని అరికట్టేందుకు సిఎం చంద్రబాబు ‘దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇటీవల వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయని, దీంతో పరిసరాలను శుభ్రం చేయటానికి వీలు పడదని, ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు(అన్నదమ్ములు) డెంగ్యూ వ్యాధితో మృత్యువాతపడ్డారన్నారు. ఈ సంఘటనతో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రజలు కలత చెందారని భావించి ఇకపై దోమ కాటు వల్ల ఎవ్వరూ చనిపోకూడదని ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. ఇందులో అధికారులతో పాటు విద్యార్థులను భాగస్వాములను చేసి ప్రతి విద్యార్థి 3వ శనివారం తన చుట్టు పక్కల ఉన్న 3 ఇళ్లలోని ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై వివరించేలా ఏర్పాట్లు చేశామన్నారు. జడ్పీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ యువత భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందన్నారు. ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మాట్లాడుతూ పరిసరాల గురించి అధికారులు చెబితే వినరని అదే తమ పిల్లలు చెబితే తల్లిదండ్రులు ఖచ్చితంగా వింటారన్నారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ దోమల నిర్మూలనకు అందరు బాధ్యత వహించాలన్నారు. దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాను దోమలు లేని జిల్లాగా మార్చాలన్నారు. అలాగే జిల్లాలో దాదాపు 10 లక్షల కుటుంబాలు ఉన్నాయని, ఆ కుటుంబాలకు దోమల గురించి అవగాహన కల్పించేందుకు విద్యార్థులను బాగస్వాములను చేస్తామన్నారు. జిల్లాలో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, వారిలో ప్రతిముగ్గురు ఒక్క టీంగా ఏర్పడి తమ చుట్టుపక్కన ఉన్న 10 ఇళ్లలో అవగాహన కల్పిస్తే 6 నెలల్లో ఆరోగ్యవంతమైన జిల్లాగా మారుతుందని, విద్యార్థులు ఆ దిశగా పయననించాలని సూచించారు. సభలో జెసి హరికిరణ్, ఎస్పీ రవికృష్ణ, డిఆర్‌ఓ గంగాధరగౌడ్, డిఎఫ్‌ఓ యశోదబాయి, కమిషనర్ రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, మణిగాంధీ, నాయకులు కెఇ ప్రభాకర్, ఏరాసు ప్రతాపరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, తదితరులు పాల్గొన్నారు.
‘హోదా’ గురించి జగన్‌కు తెలుసా..
* నవంబర్ నుంచి టిడిపి సభ్యత్వ నమోదు
* జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 24: ప్రత్యేక హోదా అంటే ఏమిటి, దాని గురించి పూర్తి సమాచారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు తెలుసా అని కార్మిక శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. నగరంలోని టిడిపి కార్యాలయంలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సిఎం చంద్రబాబు దాదాపు 32 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి విన్నవించారన్నారు. అయితే ప్రత్యేక హోదా 14వ ఆర్థిక సంఘంలోకి రాదని, హోదాకు మించి ప్యాకేజీ ఇస్తామని చెప్పి, ఆ మేరకు కేంద్రం రాష్ట్రానికి రూ. 2.29లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి తేడా తెలియని జగన్ ప్రజలను, విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు జగన్ మాట వినవద్దని, ఆయన దాదాపు 12 కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ వివాదాల్లో చిక్కుకున్నారని అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడటం ఎంతవరకూ సమంజసమన్నారు. