S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆసిఫాబాద్‌లో భారీ వర్షం

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 24: ఆసిఫాబాద్ మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో అడ, ఆసిఫాబాద్ పెద్దవాగులతోపాటు, మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుమ్రం భీం ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో అధికారులు సాయంత్రం మూడు గేట్లు ఎత్తివేశారు. దీంతో ప్రాజెక్టులోకి 12.500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, ఎత్తివేసిన మూడు గేట్ల ద్వారా 7583 క్యూసెక్కుల నీరు బయటకు వెలుతోంది. మరోవైపు భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు వెల్లే మార్గంలో ఒర్రెలు పొంగి పొర్లుతుండడంతో తాత్కాలికంగా మండలకేంద్రానికి సంభందాలు తెగిపోయాయి. అప్పపల్లి, గుండి తదితర గ్రామాలకు రాక పోకలు నిలిచి పోయాయి. ఇదిలా ఉండగా పట్టణంలోని పలు కాలనీల్లో భారీగా వర్షపునీరు చేరింది. పలువురి ఇండ్లలోకి నీరు చేరింది. ముఖ్యంగా పైకాజీ నగర్, రాజంపేట, తారకరాంనగర్, సందీప్‌నగర్, కంచుకోట, ఎస్సీకాలనీ, హడ్కోకాలనీల్లో వర్షపునీరు నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈవర్షం కారణంగా చేలలో నీరు నిలిచి చేతికొచ్చిన పత్తి పంట కాస్త నీటమునిగినట్లు తెలుస్తోం

దరంపురి సర్పంచ్‌గా కోవ మంజుల

ఆదిలాబాద్,సెప్టెంబర్ 24: బజార్‌హత్నూర్ మండలం దరంపురి గ్రామసర్పంచ్ ఎన్నిక శనివారం ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన పోలింగ్ అనంతరం ఫలితాలను వెల్లడించారు. సర్పంచ్‌గా టీఆర్‌ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన కోవ మంజుల గెలుపొందారు. దరంపురి సర్పంచ్‌గా ఇటీవల పనిచేసిన కోవ విశ్వనాథ్ మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. శనివారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 483 ఓట్లకు గాను 331 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో టీఆర్‌ఎస్ పార్టీ తరుపున బరిలో నిలిచిన కోవ మంజులకు 198 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో నిలిచిన గెడం రామరావుకు 128 ఓట్లు వచ్చాయి. 70 ఓట్ల మెజార్టీతో కోవ మంజుల గెలుపొందినట్లు ఎన్నికల అధికారి లక్ష్మణ్‌రావు తెలిపారు.

ఇచ్చోడలో భారీ వర్షం.. పొంగి ప్రవహిస్తున్న వాగులు
ఇచ్చోడ, సెప్టెంబర్ 24: మండలంలో శనివారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. శనివారం రోజంతా ఆకాశం మేఘవృతమై సాయంత్రం సైతం భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు అందోళన చెందుతున్నారు. మండలంలోని ముక్రాకె, ఆడెగాం, సిరికొండ, గుండాల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోయాబీన్ పంట కోత దశలో ఉండడంతో రైతులు చేతికి వచ్చిన పంట వర్షాలతో చేజారిపోతుందోనని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో నల్లరేగడి భూములు ఉండడంతో భూములకు కావాల్సిన నీటికంటే ఎక్కువ వర్షాలు కురియడంతో దీని ప్రభావం పత్తి పంటపై కూడా పడే అవకాశాలు ఉన్నాయని రైతులు అంటున్నారు. వాగు పరివాహక ప్రాంతాల్లోని పత్తి పంటలకు ఇప్పటికే వర్షంతో నష్టం వాటిల్లిందని, ఇదే పరిస్థితి కొనసాగితే పత్తి పంటకు నష్టం జరుగుతుందని రైతులు అంటున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటిస్తుండడంతో రైతుల్లో అందోళన మొదలైంది. ఈ వర్షాల కారణంగా మండల కేంద్రంలోని రోడ్లన్నీ బురదమయంగా మారిపోయాయి.

