S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పల్నాడులో 200 టిఎంసిల నీటి నిల్వకు ప్రణాళిక

గుంటూరు, సెప్టెంబర్ 25: పల్నాడు ప్రాంతంలో 200 టిఎంసిల నీటి నిల్వకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గురజాల నియోజకవర్గంలో వరదలకు నష్టపోయిన పంటలను పరిశీలించిన అనంతరం సిఎం చంద్రబాబు ఈ ప్రాంతంలో రిజర్వాయర్ ఆవశ్యకతను వివరించారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరిట పందికొక్కుల్లా దోచుకు తిన్నారని, ప్రభుత్వం అన్ని అంశాలలో పారదర్శకంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, కెవిపి రామచంద్రరావులు బ్రోకర్ల ద్వారా గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేయించారని, ప్రాజెక్టు పూర్తయితే రాజకీయంగా పుట్టగతులుండవనే భయంతో పొరుగు రాష్ట్రాలతో చేతులు కలుపుతున్నారని మండిపడ్డారు. ఎడమకాల్వ పరిధిలో పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే ఏడాది జూన్‌లో విశాఖపట్నానికి నీరందిస్తామని వెల్లడించారు. పదేళ్లపాటు పోలవరం, తోటపల్లి ప్రాజెక్టులను కాంగ్రెస్ నేతలు ఎందుకు నిర్లక్ష్యం చేశారో పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రజలకు వివరించాలన్నారు. తోటపల్లి మొదటిదశ పనులు పూర్తిచేయటం ద్వారా ఈ ఏడాది లక్ష ఎకరాలకు నీరందించామన్నారు. వంశధార- నాగావళి నదుల అనుసంధానంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు సస్యశ్యామలమవుతాయని వివరించారు. రెండేళ్లలో గాలేరు- నగరి, హంద్రి- నీవా ప్రాజెక్టులను పూర్తిచేసి రాయలసీమను ఆదుకుంటామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కండలేరు, సోమశిలకు నీటిని తరలించడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీరందుతుందని తెలిపారు. ఈ ఏడాది 2200 టిఎంసిల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయని, పట్టిసీమలో 21 టిఎంసీలు నిల్వ చేయడం ద్వారా ఏలూరు, కృష్ణాడెల్టాకు సకాలంలో నీరందిస్తున్నామని చెప్పారు. వైఎస్ ఆత్మ జగన్ అయితే ప్రేతాత్మ కెవిపిగా అభివర్ణించారు. వైఎస్ దోచుకున్న సొమ్ములో కొన్ని మూటలు ఢిల్లీకి తరలించింది కెవిపి కాదా అని ప్రశ్నించారు. స్విట్జర్లాండ్, టైటానిక్ స్కాంలతో కెవిపికి ప్రమేయం ఉందన్నారు. దోచుకునే సంస్కృతి తమ పార్టీకి లేదన్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగానికి రబీకి నీరందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర నిధులు మంజూరుపై నేడు రాష్ట్ర ఉన్నతాధికారులు ఢిల్లీలో చర్చిస్తారని చెప్పారు.

