S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి

ఒంగోలు, సెప్టెంబరు 24: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో దేశ ప్రధాని మోదీ, హోదా తెచ్చే విషయంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. శనివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ అప్పటిలో జరిగిన రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కృషి చేస్తామంటే ఇప్పటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎపికి 10 సంవత్సరాలు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేశారని, అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఏకంగా రాష్ట్రానికి 15 సంవత్సరాలు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేసినట్లు ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా ఎన్నికల సమంలో ఇప్పటి దేశ ప్రధాని నరేంద్ర మోది తిరుపతి ఎన్నికల సభలోబిజిపి దేశంలో అధికారంలోకి ఎపికి 10 సంవత్సరాలు ఇస్తామని సభలో ప్రకటించడమే కాకుండా ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజియే మంచిదని చెబుతూ ఈ ముగ్గురు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఇదేమని ఎవరైనా మోదీ, వెంకయ్య నాయుడును ప్రశ్నిస్తే రాష్ట్ర విభజన సమయంలో ఎపికి ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్ర విభజన బిల్లులో చట్టం చేయలేదని తప్పుకుంటూ ఆ నెపాన్ని కాంగ్రెపై వేస్తూ తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో బిజెపి ప్రభుత్వ అధికారంలో ఉన్నందున అన్ని అడ్డంకులను తొలగించి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నాటికి ఎపికి 16వేల 50 కోట్ల రూపాయలు లోటు బడ్డెట్ ఉంటే ఇప్పటి వరకు కేంద్రం కేవలం 3970 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు ఆయన తెలిపారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు జరగలేదని, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదని, విద్యా సంస్థలు కేవలం శంకుస్థాపనలకే పరిమితం అయినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత ప్యాకేజి ఇస్తారన్న నమ్మకం తమకు లేదని ఆయన విమర్శించారు. దుగ్గరాజు పట్నంలో పోర్టు మంచిది కాదని నిపుణుల కమిటీ చెబుతున్నందున జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. విలేఖర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, సిపిఐ జిల్లా నాయకులు ఎంఎల్ నారాయణ, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

దోమలపై నిరంతరం దండయాత్ర
జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల పిలుపు

ఒంగోలు,సెప్టెంబర్ 24:రాష్ట్రంలో దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో నిరంతరం కొనసాగించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక డిఆర్‌ఆర్‌ఎం మునిసిపల్ హైస్కూలులో దోమలపై దండయాత్ర పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంపై జరిగిన సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు మంచి ఆరోగ్యం, పచ్చదనం, స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారన్నారు. సింగపూర్ తరహాలో రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తయారుచేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ఎంతటివారైన ఆరోగ్యం బాగాలేకపోతే నరకాన్ని ఇక్కడే చూస్తారన్నారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టే పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు మద్దతు నిలవాలన్నారు. రాష్ట్రంలోదోమలవలన డెంగ్యూ, మలేరియా వ్యాధులు బారినపడకుండా ప్రతిజిల్లాలో దోమలపై దండయాత్ర చేయాలన్నారు.ఈ సమావేశంలో జిల్లాతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నగరపాలక పరిధిలోని అన్ని డివిజన్లలో ఈనెలాఖరులోగా బహిరంగ మలవిసర్జన లేని నగరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒంగోలునగరంలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌బాల్స్ వేయటం, పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తత్రంగా చేపడుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ, మలేరియావ్యాధులు ప్రబలకుండా ఈనెల 19వతేదీనుండి మిషన్‌మోడ్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ముందుగా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ఎబిఎం కాలేజి, రిమ్స్ ఆసుపత్రి వరకు మూడు ర్యాలీలుగా డిఆర్‌ఆర్‌ఎం హైస్కూలు వరకు జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. డిఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో సమావేశాన్ని మంత్రి రావెల, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల, జిల్లాకలెక్టర్ సుజాతశర్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దోమలపై దండయాత్ర పరిసరాల పరిశుభ్రత ప్రతిజ్ఞనను విద్యార్ధులతో మంత్రి చేయించారు. ఈ సమావేశంలో ఎస్‌పి త్రివిక్రమవర్మ, జిల్లా జాయింట్‌కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్‌తోపాటు జిల్లా అధికారులుపాల్గొన్నారు.

