S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సృష్టిలో జ్ఞానం అనంతం

ధారూర్, నవంబర్ 20: సృష్టిలో జ్ఞానం అనంతమైనదని, ఎంత చదివినా పొందాల్సిన జ్ఞానం మిగిలే ఉంటుందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రపంచాన్ని జయించాలంటే పుస్తకాలు చదవాలని సూచించారు. మారుతున్న కాలానికనుగుణంగా గ్రంథాలయాల్లో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో మార్పు వస్తేనే దేశానికి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పాఠశాలల్లోనూ గ్రంథాలయాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫేస్‌బుక్, వాట్సప్‌లతో పాటు పుస్తకాలు చదవాలని పేర్కొన్నారు. గ్రంథాలయ సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు, పుస్తకాలను పెంచాలని, ఉన్న పుస్తకాలను కాపాడాలని పిలుపునిచ్చారు. భవనాలు, సిబ్బంది, పుస్తకాల సమస్యలను అవకాశం ఉంటే జిల్లా పరిషత్ నిధులతో పరిష్కరిస్తామని అన్నారు. డబ్బులు లేకుండా చేసే పనులు ఎన్నో ఉన్నాయని, హరితహారంపై దృష్టి పెట్టాలని, వర్షాలు కురిసినందున నాటిన 40 లక్షల మొక్కలు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. హరితహారంపై విద్యార్థుల నృత్యరూపకం బాగుందని కితాబిచ్చారు. వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవి విద్యార్థులు ఐఎఎస్, ఐపిఎస్, ఉన్నతాధికారులుగా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ డిజిటలైజేషన్ అయినా సిబ్బంది కొరత కారణంగా సేవలు అందడంలేదని, సిబ్బంది నియామకం విషయాన్ని అసెంబ్లీలో సిఎం, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ ప్రొటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులను అవమాన పరుస్తున్నారని, పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు మహ్మద్ హఫీజ్ మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా చైర్మన్‌గా పనిచేసిన తనకు సిబ్బంది సహకరించారని తెలిపారు. నలుగురు ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వికారాబాద్ జడ్పీటిసి ముత్తార్‌షరీఫ్, మార్కెట్ కమిటి చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్.శుభప్రద్‌పటేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.మనోజ్‌కుమార్, లైబ్రేరియన్లు లక్ష్మప్ప, అంజయ్యలు పాల్గొన్నారు. వారోత్సవాల సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలైనవారికి అతిథులు బహుమతులు అందజేశారు.