బాసర గోదావరి పరవళ్లు
బాసర, సెప్టెంబర్ 24: కుండపోత వర్షంతో బాసర అమ్మవారి క్షేత్రం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. బంగాళఖాతంలోని అల్పపీడన ఆవర్తనం వల్ల వర్షాలు సమృద్దిగా కురుస్తుండడంతో 9 సంవత్సరాల క్రితం పరవళ్లు తొక్కిన గోదావరి నది శనివారం అదేరూపంలో ఉదృతంగా ప్రవహిస్తుంది. మహారాష్టల్రోని నాందేడ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తుండడంతో గోదావరిలోకి వరదనీరు వచ్చిచేరుతోంది. గతంలో ఎన్నడూలేనంతగా గోదావరి బస్సుబ్రిడ్జిని ఆనుకొని దగ్గరకు ప్రవహించడంతో గోదావరి నది పరవళ్లను తిలకించేందుకు గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల వారు భారీగా తరలివస్తున్నారు. ఆరె రాకేష్, ఆలయ అధికారులు ముందస్తుగా నదిలో నాటుపడవలను నిషేదించారు. గోదావరిలో పుణ్యస్నానాలు సైతం ఆచరించవద్దని ఆంక్షలు విధించారు.

పోటెత్తిన వరదలు... ఉప్పొంగిన వాగులు
* జిల్లాలో 65 గ్రామాలకు స్థంభించిన రాకపోకలు
* 6 ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత.. సుద్దవాగులో ఒకరిగల్లంతు
* గోదావరి తీరంలో హైఅలర్ట్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 24: జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్థంభించిపోయింది. ఆదిలాబాద్, నిర్మల్ డివిజన్లలో శనివారం 11 సెం.మీటర్ల వర్షపాతం నమోదుకాగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లాలో వరదల పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షించి, సమాచారం కోసం కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జైనథ్, ఆదిలాబాద్, బేల, దండేపల్లి, వాంకిడి మండలాల్లో 7 నుండి 8 సెం.మీటర్ల వర్షపాతం నమోదుకాగా తాంసి, తలమడుగులో 7.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి, చెన్నూర్ మండలాల్లో 30 గ్రామాలకు రాకపోకలు స్థంభించిపోయాయి. ఈ ప్రాంతంలో 24 ఇండ్లు పూర్తిగా నేలమట్టం కాగా 214 ఇండ్లు పాక్షింగా దెబ్బతిన్నట్లు, 114 పశువులు చనిపోయినట్లు మంచిర్యాల ఆర్డీవో ఆయేషమస్రత్‌ఖానం తెలిపారు. జిల్లాలోని తాంసి, నిపాని, బీంపూర్, ఆర్లీ, ముక్రాకె, బల్హాన్‌పూర్, గొల్లవాగు, స్వర్ణ, గుండాల, సిరికొండ, ఆడెగాం వాగులు శనివారం ఉదృతంగా వంతెనపై నుండి ప్రవహించాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయి జనజీవనం అస్థవ్యస్తమైంది. జిల్లాలో ఈసారి పత్తికి ప్రత్యామ్నాయంగా 2.7 లక్షల ఎకరాల్లో వేసిన సోయాబీన్ పంట చేతికివచ్చిన దశలోనే భారీ వర్షానికి తడిసిపోయి తీవ్రంగా దిగుబడిపై దెబ్బతీసింది. దీంతో రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, జిల్లాలోని 65 గ్రామాలకు రాకపోకలు స్థంభించిపోయాయి. మరోవైపు ఎగువ మహారాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఐదు ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి గోదావరిలోకి వదలడంతో బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. కడెం ప్రాజెక్టును, గోదావరి వరద పరిస్థితిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్‌లో సమీక్షించి, ముందు జాగ్రత్త చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. శనివారం రాత్రి ఏ క్షణంలోనైనా గేట్లను ఎత్తివేసి వరదనీటిని గోదావరిలోకి వదలాలని నిర్ణయించడంతో జిల్లా కలెక్టర్ గోదావరి తీర ప్రాంతాలను అప్రమత్తంచేశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో నాలుగు గేట్లు ఎత్తివేసి 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గడ్డెన్నవాగులో ఈతకు వెళ్ళిన నలుగురు యువకులు వరద ఉదృతి పెరగడంతో ఒక్కడు గల్లంతయ్యాడు. మరోవైపు కడెం ప్రాజెక్టు