S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జోడీపై విమర్శల దాడి!

అమరావతి, నవంబర్ 19: వారిద్దరిదీ మంచి జోడీ అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తరచూ కీర్తిస్తుంటారు. పని తప్ప వాళ్లిద్దరికీ వేరే పనిలేదని ఛలోక్తులు విసురుతుంటారు. వారిద్దరి హయాంలోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేస్తుంటారు. ప్రజలు వారిద్దరినీ గుండెల్లో పెట్టుకున్నారని కితాబిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ జోడీపై సామాన్య జనంలో విమర్శల దాడి పెరుగుతోంది. కష్టపడి సాధించుకున్న ఇమేజీ డామేజీ అవుతోంది. చివరకు వారి పథకాలతో లబ్ధి పొందుతున్న వారే తిట్లు లంకించుకుంటున్నారు. సొంత పార్టీ శిబిరాల్లోనూ డిటో. పెద్దనోట్ల రద్దు తర్వాత జనంలో పెరిగిన చిల్లర కష్టాలు ప్రధాని మోదీ-ఏపి సీఎం చంద్రబాబునాయుడుకు జనంలో ఉన్న ఇమేజీని దెబ్బతీస్తున్నాయి. గత మూడురోజుల నుంచి గుంటూరు-కృష్ణా జిల్లాల్లో ఆంధ్రభూమి చేసిన పరిశీలనలో తేలిన విషయమిది.
ప్రధాని మోదీ రాత్రి వేళ ప్రకటించిన 500, 1000 నోట్ల రద్దు రాజకీయంగా ఆయన సారథ్యం వహిస్తున్న బిజెపితోపాటు, రాష్ట్రంలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకీ నష్టం కలిగిస్తోంది. దీని ప్రభావం ఉన్నంతకాలం, దీనివల్ల ప్రజలు ప్రత్యక్షంగా ఇబ్బంది పడుతున్నంత కాలం ఆ నష్టం రెండు పార్టీలకూ తప్పదని జనం మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది. సొంత పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తలు కూడా చిల్లర సమస్యలపై ఆగ్రహంతో ఉన్నారు. ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినా సామాన్యుల్లో ఆగ్రహం, విద్యార్థులు, విద్యాధికుల్లో సానుకూల స్పందన వ్యక్తమయింది.
గుంటూరు అర్బన్-రూరల్, మంగళగిరి, తుళ్లూరు, మందడం, చినకాకాని, విజయవాడ, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, నున్న, కృష్ణలంక, లబ్బీపేట, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, ఆటోస్టాండ్లు, సాధారణస్థాయి హోటళ్ల వద్ద జనాభిప్రాయం మోదీ-బాబుకు వ్యతిరేకంగా కనిపించింది. చివరకు తెలుగుదేశం, బిజెపికి చెందిన డివిజన్, నగర స్థాయి నేతల్లోనూ తమ నాయకత్వాలపై అసంతృప్తి వ్యక్తం కావడం విశేషం. వీరికి గత ఎన్నికల్లో పట్టం కట్టిన రైతాంగం తీవ్ర వ్యతిరేకంగా ఉంది. వీరిలో తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ ఓటర్లు కూడా ఉండటం మరో విశేషం.
దీర్ఘకాలంలో మోదీ నిర్ణయం ఫలితాలిస్తుందని అభిప్రాయపడిన వర్గాలే, పెద్దనోట్ల రద్దుతో నెలకొన్న చిల్లర నోట్ల సమస్య వల్ల ముందుగా తాము నష్టపోతుండటాన్ని భరించలేకపోతున్నారు. దీనికి కారణం మోదీ, బాబులేనన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. 100, 50, 20 నోట్లు ముందుగా చలామణిలో పెట్టి తర్వాత పెద్దనోట్లు రద్దు చేసి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయంలా కనిపించింది.
ఈ విషయంలో మోదీ-బాబు చేసుకున్న మితిమీరిన ప్రచారమే నష్టం కలిగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పెద్దనోట్ల రద్దుపై తానే లేఖ రాశానని బాబుతోపాటు తెదేపా నేతలు ప్రముఖంగా ప్రచారం చేసుకుంటున్నారు. బిజెపి నేతలు ప్రతి మండల కేంద్రంలోనూ సామాన్యుడు సంధించిన అస్తమ్రంటూ మోదీ ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు పెట్టారు. ఇది జనంలోకి నెగెటివ్‌గా వెళ్లినట్లు వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి.
