S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేడు డెయిరీ డైరెక్టర్ల ఎన్నికలు

నెల్లూరు, సెప్టెంబర్ 25: విజయా డెయిరీ పాలకవర్గంలో మూడు డైరెక్టర్ పదవులకు ఏర్పడిన ఖాళీకి సంబంధించి సోమవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు అధికారిగా వరదారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన తెలిపారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన వారిని ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. జిల్లాలోని కొడవలూరు మండలం నార్తురాజుపాలెం, తోటపల్లిగూడూరు మండలం సౌత్‌ఆములూరు, ఆత్మకూరు మండలం వాశిలికి చెందిన డైరెక్టర్ల స్థానాలు ఈనెల 30వ తేదీకి ఖాళీ అవుతున్నాయి. ఈ మూడు స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి.
రసవత్తర పోటీ
ఖాళీ అయిన మూడు డైరెక్టర్ల స్థానాలకు బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచారు. ప్రస్తుత చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి మద్దతుదారులైన ఇరువూరు వెంకురెడ్డి, సుబ్బరాయుడు, కలికి వేణుపాల్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేయగా, మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్‌రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలుపొందాలని రెండు గ్రూపులు గట్టిగానే పని చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఉన్న ఓటర్లను కలిసి తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యిర్థించారు. ప్రస్తుతం విజయా డెయిరీకి 300కు పైబడి సభ్యులున్నప్పటికి వీరిలో కేవలం 131 మందికి మాత్రమే ఓటుహక్కు ఉంది. అందులోనూ 128 మంది మాత్రమే ప్రస్తుతం ఓటుహక్కును వినియోగించుకునేందుకు అందుబాటులో ఉన్నారు. ప్రతి ఓటరుకు మూడు ఓట్లు ఉంటాయి, వారు తమకు నచ్చిన ముగ్గురు వ్యక్తులకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. ఈ గుర్తులతో కూడిన బ్యాలెట్ పత్రంపై ఓటుహక్కును వినియోగించుకుంటారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఓటర్లకు తాయిలాలు కూడా సమర్పించుకునేందుకు అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలోని దూరప్రాంతానికి చెందిన ఓటర్లను ఆదివారం సాయంత్రానికి నెల్లూరుకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశారు. నెల్లూరులోనే బస ఏర్పాటుచేసి వారిని ప్రసన్నం చేసుకునే ఏర్పాట్లలో అభ్యర్థులు ఉన్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా రంగారెడ్డి ఆధిపత్యానికి గండి కొట్టాలనే కృతనిశ్చయంతో ఉన్న సుధీర్‌రెడ్డి తన వంతు ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కావడంతో ఈ ఎన్నికల్లో తాము గెలవడం నల్లేరు మీద నడక వంటిదేననే ధీమాతో కొండ్రెడ్డి వర్గం ఉంది. సోమవారం సాయంత్రానికి డైరెక్టర్లుగా ఓటర్లు మనసు దోచుకుని ఎన్నికల్లో గెలిచే వారెవరో తెలిసిపోనుంది.

భవిష్యత్తులో మరెన్ని పతకాలు సాధించాలి
* జోష్ణవికి ఘన సన్మానం
వేదాయపాళెం, సెప్టెంబర్ 25: అంతర్జాతీయ స్థాయిలో నెల్లూరు జిల్లా ఖ్యాతిని ఎగురవేసిన యోగా క్రీడాకారిణి జోష్ణవి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు జడ్ శివప్రసాద్ అన్నారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని హోటల్ అతిధిలో ఆత్మీయ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిధులుగా పాల్గొన్న జడ్ శివప్రసాద్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో అనేక పతకాలు, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు జోష్ణవి అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యోగా పోటీల్లో మూడు బంగారు పతకాలు, ఒక రజక పతకం సాధించి ఆమె అంతర్జాతీయ స్థాయిలో జిల్లాపేరు వినిపించేలా చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో చర్చించి క్రీడాశాఖ మంత్రి అచ్చెంనాయుడు దృష్టికి తీసుకెళ్లి జోష్ణవికి మరింత ప్రోత్సాహం అందేలా కృషి చేస్తామన్నారు. శాప్ డైరెక్టర్ ఎం.రవీంద్రబాబు మాట్లాడుతూ జోష్ణవిని చిన్నతనం నుంచి శాప్ తరపున ప్రోత్సహిస్తున్నామన్నారు. చిన్నతనంలోనే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన జోష్ణవి మరెంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జోష్ణవి మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువు ముత్యాల లక్ష్మినరసింహశాస్ర్తీ ప్రోత్సాహంతోనే ఇంతటి విజయాన్ని సాధించినట్లు చెప్పింది. అనంతరం జోష్ణవి తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, సుజాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సెల్వం, చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

పక్కా గృహాలు మంజూరు చేయాలి
ఎమ్మెల్యే కోటంరెడ్డి డిమాండ్
