S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఖరీఫ్‌కు సైతం నిజాంసాగర్ నీరందిస్తాం

నిజాంసాగర్, సెప్టెంబర్ 24: నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాషయం రెండు రోజుల్లో పూర్థిస్థాయి నీటిమట్టంతోజలకళను సంతరించుకోనుందని, రాష్ట్ర వ్యవసాయ, సహకారా శాఖామాత్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాషయాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు జడ్పీచైర్మన్ దఫేదార్ రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేతోకలిసి పరిశీలించారు. ప్రాజెక్ట్12,16,20 వరద గేట్లను పరిశీలించారు. జలాశయంలోనికి వస్తున్న నీటిని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ కట్టపై మంత్రి విలేఖరులతో మాట్లాడారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోనికి లక్షాపైచిలుకు వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. సింగూర్ జలాశయంనుంచి 60వేల క్యూసెక్‌లు, హల్డీవాగునుంచి 30 వేల క్యూసెక్‌లు, పోచారం నుంచి 25వేల క్యూసెక్‌ల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. ఇప్పటి వరకు జలాశయంలో1.3 టిఎంసిల కొత్త నీరు వచ్చి చేరిందన్నారు. సోమవారం నాటికి ప్రాజెక్ట్ పూర్థిస్థాయిలోనిండి జలకళను సంతరించుకుంటుందన్నారు. రబీ సీజన్‌లో నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుకింద వరి పంటలు సాగు చేసుకునేందుకు నిజాంసాగర్ నీటిని విడుదల చేయడం జరుగుతోందన్నారు. ఖరీఫ్ సీజన్‌కు సైతం ప్రాజెక్ట్‌నుంచి వ్యవసాయ భూములకు నీటిని అందించాల ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సింగూర్ ప్రాజెక్ట్ జలాయషయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోనికి రావల్సిని నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర సిఎం కేసిఆర్, నీటి పారుదల శాఖామాత్యులు తన్నీర్ హరీష్‌రావులు సిధ్దంగా ఉన్నారన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోనికి పెద్దఎత్తున వర్షపునీరు వచ్చి చేరడంతోఏస్థాయిలోచేరుతుందోపరిశీలించిన అనంతరమే సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోనికి వదిలేందుకోసం చర్యలుతీసుకోవడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌లోనికి కూడా ఇప్పటి వరకు 60 టిఎంసిల నీరు వచ్చి చేరిందన్నారు.ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ, పోలీసు శాఖ , గ్రామస్థాయి అధికారులను అప్రమత్తంచేశామన్నారు. మంత్రి వెంట సిడిసి చైర్మైన్ దుర్గరెడ్డి, నీటివినియోగదారుల సంఘం అధ్యక్షులు గంగారెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లాకార్యదర్శి వినయ్‌కుమార్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు గైని విఠల్, వైస్‌ఎంపిపి గోగుల పండరి, మండల కో-ఆఫ్షన్ సభ్యులు అహ్మద్ హుసెన్, నీటి పారుదల శాఖ ఎస్‌ఇ గంగాధర్, డిఇఇ సత్యశీలారెడ్డి, తహశీల్దార్ ఎండి.అబ్దుల్ ఘనీఖాన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సిఎం పర్యటన కోసం
హెలిప్యాడ్ స్థల పరిశీలన
నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోనికి భారీ సంఖ్యలోవరద నీరు వచ్చి చేరడంతోరాష్ట్ర సిఎం కెసిఆర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించేందుకు ఉత్సాహంగా ఉన్నారని, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖామాత్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాషయాన్ని పరిశీలించిన అనంతరం సిఎం కేసిఆర్ పర్యటన కోసం, 12 వరద గేట్ల సమీపంలోహెలిప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించారు. గత నాలుగు సంవత్సరాలుగా నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోనీరు లేక బోసిపోయిందన్నారు. జలాషయంలోనికి భారీగా వరద నీరు వస్తుండటంతో, శనివారం రాష్ట్ర సిఎం కేసిఆర్ నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయాన్ని పరిశీలించేందుకు వచ్చే వారని, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతోసిఎం పర్యటను వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయిలోనిండిన తర్వాత పరిశీలించేందుకు రెండురోజుల్లో సిఎం రానున్నారని మంత్రి వెళ్లడించారు.