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా అవినీతి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. రాష్టస్థ్రాయిలో నిర్వహించే పార్టీ వ్యవహారాలు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో తెలియటం లేదని, దీంతో పార్టీ వ్యవహారాల కోసం కూడా డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేస్తారన్నారు. గ్రామ, మండల, జిల్లా కమిటీల గురించి సిఎం డ్యాష్‌బోర్డుపై చూసి పార్టీ పటిష్టతకు కృషి చేస్తారన్నారు. నవంబర్ నుంచి పార్టీ సభ్యత్వ నమోదు చేపడుతామని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, బిసి జనార్ధనరెడ్డి, మాజీ మంత్రులు కెఇ ప్రభాకర్, శిల్పా మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రైతుల కోసం పోరాటం
* కేంద్ర మాజీ మంత్రి కోట్ల
కోడుమూరు, సెప్టెంబర్ 24:రైతుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. మండ ల పరిధిలోని కోట్ల స్వగ్రామమైన లద్దగిరిలో శనివారం క్రిష్ణగిరి, వెల్దుర్తి మం డలాల కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా కోట్ల టిడిపి ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు రైతులు, ప్రజలకు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టించేందుకు జనాకర్షక పథకాలు చేపడుతున్నారని విమర్శించారు. అందుకే జిల్లా వ్యాప్తంగా కాం గ్రెస్ పార్టీ పర్యటించి రైతుల పక్షాన నిలబడి పోరాటాలు సాగించేందుకు సిద్ధమయ్యామన్నారు. రెండున్నర ఏళ్ల టిడిపి ప్రభుత్వ విధానాలపై ప్రజలు విసుగుచెందారని స్పష్టం చేశారు. రైతులకు ఎక్కడా రుణమాఫీ చేయలేదని, ఇంత వరకూ జిల్లాలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా చేసిందేమీ లేదని ఎద్దవా చేశారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంలో విఫలం చెందారని విమర్శించారు. అధికారం అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు గ్రామాల్లో దౌర్జాన్యాలకు దిగుతున్నారని, ఇలాంటివి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులకు, ప్రజలకు అండగా ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కోల్పోయిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ మనుగడ తగ్గదని తేల్చిచెప్పారు. మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంటుందని, ప్రజలు తమ పార్టీపై చూపుతున్న ఆదరాభిమానాలతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచే జిల్లా వ్యాప్తంగా పర్యటించనున్నట్లు కోట్ల స్పష్టం చేశారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో
ముగ్గురి మృతి
* 8 మందికి గాయాలు
పాములపాడు, సెప్టెంబర్ 24 : జిల్లాలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 8 మంది గాయప డ్డారు. అందులో కర్నూలు-గుంటూ రు ప్రధాన రహదారిపై జూటూరు గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెంది న ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు అనుచరు లు ఇద్దరు దుర్మరణం చెందారు. పాములపాడు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు వైకాపాలో చేరుతున్న సందర్భంగా ఆయన అనుచరులు తూఫాన్ వాహనంలో విజయవాడకు వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగియగానే వారు తిరిగి కర్నూలుకు వస్తుండగా పాములపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని జూటూరు గ్రామ సమీపంలో నిలిచి వున్న లారీని తుఫాన్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో జమ్మన్న(40), జాన్(25) అక్కడికక్కడే మృతి చెందగా మరో 8మంది గాయపడ్డారు. ఈ వాహనం వెనుకనే వారికి చెందిన మరో వాహనం వస్తుండడంతో వారు ఆగి మృతిచెందిన, గాయపడి వారిని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతిచెందిన ఈ ప్రమాదానికి కారణం తుఫాన్ వాహనం డ్రైవరు నిర్లక్ష్యమని తెలిపారు.