నెల్లూరు, సెప్టెంబర్ 25: రూరల్ నియోజకవర్గంలో ప్రజలు పక్కా గృహాల కోసం దరఖాస్తులు సమర్పించుకున్నా, ఇంతవరకు మంజూరు కాలేదని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఆదివారం స్థానిక 20వ డివిజన్‌లో ఆయన ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆయన స్పందిస్తూ నగరంలో వేలాది మంది ప్రజలు సొంత ఇళ్లు లేక బాడుగ ఇళ్లలో నివాసం ఉంటున్నారని, ఇళ్లులేని పేదవారందరికి రూ.లక్షా 50 వేలుతో పక్కా ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల వాగ్ధానం చేసిన టిడిపి, అధికారంలోకి వచ్చాక ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని ప్రశ్నించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేదవాడి సొంతింటి కల నిజం చేసేందుకు పక్కా గృహాలను తక్షణమే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నది, ఎప్పటిలోగా పక్కా ఇళ్లు మంజూరు చేస్తారో చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రూరల్ పరిశీలకుడు కొణిదల సుధీర్, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసయాదవ్, వైసిపి నేతలు తాటి వెంకటేశ్వరరావు, బత్తిన శోభన్‌రెడ్డి, రియాజ్, ఖలీల్, బాబులు, అలీమ్, సందానిబాషా, బషీరా, ఉమాయిన్, అశోక్, రాఘవ, చిరంజీవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుపై అవగాహన లేని జగన్
ఎంఎల్‌సి బీద రవిచంద్ర విమర్శ
నెల్లూరుటౌన్, సెప్టెంబర్ 25: ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి విద్యార్థుల భవిష్యత్తుపై అవగాహన లేదని, ఆయన ఒక అవినీతి చక్రవర్తి అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్ర విమర్శించారు. జిల్లాకేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడు అధ్యక్షతన వైకాపా నగర అధ్యక్షుడు సర్వేపల్లి విశ్వరూపాచారి, కావలి ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, పొదలకూరు మండలానికి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు ఎంఎల్‌సి బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఏ రాజకీయనాయకుడి స్వార్థానికి బలికాకూడదని, చదువు తరువాతే రాజకీయాల్లోకి రావాలన్నారు. విద్యార్థులను పక్కదోవ పట్టించేందుకు 37 కేసుల్లో సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్న జగన్ విద్యార్థుల భేరి, యువభేరి అంటూ విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాయన్నారు. విద్యార్థులను ఆ భేరి, ఈ భేరి అంటూ తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. రాష్ట్రంలో నిర్వీర్యమైపోయిన విద్యావ్యవస్థను, యువతను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉండాలన్న ఆలోచనతో విద్యార్థులు పోరాటాలు సాగించారన్నారు. విభజన సమయంలో గత కాంగ్రెస్, బీజేపి ప్రభుత్వాలు ప్రత్యేక హోదా గురించి అడగలేదని దానివల్ల ఏపికి ఎంతో నష్టం వాటిల్లిందన్నారు. ఆనాడు చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా లేకపోయినా ప్రత్యేకప్యాకేజి కోసం నేడు స్వాగతిస్తున్నారని అన్నారు. ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే మేలని ఎన్నో నిధులు అందుతాయని ఈ విషయం కూడా జగన్‌కు తెలియదా అని నిలదీశారు. కేంద్రప్రభుత్వం పదేపదే పెట్టుబడులు అందిస్తూ పరిశ్రమలు పెట్టేందుకు 90 శాతం రాయితీ కూడా ఇస్తుందన్నారు. గ్రామస్థాయి నుంచి విద్యార్థులు, యువత, విద్యార్థుల అభివృద్థికి తెలుగుదేశంపార్టీ అందిస్తున్న పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి విద్యార్థికి తెలియచేయాలని విద్యార్థులను కోరారు. విద్యార్థుల కోసం ఆనాటి ఎన్టీఆర్ ప్రస్తుత చంద్రబాబులే కాక ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా విద్యార్థుల కోసం పలు ప్రణాళికలను తయారు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుతోపాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న జగన్ మాటలను నమ్మొద్దని విద్యార్థులను కోరారు. ఈసమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మల్లికార్జునరెడ్డి, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు శింగంశెట్టి రవిచంద్ర, ఆనం రంగమయూర్‌రెడ్డి, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత విద్యార్థులు మేళతాళాలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం ఆనం వివేకానందరెడ్డి, బీద రవిచంద్రలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాష్ట్రంలో బాబు పాలన అవినీతిమయం
* ఎమ్మెల్యే కాకాణి విమర్శ
వెంకటాచలం, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన అవినీతిమయంగా సాగుతోందని వైకాపా జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని కురిచెర్లపాడు గ్రామంలో అదివారం ఆయన గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినితి పాలన సాగుతోందని, ఈవిషయం కొన్ని పత్రికల్లో వెల్లడైందన్నారు. అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు పాదయాత్రలో, బహిరంగ సభల్లో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఇంతవరకు పూర్తిస్థాయిలో హామీలు అమలు జరగలేదన్నారు. ముఖ్యమంత్రితోపాటు ఆయన కుమారుడు, ఇతర మంత్రులు అందరు కలిసి ముడుపులు తీసుకోవడానికే సమయం సరిపోతోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అభివృద్ధి అంటూ చెప్పుకుంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే స్థానిక నాయకులు నీరు-చెట్టు పేరుతో దోచుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజలకు అందే సంక్షేమ కార్యక్రమాల్లో అవినితికి పాల్పడుతున్నారన్నారు. తెలంగాణాలో టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు. ఓటమి భయంతోనే రాష్ట్రంలో వైసిపిని నిర్వీర్యం చేసేందుకు వైసిపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, దీంతో తమ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రజల్లో టిడిపికి ఆదరణ వుంటే పార్టీ వీడిన వైసిపి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టి గెలిపించుకోవాలని ఆయన సవాలు విసిరారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను ఎంతమాత్రం అమలు చేసిందో ప్రజలకు వివరించేందుకే గడప గడపకు వైసిపి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా పంచాయతీలోని ఒకటో వార్డు మెంబర్ మల్లికార్జున్ నాయుడు కాకాణి సమక్షంలో వైసిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యులు మందల వెంకటశేషయ్య, వైస్ ఎంపిపి శ్రీ్ధర్‌నాయుడు, కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాషా, హుస్సేన్, ఎంపిటిసి సభ్యులు శ్రీనివాసులు, ఉప సర్పంచ్ వెంకటరమణయ్య, నాయకులు కోదండరామిరెడ్డి, విజయ్‌మోహన్‌రెడ్డి, స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వాహనం ఢీకొని జింక మృతి
వెంకటాచలం, సెప్టెంబర్ 25 : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి చెందిన సంఘటన వెంకటాచలంలోని ఇందిరమ్మకాలనీ సమీపంలో వెంకటాచలం - తిక్కవరప్పాడు మార్గంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జింక తాగునీటి కోసం అడవిలో నుంచి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మూడు జింకలు మృతి చెందగా స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అటవీ శాఖ అధికారులు వచ్చేలోపు రెండు జింక కళేబరాలను గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు.

ఉప్పెనలా పోర్టు ఉద్యమం
* ఎమ్మెల్యే రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంటేరు స్పష్టం
కావలి, సెప్టెంబర్ 25: నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ఆయువుపట్టుగా ఉన్న రామాయపట్నం పోర్టు సాధన కోసం శనివారం నిర్వహించిన పాదయాత్ర అన్ని వర్గాల ప్రజల అండతో దిగ్విజయంగా జరిగిందని, ఈ ఉద్యమం ఉప్పెనగా మారబోతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం రామ్మూర్తిపేటలో ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు, కనమర్లపూడి వెంకటనారాయణ, కనపర్తి రాజశేఖర్, ఎల్లంటి వెంకటేశ్వర్లు, పరుసు మాల్యాద్రి, శ్రీనివాసులు, మరికొందరితో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష రామాయపట్నం పోర్టు సాధన అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్ర విజయవంతమైందన్నారు. అందులోనూ రాష్ట్ర అసెంబ్లీ, జాతీయ స్థాయిలో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి తదితరులు రావడం ఉద్యమానికి మరింత బలాన్ని ఇచ్చిందని తెలిపారు. పాదయాత్రలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు, వామపక్ష నేతలు, తదితరులు పాల్గొన్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోర్టు సాధించుకుంటేనే కావలి కనకపట్నం కాగలదన్నారు. రహదారులు, రైల్వే లైన్‌లు, పరిశ్రమలు లెక్కలేనన్ని వస్తాయని, ఒక్క కావలి ప్రాంతంలోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కృష్ణపట్నం పోర్టు ప్రారంభం అయిన తర్వాత నెల్లూరులో ఉపాధి అవకాశాలు రెట్టింపు అయ్యాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, ఈక్రమంలో పోర్టును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పోర్టు ఏర్పాటుచేయాలని చెబుతున్న రామాయపట్నం ప్రకాశం జిల్లాలోది కాగా, కావలి నుంచి ఉద్యమం చేయడం దానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకావడం ప్రకాశం జిల్లా వాసులను ఆలోచనలో పడవేసిందని, ఆ జిల్లాలో అన్నివర్గాల ప్రజలు రామాయపట్నం పోర్టు సాధనపై దృష్టిపెడుతున్నారని తమకు సమాచారం వచ్చిందన్నారు. మరికొద్ది నెలల్లో కావలి తరహాలోనే ప్రకాశం జిల్లాలోనూ ఉద్యమం ఉప్పెనగా మారబోతుందన్నారు. నవంబర్ నెలలో కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు ఎంపీలతో కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు చెబుతూ ప్రధానమంత్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా అడుగుతున్నట్లు తెలిపారు. సాంకేతిక కమిటీ పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపి ఉన్న నేపథ్యంలో అన్ని విషయాలను ప్రధానికి తెలియచేసి పోర్టు విషయమై సానుకూల నిర్ణయం తీసుకునేలా చూస్తామన్నారు. తనకు మద్దతు ఇచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు, సామాన్య జనానికి రుణపడి వుంటానని, పోర్టు డిమాండ్‌ను మరింత వేగవంతంగా, సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.