ఏడుగేట్లను ఎత్తివేసి 87వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ఈ ప్రాజెక్టు జలాశయంలోకి 80వేల క్యూసెక్కుల వరద నీరు చేరగా ప్రస్తుతం 698 అడుగుల నీటిమట్టంతో నీటిని నిల్వ ఉంచారు. సాత్నాల ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తివేసి 3వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేసి 13561 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేసి 7583 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మత్తడివాగు ప్రాజెక్టు రెండుగేట్లు ఎత్తివేసి 1950 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. స్వర్ణవాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేసి 4వేల క్యూసెక్కుల వరదనీటిని వదిలిపెట్టారు. చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, బజార్‌హత్నూర్, బోథ్, సారంగపూర్, ఆదిలాబాద్, నార్నూర్ మండలాల్లో వరద ఉదృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. జన్నారం మండలం కవ్వాలలో భారీ వర్షానికి ఓ పెంకుటిల్లు కూలిపోగా, పశువుల కొట్టం నేలమట్టమై ఎద్దు మృతి చెందింది. ముథోల్‌లో పిడిగుపాటుకు ఇళ్లు ధ్వంసమైంది. భారీ వర్షాలకు చేతికివచ్చే దశలో ఉన్న సోయాబీన్ పంట సుమారు 12వేల ఎకరాల్లో దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాయంత్రం జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ వరద పరిస్థితిపై పోలీసులు అప్రమత్తంగా ఉండి సహాయ చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. పోలీసులకు, వైద్య సిబ్బందికి అత్యవసర పరిస్థితి కింద సెలవు దినాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా పోలీసుల కంట్రోల్ రూంకు 08732226246, 9490619547 నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు.

భైంసా సబ్‌డివిజన్‌లో భారీ వర్షాలు
* ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
* గడ్డెన్నవాగు ప్రాజెక్టు 4 గేట్ల ఎత్తివేత
* ప్రాజెక్టులో ఈతకు వెళ్లి ఒకరి మృతి
భైంసా రూరల్, సెప్టెంబర్ 24: భైంసా సబ్‌డివిజన్ పరిధిలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా విద్యుత్ అంతరాయంతో గ్రామాలు అంధకారంగా మారాయి. భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో ఈతకు వెళ్లి ఒకరు మృతిచెందగా భారీ వర్షానికి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరడంతో ప్రాజెక్టు అధికారులు 4 గేట్లను ఎత్తివేశారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని తానూర్, కుభీర్, లోకేశ్వరం, ముధోల్, తదితర మండలాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భైంసా నుండి మాగాం వెళ్లే రోడ్డు గుండెగాం గ్రామంవద్ద వంతెనపై నీరు వెళ్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి గరిష్టస్థాయికన్నా నీరు అధికంగా చేరడంతో నాలుగుగేట్లను ఎత్తివేసిన అధికారులు 1800 క్యూసెక్కుల నీటిని సుద్దవాగులోకి వదిలారు. వాగు ప్రాంతంలో ఈతకు వెళ్లిన భైంసా పట్టణంలోని బార్ ఇమామ్‌గల్లికి చెందిన సయ్యద్ సల్మాన్(22) అనే యువకుడు నీట మునిగి మృతిచెందాడు. ఏపి నగర్‌లో గంగాధర్ అనే వ్యక్తి ఇంటిపైన పిడుగు పడడంతో ఇల్లు స్వల్పంగా ధ్వంసమైంది. మండలంలోని ఈలేగాం, దేగాం, వాలేగాం, గుండెగాం, ఎగ్గాం, బిజ్జుర్ తదితర గ్రామాల్లో భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలోనే గడిపారు. మహాగాం, దేగాం, మాటేగాం, వానల్‌పాడ్ వాగులు ఉదృతంగా ప్రవహించాయి. చీరాల ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చిచేరింది. పేండ్‌పల్లి,తిమ్మాపూర్, సుంక్లి, ఎగ్గాం, తదితర గ్రామాల్లో పంట