S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెరిగిన భూగర్భ జలాలు

కడప, నవంబర్ 20: కరవుపీడిత జిల్లాలో కోనేటి గుంతలు, పంట కుంటలు సత్పలితాలు ఇచ్చి కొంతమేరకు రైతులకు ఊపిరినిచ్చింది. గతంలోకంటే ప్రస్తుతం కోనేటి గుంతలు, పంటకుంటలు ఏర్పాటుచేయడంతో వాటిద్వారా భూగర్భజలాలు పెరిగి వాటి కింద ఉన్న వేలాది గొట్టపుబావులకు నీటి మట్టం పెరిగి రైతులను కొంతమేరకు ఆదుకుంటున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 12వేల పంటకుంటలు, దాదాపు 2వేల కోనేటి గుంతలు తవ్వారు. పంట కుంటలకు రూ.150కోట్లు, కోనేటి గుంతలకు రూ.50కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. వరుస కరువులతో కోలుకోలేని రైతాంగానికి ఖరీఫ్‌లో వర్షాలు కురవక పంటల దిగుబడి రాకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. గత కొనే్నళ్లలో అరకొర కురిసిన వర్షాలకు కోనేటి గుంతలు, పంట కుంటల్లో వర్షనీరు నిలిచింది. దీంతో గొట్టపుబావుల్లో నీటిమట్టం పెరగడంతో వరిసాగుతోపాటు ఆరుతడి పంటలు వేసుకుని పండ్లతోటల రైతులకు ఉపయోగపడుతున్నాయి. జిల్లాలో 2100గొట్టపు బావులుండగా, వాటికి సమీపంలో పంటకుంటలు, కోనేటి గుంతల తవ్వకంతో ప్రస్తుతం వారి ప్రాంతాల్లో 300 అడుగులు కూడా నీరు అందుతోంది. గతంలో 500 నుంచి 700 అడుగుల్లో గొట్టపుబావులు తవ్వినా నీరు అందేదికాదు. జిల్లా నీటి యాజమాన్యసంస్థ ద్వారా ప్రభుత్వం 76.664 పంటకుంటలు మంజూరయ్యాయి. అలాగే నీటి కుంటలు, కోనేటి గుంతలు 2వేలు పైబడి ఉద్యానవనశాఖ కింద తవ్వారు. గొట్టపు బావుల్లో భూగర్భజలాలు పెరిగేందుకు కోనేటి గుంతలేనని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా 25వేల ఎకరాల్లో చీనీ తోటలు, 20వేల ఎకరాల్లో బొప్పాయి, మామిడి, జామ, 15వేల ఎకరాల్లో అరటితోటలు సాగుచేసుకున్నారు. అయితే పంటకారు రైతులకు నీరు కొంతమేరకు కొరతగా ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్లనే నీరు పుష్కలంగా లభించడం లేదు. జిల్లాలో 31 మండలాల్లో 207 మైక్రో వాటర్ షెడ్ల ద్వారా భూగర్భజలాలు పెంపొందించేందుకు జిల్లా నీటి యాజమాన్యసంస్థ చర్యలు తీసుకుంది. జిల్లా నుంచి పండ్లతోటల రైతులు ప్రతినెలా కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రూ.200 నుంచి రూ.300కోట్లు విలువచేసే పండ్లను ఎగుమతి చేసుకుంటున్నారు. రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి ప్రాంతాల్లో పండ్ల తోటలసాగు అధికంగా ఉంది. ప్రస్తుతం పులివెందుల, రాయచోటి ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడి రైతాంగం అనేక అవస్థలుపడుతున్నారు. రెయిన్‌గన్స్ ద్వారా స్పింక్లర్లు, డ్రిప్ ద్వారా , వాటర్ ట్యాంకుల ద్వారా నీటి తీరువాకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం మీద కోనేటి గుంతలు, పంట కుంటలు ద్వారా భూగర్భజలాలు పెరిగి కొంతమేరకు జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటున్నాయి.

వసతి గృహాల్లో పిల్లల పట్ల
జాగ్రత్తలు పాటించాలి

కడప,నవంబర్ 20: ప్రభుత్వపాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యంలో లోపాలు ఉంటే వైద్య సేవలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దేశజనాభా 120కోట్లలో మగవారు ఎక్కువగా , ఆడవారు తక్కువగా ఉన్నారన్నారు. ఇందులో 39శాతం పిల్లలు ఉన్నారని వీరు అత్యధికంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నారన్నారు. వెయ్యిమంది మగ పిల్లలు ఉంటే 918 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారన్నారు.కడప జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఆడపిల్లల సంఖ్య పెరిగితేనే దేశాభివృద్ధి చెందుతుందన్నారు. పిల్లల్లో తప్పనిసరిగా విద్యాహక్కు చట్టం అమలు చేయాలని బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించి బాల కార్మికుల వ్యవస్థలేని సమాజాన్ని సృష్టించాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా స్ర్తిశిశు సంక్షేమశాఖ అధికారి రాఘవరావు మాట్లాడుతూ స్ర్తి శిశు సంక్షేమశాఖ ద్వారా బాలసదన్‌లు నిర్వహిస్తున్నామని, పిల్లలకు ఎక్కడైనా సమస్యలుంటే 1098నెంబర్‌కు ఫోన్ చేయాలని శాఖాధికారులు, స్వచ్చంధ సంస్థలు స్పందించి సమస్యను పరిష్కరిస్తాయన్నారు. ఈకార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