వదలని వర్షం

వరద నీటిలో కొట్టుకుపోయి తల్లీ, కుమారుడు గల్లంతు
పదుల సంఖ్యలో తెగిపోయిన చెరువు కట్టలు
నీట మునిగిన పంటలు
కొట్టుకుపోయిన బ్రిడ్జిలు .. జలదిగ్బంధం వీడని గ్రామాలు
ఆర్మూర్‌లో రికార్డు స్థాయిలో 39.54 సెం.మీ వర్షం
సహాయక చర్యల కోసం జిల్లాకు చేరుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం
ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌కు పోటెత్తిన వరద జలాలు
నిజామాబాద్, సెప్టెంబర్ 24: గత మూడు రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తూ, ప్రజా జీవనానికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. వర్షాల తాకిడితో అనేక చోట్ల చెరువులకు గండ్లు పడి ఆయకట్టు పంటలన్నీ నీట మునగగా, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన రహదారుల పై నుండి వరద జలాలు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రాణాంతకంగా పరిణమించాయి. వేల్పూర్ మండలం పడిగెల సమీపంలో వరద నీటిలో ఓ కారు కొట్టుకుపోగా, అందులో ప్రయాణిస్తున్న తల్లీ, కుమారుడు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. పడిగెల్‌కు చెందిన ప్రియాంక(25), ఆమె కుమారుడు వర్షిత్(2)లు తమ కుటుంబీకులతో కలిసి వేల్పూర్‌లోని సమీప బంధువుల ఇంట్లో వేడుకలో పాల్గొని శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. అదే సమయంలో నవాబు చెరువు అలుగుపారుతూ పడిగెల్ శివారులో ప్రధాన రహదారిపై నుండి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వీరు ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయింది. కారులో ఉన్న నలుగురు ఎలాగోలా సురక్షితంగా బయటపడగలిగినప్పటికీ, ప్రియాంక, ఆమె కుమారుడు వర్షిత్‌లు వరద జలాల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వారి కోసం అర్ధరాత్రి నుండి శనివారం సాయంత్రం వరకు గాలింపులు జరుపుతున్నప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. 12మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం జిల్లాకు చేరుకోగా, వారు సైతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో 13సెం.మీ పైచిలుకు సగటు వర్షపాతం నమోదైంది. ఆర్మూర్‌లో ఇదివరకెన్నడూ లేని విధంగా ఏకంగా 39.54సెం.మీ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో 5సెం.మీ మొదలుకుని 25సెం.మీ వరకు వర్షపాతం నమోదైంది. జుక్కల్‌లో 12.4, నవీపేటలో 16.16, బాల్కొండలో 18.70, వర్నిలో 13.36, మోర్తాడ్‌లో 14.94, జక్రాన్‌పల్లిలో 18.06, మాచారెడ్డిలో 6.92, రెంజల్లో 20.14, నందిపేటలో 19, సిరికొండలో 4.84, దోమకొండలో 6.92, కామారెడ్డిలో 12.46, వేల్పూర్‌లో 18.06, కోటగిరిలో 12.86, సదాశివనగర్‌లో 9.16, బీర్కూర్‌లో 10, బిచ్కుందలో 9.06, బాన్సువాడలో 6.98, తాడ్వాయిలో 15.92, నిజామాబాద్‌లో 9.72, బోధన్‌లో 19.8 మాక్లూర్‌లో 15.44, భీమ్‌గల్‌లో 11.28, పిట్లంలో 6, మద్నూర్‌లో 20.18, దర్పల్లిలో 10.42, లింగంపేటలో 14.02, ఎడపల్లిలో 15.04, కమ్మర్‌పల్లిలో 8.24, డిచ్‌పల్లిలో 11.88, గాంధారిలో 10.26, భిక్కనూరులో 5.4, నిజాంసాగర్‌లో 8.9, ఎల్లారెడ్డిలో 9.22, నాగిరెడ్డిపేటలో 8.44సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