మరో ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి
ఆళ్లగడ్డ : మండల పరిధిలోని పేరాయిపల్లె, నల్లగట్ల గ్రామాల మధ్య జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చాగలమర్రి మాజీ సర్పంచ్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎంఎస్ నిజాముద్దీన్(56) మృతి చెందాడు. ఎస్‌ఐ రామయ్య తెలిపిన వివరాలు.. నిజాముద్దీన్ శనివారం సాయంత్రం చాగలమర్రి నుంచి ఆళ్లగడ్డకు వెళ్లి అక్కడ పని ముగించుకుని తిరిగి ద్విచక్రవాహనంపై నంద్యాలకు బయల్దేరాడు. అయితే పేరాయిపల్లె, నల్లగట్ల గ్రామాల మధ్య జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిజాముద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే డ్రైవర్ లారీ మందు భాగంలో ద్విచక్ర వాహనం ఇరుక్కున్నా ఆపకుండా అతి వేగంతో ముందుకుపోయాడు. చివరకు నల్లగట్ల గ్రామం సమీపంలో లారీని వదిలేసి పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే రూరల్ ఎస్‌ఐ రామయ్య సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే టిడిపి నాయకులు బివి రామిరెడ్డి, మహేశ్వరరెడ్డి, జయచంద్రారెడ్డి, చాగలమర్రి నాయకులు అన్సర్‌బాషా, ఎంపిటిసి గయాజుద్దీన్, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకన్నారు. నిజాముద్దీన్ మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ సంతాపం తెలిపారు. కాగా నిజాముద్దీన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈయన భూమాకు అత్యంతగా సన్నిహితుడిగా వుండేవాడు. ఈయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
నంద్యాలలో 2 నుంచి బహిరంగ
మలవిసర్జన నిషేధం
నంద్యాల, సెప్టెంబర్ 24: అక్టోబరు 2వ తేదీ నుంచి నంద్యాల పట్టణంలో బహిరంగ మలవిసర్జన నిషేధిస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మాణాన్ని ఆమోదించింది. స్వచ్ఛ్భారత్ పిలుపుమేరకు నంద్యాల పురపాలక సంఘం బహిరంగ మలవిసర్జనపై కఠిన చర్యలకు పూనుకుంది. బహిరంగంగా మలవిసర్జన చేసిన వారికి రూ. 5 వేల జరిమానాతోపాటు, సదరు వ్యక్తి ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటుచేసి ఆ వార్డు లో ఊరేగిస్తామని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. శనివా రం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ హాలులో చైర్‌పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో అజెండాలోని ప్రధాన అంశమైన బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణం గా నంద్యాలను అభివృద్ధి చేసేందుకు వార్డు కౌన్సిలర్లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై కౌన్సిలర్లు శివశంకర్, అనిల్ అమృతరాజ్, కత్తి శంకర్, పడకండ్ల సుబ్రమ ణ్యం, భీమునిపల్లె వెంకటసుబ్బయ్య, జెవిసి హారిక మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జనపై నిషేధం విధించడం మంచి పద్దతేనని, అయితే పట్టణ జనాభా 3 లక్షలకు చేరిందని, వారికి సరిపడ వౌళిక సదుపాయాల కల్పన సరిగా జరగలేదన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి మరుగుదొడ్డి లేద ని, మరుగుదొడ్లు లేనివారికి సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించి నిషేధం విధిస్తే బాగుంటుంద ని సభ్యులు సూచించారు. దీనిపై కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ స్వచ్ఛ్భారత్ మిషన్ కేంద్ర ప్రభుత్వ సభ్యులు నంద్యాల పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి బహిరం గ మలవిసర్జనపై నివేదిక సిద్దం చేస్తారన్నారు. అందువల్ల వార్డు సభ్యులందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. పురపాలక సంఘం బహిరంగ మలవిసర్జన లేని పట్టణం గా గుర్తింపు పొందితే స్వచ్ఛ్భారత్ మిషన్ నుంచి మరిన్ని నిధులు అందే అవకాశాలు ఉన్నాయన్నారు. బహిరం గ మలవిసర్జన, మూత్రవిసర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంగీకార పత్రం ఇవ్వాలని కోరారు. చైర్‌పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ నంద్యాలను పరిశుభ్రమైన పట్టణంగా అభివృద్ధి చేసేందుకు బహిరంగ మల, మూత్రవిసర్జనపై నిషేధం విధించడం మంచి నిర్ణయమేనన్నారు. పట్టణ ప్రజలంతా దీనిపై అవగాహన పెంచుకుని సహకరించాలన్నారు. కాగా గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదనీరు ఖాళీ స్థలాల్లో చేరిన కారణంగా దోమలు విజృంభిస్తున్నాయని, ఖాళీ స్థలాల్లోని నీటిని పురపాలక యంత్రాంగం తోడి వేసి దోమలను అరికట్టాలని పలువురు సభ్యులు సూచించారు.
