S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట:మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం (కోనేరుసెంటరు), నవంబర్ 19: గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. శనివారం మండల పరిధిలోని మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, మేకావానిపాలెం, పోతిరెడ్డిపాలెం, కొత్తపూడి, పొట్లపాలెం, పోతేపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మంగినపూడి గ్రామంలో రూ.4లక్షలతో సిసి రోడ్డు పనులు, మేకావానిపాలెంలో రూ.5లక్షలతో సిసి రోడ్డు పనులు, తవిసిపూడిలో రూ.3లక్షలతో సిసి రోడ్డు పనులు, పోతిరెడ్డిపాలెంలో రూ.9లక్షలతో, పొట్లపాలెంలో రూ.5లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా అత్యధిక పని దినాలు కల్పించి గ్రామాల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్, ఆయా గ్రామాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులతో ఆర్థికస్వావలంభన
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 19: మహిళలు ఉత్పాదకత పెంపొందించే రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థిక స్వాలంభన సాధించాలని జిల్లా సహకార శాఖాధికారి ఎన్‌విఆర్ ఆనంద బాబు కోరారు. 63వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక ఓగీసుపేటలోని కమ్యూనిటీ హాలు వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆనంద బాబు మాట్లాడుతూ మహిళలు సంఘటితమై సహకార శాఖ ద్వారా సహకార సంఘాలుగా ఏర్పడాలన్నారు. సహకార సంఘాలుగా ఏర్పడిన మహిళలకు ప్రభుత్వం రుణాల మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వం నుండి అందే రివాల్వింగ్ ఫండ్‌తో పాటు రుణాలను ప్రాధాన్యతా క్రమంలో తిరిగి చెల్లించాలన్నారు. విలాసాలకు పోకుండా ఉత్పదకత పెంచే చేతి వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో బందరు విభాగ సహకార శాఖాధికారి సిహెచ్ రవి కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయకుమార్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారి ఫణికుమార్, రాష్ట్ర సహకార యూనియన్ ప్రాంతీయ విద్యాధికారి రంగరాజు తదితరులు పాల్గొన్నారు.
28న బందరుకు పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి రాక
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 19: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి ఈ నెల 28వతేదీన జిల్లా కేంద్రం మచిలీపట్నం రానున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ పిసిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో భాగంగా ఆయన బందరుకు రానున్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రజా బ్యాలెట్‌తో పట్టణ పుర వీధుల్లో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఆ తర్వాత కోనేరుసెంటరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రఘువీరారెడ్డితో పాటు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరు కానున్నారు.
ఘనంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
మైలవరం, నవంబర్ 19: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం మూడు రకాలైన అంతర్జాతీయ దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవం, అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలను డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులు సైతం ఆర్థిక, మానశిక సమస్యలతో సతమతమవుతూ అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. సమాజంలో స్ర్తి, పురుషులు కలిసి జీవిస్తేనే సమానత్వం లేకపోతే అసమానత్వంతో బతుకులీడుస్తున్నారన్నారు. స్ర్తిలు తమ బాధలు చెప్పుకుంటున్నారని, కానీ పురుషులు చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక సతమతమవుతున్నాడన్నారు.

