S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సందడిగా సాగిన ‘బాబు’ ప్రదర్శన

ఏలూరు, సెప్టెంబర్ 24:రాష్ట్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘దోమలపై దండయాత్ర’ ప్రారంభానికి ఏలూరు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యార్ధినీవిద్యార్ధులు, ప్రజలు దారిపొడవునా అపూర్వ స్వాగతం పలికారు. ఆయనతోపాటు వందలాది మంది విద్యార్ధులు దండుగా ప్రదర్శనలో పాల్గొనడంతో ప్రధాన రహదారి మొత్తం నిండిపోయింది. విద్యాసంస్ధలకు శెలవు ప్రకటించడంతో అయా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్దినీవిద్యార్ధులు తమ కళాశాలల బ్యానర్లు, స్వచ్ఛ్భారత్ బ్యానర్లు, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసే ప్లకార్డులను పట్టుకుని చంద్రబాబు వెంట ప్రదర్శనలో పాల్గొన్నారు. స్ధానిక సర్ సిఆర్‌ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు ఉదయం 11.30 గంటలకు చేరుకున్న చంద్రబాబు అక్కడ నుండి కాన్వాయ్‌లో బయలుదేరారు. అయితే కొత్తబస్టాండ్ వద్ద ఉన్న వంతెన వద్దకు చేరుకునే సరికి దారిపొడవునా విద్యార్ధులు, ప్రజలు నిలబడి ఉండటంతో కాన్వాయ్ దిగిపోయిన చంద్రబాబు ఇక అక్కడ నుంచే ప్రదర్శనగా ఫైర్‌స్టేషన్ సెంటరుకు బయలుదేరారు. దీంతో రోడ్లకు ఇరువైపులా అటు విద్యార్ధులు, ఇటు ప్రజలు కూడా చంద్రబాబును చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపారు. దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులకు సంబంధించిన ప్లకార్డు పట్టుకుని సిఎం చంద్రబాబు ప్రదర్శనలో పాల్గొన్నారు. మధ్యమధ్యలో అగుతూ అభివాదాలు చేస్తూ, మరికొంతమందితో మాట్లాడుతూ, విద్యార్ధులను పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. జడ్పీ కార్యాలయం వద్ద ఒక మహిళ తన చిన్నారిని తీసుకుని రావటంతో అక్కడ ఆగిన చంద్రబాబు ఆ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. పలువురు విద్యార్ధులు చంద్రబాబుతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు కాన్వాయ్‌కు ముందు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ చిన్నారుల్లో ఉత్సాహన్ని నింపారు.

ప్రతి శనివారం ఆరోగ్యవారం
ముఖ్యమంత్రి పిలుపు
ఏలూరు, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్‌ను సంక్రమిత వ్యాధిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి శనివారం ఆరోగ్యవారంగా పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. స్ధానిక సురేష్‌చంద్ర బహుగుణ పోలీసు స్కూల్ ఆవరణలో రాష్ట్రప్రజల ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తున్న దోమలపై దండయాత్రను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈసందర్భంగా దోమల కారణంగా వ్యాపించే వ్యాధులు, నివారణ చర్యలు, దోమల నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తచర్యలపై ‘దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో 110 మున్సిపాల్టీలను అక్టోబర్ 2వ తేదీనాటికి బహిరంగ మలవిసర్జన రహిత మున్సిపాల్టీలుగా తీర్చిదిద్దుతామని, ఈ సంవత్సరాంతానికి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలను బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతాలుగా దేశంలోనే తొలిసారిగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. రాష్ట్ర గనులు, స్ర్తి,శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి ఆటంకం కలిగించే వారిని దోమల మాదిరిగా తరిమికొట్టాలన్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు జిల్లా అభివృద్ధిని ప్రత్యేక దృష్టితో చూస్తారనే విశ్వాసం చంద్రబాబుపై ఉందన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండు విపత్తుల నుండి కాపాడిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దగల నేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నగరంలో దోమలపై దండయాత్రకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జ్వరాల నివారణకు 243 సంచార వైద్యయూనిట్లను ఏర్పాటుచేశామన్నారు. దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రతపై ప్రచురించిన పుస్తకం భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని, ఈ పుస్తకాన్ని ప్రతి ఇంటికి అందజేస్తామన్నారు. పంచాయితీరాజ్ కమిషనర్ బి రామాంజనేయులు మాట్లాడుతూ రానున్న మూడేళ్లలో రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా నిలుపుతామన్నారు. దేశంలోనే బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా పశ్చిమగోదావరి జిల్లాను ప్రకటించనున్నారని, దీనికి కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్‌ను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత వివిధశాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించి, పోలీసు స్కూల్‌లో మొక్కలు నాటారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు వినియోగించే బహుళ ప్రయోజన మినీ పొక్లెయినర్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిలు తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబు, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, వేటుకూరి శివరామరాజు, పులపర్తి రామాంజనేయులు, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఏలూరు డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, కార్పోరేటరు బండారు కిరణ్‌కుమార్, డిఐజి రామకృష్ణ, జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కరరావు, జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్, జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీప్, కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, టిడిపి నేతలు పాలి ప్రసాద్, దాసరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

వరద సహాయక కార్యక్రమాలకు జిల్లా నుంచి అధికారులు
-గుంటూరుకు పలువురు ఎస్‌డిసిలు -

ఏలూరు, సెప్టెంబర్ 24 : గుంటూరు జిల్లాలో వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన పలువురు అధికారులను తక్షణం పంపాలంటూ ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునీత శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా రాజమండ్రి భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్, నల్లజర్ల ఎస్‌డిసి డి పుష్పమణి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఝాన్సీరాణి, కెఆర్‌సి ఎస్‌డిసి ఆర్‌వి సూర్యనారాయణ, పోలవరం ప్రాజెక్టు ఎస్‌డిసి ఎ శ్రీరామచంద్రమూర్తి, కె ఆర్ పురం ఎస్‌డిసి సిహెచ్ వెంకటేశ్వరరావులను తక్షణం గుంటూరు పంపాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సిఎంను ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శన
ఏలూరు, సెప్టెంబర్ 24: రాష్ట్రప్రభుత్వం శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్ధులు కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబును విపరీతంగా ఆకట్టుకున్నారు. స్ధానిక సురేష్‌చంద్ర బహుగుణ పోలీసు ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు దోమల వల్ల కలిగే వ్యాధులను వివరించటంతోపాటు ఏలూరు కెపిడిటి హైస్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్ధులు దోమ బొమ్మల ప్ల్లకార్డులను కట్టుకుని ముఖ్యమంత్రిని ఆకట్టుకున్నారు. ఈసందర్భంగా వారు రెండునిముషాల పాటు ప్రదర్శించిన లఘునాటిక కార్యక్రమంతో చంద్రబాబు మంత్రముగ్ధులయ్యారు. ప్రభుత్వం చేపట్టిన దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని కేవలం రెండు నిముషాలపాటు అందరికి అర్ధమయ్యేరీతిలో ప్రదర్శించిన ఆ చిన్నారులను ప్రశంసలతో ముంచెత్తారు. ఈసందర్భంగా దీనికి రూపకల్పన చేసిన పోతునూరు జడ్పీ హైస్కూల్ ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు, జిల్లా సైన్సు అధికారి టి అప్పారావు, జిల్లా విద్యాశాఖాధికారి మధుసూదనరావును కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వారిద్దరు తమ ప్రసంగంలో సిఎం చంద్రబాబు పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించటంతో ఆయన కూడా ఎంతో అనందపడ్డారు. తర్వాత తన ప్రసంగంలో వారిద్దరి మాటలను కూడా ఆయన ప్రస్తావించటం గమనార్హం.

వర్ష బాధితులను ఆదుకుంటాం
మంత్రి సుజాత హామీ
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 24: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు, పంటలు దెబ్బతిన్న బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ముంపునకు గురైన పట్టణంలోని 9వ వార్డు రాముడుకుంటను శనివారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి పలు సమస్యలు కాలనీలోని మహిళలు తీసుకువచ్చారు. కాలనీలో రహదార్లు అధ్వాన్నంగా ఉండటం, ఆపై మురుగునీరు ప్రవహిస్తుండటం చూసిన మంత్రి సుజాత మున్సిపల్ కమిషనర్, అధికార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలోని పేదలకు పట్టాలు ఇవ్వలేని పక్షంలో ఎంజాయ్‌మెంట్ సర్ట్ఫికెట్లు ఇవ్వాలని ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం రాత్రి 147.8 మిల్లీమీటర్ల భారీ వర్షం కురవడంతో పల్లపు ప్రాంతమైన రాముడుకుంట మునిగిపోయి సుమారు 30 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారని, 17 ఇళ్లు దెబ్బతిన్నాయని కౌన్సిలర్ బొబ్బర రాజ్‌పాల్‌కుమార్, టిడిపి నేతలు కొండ్రెడ్డి కిషోర్, పెనుమర్తి రామ్‌కుమార్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా నిరాశ్రయులైన కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సుజాత విలేఖరులతో మాట్లాడుతూ రాముడుకుంట ముంపు నివారణకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి భారీ డ్రైనేజి నిర్మాణానికి ప్రత్యేక నిధులు కోరతానన్నారు. నీరు-చెట్టు పథకం కింద చెరువు పూడిక తీయిస్తామని చెప్పారు. ప్రజలు కూడా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, కాచిన నీరు తాగాలని, వేడి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, టిడిపి సీనియర్ నేత మండవ లక్ష్మణరావు, ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్ జివివి సత్యనారాయణ, జడ్పీటిసి సభ్యుడు శీలం రామచంద్రరావు, మున్సిపల్ కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు, ఎంపిడిఒ పి.శ్రీదేవి, కౌన్సిలర్ బొబ్బర రాజ్‌పాల్‌కుమార్, తెలుగుదేశం నేతలు పెనుమర్తి రామ్‌కుమార్, నంబూరి రామచంద్రరాజు, కొండ్రెడ్డి కిషోర్, వందనపు హరికృష్ణ, షేక్ యాకూబ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఇ-బైకులు
ఇ-మోటో
ఛాంపియన్‌షిప్-2016