పెద్దనోట్ల రద్దుతో విలవిల్లాడుతున్న రైతన్నలు

కమలాపురం, నవంబర్ 20: కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దుతో రైతన్నలు విలవిలలాడుతున్నారని జిల్లా వైసిపి రైతు విభాగం నేత పుత్తా ప్రసాదరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు ఒకవైపు, వర్షాభావ పరిస్థితి మరోవైపు, రైతన్నను కోలుకోలేని పరిస్థితిలో పడేశాయన్నారు. దీంతో అన్నధాతల బతుకులు చితికిపోతున్నాయన్నారు. అసలే ఖరీఫ్‌సీజన్‌లో పూర్తిగా పంటసాగుకాక ఇబ్బందిపడగా, ఈ రబీసీజన్‌లో ఇప్పటివరకు వర్షం కురువకపోవడంతో అప్పులుచేసి, విత్తనాలు తెచ్చుకున్న రైతన్న వాటిని ఇంటిలోనే పెట్టుకుని కుమిలిపోతున్నారన్నారు. అసలే సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగం ఈ ఏడాది మరింత దారుణమైందన్నారు. సాగునే నమ్ముకుని జీవిస్తున్న అధికశాతం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసారు. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం అన్నదాతలపాలిట శాపంగా మారిందన్నారు. ఇక వ్యవసాయ కూలీల పరిస్థితి చాలాదారుణంగా తయారైందన్నారు. కూలి పనులకు వెళ్లేవారికి చిల్లరనోట్లు ఇచ్చేందుకు లేకపోవడంతో వారికి కూడా అప్పులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రబీసీజన్ ప్రారంభమై ఒకటిన్నర నెల అయినప్పటికీ బ్యాంకుల్లో ఈ పెద్దనోట్లు రద్దు కారణంగా రుణాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. అంతేకాక సహకార బ్యాంకుల్లో ఎలాంటి నోట్ల కార్యకలాపాలు లేకపోవడంతో సొసైటీల ద్వారా రుణాలుపొందే రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. జిల్లాలో మరికొన్నిచోట్ల రైతుల వద్ద అవసరమైన నగదు లేకపోవడంతో పంటకోతలు కూడా కొంతమేర ఆలస్యం చేస్తున్నారని దీంతో అటు రైతులకు, ఇటు కూలీలకు ఇక్కట్లు తప్పడం లేదన్నారు. అంతేకాక ఎరువులు, పురుగుల మందుల వ్యాపారులు పెద్దనోట్ల ప్రభావంతో అప్పులిచ్చేందుకు ఒప్పుకోవడం లేదని అన్నారు. ప్రధానమంత్రి బీమా పధకానికి సంబందించి బ్యాంకుల్లో రైతులు పంటలకు సంబందించిన ఫ్రీమియం కూడాచెల్లించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. మొత్తంపైన కేంద్రం తీసుకున్న అనాలోచిత చర్యవల్ల రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టకపోతే అన్నధాతలు కూలీలుగా కూడా పనికిరాకుండా పోతారని ఆందోళన వ్యక్తం చేసారు.
నోట్ల రద్దుతో చిరువ్యాపారులు
సతమతం
కమలాపురం, నవంబర్ 20: రు. 1000,రు.500ల పెద్దనోట్ల రద్దుతో చిరువ్యాపారులు సతమతమవుతున్నారు. వ్యాపారం జరిగితే కాని జీవనం కొనసాగని వారి పరిస్థితి రోజురోజుకు తీవ్ర ఆందోళనకరంగా మారుతోంది. కూలీనుంచి ఆటో కార్మికుని వరకు అన్నంపెట్టే అన్నధాత నుంచి వ్యవసాయకూలీల వరకు అష్టకష్టాలు పడుతున్నారు. బేల్దారి కార్మికులు కూడా పనులులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 300ల నుంచి 400 వరకు కూలీ పొందే వీరు, భవన యజమానులు, చిల్లర నోట్లులేక పనులు నిలిపివేయడంతో అవస్థల పాలవుతున్నారు. వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇలా ఉండగా కార్తీకమాసంలో అయ్యప్ప, శివ, గోవింద మాలాదీక్షాపరులు కూడా పెద్దనోట్లు మారకపోవడంతో చాలామంది ఈ మారు దీక్షలను వాయిదా వేసుకున్నారు.దీక్షపరులతో రోజూ కిటకిటలాగే పండ్ల,పూలవ్యాపారాలు లేక వెలవెలపోతున్నాయి. దీంతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నా యని పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము అప్పుల పాలుకాక తప్పదని అందోళన వ్యక్తం చేస్తున్నారు.
నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య
రాజంపేట, నవంబర్ 20: దేశంలో పెద్దనోట్ల రద్దుచేయడం, అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోవడం పిచ్చి తుగ్లక్ చర్యగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అభివర్ణించారు. ఆదివారం రాజంపేటకు విచ్చేసిన ఆయన రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెనిగలపాటి సుబ్రమణ్యంనాయుడు ఇంట్లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 14వ శతాబ్దంలో మహ్మద్‌బిన్ తుగ్లక్ ఇలాగే కరెన్సీ రద్దు ప్రయోగాలు చేసి తన పదవినే కోల్పోయారన్నారు. సామ్రాజ్యం అంతరించి చరిత్రలో పిచ్చి తుగ్లక్‌గా సార్థకనామం అయిందని నేడు అదే పరిస్థితి ప్రధాని నరేంద్రమోడికి దాపురించిందన్నారు. ముందుచూపు లేక రాజకీయ లబ్దికోసం చేసిన చర్యయని ఆయన విమర్శించారు. మోడి వదిలినబాణం గురి తప్పిందని పెద్దలకు తగలాల్సిన బాణం పేద ప్రజలకు తగిలి పర్యవసానంగా దేశంలో 55 మంది మృతికి కారణమైందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కొత్తకాదని, వివిధ దేశాలలో రద్దు జరిగినా ఎక్కడా సామాన్యులు ఇబ్బందులు పడలేదని ఆయన అన్నారు. మనదేశంలో 1946, 1978లో కూడా నోట్ల రద్దు జరిగిందన్నారు. 1946లో దేశంలో మొత్తం కరెన్సీ రూ. 1235 కోట్లు కాగా అందులో రద్దు నోట్లు రూ. 143 కోట్లు అని వాటిలో 11.50 శాతం పెద్దనోట్లు కాగా 88.50 చిన్ననోట్లు ఉన్నాయన్నారు. 1978లో జనతా ప్రభుత్వం వెయ్యి, 5 వేలు, 10 వేల పెద్ద కరెన్సీ నోట్లను రద్దుచేసిందని, అపుడు దేశంలో మ్తొతం కరెన్సీ రూ. 9152 కోట్లు అని, రద్దైన పెద్దనోట్ల విలువ రూ. 146 కోట్లు కాగా మొత్తం కరెన్సీ విలువలో 1.6 శాతం రద్దు అయ్యాయన్నారు. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం కరెన్సీ నోట్లు రూ. 16.96 కోట్లు ఉండగా ఇందులో పెద్దనోట్లు రూ. 14.95 లక్షల విలువ ఉందన్నారు. పెద్దనోట్లు 86 శాతం ఉండగా, చిన్ననోట్లు 14 శాతం మాత్రమే ఉండడంతో సమస్య ఇక్కడ వచ్చిందని తులసిరెడ్డి తెలిపారు. రద్దుఅయిన కరెన్సీ స్థానంలో కొత్తనోట్లను దేశంలోని మైసూరు, సాల్బాణి, డివిస్, నాసిక్‌లలో 7 నెలల పాటు ముద్రిస్తే రద్దు అయిన నోట్ల విలువకు సమానంగా ముద్రించలేరన్నారు. ఈ నాలుగు ముద్రణాలయాల ముద్రణా సామర్థ్యం రోజుకు రూ. 300 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని ప్రత్యామ్నాయం ఆలోచించక పోవడంవల్లే నేడు దేశవ్యాప్తంగా భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దీనివలన ప్రజా జీవితం అల్లకోల్లోలం అయిందని, వ్యాపారులు, వ్యవసాయ రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పడిపోయాయని తద్వారా అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడి బాణం గురితప్పడంతో నల్లకుబేరులపై పడాల్సిన బాణం పేద ప్రజలు, గృహిణులతో పాటు అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగం సతీష్‌కుమార్ , పి.సుబ్రమణ్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