వరద బాధితులకు సిఎం భరోసా
* ఫలించిన ఎమ్మెల్యే
యరపతినేని కృషి
దాచేపల్లి, సెప్టెంబర్ 25 : దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన పర్యటన వరద బాధితులకు భరోసా ఇవ్వగా తెలుగుదేశం వర్గాల్లో జోష్ నింపింది. గురజాలలో జరిగిన వరద నష్టానికి ప్రభుత్వ సహాయంతో పాటు తన వ్యక్తిగత సహాయాన్ని సైతం అందించి బాధితుల ప్రశంసలు పొందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దాచేపల్లి ప్రాంత వరద బాధితుల సమస్యలు వారి మనోభావాలను సిఎం దృష్టికి తీసుకువెళ్ళి బాధితులకు సత్వర న్యాయం జరిపించడంలో విజయం సాధించారు. ఎమ్మెల్యే యరపతినేని దాచేపల్లి ప్రాంత సమస్యలను ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్ళడంతో ఆయా సమస్యలపై అవగాహన ఉన్న ముఖ్యమంత్రి బాధితుల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడారు. సిఎం చంద్రబాబునాయుడు పర్యటన ఆసాంతం వరద బాధితులతో ఎంతో ప్రేమగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిఎం చంద్రబాబు ఎంతో ఓపికగా దాచేపల్లిలో వరద కారణంగా నష్టపోయిన షాపులను పరిశీలించటం , ప్రతి షాపునకు తిరిగి సంబంధిత షాపు యాజమానితో నష్టం వివరాలు అడిగి తెలుసుకోవడం వరద బాధితులలో సంతోషం నింపింది. వరద వలన మునిగిపోయిన ఇళ్లను సందర్శించి ఎంతో ఓపికగా ఆ ఇంట్లో మహిళలతో మాట్లాడటం వారికి సంతోషాన్నిచ్చింది. నష్టం జరిగిన తీరుపై అవగాహనకు వచ్చిన సిఎం వెంటనే జరిగిన బహిరంగ సభలో నష్ట పరిహారం ప్రకటించడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దల కాలంగా దాచేపల్లి ప్రధాన సమస్యగా ఉన్న రోడ్లు, డ్రైనేజీల ఆవశ్యకతను గుర్తించిన సిఎం వెంటనే దాచేపల్లిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వెంటనే 10 కోట్ల రూపాయలు ప్రకటించడం పట్ల బాధితులలో హర్షం వ్యక్తం అయింది. అదే విధంగా దాచేపల్లిలో రోడ్డు విస్తరణ పనులలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆ లోటుపాట్లను వెంటనే సవరించాలని ప్రజలు ఎప్పటి నుండో కోరుతున్నారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడిన సిఎం బాధితుల మనోభావాలు గమనించి సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్‌పై విచారణకు ఆదేశించడం, మరమ్మతులకు నిధులు కేటాయించడం ప్రజలలో సంతోషాన్ని నింపింది. సిఎం పర్యటన విజయవంతం కావడం తెలుగుదేశం వర్గాల్లో కొత్త జోష్‌ను తెచ్చిపెట్టింది.

వరద బాధితులను
ప్రభుత్వం ఆదుకోవాలి
రాజుపాలెం, సెప్టెంబర్ 25: భారీ వర్షాల వలన మండలంలో దెబ్బతిన్న రెడ్డిగూడెం, గణపవరం, అనుపాలెం గ్రామాలను, గృహాలను ఆదివారం వైఎస్‌ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పరిశీలించారు. నష్టపోయిన బాధితులు బోరున విలపించారు. వరద వచ్చిన ప్రతి గృహాన్ని ఆయన సందర్శించి బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా విలేఖర్ల సమావేశంలో అంబటి మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీవర్షాల వలన చెరువులు తెగిపోవడం కారణాన అత్యధికంగా నష్టపోయిన గ్రామం రెడ్డిగూడెం అన్నారు. పూరి గుడిసెలు పూర్తిగా దెబ్బతిన్నాయని, డాబాలు కుంగిపోయాయని, భవనాలు సైతం పాక్షికంగా నష్టానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగు రోజులు గడిచినా ప్రభుత్వం గానీ, రెవెన్యూ అధికారులు గానీ బాధితులను ఆదుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులను పరామర్శించడానికి వచ్చి బాధితులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారని మండిపడ్డారు. ఈనెల 27న తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ గ్రామానికి వస్తారని, మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం అనుపాలెం ఎస్సీ కాలనీ, గణపవరం వరద బాధితులను నిత్యావసర సరుకులను అందజేశారు. అంబటి రాంబాబు వెంట మాజీ ఎంపిపి మర్రి సుందర రామిరెడ్డి, బాసు లింగారెడ్డి, బత్తుల రామస్వామి, ఎంపిటిసిలు మేడా విజయ్, శ్రీనివాసరావు, నాగుల్‌మీరా, వైసిపి నాయకులు మర్రి సుబ్బారెడ్డి, బాషా, రేపూడి శ్రీనివాసరావు, తోటా ప్రభాకర్, దూదేకుల మీరావలి, అంకాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

‘సర్వే వేగవంతంగా నిర్వహిస్తాం’
అచ్చంపేట, సెప్టెంబర్ 25: మండల కేంద్రమైన అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం అధికారులతో నెల్లూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇడి రామచంద్రారెడ్డి వరద పరిస్థితిపై సమీక్షించారు.
ఇందులో భాగంగా ఆయన మండల అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈనెల 11 నుండి ఆదివారం వరకు 107.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. వరదల వల్ల మండలంలో మిర్చిపంట ఆకు రాలుతుందన్నారు. కస్తల గ్రామంలో వాగులు పొంగిపొరలడంతో వందలాది ఎకరాలు నీటమునిగాయని చెప్పారు. ఈ పొలాలపై వేగవంతంగా సర్వేచేసి నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. వరద ఉద్ధృతికి చల్లగరిగ కృష్ణారేవులో కొట్టుకుపోయి మృతిచెందిన తటావతు జానునాయక్‌కు ఎక్స్‌గ్రేషియా అందించేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. సమీక్షలో ఎండిఒ డిజి నాయక్, ఇన్‌చార్జి తహశీల్దార్ విశే్వశ్వరరావు, ఆర్‌ఐ ప్రణతి, విఆర్‌ఒలు పాల్గొన్నారు.

