S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫితృఋణం తీర్చే అమావాస్య

మహాలయ పక్షం ప్రారంభమయ్యాక 15వ రోజున వచ్చే బాద్రపద బహుళ (లేక కృష్ణ) అమావస్యే మహాలయ అమావాస్య. శుద్ధ పూర్ణిమనుండి వరుసగా పదిహేను రోజులు పితృపక్షం అంటారు. ఈరోజు నుండీ వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలకు పూజ చేయాలని పెద్దల ఉవాచ. పితృ దోషం అంటే ఒక శాపంగా భావిస్తాం. ఏ వ్యక్తికైనా అనారోగ్యమో లేదా మరే తీరని కష్టాలో కలగడం జరిగితే దానికి కారణం అతడి పూర్వీకులు అంటే ఆ వ్యక్తియొక్క తల్లిదండ్రులు లేదా వారి తల్లిదండ్రులో తాతముత్తాతలో తెలిసోతెలీకో చేసిన దోషాలు, తప్పులు కారణం కావచ్చు అంటారు. గత జన్మలో పూర్వీకులు చేసిన దోషాల ఫలితం వారి తర్వాతి తరాలవారు అనుభవించక తప్పకపోవచ్చు. ఇది ప్రస్తుత వ్యక్తి కష్టాల పాలవడం, పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. పితృ దోషం అంటే ఒక శాపం. పితృ దోషాలవలన అనేక విధాలైన సమస్యలు కలుగవచ్చును. మొదలుపెట్టిన పనులు పూర్తికాకపోడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం, ఇంకా అనేక విధాలైన, ముఖ్యంగా సంతానం కలక్కపోడం, పుట్టినవారూ బ్రతక్కపోడం, ఉన్న బిడ్డలూ సరైన తీరులో జీవించకపోడం, వక్రమార్గం పట్టడం వంటివి. పుట్టిన ప్రతివాడూ తీర్చవలసిన ముఖ్యమైన ఋణం ‘పితృఋణం’. దీనివలన పితృదేవతలు సంతృప్తి పడతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృ ఋణం తీర్చలేకపోతే వారికి ముక్తి కలుగదు. మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. దానికి సంతృప్తి చెందిన పితృదేవతల ఆశీర్వాదం ఆ వంశీకులకు ఉన్నతి కలిగిస్తుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవీ చేయరు. మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం వదిలాక తిరిగి శుభకార్యాలు మొదలుపెట్టవచ్చు. ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధకర్మలు చేయడంవల్ల పితృదేవతలను స్మరించి వారిని గుర్తుకుతెచ్చుకోడం వారికి సంతృప్తినచ్చి ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు సవివరంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటంవల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. మనస్ఫూర్తిగా, శ్రద్ధతో శ్రాద్ధకర్మ నిర్వహిస్తే వారు తమ సంతతి వారికి ఆయుష్షు, విద్య, ధనం, సంతానం, సమస్తం కలిగేలాగా దీవిస్తారు. శ్రద్ధతో చేసేదే శ్రార్ధం అంటే. శ్రాద్ధకర్మలో నువ్వులు, గూడమిశ్రీత అంటే బియ్యాన్ని బెల్లంతో కలిపి వండే అన్నం, పితృదేవతలకు అర్పిస్తే ఆ వ్యక్తి సంపద వృద్ధి అవుతుంది. అన్ని దానాలలో కంటే అన్నదానం ప్రధానమైనది. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితానే్న ఇస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా! ప్రాణాన్ని నిలిపేది అన్నం. ఐతే ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానంవల్ల అనంతకోటి యజ్ఞాలుచేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. అందుకే పూర్వంనుంచీ, ఆ రోజుల్లో బ్రాహ్మణులు పేదరికంలో ఉండేవారు కనుక, వేద పండితులైన, ఊరికి వేదమంత్రాలతో స్వస్థి వాక్యం పలికే బ్రాహ్మణులకు కాస్తంత అన్నం పెట్టడం ఆచారంగా వచ్చింది. - స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం- న్యాయేన మార్గేణ మహీం మహీశాంగో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం- లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.... అంటూ సమస్త జనులకూ శుభం జరగాలని నిత్యం ప్రార్ధించే బ్రాహ్మణులకు సంతృప్తిగా శ్రార్ధం రోజున ముందుగా భోజనంపెట్టి తర్వాత మన శక్త్యానుసారం అన్నదానం చేయమంటారు. అమావాస్యనాడు శ్రాద్ధకర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం చేసే శ్రార్ధంకన్నా అతి ముఖ్యమైన శ్రార్ధాలు ఈ మహాలయపక్షంలో చేసేవి. పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్యనాడైనా చేయాలంటారు పెద్దలు. ధనం సమకూరనప్పుడు, అవకాశం లేనపుడూ శ్రార్ధకర్మలు పద్ధతి ప్రకారం చేయలేనివారు పితృపక్షమైన ఈ మహాలయ అమావాస్యనాడు ఉత్త శాకంతో అంటే ఏదైనా కూరతో శ్రార్ధం చేయవచ్చు. అదికూడా వీలుకాకపోతే, గోవుకు దాని ఆహారమైన గడ్డి పెట్టవచ్చు. అదీ చేయలేనివారు చేతులెత్తి మొక్కి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రార్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. తనకు జన్మనిచ్చి ఈ లోకంలోకి తెచ్చిన పితృదేవతలను గౌరవభావంతో స్మరించి, భక్తిప్రపత్తులు చాటుకోడమే ఈ కార్యాల వెనుకనున్న భావన.
ఏ తిథినాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధకర్మ చేయాలి. తండ్రి జీవించి, తల్లిని పోయినవారు ఈ పక్షంలో వచ్చే నవమినాడు, తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షమంతా చేయలేకపోతే ఒక్క మహాలయ అమావాస్యనాడైనా చేసి తీరాలి. అదే మాతాపితరుల ఋణం తీర్చుకోడమవుతుంది.

- హైమా శ్రీనివాస్