S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముంపు పాపం ఎవరిది?

గుంటూరు, సెప్టెంబర్ 25: ఒకటి కాదు... రెండు కాదు... దశాబ్దాల కాలంగా గ్రామాలకు గ్రామాలు సెలయేళ్లవుతున్నా ఎవరికీ పట్టదు.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆధునికీకరణ మంత్రం తెరపైకి వస్తుంది.. ఆనక అటకెక్కుతుంది.. ఎప్పటికప్పుడు వాగులకు వంకపెట్టి చేతులు దులుపుకోవటం రివాజుగా మారుతోంది.. భారీ వర్షాలు, వరదల కారణంగా జరుగుతున్న నష్టానికి శాశ్వత పరిష్కారం లభించటంలేదు. దశాబ్ద కాలం కిందట సంభవించిన ఓగ్ని తుపాను కారణంగా గుంటూరు జిల్లాలో సాగు, మురుగునీటి కాల్వలు ఏకమై వందలాది గ్రామాలను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర నీటిపారుదల రంగ నిపుణులు పరిశీలన జరిపి డెల్టా కాల్వలను శాశ్వత ప్రాతిపదికన ఆధునికీకరించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రపంచ బ్యాంకు రు. 5 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కాల్వల ఆధునికీకరణకు టెండర్ పెట్టిన ప్రభుత్వాలు ఇప్పటివరకు కనె్నత్తి చూసిన దాఖలాలులేవు. వర్షాలకు పొంగుతున్న వాగులపై హైలెవల్ వంతెనల నిర్మాణం, కాల్వలకు లైనింగ్ పనులు పూర్తిచేయాలనే ధ్యాస లేనందునే ఏటా అపార నష్టం సంభవిస్తోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వాగు పోరంబోకు భూములనేకం కబ్జాకు గురయ్యాయి. నిషేధిత స్థలాలను సైతం ఆక్రమించుకుని వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోవడం వల్లే తరచు ముంపు బారిన పడాల్సి వస్తోందనేది నిపుణుల వాదన. దశాబ్ద కాలంగా కాల్వల మట్టిపనులు ఇంకా పూర్తికాలేదంటే అతిశయోక్తికాదు. కృష్ణా తూర్పు డెల్టా ఆధునికీకరణకు రూ. 2800 కోట్లు, పశ్చిమ డెల్టాకు రూ. 2600 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాలో నల్లమడ, కృష్ణా జిల్లాలో బుడమేరు వాగుల ఆధునీకరణ చేపట్టారు. బుడమేరు వాగు పట్టిసీమ ఖాతాలో చేరడంతో ఆ ప్రాంతానికి ముంపు తప్పింది. అయితే గుంటూరు జిల్లాలో మాత్రం నల్లమడ వాగు ఉద్ధృతి నేటికీ బుసలు కొడుతోంది. ఫలితంగా పల్నాడు నుంచి సముద్ర తీరం వరకు ఉన్న గ్రామాలపై ప్రభావం చూపుతోంది. గుంటూరు జిల్లాలో ప్రధానంగా నల్లమడ, ఓగేరు, కొండవీటి వాగులకు వరద పోటెత్తుతోంది. రాజధాని నేపథ్యంలో కొండవీటివాగు ముంపు నియంత్రణ చర్యలను ఇప్పుడే ప్రభుత్వం చేపట్టింది. భారీవర్షాల సమయంలో వాగులు పొంగి పొలాలు, ఊళ్లు ముంపు బారిన పడుతున్నాయి. వాగులు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో లైనింగ్‌తో పాటు కట్టలు బలహీనంగా ఉన్నందున కూడా గండ్లకు ఆస్కారం కలుగుతోంది. చప్టాలపైకి నీరుచేరి రవాణా వ్యవస్థ స్తంభిస్తోంది. ఈ సమస్యకి హైలెవల్ వంతెనలు నిర్మించటమే పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. కుప్పగంజి వాగు సమస్యకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. తిలాపాపం తలాపిడికెడు అనే చందంగా వాగులు, కాల్వల ఆధునికీరణ సాగుతోంది. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.

నల్లమడవాగు గండితో గ్రామాలను
చుట్టుముట్టిన వరదనీరు (ఫైల్‌ఫొటో)