పొలాల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తంచేశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద పోలీసులు అప్రమత్తం చేశారు. మండలంలోని మహాగాం గ్రామంలోకి ఇండ్లలోకి నీరుచేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలను ఎదుర్కొన్నారు. పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో సమీపంలో ఉన్న వంతెనపై నుండి నీరు ఉదృతంగా ప్రవహించడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కురుస్తున్న భారీ వర్షాలకు కర్షకులకు ఎంతో మేలు
* రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
* కుటుంబ సభ్యులతో మంత్రి ఐకె రెడ్డి సందర్శన
* అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు
కడెం, సెప్టెంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు ప్రాజెక్టుల్లో వరదనీరు వచ్చిచేరుతుందని, ఈ వర్షంతో రైతుల పంటలకు ఎంతో మేలు కలిగే అవకాశం ఉంటుందని రాష్ట్ర న్యాయ, దేవాదాయ, గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మండల కేంద్రమైన కడెంలో గల కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబ సభ్యులతో సందర్శించారు. ముందుగా మంత్రి ప్రాజెక్టుకు చెందిన ప్రాజెక్టు గేజ్‌రూమ్‌లోకి వెళ్లి పెరుగుతున్న నీటి మట్టాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. గత రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం పెరుగుదల, గోదావరిలోకి విడుదలవుతున్న నీరు, ప్రాజెక్టు విషయాలపై నీటిపారుదలశాఖ ఈ ఈ వెంకటేశ్వర్‌రావు, మంత్రి ఐకెరెడ్డి తెలిపారు. అనంతరం మంత్రి ఐకెరెడ్డి తమ కుటుంబ సభ్యులతో ప్రాజెక్టు వద్ద కాలినడకన దాదాపు అరకిలోమీటరు వరకు నడుస్తూ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతను పరిశీలించారు. గోదావరిలోకి వెళ్తున్న నీటిని,దృశ్యాన్ని తిలకించారు. వరదగేట్ల నుండి ఉప్పొంగుతూ గోదావరిలోకి వెళ్తున్న నీటిని, మంత్రి ఐకెరెడ్డి తన సెల్‌ఫోన్‌లో బంధించారు. దాదాపు అరగంటపాటు మంత్రి కుటుంబ సభ్యులతో నీటి ఎత్తివేతను తిలకిస్తూ ఆనందంగా గడిపారు. అనంతరం మంత్రి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గత కొన్నిరోజుల నుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఈ వర్షాలమూలంగా ఇన్‌ఫ్లో వరదనీరు పలు ప్రాజెక్టులలోకి వచ్చిచేరుతుండడంతో ప్రాజెక్టు నీటితోపూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కడెం, శ్రీరాంసాగర్, స్వర్ణప్రాజెక్టులు పూర్తిగా నిండి నిండుకుండలా మారిందన్నారు. ప్రాజెక్టు నీటిని 8 సార్లు గేట్ల ద్వారా ఎత్తివేయడం జరిగిందన్నారు. శ్రీరాంసాగర్‌లోకి భారీ వరదనీరు వచ్చిచేరిందని, గేట్ల ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో భారీ వర్షాలు కురవడం రైతుల అదృష్టమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్నివిధాల ఆదుకుంటుందన్నారు. ప్రాజెక్టులో భారీ వర్షాల కారణంగా అధికంగా ఇన్‌ఫ్లో వరదనీరు వచ్చిచేరుతుండడం, మరోపక్క గేట్లను ఎత్తివేసి గోదావరికి నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. దీంతో రెవెన్యు, నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు నీటినిల్వ సామర్థ్యాన్ని అధికారులకు తెలపాలని మంత్రి సూచించారు. ఆయన వెంట ఎఫ్ ఎసి ఎస్ ఛైర్మెన్ రాంకిషన్‌రెడ్డి, కడెం మండల తహసిల్దార్ నర్సయ్య, కడెం ఎంపిడివొ శ్రీలత, ఖానాపూర్ సి ఐ నరేష్‌కుమార్, సర్పంచ్ చిన్నయ్య, టి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్ల సత్యనారాయణ, కడెం మండల అధ్యక్షులు జీవన్‌రెడ్డి, పలువురు నాయకులు, అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.

భారీ వర్షం.. అతలాకుతలం
* కూలిన ఇండ్లు.. పొంగిన జౌళినాళ
* లోతట్టు ప్రాంతాలు జలమయం
దివ్యనగర్, సెప్టెంబర్ 24: నిర్మల్ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా పట్టణ జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలో 200.06 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. పట్టణంగుండా ప్రవహిస్తున్న జౌళినాళ నిండుగా ప్రవహించడంతో పట్టణంలోని నాయుడివాడ, రాంరావుబాగ్, కాల్వగడ్డ, బ్రహ్మపురి, కురాన్నపేట్, తదితర కాలనీల ఇళ్లలోకి నీళ్లుచేరాయి. అలాగే వై ఎస్ ఆర్ కాలనీ ఇండ్లలోకి భారీగా వరదనీరు రావడంతో అర్ధరాత్రి నుండి కాలనీవాసులు నిద్రలేని రాత్రులు గడిపారు. భారీ వర్షాలకు పట్టణంలోని జుమ్మెరాత్‌పేట్ ఉన్నత పాఠశాల, ఈద్‌గాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి నీరు రావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు.పట్టణంలోని పలు కాలనీల రోడ్లు గుంతలుగా మారడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పట్టణంలోని ప్రియదర్శినినగర్‌లోకి ట్యాంక్‌బండ్ నుండి భారీగా వరదనీరు రావడంతో కాలనీలోని పలురోడ్లు కొట్టుకుపోయాయి. పలు ఇండ్లచుట్టూ నీరుచేరడంతో ఆ ఇండ్లలోకి వెళ్లడం కూడా ఇబ్బందిగా మారింది.
పిడుగుపాటుకు కూలిన ఇళ్లు....
పట్టణంలోని బంగల్‌పేట్ కాలనీకి చెందిన సిరిపురం పోశెట్టి అనే వ్యక్తికిచెందిన ఇళ్లు శుక్రవారం రాత్రి పిడుగుపాటుకు వర్షం తోడుకావడంతో కూలిపోయింది. అలాగే బంగల్‌పేట్‌కు చెందిన లింగన్న, బోయవాడకు చెందిన రాజు అనే వ్యక్తులకు చెందిన ఇండ్లు భారీ వర్షాలకు కూలిపోయాయి. భారీ వర్షాల మూలంగా పట్టణంలోని చెరువులు నిండుకుండల దర్శనమిస్తున్నాయి. రెండు జాతీయ రహదారుల మీదుగా పలుచోట్ల భారీ వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి
* 7 గేట్ల ఎత్తివేత
* కడెంలో కురిసిన భారీ వర్షం
కడెం, సెప్టెంబర్ 24: జిల్లాలోని కడెం మండలంలో శుక్రవారం అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురవడంతో మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లాయి. భారీ వర్షం కురవడంతో మండలంలోని అంబారిపేట్ ట్రాఫిక్‌రోడ్డు వద్ద వేసిన తాత్కాలిక వంతెన నీటిలో కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాలివానకు రోడ్లపై చెట్లు విరిగిపోవడం, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కడెం మండలంలో శుక్రవారం 83.80 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కడెం జలాశయంలో భారీగా వరదనీరు వచ్చిచేరింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడంతో ప్రాజెక్టులో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమై కడెం ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తివేసి గోదావరిలోకి 88 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం కడెం జలాశయం పూర్తిస్థాయిలో నిండిపోయింది. ప్రాజెక్టులోకి 74వేల ఇన్‌ఫ్లో నీరు వచ్చిచేరడంతో అధికారులు 88 వేల క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల చేశారు. అధికారులు ప్రాజెక్టు వద్ద ఉండి నీటిమట్టాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయకట్టు లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సమాచారం అందించారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
కడెం ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి
కడెం ప్రాజెక్టు రిజర్వాయర్‌లో భారీగా వరదనీరు వచ్చిచేరుతుండడంతో ఏడు వరదగేట్లను ఎత్తివేయడంతో శనివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌జిల్లాలోని పలు పట్టణాల్లో, మండలాల నుండి పెద్ద ఎత్తున ప్రత్యేక వాహనాల్లో వచ్చి ప్రాజెక్టు వద్ద సందడి చేస్తున్నారు.