నేటి తరానికి మార్గదర్శి పండిట్ దీనదయాళ్
గుంటూరు, సెప్టెంబర్ 25: ఏకాత్మ మానవతావాదాన్ని ప్రవచించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయులని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం కన్వీనర్ ఆర్ లక్ష్మీపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూపరాణి పేర్కొన్నారు. పండిట్ దీనదయాళ్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బ్రాడీపేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో దీనదయాళ్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దీనదయాళ్ జీ సూచించిన ఏకాత్మతా మానవత సిద్ధాంతం ఆధారంగా బిజెపి నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రతి పేదవానికి అంత్యోదయ పథకం ద్వారా ఆర్థిక పరిపుష్టి కలిగేలా కృషి చేస్తుందన్నారు. పేద, ధనిక, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా భారత్‌లోని ప్రజలంతా ఒక్కటేనని పండిట్ దీనదయాళ్ చాటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పునుగుళ్ల రవిశంకర్, ఉపాధ్యక్షులు పి రంగవల్లి, జి సత్యనారాయణ, ఆఫీస్ ఇన్‌చార్జి కెసివై రాజేష్‌నాయుడు, కార్యదర్శి ఆకుల రామకోటేశ్వరరావు, జిల్లా యువమోర్చ అధ్యక్షుడు సిహెచ్ అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు కెఎపిఆర్ విఠల్, రూరల్ మండలం అధ్యక్షుడు సురేష్‌బాబు, నాయకులు దానబోయిన శివయ్య, కె బ్రహ్మయ్య, కనె్నగంటి మురళి, టి తాతారావు, ఆవుల నాగేంద్రయాదవ్, మీడియా ఇన్‌చార్జి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శమూర్తి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ
మంగళగిరి, సెప్టెంబర్ 25: భారత రాజకీయ నాయకులకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆదర్శమూర్తి అని ధనం, అధికారం పట్ల వ్యామోహంలేని నిజమైన దేశభక్తుడని బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు భీమిరెడ్డి అంజిరెడ్డి అన్నారు. జనసంఘ్ మాజీ అధ్యక్షుడు దీనదయాళ్ ఉపాధ్యాయ శత జయంతిని పురస్కరించుకుని మండల పరిధిలోని రామచంద్రాపురంలో నీలం సంజీవరెడ్డి సేవాసమితి ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో అంజిరెడ్డి మాట్లాడారు. దీన్‌దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపసర్పంచ్ సుబ్బారెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. పట్టణంలోని బిజెపి కార్యాలయంలో పట్టణ బిజెపి అధ్యక్షుడు జగ్గారపు రామ్మోహనరావు అధ్యక్షతన ఆదివారం దీనదయాళ్ ఉపాధ్యాయ శతజయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆలిండియా హాండ్లూమ్‌బోర్డు మెంబర్లు జగ్గారపు శ్రీనివాస్, అందే శివశంకరరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, తాటిపాముల సాంబశివరావు, దామర్ల రమేష్, సానా చౌడయ్య, ఆకురాతి నాగేంద్రం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అశ్లీలతకు తావులేని మిస్ అమరావతి అందాల పోటీలు
తాడేపల్లి, సెప్టెంబర్ 25: గుంటూరు కృష్ణాజిల్లాల సరిహద్దులోని ప్రకాశంబ్యారేజ్ వద్ద, లోటస్ ఫుడ్ సిటీ సమీపంలో కృష్ణానదిలో ఆదివారం మిస్ అమరావతి అందాల పోటీలు నిర్వహించారు. ఫ్యూచర్ ఆల్ కంపెనీ చేపట్టిన ఈకార్యక్రమాన్ని సాయి క్రియేటివ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు చాంపియన్ యాష్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించారు. ఈసందర్భంగా సాయి క్రియేటివ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్ ఆర్గనైజర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ నేటి ఆదునిక యుగంలో మహిళల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించి వారు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే సదుద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అశ్లీలతకు తావులేకుండా సంప్రదాయ పద్ధతిలో ఇప్పటి వరకూ విశాఖపట్నం, రాజమండ్రి, భీమవరం, నెల్లూరు, గుంటూరు, విజయవాడ నగరాల్లో మిస్ సిటీల పోటీలు నిర్వహించామని, అదే క్రమంలో రాజదాని ప్రాంతానికి ప్రాచుర్యం కల్పిస్తూ గుంటూరు, విజయవాడ నగరాల పరిధిలో యువతులకు ప్రాధాన్యత ఇచ్చి మిస్ అమరావతిగా ఎంపిక చేయటానికి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రదర్శన, ఆత్మవిశ్వాసం వంటి అంశాలు పరిగిణలోకి తీసుకుని మరో రెండు దశల్లో పోటీలు నిర్వహించి మిస్ అమరావతిని ఎంపిక చేస్తామని తెలిపారు. కాగా అక్టోబర్ 1న విజయవాడలోని మెట్రోపాలిటన్‌లో గ్రాండ్ ఫైనల్ నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే యువతులకు అవసరమైన ఆహారం, డ్రస్ డిజైనింగ్, ప్రదర్శన నైపుణ్యాల గురించి కూడా ఛాంపియన్ యాష్ క్లబ్ వారు శిక్షణనిస్తున్నారని గొట్టిపాటి సాయి తెలిపారు. ఈసందర్భంగా ఛాంపియన్ యాష్ క్లబ్ ఎండి సుభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర రాజదానిలో ఇటువంటి పోటీలు నిర్వహించటం వలన గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాషన్ డిజైనింగ్, కొరియోగ్రఫీ వంటి రంగాల పట్ల ఆసక్తి ఉన్న యువతులు, ఆధునిక రంగాల్లో ముందుకు వెళ్ళటానికి ఈ పోటీలు ఆత్మవిశ్వాసాన్నిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న సినిమా రంగంలో కూడా యాక్షన్, డైరక్షన్ వంటి విభాగాల్లో కూడా అవకాశాలకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. ఈకార్యక్రమంలో నేషనల్ కొరియోగ్రాఫర్ నీల్‌ఫర్, ఫ్యాషన్ డిజైనర్ శ్రావణ్, సుమారు 30 మంది పోటీదారులు పాల్గొన్నారు.

