S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సర్వోన్నత ‘వివాదం’..

వివాదాలను పరిష్కరించవలసిన వ్యవస్థ వివాదగ్రస్తం కావడం విచిత్రమైన పరిణామం. వివాదం అంకురించడానికి కారణం ఎవరు? ప్రాతిపదిక ఏమిటి? అన్న సందేహాలకు సరైన సమాధానం దొరకకపోవడం మరో విచిత్రం. ఉన్నత న్యాయమూర్తులు- హైకోర్ట్ జడ్జెస్-గా నియుక్తికోసం సర్వోన్నత న్యాయస్థానం ‘వరణ మండలి’- కాలేజియమ్- ఎంపిక చేసిన నలబయి ముగ్గురు అభ్యర్థులను ఈ పదవులకు నియమించడానికి కేంద్ర మంత్రివర్గం అంగీకరించకపోవడం వివాదానికి మొదటి దశ... నవంబర్ పదకొండవ తేదీన కేంద్ర మంత్రివర్గం ఈ అభ్యర్థులను ఉన్నత న్యాయమూర్తులుగా నియమించడానికి వీలుకాదని సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ థాకుర్ అధ్యక్షతన సమావేశమై ఉండిన ధర్మాసనానికి నివేదించింది! ఈ అభ్యర్థుల అర్హతల గురించి మళ్లీ పరిశీలించాలన్న కేంద్ర మంత్రివర్గం వారి నివేదన! వారం రోజులు తిరగకముందే ‘కాలేజియమ్’వారు సమీక్షను పూర్తిచేశారు. తాము ఎంపిక చేసిన నలబయి ముగ్గురినీ ఉన్నత న్యాయమూర్తులుగా నియమించి తీరాలన్నది సమీక్ష సారాంశం! ‘వరణ మండలి’ నిర్ణయాన్ని పద్దెనిమిదవ తేదీన సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వ న్యాయప్రతినిధి- అటార్నీ జనరల్- ముకుల్ రోహత్గీకి తెలియచేయడం వివాదంలోని రెండవ ఘట్టం! సుప్రీంకోర్టు ‘వరణ మండలి’వారు ఇలా పునరుద్ఘాటించిన నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం అంగీకరించి తీరాలన్న నిబంధన గురించి స్పష్టత రాకపోవడం వివాదంలోని రెండవ ఘట్టం! ప్రస్తుతం అమలులో ఉన్న ‘నియామక ప్రక్రియ’- మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్- ఎమ్‌ఓపి- ప్రకారం ‘సర్వోన్నత వరణ మండలి’ నిర్ణయాన్ని నిరాకరించే అవకాశం కేంద్ర మంత్రివర్గానికి ఉంది. కానీ ఈ ‘నిరాకరణ’ను ‘వరణ మండలి’ అంగీకరించవచ్చు, నిరాకరించవచ్చు. రెండవసారి ‘వరణ మండలి’ చేసిన నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించి తీరాలి, ‘వరణ మండలి’ రెండవసారి నిర్ధారించిన అభ్యర్థులను ఉన్నత న్యాయమూర్తులుగా నియమించాలని రాష్టప్రతికి నివేదించాలి! ఇప్పుడు ఈ నలబయి ముగ్గురినీ ‘వరణ మండలి’ మళ్లీ నిర్ధారించింది. అందువల్ల కేంద్ర మంత్రివర్గం ఆమోదించక తప్పదు. కానీ ప్రస్తుతం అమలులోఉన్న ‘నియామక ప్రక్రియ’- ఎమ్‌ఓపి-ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిందట! కొత్త ‘నియామక ప్రక్రియ’ను కేంద్ర మంత్రివర్గం, ‘సర్వోన్నత వరణ మండలి’ ఉమ్మడిగా రూపొందించవలసి ఉంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నూతన ‘ప్రక్రియ’ పత్రాన్ని ప్రస్తుతం ‘వరణ మండలి’ పరిశీలిస్తోంది! నూతన నియామక ప్రక్రియ గురించి గత ఆగస్టు మూడవ తేదీన రోహత్గీ ప్రస్తావించాడట! సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకోనున్నట్టు ‘కాలేజియమ్’ రోహత్గీకి తెలిపిందట! కానీ ఇంతవరకు నూతన ‘నియామక ప్రక్రియ’ను సర్వోన్నత వరణ మండలి ఆమోదించలేదు, తిరస్కరించలేదు! ఇదీ నూతన వివాద భూమిక!