శుక్రవారం రాత్రి నుండి శనివారం సాయంత్రం వరకు కూడా ఏమాత్రం విరామం లేకుండా దంచికొట్టిన కుండపోత వానతో రహదారులు, నివాస సముదాయాలు, పంట పొలాలు అనే తేడా లేకుండా ఎటుచూసినా అన్ని ప్రాంతాలూ జలమయంగా మారి చెరువులను తలపించాయి. జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ - బోధన్ మార్గంలో మాలపల్లి వద్ద ప్రధాన రహదారిపై నాలుగు అడుగుల ఎత్తుతో వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకధాటి వర్షాలతో మోర్తాడ్, ఆర్మూర్, బాన్సువాడ, బోధన్, దోమకొండ, కామారెడ్డి తదితర అనేక మండలాల్లో పదుల సంఖ్యలో చెరువులకు గండ్లు పడ్డాయి. పిట్లం మండలం నర్సింగ్‌పల్లి వద్ద బ్రిడ్జి పూర్తిగా కూలిపోవడంతో సంగారెడ్డి - దెగ్లూర్ మధ్యన వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రధానంగా లక్షన్నర పైచిలుకు ఎకరాల విస్తీర్ణంలో సోయా పంటకు పూర్తిగా నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ప్రధాన రహదారుల పై నుండి ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బిచ్కుంద, మద్నూర్ మండలాల్లోని సరిహద్దు గ్రామాలైన హస్గుల్, సిర్‌సముందర్, తక్కడ్‌పల్లి, కుర్లా, తడిహిప్పర్గ, టాక్లీ తదితర గ్రామాలు జలదిగ్బంధంలోనే కూరుకుపోయాయి. బాధితులకు అండగా నిలిచేందుకు జిల్లా యంత్రాంగం బిచ్కుందలోని పాఠశాలలో సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు వంద మందికి తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తోంది. సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా వెసులుబాటు ఇవ్వని రీతిలో ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో సౌకర్యాల పునరుద్ధరణ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. బోధన్ మండలం హంగర్గ గ్రామం చుట్టూ మూడు వైపులా ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా యంత్రాంగం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని హంగర్గకు పంపించి అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైతే సహాయక చర్యలు చేపట్టేలా మాక్‌డ్రిల్ నిర్వహింపజేసింది. కలెక్టర్ యోగితారాణా స్వయంగా గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
ఎస్సారెస్పీ వరద గేట్ల ఎత్తివేత
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో ప్రధాన జలాశయాలైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వరద జలాలు ముంచెత్తుతున్నాయి. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టానికి వడివడిగా చేరువవుతుండడంతో శనివారం రాత్రి వరద గేట్లు ఎత్తేసి తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 1091 అడుగులు, 90టిఎంసిల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 3.60లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో ఈ రిజర్వాయర్‌లో శనివారం సాయంత్రం నాటికి 1087 అడుగులు, 74.5టిఎంసిల నీరు నిలువ ఉంది. ఇన్‌ఫ్లో భారీగా వస్తుండడంతో వరద కాల్వ, మెయిన్ కెనాళ్ల ద్వారా 18572క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో సైతం 38వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 1405అడుగులు, 17.8టిఎంసిల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1381 అడుగులు, 1.5టిఎంసిలకు నీటిమట్టం చేరింది. సింగూర్ నుండి ఇన్‌ఫ్లో పెద్దఎత్తున వస్తుండడంతో సోమవారం ఉదయం నాటికి నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకుంటుందని అంచనా వేస్తున్నారు. శనివారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే అధికారులతో కలిసి నిజాంసాగర్‌ను సందర్శించారు. నాలుగేళ్ల అనంతరం నిజాంసాగర్‌కు వరద జలాలు వస్తుండడంతో ఈ ప్రాజెక్టును సందర్శించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఎంతో ఆసక్తి చూపుతూ శనివారం హాజరవుతున్నట్టు తెలిపారని, వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా సిఎం రాలేకపోయారని మంత్రి పోచారం పేర్కొన్నారు.