తమ నేత అన్నిసార్లు పెద్దనోట్ల రద్దుకు తానే లేఖ రాశానని చెప్పడం వల్ల రాజకీయంగా నష్టం జరుగుతోందని, ఆ ప్రచార ప్రభావం సామాన్య ప్రజలపై పడుతోందని తెదేపా నేతలు వాపోతున్నారు. దీనివల్ల తమ చిల్లరనోట్ల సమస్యకు బాబే కారణమన్న భావన నెలకొనే ప్రమాదం ఏర్పడిందన్నారు.
‘మా సార్ బ్లాక్‌మనీ, ఎన్నికల్లో పెద్దనోట్ల ద్వారా ఓట్లు కొనే వ్యవస్థకు చెక్ పెట్టేందుకు పెద్దనోట్లు రద్దు చేయాలని కోరారు. మోదీ కూడా రద్దు చేశారు. కానీ మోదీ నిర్ణయం తర్వాత బాబుగారు ఆ ఘనత తమదేనన్నట్లు చాలాసార్లు చెప్పారు. మా నేతలు కూడా అదే చెబుతున్నారు. దానివల్ల తమ చిల్లర కష్టాలకు బాబు-మోదీ కారణమన్న భావన ఏర్పడుతుంది కదా? ఈ ప్రచారానికి ఎంత త్వరగా తెరదించితే పార్టీకి అంత మంచిద’ని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
కాగా, ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న వర్గాలు కూడా చిల్లర సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండటం ప్రస్తావనార్హం. వీరిలో పెన్షనర్లు, డ్వాక్రా సంఘాల మహిళలు, వికలాంగులు, వివిధ పథకాల నుంచి లబ్ధి పొందిన వారూ ఉండటం గమనార్హం. సామాన్య జనాలకు నష్టం లేదని, నల్లకుబేరులకే నష్టమని మోదీ నుంచి వెంకయ్య వరకూ చేస్తున్న వ్యాఖ్యలు మరింత చేటు తెస్తున్నాయి.
2004లో దేశవ్యాప్తంగా కరవు విలయతాండవం చేస్తున్నా భారత్ వెలిగిపోతోందని చేసిన పాజిటివ్ ప్రచారం నెగెటివ్‌గా మారిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి, అందులో కొందరు మరణిస్తున్న వైనాన్ని మీడియాలో చూస్తూ కూడా, సామాన్యులకు ఇబ్బందిలేదని మంత్రులు చేస్తున్న ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి తమ మాదిరిగా క్యూలో నిల్చుంటే ఇబ్బందులున్నాయా? లేవా అని తెలుస్తాయని క్యూలో నిల్చున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉండగా, విద్యార్థులు, విద్యాధికుల్లో మాత్రం ఈ నిర్ణయంపై సానుకూలత వ్యక్తమవుతోంది. సంస్కరణల అమలు తొలిరోజుల్లో కొంత వ్యతిరేకత ఉంటుందంటున్నారు. అయితే, చిన్ననోట్లు చలామణిలో తెచ్చి పెద్దనోట్లు రద్దు చేసి ఉంటే మోదీ-బాబు చరిత్రలో నిలిచిపోయేవారని ఆ రెండు వర్గాలకు చెందినవారు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు పూర్తయ్యేవరకూ కష్టాలు ఉంటాయని మరికొందరు చెబుతున్నారు.
‘మాకు ఫ్లైఓవర్ కట్టాలంటే రోడ్లు మూయించాలి. పక్కన కొన్ని ఇళ్ళు కూడా పోతాయి. అది పూర్తయ్యే వరకూ మాకు నడక ఇబ్బందిగానే ఉంటుంది. అంతమాత్రాన రోడ్డు ఆపేశారని ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఫ్లైఓవర్ ఎలా వస్తుంది’ అని ఓ ప్రభుత్వ లెక్చరర్ వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జనంలో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో బాబు రోజూ సమీక్షలు నిర్వహించి, చిన్ననోట్ల దిగుమతి కోసం ఆర్‌బిఐ, కేంద్రంతో మాట్లాడటం, నోట్లరద్దుపై పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు మధ్య తరగతి, విద్యాధికులకు సంతృప్తి కలిగిస్తున్నట్లు వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి.
‘కనీసం చంద్రబాబు రోజూ మీటింగ్ పెట్టి ఆ పనయినా చేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో అది కూడా చేస్తున్నట్లు మీడియాలో కనిపించడం లేద’ని ఒక ప్రధానోపాధ్యాయురాలు అభిప్రాయపడ్డారు.