S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బ్యాంకుల్లోనే బతుకులు

హైదరాబాద్, నవంబర్ 17: బ్యాంకుకు వెళ్లాలంటే మధ్యాహ్న భోజనం, సాయంత్రం టిఫిన్, ఆరోగ్య సమస్యలుంటే వాటికి సంబంధించిన మాత్రలు తీసుకుని వెళ్లాల్సిందే అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న జోకులను బ్యాంకులు నిజం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరం అంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంకులు తలుపులు తీయకముందే క్యూలు సిద్ధమవుతున్నాయి. వారిని లైన్లలో నిల్చోబెట్టేందుకు పోలీసులు లాఠీలకు సైతం పనిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఈ లైన్లు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాంతాడంత క్యూలు ఉండటంతో వృద్ధులు, మహిళలు, ఒంటరి ప్రజలు నానా ఇబ్బందులకు గరవుతున్నారు.
ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వచ్చి డబ్బు తీసుకోవల్సిందేనని ఆంక్షలు విధించడంతో అనారోగ్యంతో ఉన్న వారు సైతం బ్యాంకులకు తప్పనిసరి రావల్సి వస్తోంది. వారందరికీ బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. ఎన్ని గంటలు లైన్లో నిల్చున్నా ఆఖరి నిమిషంలో నగదు అయిపోయిందనో, ఇంకా నగదు రాలేదనో చెప్పి చేతులు దులుపుకోవడంతో బ్యాంకుల్లో వాగ్యుద్ధాలే జరుగుతున్నాయి. లైన్‌లో నిల్చున్నపుడు గరిష్టంగా 24వేలు ఇస్తామని చెప్పి ఒక దశలో 10వేలు ఇస్తామని, మరోగంట గడిచాక ఐదువేలే చేతుల్లో పెడుతున్నారు. అసలు ప్రభుత్వం చెబుతున్న దానికి, బ్యాంకులు చేస్తున్న దానికీ పొంతన లేకుండా పోయింది. బ్యాంకుల్లో కుస్తీలు పడి నగదు పొందినా, రెండువేల రూపాయిల నోటు పట్టుకుని చిల్లర కోసం కూడా పడరాని పాట్లు పడాల్సి వస్తోంది.
ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించినట్టు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఏదీ అమలుకావట్లేదు. బ్యాంకర్లు సైతం ఖాతాదారులకు దండం పెట్టేస్తున్నారు. డబ్బుంటే ఇచ్చేవాళ్లం, లేనపుడు మమ్మల్ని ఏం చేయమంటారని నిర్వేదం ప్రకటిస్తున్నారు.
మాకేం ఆదేశాలు లేవు: బంక్‌ల యజమానులు
డెబిట్ కార్డుల నుండి గరిష్టంగా రెండు వేల వరకూ నగదు ఉపసంహరణకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు వచ్చిన వార్తలను పెట్రోల్ బంక్‌ల్లో యజమానులు కొట్టిపారేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వరకూ తమకు ఎలాంటి ఆదేశాలు లేవని వారు స్పష్టం చేశారు. అయితే చమురు కంపెనీలు మాత్రం ఎస్‌బిఐతో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పినా బంక్‌ల్లో మాత్రం ఈ సౌకర్యం అందుబాటులోకి రాలేదు.
ముంబై సహా పలు నగరాల్లో ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లలో కూడా రెండు వేలు చొప్పున నగదు ఉపసంహరణ వీలుకల్పించారని చెప్పగానే హైదరాబాద్‌లో కూడా అలాంటి సౌకర్యం కల్పించారేమోనని జనం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటే అలాంటిది ఏమీ లేదని చెప్పడంతో డీలాపడ్డారు.
ఎటిఎంలు పనిచేయక, బ్యాంకుల్లో నగదు లేక, ఆన్‌లైన్‌లో సైతం కార్డులను స్వైప్ చేద్దామంటే సెర్వర్ డౌన్ అంటూ సమాధానం ఇస్తున్నారు. దాంతో బతకడం ఎలా అంటూ సామాన్యులు నిలదీస్తున్నారు. రానున్నరోజుల్లో రెండు వేలు ఇవ్వడం కూడా గగనమేనని బ్యాంకర్లు ముందుగానే పిడుగులాంటి వార్త చెబుతున్నారు. మున్ముందు నగదు కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు.
బ్యాంకులు సామాన్యులకు ఐదువేలకు మించి ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు విధించి, అసామాన్యులకు మాత్రం లక్షల్లో క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక పక్క జనం క్యూల్లో ఉన్నపుడే వేరొకరికి మాత్రం లక్షల్లో క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేయడం లేదా చెల్లింపులు చేస్తున్నాయని, అసలు బ్యాంకుల లావాదేవీలపైనే నిఘా పెట్టి వాటిపై దర్యాప్తు జరపాలని జనం కోరుతున్నారు. ఐడిబిఐ, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ తదితర బ్యాంకులపై ఈ తరహా ఆరోపణలు వస్తున్నాయి.

చిత్రం.. హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్ వద్ద గురువారం డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్న జనం