పుట్టలో అమ్మవారి విగ్రహం
* కలలో కనపడినట్లు తెలిపిన ముస్లిం మహిళ..
* చూసేందుకు తరలివచ్చిన జనం..
జూపాడుబంగ్లా, సెప్టెంబర్ 24:మండల పరిధిలోని పురాతన గ్రామమైన పారుమంచాల గ్రామ పొలిమేరలో మారెమ్మ కుంట చెరువు వద్ద ఉన్న పుట్టలో శనివారం అమ్మవారి విగ్రహం బయటపడింది. పారుమంచాల గ్రామానికి చెందిన ఓ ముస్లిం మహిళ గడిచిన 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివాసం వుంటున్నారు. ఆమెకు నిద్రలో నిత్యం విగ్రహం వున్నట్లు కల వస్తుండేదని ఆమె గ్రామ ప్రజలకు తెలిపింది. ఈ మేరకు పారుమంచాల గ్రామానికి వచ్చి కొందరు సహాయకులతో పుట్ట చుట్టూ వున్న కంపచెట్లను తొలగించారు. దీంతో ఆ పుట్టలో అమ్మవారి విగ్రహం బయటపడింది. విగ్రహం చేతిలో కుంకుమ భరణి, నాగేంద్రుని శిరసు వున్నట్లు వారు గుర్తించారు. ఈ విషయం ఈ నోటా ఆ నోటా పడి గ్రామస్థులకు తెలియడంతో ప్రజలు తండోపతండాలుగా వెళ్లి విగ్రహానికి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
రాష్ట్రంలోనే ఆదర్శంగా
ఉర్దూ యూనివర్శిటీ
* తల్లిదండ్రుల ఆశయాలను సాకారం చేయాలి
కర్నూలు ఓల్డ్‌సిటీ, సెప్టెంబర్ 24: రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉర్దూ యూనివర్శిటీని తీర్చుదిద్దుతామని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీ ఉపకులపతి వై.నరసింహులు పేర్కొన్నా రు. స్థానిక ఉర్దూ యూనివర్శిటీలో శనివారం ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విసి హాజరై ప్రసంగించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను సాకారం చేసేలా విద్యనభ్యసించాలన్నారు. యూనివర్శిటీ దశ నుంచి తమ కు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని భావి భారత పౌరులుగా ఎదిగి దేశ పతాకాన్ని ప్రపంచంలోనే ఉన్నత శిఖరాలకు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విశ్వవిద్యాలయం అతిథి ఉపన్యాసకులుగా పని చేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్.మహబూబ్‌బాషాకు విసితో పాటు రిజిస్ట్రార్ ఎస్‌ఎ.సత్తార్‌సాహెబ్ పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. అలాగే ఫ్రెషర్స్ డే పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, సోలో సాంగ్, అంత్యాక్షరి విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. అనంత రం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో సహాయ ఆచార్యులు డాక్టర్ ఎస్‌ఎస్.మొయినుద్దీన్, డాక్టర్ ఆమ్తూర్ రహీం, డాక్టర్ ఎస్.మహబూబ్‌బాషా, ఎం.గిరిధర్‌సింగ్, ఎండి. ఇర్ఫాన్, అబూబకర్, రషీద్, సిబ్బంది ఫిరోజ, గోపాలకృష్ణమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.
భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే..
* పిసిసి కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 24:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని, ఈ తరుణంలో భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే అని పిసిసి కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు జోస్యం చెప్పారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం బుచ్చిబా బు పాత్రికేయుల సమావేశంలో మా ట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రజల కు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో బిజెపి, టిడిపి విఫలం చెందాయన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్‌పార్టీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాం గ్రెస్‌కు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా అన్ని రాజకీయ పార్టీలు లేఖలు రాయటమే కాకుండా ముక్తకంఠంతో తెగేసి చెప్పటంతో విధిలేని పరిస్థితిలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర విభజన చేసిందని గుర్తుచేశారు. అయితే మిగతా పార్టీలు కాంగ్రెస్ పార్టీనే ముద్దాయిగా పేర్కొనడంతో ఆ ఎన్నికల్లో బిజెపి, టిడిపి గెలిచాయన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి కోట్లతో పాటు మిగతా నాయకులు డిమాండ్ చేస్తుంటే అర్హత లేని నాయకులు కోట్లపై విమర్శలు చేయ డం శోచనీయమన్నారు. సమావేశంలో నాయకులు మదనగోపాల్, వెంకటస్వామి, పెద్దారెడ్డి, వైవి.రమణ, శ్రీనివాసరెడ్డి, ఖలీల్‌బాషా, అశోకరత్నం, తదితరులు పాల్గొన్నారు.