గండ్లను పూడిపిస్తాం
పెదనందిపాడు, సెప్టెంబర్ 25: డ్రైనేజీ ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పొన్నూరు ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్ తెలిపారు. మండల పరిధిలోని నాగులపాడు సమీపంలో నల్లమడ వాగుకు పడ్డ గండిని ట్రాక్టర్‌పై వెళ్లి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో డ్రైనేజీ అధికారులతో నల్లమడ ముంపు సమస్యపై సమీక్ష నిర్వహించనున్నారు. వాగు కరకట్టకు పడ్డ గండ్లను త్వరితగతిన మరమ్మతులు చేయిస్తామన్నారు. గండ్లు పడటం వలన కోతకు గురైన పంట పొలాలకు పరిహారం చెల్లించాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంట మండల ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, యార్డు డైరెక్టర్ కె చలమయ్య, సర్పంచ్ టి వెంకట సుబ్బారావు, రమేష్ తదితరులున్నారు.

ముంపు పొలాలను పరిశీలించిన రావి బృందం
పొన్నూరు, సెప్టెంబర్ 25: ఇటీవల కురిసిన భారీవర్షాలకు వాగులు, వంకలు పొర్లి ముంపునకు గురైన పొన్నూరు మండలం పెదఇటికంపాడు గ్రామంలోని పంట పొలాలను నియోజకవర్గ వైసిపి కన్వీనర్ రావి వెంకట రమణ బృందం ఆదివారం పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేనందునే పొన్నూరు ప్రాంత మురుగు వెనక్కు వెళ్లి ముంపునకు కారణమైందని రావి పేర్కొన్నారు. ముంపు వలన నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ సత్వరం అందజేయాలని, విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు వేణుప్రసాద్, ఆకుల వెంకటేశ్వరరావు, ఎల్ పిచ్చిరెడ్డి, వాహెదుల్లా, మొల్లా కరీమ్, సఫైతుల్లా, శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు.