S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెన్షన్ల కోసం ‘పండుటాకులు’ విలవిల

నిజామాబాద్, నవంబర్ 20: ఆదుకునే వారు లేక దుర్భర స్థితిలో జీవనాలు గడుపుతున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటు రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్లు శ్రమించే బీడీ కార్మికులు అనేక మంది అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా పెన్షన్లకు నోచుకోవడం లేదు. అధికారులకు అర్జీలు అందజేసి నెలలు గడుస్తున్నా, తమకు మంజూరీలు లభించడం లేదని వాపోతున్నారు. మరోవైపు ఇప్పటికే మంజూరీలు ఇచ్చిన వారిలో అనర్హులను గుర్తిస్తూ ప్రభుత్వం ఆఘమేఘాల మీద వారి పెన్షన్లను రద్దు చేస్తోంది. జిల్లాలో సుమారు 11వేల పైచిలుకు పెన్షన్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఇది సమంజసమే అయినప్పటికీ, అదే స్థాయిలో అర్హులైన వారికి వెంటదివెంట పెన్షన్లను మంజూరు చేయడంలో మాత్రం చొరవ చూపడకుండా ఎడతెగని జాప్యం జరుగుతోంది. గత రెండేళ్ల క్రితం ఇదే నవంబర్ మాసంలో 8వ తేదీన ఆసరా పెన్షన్ల పథకానికి తెరాస ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వృద్ధాప్య, వితంతు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు నెలకు 1000రూపాయలు, వికలాంగులకు 1500రూపాయల చొప్పున పెన్షన్‌ను అందిస్తున్నారు. అదేవిధంగా 2015 మార్చి మాసం నుండి బీడీ కార్మికులకు జీవన భృతి కింద వేయి రూపాయలను పంపిణీ చేస్తున్నారు. ఆసరా పథకం కింద నిజామాబాద్, కామారెడ్డిలతో కూడిన ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,63,359మంది లబ్ధిదారులకు ప్రతీ నెల 28.12కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో అందిస్తున్నారు. వీరితో పాటు మరో లక్షా 6వేల మంది బీడీ కార్మికులకు, 3647మంది ఎయిడ్స్ బాధితులకు వేయి రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారు. పెన్షన్లు పొందుతున్న వారిలో వృద్ధులు 1,12,705మంది ఉండగా, వితంతువులు 1,12,487మంది, వికలాంగులు 35,682, చేనేత కార్మికులు 824, గీత కార్మికులు 1661మంది ఉన్నారు. వీరికి బయోమెట్రిక్ ఆధారంగా పెన్షన్లు అందజేస్తుండగా, ఇంకనూ అనేక మంది పెన్షన్ల కోసం నెలల తరబడి ఎదురుతెన్నులు చూస్తున్నారు.
సుమారు 45వేల పైచిలుకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పెన్షన్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నప్పటికీ, ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టిన సమయంలో మంజూరీల పట్ల చూపిన చొరవ, వేగం ప్రస్తుతం అధికారుల్లో కనిపించడం లేదు. ఫలితంగా అర్హులైన వారి దరఖాస్తులను సైతం పరిశీలన జరుపకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. తమకు త్వరితగతిన మంజూరీలు తెలుపని కారణంగా నెలనెలా వచ్చే పెన్షన్ మొత్తాలను కోల్పోవాల్సి వస్తోందని అర్హులైన వారు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. మరోవైపు ఇదివరకు అందించిన వాటి కంటే ఇప్పటికే ఎంతో ఎక్కువ సంఖ్యలో పెన్షన్‌లు మంజూరు చేశామని, ఎలాంటి సీలింగ్ లేనందున అర్హులైన వారందరికీ తప్పనిసరిగా పెన్షన్‌లు మంజూరు చేస్తూనే ఉంటామని అధికార పార్టీ నేతలు ఊరడింపు వచనాలు పలుకుతున్నారు. క్షేత్ర స్థాయిలో చూస్తే మాత్రం మంజూరీల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు ఇట్టే స్పష్టమవుతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అందుతున్న ఫిర్యాదుల్లో సింహ భాగం పెన్షన్ల మంజూరీ కోసమే దాఖలవుతున్నాయి. ఇక ఆయా మండలాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు పెన్షన్లు కోరుతూ అనునిత్యం మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి నుండి అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు, అరకొర మందికి మంజూరీలు తెలిపి మిగతా అర్హులైన వారందరికీ ఏదో ఒక సాకు చెప్పి కాలయాపనతోనే సరి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుల్లా పండుటాకులు తమ పట్ల కనికరం చూపాలంటూ ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, అధికారుల కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడుతున్నారు. ప్రత్యేకించి అరవై ఏళ్ల వయస్సు పైబడి నా అనేవారెవరూ లేని వేలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ల కోసం ఎంతో ఆతృతతో ఎదురుతెన్నులు చూస్తున్నారు. వార్దాక్యంలోనూ అనునిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమకు పెన్షన్ మంజూరు చేయాలంటూ అధికారులను బ్రతిమాలుతున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి. వీరి అర్జీలను త్వరితగతిన పరిశీలన జరిపి, నిబంధనలకు లోబడి అర్హులు ఉంటే వారికి వెంటనే మంజూరీలు తెలిపితే వృద్ధులు, వికలాంగులు అనునిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే శ్రమ తప్పి, వారికి ఎంతోకొంత ఆర్థిక వెసులుబాటు కల్పించినట్లవుతుంది.