ఒలింపిక్ పతకాలే లక్ష్యం కావాలి
* ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 24:ప్రతి క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా సాధన చేయాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో ఆదివారం రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-19 బాలబాలికల టెన్నిస్ వాలీబాల్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నతనం నుంచే క్రీడల్లో నిరంతరం సాధన చేస్తే యవ్వన దశలోకి వచ్చేలోగా మంచి క్రీడాకారులుగా తయారవుతారన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా వుంటారని, తద్వారా విద్యలో కూడా రాణించి మంచి పౌరులుగా ఎదుగుతారన్నారు. జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొడం వల్ల క్రమశిక్షణతో పాటు పోటీతత్వ, క్రీడాస్ఫూర్తి ఏర్పడుతాయన్నారు. అనంతరం వారు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరయాదవ్, డిప్యూటీ డివిఇఓ వెంకటరావు, టెన్నిస్ వాలీబాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, పార్వతమ్మ, స్కూల్ గేమ్స్ సంఘం కార్యదర్శి చలపతిరావు, ఈశ్వరనాయుడు, హర్షవర్ధన్, హరిప్రసాద్‌నాయుడు, అవినాష్, పద్మావతి, లక్ష్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఏపిజిబి లావాదేవీలు
రూ. 19,500 కోట్లు
* ఎపిజిబి చైర్మన్ సంపత్‌కుమార్ ఆచారి
మహానంది, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రాష్ట్రంలో 504 శాఖలతో 19,500 కోట్ల లావాదేవీలు నిర్వహిస్తోందని ఎపిజిబి చైర్మన్ డి. సంపత్‌కుమార్ ఆచారి తెలిపారు. శనివారం ఆయన కుటుంబ సమేతంగా మహానందిలో పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ మర్యాదలతో పర్యవేక్షకులు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్ర్తీ స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి, అమ్మవార్లకు అభిషేకార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బ్యాంకులో బంగారు రుణం గ్రాముకు రూ.2 వేలకు పెంచామన్నారు. గృహ నిర్మాణ రుణాలకు ప్రాసెస్ ఫీజు 50 శాతం చెల్లిస్తే వారికి రుణాలు అందిస్తున్నామన్నారు. ఇకనుంచి ఇంటినుంచే బ్యాంకింగ్ సేవలు నిర్వహించేలా మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో వ్యాపార ప్రతినిధులు 985 మంది ఉన్నారని, వారి నుంచి ఈ లావాదేవీలు కూడా జరుపుకోవచ్చన్నారు. త్వరలో 20 వేల కోట్ల లావాదేవీలను చేరుకోబోతున్నామని అన్నారు. బ్యాంకులో రూ.10,300 కోట్లు డిపాజిట్లు ఉండగా, రూ.9,200 కోట్లు రుణాలుగా ఇచ్చామన్నారు. ఇందులో 76 శాతం వ్యవసాయ రుణాలు ఉన్నాయన్నారు. ఎటిఎం సెంటర్లు 67 ఉన్నాయని, డిసెంబరు నాటికి 90 ఎటిఎంలు ఏర్పాటుచేస్తామన్నారు. ఆయన వెంట రీజనల్ ఆఫీసర్ వసంతకుమార్‌రెడ్డి, క్యాషియర్ సుబ్బారావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేంద్రనాధరెడ్డి తదితరులు ఉన్నారు.