పదకొండవ తేదీన కేంద్ర మంత్రివర్గం నివేదించిన ‘నిరాకరణ’ నిర్ణయాన్ని వారం రోజులలోనే ‘వరణ మండలి’ సమీక్షించింది, నిరాకరించింది. వేగవంతమవుతున్న న్యాయ ప్రక్రియకు ఇది నిదర్శనం. కానీ ఆగస్టు నెలలోనే కేంద్ర మంత్రివర్గం రూపొందించి నివేదించిన కొత్త ‘ఎమ్‌ఓపి’ని పరిశీలించడంలో మాత్రం ‘వరణ మండలి’వారు ఈ వేగాన్ని ప్రదర్శించడం లేదు. కొత్త ‘నియామక ప్రక్రియ’ స్వరూప స్వభావాలు ఏమిటో స్పష్టమైన తరువాతనే ఈ 43 మంది అభ్యర్థులను నియమించి తీరవలసిందేనని ‘వరణ మండలి’ నిర్దేశించి ఉంటే వివాదం అంతటితో సమసిపోయేది. అలా జరుగలేదు. అందువల్ల ‘నూతన నియామక ప్రక్రియ’ ఏర్పడేవరకూ ఎదురుచూస్తూ కూర్చొనడానికి కేంద్ర మంత్రివర్గానికి వెసలు ఏర్పడింది! పాత ‘నియామక ప్రక్రియ’ను పాటించి తీరాలా? కొత్త ప్రక్రియకోసం వేచి ఉండాలా? అన్నది మళ్లీ మొదలయిపోయిన మీమాంస... తాము ప్రతిపాదించి ఎంపిక చేసిన డెబ్బయి ఏడుగురు అభ్యర్థులను హైకోర్టుల న్యాయమూర్తులుగా నియమించకుండా కేంద్ర మంత్రివర్గం జాప్యంచేయడం పట్ల ‘సర్వోన్నత వరణ మండలి’ న్యాయమూర్తులు అనేకసార్లు నిరసనలు తెలిపారు. ‘‘న్యాయ వ్యవస్థను స్తంభింపచేయడానికి ప్రయత్నించవద్దని’’ ఆగస్టు 12వ తేదీన ప్రధాన న్యాయమూర్తి కేంద్ర మంత్రివర్గాన్ని హెచ్చరించారు. తమను ఒక మూలకు నెట్టినట్టయితే కేంద్ర మంత్రివర్గంతో సంఘర్షణ సాగించడానికి సైతం సంశయించబోమని రోహత్గీకి సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు కూడ.....
కేంద్ర ప్రభుత్వం ‘నియామకాల’ బదిలీల విషయంలో జాప్యం చేస్తుండడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలోనే గత ఏప్రిల్‌లో జరిగిన ఒక సదస్సులో సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ థాకుర్ తీవ్రంగా నిరసించి ఉన్నారు! ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో ఏప్రిల్ 24న జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ప్రధాన మంత్రి సమక్షంలో చేసిన విమర్శలు ప్రకంపనాలను సృష్టించాయ. తాము, హైకోర్టు జడ్జీలుగా నియమించడానికై నూటడెబ్బయి మంది అభ్యర్థుల జాబితాను సమర్పించిన తరువాత రెండు నెలలు గడిచిపోయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల థాకుర్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ ఏప్రిల్ నాటి సదస్సులో ప్రధాన న్యాయమూర్తి కంట తడిపెట్టుకొనడం దేశ ప్రజలను కలవరపరచిన పరిణామం! నియామకాలు సకాలంలో జరగకపోవడంవల్ల, పదవులలో ఉన్న న్యాయమూర్తులకు పనిభారం విపరీతంగా పెరిగిందని న్యాయస్థానాలలో వివాదాలు అపరిష్కృతంగా పేరుకొనిపోతున్నాయని ఆయన ఆవేదనను వ్యక్తంచేసి ఉన్నారు.... ప్రభుత్వం ఎందుకని జాప్యంచేసిందన్నది సమాధానం లేని సమస్య! కానీ ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన ‘నియామక ప్రక్రియ’- మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్-ను సర్వోన్నత వరణ మండలి వారు మూడున్నర నెలలుగా ఎందుకని పరిశీలించడంలేదన్న ప్రశ్నకు కూడ సమాధానం లేదు! ‘సర్వోన్నత వరణ’ మండలి నవంబర్ 18న ఎలాంటి సమాధానం చెప్పలేదు! ఉన్నత, సర్వోన్నత న్యాయమూర్తులు వివాదగ్రస్తులు కాకుండా ఉండడం దేశ హిత సాధనకు మార్గం. కానీ ఇటీవల కాలంలో అనేకమంది ఉన్నత న్యాయమూర్తులు వివిధ వివాదాలకు గురిఅయ్యారు. తీవ్రమైన అవినీతికి పాల్పడినట్టు అభియోగాలకు గురై పదవులను కోల్పోయినవారు కూడా ఉన్నారు. కానీ నియామకాల విషయంలోనే ఇప్పుడు ఇలా పెద్ద వివాదం మొదలుకావడం రాజ్యాంగ చరిత్రలోనే అపూర్వమైన విపరిణామం.
శాసన నిర్మాణశాఖ- లెజిస్లేచర్-, కార్య నిర్వహణ శాఖ- మంత్రివర్గం ఎక్జ్‌క్యూటివ్-, న్యాయస్థానాలు- జ్యుడిషియరీ-, మన ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలోని మూడు స్వతంత్ర విభాగాలు! కానీ రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించిన సందేహాలను తీర్చవలసింది న్యాయ వ్యవస్థ! రాజ్యాంగంలో 142వ అధికరణం, 143వ అధికరణం ఈ సంగతిని స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. అందువల్ల అన్ని రాజ్యాంగ వ్యవహారాలలోను సుప్రీంకోర్టు మాట తుది మాట! అందరికీ అది శిరోధార్యం... కానీ ఈ తుది మాట వివాదగ్రస్తం అయినప్పుడు ఎవరు నిర్ణయించాలి?? అలాంటి స్థితి ఇప్పుడు ఏర్పడిపోయిందా??