పేదరిక నిర్మూలనలో మెప్మా కీలకపాత్ర
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 19: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మున్సిపాల్టీల్లోని నిరుపేద కుటుంబాల పాలిట వెలుగు రేఖగా మారింది. పట్టణ ప్రాంతాల్లో నిరశిస్తున్న పేదల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మార్చడంలో మెప్మా కీలకపాత్ర పోషిస్తోంది. మహిళల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి, అవసరమైతే శిక్షణ ఇప్పించి వారిని సన్నద్ధం చేయడంలో మెప్మా పోషిస్తున్న పాత్ర అనన్య సమాన్యం. ఇలా మెప్మా అందిస్తున్న సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 మున్సిపాల్టీల్లోని లక్షలాది మంది పేద మహిళలు, స్వయం ఉపాధితో ప్రగతి పథంలోకి దూసుకుపోతున్నారు. మెప్మా, ఇలాంటి స్వయం శక్తి సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షా, 82 వేలుంటే, వాటిలో 18 లక్షల మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. 2020 నాటికల్లా వీళ్లందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మెప్మా పని చేస్తోంది. ఈ ఏడాది రెండు లక్షలమంది మహిళలకు జీవనోపాధి కల్పించాలని మెప్మా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం వీరికి రెడువేల 400 కోట్ల రూపాయల రుణాలు కావాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
ఇప్పటికే 43,827 మంది మహిళలకు బ్యాంకుల ద్వారా రూ. 670కోట్ల రుణాలు ఇప్పించి, ఉపాధి కల్పించింది మెప్మా. వచ్చే మార్చి నాటికి మరో లక్షన్నర మందికి ఉపాధి కల్పించాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి రెండు లక్షల మందికి ఉపాధి కల్పించడం సాధ్యమవుతుందని అధికారులు అంచనా వేశారు. సెప్టెంబర్ నెలలో 20,928 మంది మహిళలకు రూ. 254.73 కోట్ల రుణాలిప్పించడం ద్వారా ఉపాధి కల్పించాలని మెప్మా అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కానీ సెప్టెంబర్ ముగిసేనాటికి వివిధ కారణాల రీత్యా 3398 గ్రూపులకు చెందిన 11624 మంది మహిళలకు రూ.128.56 కోట్ల రుణాలు ఇప్పించడం ద్వారా ఉపాధి కల్పించారు. మెప్మా సహకారంతో ఉపాధి పొందుతున్న వాళ్లలో అత్యధికులు కిరాణా, మిల్క్ డైరీ, హోటల్స్, కూరగాయల అమ్మకం వంటి సంప్రదాయ వ్యాపారాలు చేసుకుంటుంటే ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్, స్నాక్స్ మేకింగ్, విర్మికంపోస్ట్, నర్సరీ, ఆటో మొబైల్స్, ఆర్ట్ఫిషియల్ జువెలరీ మేకింగ్, వెదురు బుట్టల అల్లిక, సిమెంట్ ఇటుకల తయారీ వంటి వినూత్న తరహా వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు.

విద్యతో పాటు బాలలకు రక్షణ
పాయకాపురం, నవంబర్ 19: సమాజంలో పిల్లల పరిరక్షణ చాలా ముఖ్యమని, ప్రతి పిల్లవాడికి విద్యతో పాటు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని సబ్ కలెక్టర్ సలోని అన్నారు. సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో జువెలైన్ జస్టిస్ యాక్ట్ 2015 పై జిల్లా స్థాయి వర్క్‌షాపును సంబంధిత అధికారులు, స్వచ్ఛంధ సేవా సంస్థల ప్రతినిధులతో నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన సలోని మాట్లాడుతూ 16 సంవత్సరాలు పైబడిన వయసు బాలల హేయమైన నేరాలకు పాల్పడినప్పుడు జువెలైన్ జస్టిస్ బోర్డు సెక్షన్ 15 ప్రకారం ఆ బాలుడు నేరం చేయటానికి శారీరక, మానసిక, శక్తిని బోర్డు ప్రాథమిక అంచనా వేస్తుందని తెలిపారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ డివిజి అశోక్‌కుమార్ మాట్లాడుతూ దైనందిన జీవితాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఏలా తీర్చిదిద్దుతారో అదే విధంగా సంరక్షణ, రక్షణ అవసరమైన బాలలను కూడా చూడాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ చిన్నతనం నుండి పిల్లలకు చదువుతో పాటు క్రమశిక్షణ పెంచితే చట్టాల అవసరం ఉండదన్నారు. బాలల న్యాయ చట్టం 2015 పై అవగాహన కల్పించడానికి సంబంధిత శాఖలతో పాటు స్వచ్ఛంధ సేవల సహకారం తీసుకుని జిల్లాలో ఆదరణ, రక్షణాపరంగా అవసరమైన బాలలకు ఆసరాగా ఉండే విధంగా పని చేయటం జరుగుతుందని జిల్లా స్ర్తి, శిశు సంక్షేమ అధికారిణి కె.కృష్ణకుమారి తెలిపారు.