తీరం లోపల
Published Saturday, 19 November 2016తెడ్డు జారిపోయింది
సముద్రం లోపల
పడవా నేనూ ఇద్దరమే-
అలల సింహం మీద
స్వారీ చేయడం ఇదే నా తొలి అనుభవం
దూర తీరాల మీద
పక్షులు
పగటి పనులన్నీ ముగించుకొని
గూళ్ల వైపు వెళ్లిపోతూ-
నెలవంక కన్ను తెరిచిన నింగి
నక్షత్రాల్ని
నల్లని జడలో అల్లుకుంటుంది
నిశి నిశ్శబ్దంలో
పిల్లగాలి
నా చుట్టూ తిరుగుతూ
చుట్టమై పరామర్శించి మాయమై పోతుంది
నిశ్చల నీరవం కింద
జలపుష్పమేదో
తళుక్కున షికారు చేసిపోయింది
కంటి లోపల కునుకుని
కనురెప్ప తినేసి
చూపుల దీపం వెలిగించి కూర్చుంది-
తెడ్డు జారిపోయింది
సముద్రంలో ఇప్పుడు ముగ్గురం
పడవా నేనూ
నా పద్యం-
కవి కూడా ఒక జాలరి
రక్షించేందుకు
ఇటుకేసి ప్రయాణిస్తున్న ఆ జాలరే
నా ఉప్పునీటి కవిత్వానికి తొలకరి
*