రామాయపట్నం పోర్టు సాధన కోసం ఉద్యమం
* ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా వెనుకడుగు వేసేది లేదు
* నెల్లూరు ఎంపి మేకపాటి స్పష్టం
ఉలవపాడు, సెప్టెంబర్ 24: రామాయపట్నం పోర్టు సాధించుకునే దిశలో శనివారం ప్రజాప్రతినిధులు పాదయాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహనరెడ్డి, కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిరెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర శనివారం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కలుగోలమ్మ గుడి నుండి ప్రారంభమై మధ్యాహ్నం గుడ్లూరు మండలం చేవూరుకు చేరుకుంది. వీరికి గుడ్లూరు మండలం వారు స్వాగతం పలికి అక్కడనుండి పాదయాత్రగా తెట్టు, రామాయపట్నంకు సాయంత్రానికి చేరుకున్నారు. ఈ పాదయాత్రలో ప్రజాప్రతినిధులతో పాటు మద్దతుగా అధిక సంఖ్యలో ప్రజలు, పోర్టు సాధన కార్యకర్తలు కావలి నుండి రామాయపట్నంకు పాదయాత్రగా చేరారు. రామాయపట్నం కూడలిలో జరిగిన సభలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగితే రెండు జిల్లాలలో యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు రాజమోహనరెడ్డి మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు సాధన కోసం ఉద్యమం చేపట్టామని, ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా వెనుకడుగు వేసేది లేదని, వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వస్తే పోర్టు నిర్మాణం చేపట్టి పూర్తిచేస్తామని తెలిపారు. పాదయాత్రలో కందుకూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సిపి సమన్వయకర్త తూమాటి మాధవరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రామాల సింగారెడ్డి, మైనారిటీ నాయకులు ఎస్‌డి ఫజుల్, ఎస్‌డి బాషా, వైఎస్‌ఆర్ టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కేశవరపు జాలిరెడ్డి, పట్టణ కన్వీనర్ వేమిరెడ్డి క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

లాభసాటి వ్యవసాయమే
ప్రభుత్వ ధ్యేయం
- మంత్రి రావెల -
ఒంగోలు,సెప్టెంబర్ 24:వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్నదే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖమంత్రి రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక పాత జిల్లాపరిషత్ సమవేశమందిరంలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని, రైతుల పక్షాన నిలబడి వారికి మేలు చేసే ప్రభుత్వమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు రుణమాఫీ చేసి, నదుల అనుసంధానం చేసి అపరభగీరథుడయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రతి అంగుళం నీటితో తడపాలని ప్రయత్నం చేస్తున్న రైతు బాంధవుడన్నారు. కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ రైతులు పంటల సాగులో తాము పెట్టే పెట్టుబడిని తగ్గించడానికి వ్యవసాయ యంత్రపరికాలను అందచేస్తున్నామన్నారు. మొత్తం 202మందికి 1.20కోట్ల రూపాయల వ్యయంతో డ్వామా, వ్యవసాయం, ఉద్యాన, బిసి,కాపు, ఎస్‌సి కార్పొరేషన్ల ద్వారావ్యవసాయ పనిముట్లు పంపిణీచేస్తున్నామన్నారు. ఈ పరికారాలను బాగా వాడుకోవాలని, సకాలంలో రుణాలు చెల్లిస్తే భవిష్యత్‌లో ఇంకా ఎక్కువ మొత్తంలో రుణంగా పొందవచ్చునని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం వ్యవసాయరంగం బాగుండాలనే ధ్యేయంతో రైతులకు సబ్సిడీ యంత్ర పరికరాలను అందించటం సంతోషదాయకమన్నారు. అనంతరం లబ్ధిదారులైన రైతులకు మినిట్రాక్టర్లు, రోటవేటర్లు, విత్తనం వేసే పరికరాలు, అంతర సేద్యపరికరాలు, ఆయిల్ ఇంజన్లు, స్పింకర్లు, స్ప్రేయర్లు, తదితర వ్యవసాయ పనిముట్లను మంత్రి రావెల, జిల్లా కలెక్టర్, శాసనసభ్యుడు దామచర్ల పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంయుక్తసంచాలకులు మురళీకృష్ణ, డ్వామా పిడి పోలప్ప తదితరులు పాల్గొన్నారు.

విషజ్వరంతో అంగన్‌వాడి కార్యకర్త మృతి
కారంచేడు, సెప్టెంబర్ 24: విషజ్వరంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ అంగన్‌వాడి కార్యకర్త మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలో చోటుచేసుకుంది. మండలంలోని రంగప్పనాయుడు వారిపాలెంలో జయలక్ష్మి (42) అంగన్‌వాడి కార్యకర్తగా పనిచేస్తుంది. జయలక్ష్మి భర్త వెంకాదాసు తెలిపిన వివరాల మేరకు గత కొద్దిరోజుల క్రితం జ్వరంతో బాధ పడుతున్న జయలక్ష్మిని చీరాల ప్రయివేటు వైద్యశాలలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ జయలక్ష్మి మృతి చెందిందని తెలిపారు.

నీటికుంటలో పడి బాలుడు మృతి
వేటపాలెం, సెప్టెంబర్ 24: ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన దేశాయిపేట పంచాయతీ ఇమామ్‌నగర్‌లో శనివారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన గుంజి అంకమ్మ, వెంకటరమణ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా పెద్దవాడైన నాగకేశవ్ (5) స్థానికంగా ఉన్న అంగన్‌వాడి కేంద్రంలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం ఇతర పిల్లలతో ఆడుకుంటూ కావూరి సాంబయ్య ఇంటి సమీపంలో ఉన్న నీటి కుంటలో పడిపోయాడు. స్థానికులు బాలుని బయటకు తీసి సమీపంలో ఉన్న బీడి కార్మికుల సంక్షేమ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదం సమయంలో బాలుని తల్లిదండ్రులు కాంక్రీటు పనులకు వెళ్లారు. సమాచారం అందుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఎస్సై ఎస్‌ఎం షరీఫ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.