భీమవరం, సెప్టెంబర్ 24: భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి ఇ-మోటో ఛాంపియన్‌షిప్-2016 (ఇ-బైకు రేసింగ్)లో రెండవ రోజు శనివారం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన 25 విద్యార్థీ బృందాలు నవీన ఆవిష్కరణలతో రూపొందించిన ఎలక్ట్రికల్ బైకులు అందరినీ ఆకట్టుకున్నాయ. ప్రతీ ఎలక్ట్రికల్ బైకును సాంకేతిక పరీక్ష నిర్వహించారు. వాహన తయారీ నియమావళి ప్రకారం రూపొందించారో లేదోనని గుర్తించారు. ప్రతీ బైకుకు బరువు, నీటి పరీక్షలు కూడా చేశారు. వానా కాలంలో నీటిలో తడవడం వల్ల ఈ ఎలక్ట్రికల్ బైకులో ఏమైనా లోపాలు, షార్టుసర్క్యూట్ జరుగుతుందా అనే అంశాలపై పరీక్షించారు. అనంతరం అర్హత సాధించిన నమూనా- వాహనాలను నవీన ఆవిష్కరణలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం పరీక్షిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులు నవీన ఆవిష్కరణలు సామాన్యులకు సాంకేతిక పరిజ్ఞానానికి చేరువ చేసే రీతిలో రూపకల్పన చేశారు. బ్లూటూత్ సౌకర్యం.. బయోమెట్రిక్ ద్వారా యజమాని చేతి వేలిముద్రలు గుర్తించడం.. వాహనం నడపడానికి తాళంతోపాటు మొబైల్‌కు పాస్‌వార్డ్ వచ్చే సందేశం.. దొంగలు వాహనాన్ని కదిలించే ప్రయత్నం చేస్తే యజమానికి వచ్చే సంక్షిప్త సందేశం.. వాహన యజమాని హెల్మెట్ ధరించాడో లేదో సూచించే నవీన సౌకర్యాలు ప్రతీ ఎలక్ట్రికల్ బైకులో ఉండటం విశేషం. ఇటువంటి సృజనాత్మకత కలిగిన యువ ఇంజనీర్లను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి శ్రీనివాసరాజు, సమన్వయకర్తలు మనోనీత్ కుమార్, సాగర్, వికాస్‌లు పర్యవేక్షించారు.
తమ్మిలేరును అభివృద్ధిచేయాలి
ఏలూరు, సెప్టెంబర్ 24: తమ్మిలేరులో గుర్రపుడెక్క, తూడు తొలగించి తమ్మిలేరును అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. స్ధానిక రెడ్డి కళాశాల వద్ద శుక్రవారం తమ్మిలేరును ఆయన పరిశీలించారు. తమ్మిలేరు వల్ల గతంలో ఏలూరు నగరం ముంపునకు గురైన పరిస్దితుల దృష్ట్యా ముందుజాగ్రత్తచర్యగా తమ్మిలేరును వెడల్పు చేసి నీరు సక్రమంగా పారుదల జరిగేలా చూడాలని, తమ్మిలేరు మురికికూపంగా కాకుండా సేద్యపునీటిని అందించే ఒక ప్రధానకాల్వగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం ఎంత ఖర్చు అయినా నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరునాటికల్లా తమ్మిలేరు అభివృద్ధి పనులు పూర్తిచేస్తామని, ఇప్పటికే 18కోట్ల రూపాయలతో పనులు సిద్ధంచేశామన్నారు. కార్యక్రమంలో విప్ చింతమనేని ప్రభాకర్, ఎంపి మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు.