S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మూసీ ఉగ్రరూపం

వలిగొండ, సెప్టెంబర్ 24: మూసీ ఎగువ ప్రాంతమైన హైద్రాబాద్‌లో కురుస్తున్న అతిభారీ వర్షంతో మూసీ క్రమక్రమంగా ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని సంగెం కాజ్‌వేపై నుండి ప్రవహిస్తున్న మూసీ భీమలింగం కత్వ, ఆసిఫ్‌నహార్ కత్వ పైనుండి హోరెత్తుతు ప్రవహిస్తుంది. మూసీ ప్రవాహాంతో, గురువారం నుండి కురిసిన వర్షంతో మండలంలోని అన్ని చెరువులు మత్తడి దూకుతూ కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీవర్షం కురిస్తే మూసీ ఉగ్రరూపాన్ని తప్పక చూడాల్సి వస్తుందని గతంలో 2000 సంవత్సరంలో మూసీ ఉగ్రరూపాన్ని చూపించిందని పలువురు ఇప్పుడు గుర్తుకు చేసుకున్నారు.
కేతేపల్లి: జిల్లా రెండవ అతిపెద్ద ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు నుండి నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 34500 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో శనివారం ఉదయం 9క్రస్టు గేట్లను 6అడుగుల మేర ఎత్తులేపి 34309క్యూసెక్కుల నీటిని దిగువ మూసీ విడుదల చేశారు. సాయంత్రం నాటికి ప్రాజెక్టుకు వచ్చే ప్రవాహం 28వేల క్యూసెక్కులకు తగ్గడంతో అదే 9గేట్లను ఒక అడుగు మేర తగ్గించి 5అడుగుల మేర గేట్లను ఎత్తి 28వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు కాగా ప్రస్తుతం 642.8అడుగులుగా ఉంది. ప్రాజెక్టు ఎడమకాల్వకు 200క్యూసెక్కుల నీటిని, సూర్యాపేట పట్టణ ప్రజల తాగునీటి అవసరం కోసం 55క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పాటు ఈ రోజు వరకు ప్రాజెక్టు నుండి 4టి ఎంసిల నీటిని దిగువకు వదిలినట్లు డి ఈ నవికాంత్, ఏ ఈ రమేష్‌లు తెలిపారు.
జోరు తగ్గించిన వరుణుడు
* చెరువులో ఒకరి గల్లంతు
* 15 వేల హెక్టార్లలో పంట నష్టం
* 34 చెరువులకు గండి

నల్లగొండ, సెప్టెంబర్ 24: జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల జోరు శనివారం తగ్గుముఖం పట్టగా రైతులు, ప్రజల రోజువారి దినచర్యల దిశగా సాగారు. అయితే ముసురు వర్షాలు పడుతునే ఉండగా జిల్లాలో 54మండలాల్లో సగటు 10మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. తిరుమలగిరిలో 49.2మిల్లిమీటర్లు, అర్వపల్లిలో 45, శాలిగౌరారంలో 41, మోత్కూర్ మండలంలో 32.6, గుండాలలో 31.2మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. వరుస వర్షాలతో జిల్లా పరిధిలోని 4,762చెరువులకుగాను 1230చెరువులు అలుగు పోస్తుండగా మరో 1148చెరువులు 75శాతంకు పైగా నిండాయి. వేములపల్లి, గూడూరు చెరువులకు గండి పడింది. ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా 34చెరువులకు గండ్లు పడ్డాయి. శాలిగౌరారంలోని గండికుంట చెరువులో పవన్‌కుమార్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. జంటనగరాల్లో కురిసిన వర్షాలు, వరదలతో జిల్లా గుండా పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, కట్టంగూర్ మండలాల్లో మూసీ నది వరద ఉదృతి జోరుగా సాగుతుంది. పోచంపల్లి-బీబీనగర్ మండలాల మధ్య రుద్రవెల్లి, పెదరావులపల్లి, జూలురు గ్రామాల మధ్య కాజ్‌వే మీదుగా మూసీ వరద సాగుతుండగా రాకపోకలు స్తంభించాయి. కట్టంగూర్ మండలంలో బీమారం వద్ధ కాజ్‌వే మీదుగా మూసీ వరద సాగుతుండటంతో సూర్యాపేట-మిర్యాలగూడల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కేతెపల్లి మండలంల మూసీ ప్రాజెక్టు 9గేట్లను ఆరు అడుగుల మేరకు ఎత్తి నీటి విడుదల సాగిస్తుండగా ఇన్‌ప్లో, అవుట్ ఫ్లో 28వేల క్యూసెక్కులుగా ఉంది. కేతెపల్లి మండలంలో మూసీ కాలువ, చెరువులకు గండ్లు పడి, వాగులు, చెరువులు పొంగి 1500హెక్టార్ల వరి, పత్తి తదితర పంట నష్టం జరిగింది. ఎనిమిది ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. మండలంలో 1100ఎకరాల మేరకు పంట నష్టం జరుగా 53ఇండ్లు పాక్షికంగా 14ఇండ్లు పూర్తిగా కూలాయి. పులిచింతల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టగా ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 58వేల క్యూసెక్కులు కొనసాగుతుండగా 30టిఎంసిల నీటి మట్టం ఉండేలా ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల సాగిస్తున్నారు. వర్షాలతో పదేళ్ల పిదప ఆలేరు గంథమల్ల చెరువు అలుగు పోస్తుండగా అలుగు పోస్తుంది. వరుస వర్షాలు, పొంగిన వాగులు, చెరువుల వరదలతో జిల్లా వ్యాప్తంగా 10,399హెక్టార్ల పత్తి, 4,214హెక్టార్ల వరి, 371హెక్టార్ల కంది, 142హెక్టార్ల మొక్కజొన్నతో ఇతర పంటలు మరో 200ఎకరాల మేరకు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. 97ఇండ్లు పూర్తిగా, మరో 350 ఇండ్లు పాక్షికంగా కూలినట్లుగా సమాచారం.

వేములపల్లి పెద్ద చెరువుకు గండి
మిర్యాలగూడ, సెప్టెంబర్ 24: కురుస్తున్న వర్షాలకు వేములపల్లి మండల కేంద్రంలోని పెద్దచెరువుకు వరద తాకిడి అధికంగా రావడంతో గండిపడింది. దాంతో సుమారు వంద ఎకరాలలో సేద్యంచేసిన వరిపంట నీట మునిగింది. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చెరువు ఎగువ భాగంలో ఉన్న కుక్కడం చెరువు అలుగుపోసి వేములపల్లి పెద్దచెరువులోకి భారీగా వరద నీరు వచ్చింది. వరద తాకిడికి శుక్రవారం రాత్రి కట్ట బలహీనంగా ఉన్న ప్రాంతంలో గండిపడి చెరువులో నీరు పంటపొలాల మీదుగా చిత్రపరక వాగు నుండి యాద్గార్‌పల్లి చెరువులోకి వెళ్తుంది. దాంతో చిత్రపరకవాగు వెంట ఉన్న వరిపంటలు కూడా నీటమునిగాయి. గండిపడిన విషయాన్ని ఆర్డీఓ కిషన్‌రావు, ఐబి ఎస్‌ఇ ధర్మానాయక్, తహశీల్దార్ సరస్వతి, ఐబి డిఇ మురళి, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకోని పరిశీలించారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ యుద్ద ప్రాతిపదికన చెరువుకు పడిన గండిని పూడ్చాలని అధికారులను ఆదేశించారు. గండిని పూడ్చి రైతులు వరిపంట నష్టపోకుండా చూడాలని ఆయన సూచించారు. కాగా అధికారులు గండిని పూడ్చేందుకు ప్రొక్లయిన్‌ను తీసుకొచ్చి పూడ్చే పనులు చేపట్టారు. జెసిబిని తెప్పించి గండిని పూడ్చే పనులు చేపట్టారు. కాగా వేములపల్లి మండలంలోని మొల్కపట్నంలోని కృష్ణమూర్తి ఇళ్లు వర్షానికి కూలిపోయింది.
జోరు వాన..జలమయం
మోత్కూరు, సెప్టెంబర్ 24: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మండలంలోని చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతంలోని వరి పొలాలు నిండి పారకంగా నీళ్ళు పోవడంతో గట్లు తెగి పోవండంతోపాటు వరి పైరు నీట మునిగింది. శనివారం గంటకు పైగా మోత్కూరు మండలంలో కుండపోతగా వర్షం కురియడంతో బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసిన అంతా జలమయమే కన్పిస్తుంది. మోత్కూరులో బోయిని లక్ష్మి, ఆరేగూడెంలో వెంగళ యశోద, ధర్మపురంలో నల్ల లక్ష్మి ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పూర్తిగ దెబ్బ తిన్న ఇండ్ల నిర్వాసితులకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 38 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వి ఆర్ ఓ శంకర్ తెలిపారు. మోత్కూరు చెరువు అలుగు పోస్తుండడంతో మోత్కూరు నుండి తిర్మలగిరి వైపువెళ్ళే ప్రధాన రహదారి కోతకు గురై రోడ్డు తెగి పెద్ద గుంతగా మారడంతో ఆర్టీసి బస్సులు అనాజిపురం మీదుగా తిర్మలగిరి వైపువెళ్తున్నాయి.

వాగులో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
నాంపల్లి, సెప్టెంబర్ 24: విపరీతమైన మండలంలోని చామలపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని గానుగుపల్లి గ్రామ శేశిలేటివాగు నందు గల్లంతైన మానాల సాయికుమార్ (14) ఆచూకీ కోసం అధికారులు, రెవెన్యూ యంత్రాంగం శుక్రవారం ఉదయం నుంచి రాత్రి తెల్లవారుజాము వరకు చెక్‌డ్యాంను బాంబ్ బ్లాస్టింగ్‌తో రంద్రాలు చేసి నీటిమట్టాన్ని తగ్గించడంతో శనివారం ఉదయం సాయికుమార్ శవం నీటిపై తేలియాడుతుండటంతో గమనించిన గ్రామస్తులు, అధికారులు మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. దీంతో కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా గ్రామమంతా కన్నీటి పర్వంతం అయ్యింది. పలువురు ప్రముఖులు, నాయకులు, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు విద్యార్ధి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపం వ్యక్తం చేశారు. సాయంత్రం ఆశ్రునయనాల మధ్య సాయికుమార్ అంత్య క్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ ప్రకాశ్‌రావు, నాంపల్లి సి ఐ బాల గంగిరెడ్డిలు తెలిపారు.

30 నుండి అక్టోబర్ 8 వరకు బతుకమ్మ ఉత్సవాలు
* ఎమ్మెల్యే వేముల వీరేశంను ఆహ్వానించిన జాగృతి
చిట్యాల, సెప్టెంబర్ 24: తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకయిన బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు జరుగనున్నాయిని జాగృతి నియోజకవర్గ కన్వీనర్ పట్టెడ సుధాకర్ తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలను ఈనెల 30 తేదీన నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్‌లో, అక్టోబర్ 1న కట్టంగూర్, 2న నార్కట్‌పల్లి, 3న చిట్యాల, 4న రామన్నపేట, 5న కేతెపల్లి, 6న సిరిపురం, 7న గుండ్రాంపల్లి, 8న నకిరేకల్‌లో నిర్వహించబడునన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరుకావాల్సిందిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను జాగృతి నాయకులు కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. మహిళలు బతుకమ్మలను అందంగా అలంకరించి ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

భార్యను గొడ్డలితో నరికి
కుమార్తెతో సహా ఆత్మహత్య
చావుబతుకుల మధ్య భార్య
తుర్కపల్లి, సెప్టెంబర్ 24: కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి ఆపై 8 నెలల కుమార్తెతోపాటు ఆత్మహత్య చేసుకోగా, మరో కుమార్తె ప్రమాదం నుండి బయటపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం చిమ్మకపల్లి గ్రామానికి చెందిన ఎ.రాంచంద్రం తన కుటుంబ సభ్యులతో కలసి 15 సంవత్సరాల క్రితం వాసాలమర్రి గ్రామానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. నాలుగేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా చామిర్‌పేట మండలం కేశవపురం గ్రామానికి చెందిన లావణ్యను రాంచంద్రం పెళ్లిచేసుకున్నాడు. వీరి సంసారంలో తరుచూ గొడవులు సాగేవి. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. నాలుగు నెలల క్రితం రామచంద్రం మెదక్ జిల్లా తుప్రాన్ మండలం జీవంపేట్ ప్రాంతానికి చెంది ఓ బాలికను పెళ్లి చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య తరఫు బంధువులు అతనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో మూడు నెలలు సంగారెడ్డి జైలులో శిక్షను అనుభవించి పది రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. కేశవపురంలో నాలుగు రోజుల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి భార్య, పిల్లలను వాసాలమర్రి గ్రామానికి తీసుకొచ్చాడు. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్యతో గొడవ పడి ఆమెను అతి దారుణంగా గొడ్డలితో నరికాడు. ఆమె రక్తపుమడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా మూడేళ్ల కుమార్తె స్రవంతి, మరో ఎనిమిది నెలల కుమార్తె తో కలసి ఇంట్లో ఉన్న వాటర్ హీటర్‌తో కరెంట్ షాక్ పెట్టుకున్నాడు. అయతే, పెద్ద కుమార్తె స్రవంతి షార్ట్‌సర్య్కూట్‌తో ఎగిరి దూరం పడగా రామచంద్రం, 8 నెలల కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ మసీయుద్దిన్ తన సిబ్బందితో సంఘటన స్ధలానికి చేరుకొని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మృతుని పెద్దకుమార్తె స్రవంతిని 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భార్యను హతమార్చిన భర్త
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 24: నిత్యం తాగుతు అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త కిరాతకం శనివారం నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ తులసీనగర్‌లో చోటుచేసుకుంది. సిఐ తులా శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఐతరాజు యాదయ్య, సుజాత దంపతులు పట్టణంలోని తులసీనగర్‌లో గత కొంతకాలంగా నివసిస్తున్నారు. వీరికి ఆరేళ్ల కూతురు రాజేశ్వరి, మూడేళ్ల కుమారుడు భాస్కర్ ఉన్నారు. దినసరి కూలీగా పనిచేస్తున్న యాదయ్య నిత్యం తాగివస్తూ తరుచూ భార్యను అనుమానిస్తూ కొడుతుండేవాడు. ఇదే క్రమంలో శనివారం ఉదయం 11 గంటలకు కూడా భార్యాభర్తల మధ్య గొడవ ఏర్పడగా ఆగ్రహంతో యాదయ్య ఇంట్లోని గొడ్డలితో భార్యపై దాడి చేసి నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుజాత తల్లి ఫిర్యాదు మేరకు చేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నిందితుడు యాదయ్య పరారీలో ఉన్నారన్నారు.