బాధితుల కోసం పునరావాస కేంద్రాలు

నిజామాబాద్, సెప్టెంబర్ 24: భారీ వర్షాల తాకిడితో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా తెలిపారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న బిచ్కుంద మండలంలోని హస్గుల్‌లో 25మందికి, సిరిసముందర్‌లో 52మందికి, పెద్దతక్కడ్‌పల్లిలో 10మందికి, జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌లో 13మందికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించామని వివరించారు. కాగా, జిల్లాల వరదల కారణంగా వేల్పూర్ మండలం పడిగెల్‌కు చెందిన ప్రియాంక(26), ఆమె కుమారుడు హర్షిత్(2)లు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారని, తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలోని చెరువులో నీట మునిగి నర్సవ్వ(70) అనే వృద్ధురాలు మృతి చెందిందని కలెక్టర్ తెలిపారు. వర్షాల కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 118 ఇండ్లు పూర్తిగా, 996 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు నిర్ధారించామని అన్నారు. పంటలకు సంబంధించి వరి 1062 సెక్టార్లలో, సోయాబీన్ 5257 హెక్టార్లు, పెసర 125హెక్టార్లు, మొక్కజొన్న 79 హెక్టార్లు, మినుములు 335హెక్టార్లు, పత్తి 92 హెక్టార్లు, చెరకు 30 హెక్టార్లు చొప్పున మొత్తం 6980 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. అదేవిధంగా వర్షాల ధాటికి 6 మేకలు, మూడు గొర్రెలు మృతి చెందాయని చెప్పారు. ఆరు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు, 57 విద్యుత్ స్తంభాలు వర్షాల ఉద్ధృతికి కూలిపోయాయని అన్నారు. పంచాయతీరాజ్‌కు చెందిన 6.6 కిలోమీటర్లు, ఆర్ అండ్ బి పరిధిలోని 245 కిలోమీటర్ల మేర రోడ్లకు నష్టం వాటిల్లిందని వివరించారు. వరద నీటి ప్రవాహం కారణంగా మూడు చెరువులకు గండ్లు పడ్డాయని, మరో 14 చెరువుల కట్టలు దెబ్బతిన్నాయని గుర్తించామన్నారు. 13పాఠశాలల భవనాలకు కూడా వర్షాలతో నష్టం వాటిల్లిందని కలెక్టర్ తెలిపారు. చెడిపోయిన రోడ్లు, తెగిన విద్యుత్ వైర్లు, స్తంభాలను, గండ్లు పడిన చెరువు కట్టలను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయిస్తున్నామని చెప్పారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు చెందిన 13మంది సభ్యులతో కూడిన బృందం జిల్లాకు చేరుకుందని, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పటికీ సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని అన్నారు.

చెరువులో తల్లీ, కొడుకు గల్లంతు
గజ ఈతగాళ్లతో అనే్వషణ..
వేల్పూర్, సెప్టెంబర్ 24: వేల్పూర్ మండలం పడిగెల గ్రామ శివారులో అలుగు ప్రవాహానికి తల్లీ, కుమారుడు గల్లంతయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో గల్లంతైనా తల్లీ, కుమారుల జాడ కోసం శనివారం రోజంతా గాలించినా వారి అచూకి లభించలేదు. పడిగెల గ్రామానికి చెందిన అంబేకర్ విఠల్, అతని భార్య శారద, అంబేకర్ కిషన్ భార్య సునీత, విఠల్ కోడలు ప్రియాంక, కుమారుడు వర్షిత్‌లు కలిసి వేల్పూర్‌లో తమ సమీప బంధువులైన అంబేకర్ పోతాజీ ఇంట్లో జరిగిన పితరుల మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుగు ప్రాయాణంలో మారుతి ఆల్టో కారులో వెళ్తుండగా పడిగెల నవాబు చెరువు అలుగు ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువ కావడంతో కారు సైలెన్సర్‌లో నీరు వెళ్లడంతో కారు ఆగిపోయింది. దీంతో కారులో ఉన్న ఏడుగురిలో నుంచి విఠల్ కోడలు ప్రియాంక(25), తన కుమారుడు వర్షిత్(2)ను తీసుకొని కారులో నుంచి దిగి నడిచే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా నీటి రాక పెరగడంతో ఆ ప్రవాహానికి కొట్టుకుపోయారు. ప్రియాంక, వర్షత్‌లు మరణించి ఉంటారని, వారి మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.