చినుకు రాలదు.. చింత తీరదు...!
చాపాడు, నవంబర్ 20: జిల్లాలో వర్షం జాడ లేకపోవడంతో రైతుల చింత తీరడం లేదు. రబీ పంటలసాగుకు రైతులు వర్షం కోసం ఎదురుచూసినా చినుకు జాడే లేకపోవడంతో రబీ పంటలసాగు ప్రశ్నార్థకంగా మారింది. మెట్ట ప్రాంతాల్లో శనగ, దణియాలు, కుసుమ, పొద్దుతిరుగుడు, జొన్న వంటి పంటలను సాగుచేయాలని రైతులు సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ మొదటివారం నుంచి నేటి వరకు ఎక్కడేగానీ తగిన వర్షపాతం లేకపోవడంతో రైతులు వర్షం కోసం వెయ్యికళ్లతో ఎదురుచూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ముందుగానే పంటభూముల్లో వేలాదిరూపాయలు ఖర్చుచేసి సత్తువలను విత్తుకోవడం జరిగింది. సకాలంలో వర్షం లేకపోవడం వలన విత్తిన సత్తువలు ఆవిరైపోతున్నాయనే ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో నెలరోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంటలు విస్తారంగా సాగు కాగా ఈ ఏడాది అందుకు భిన్నంగా వరుణదేవుడు ముఖం చాటేయడంతో ఎక్కడేగానీ ఒక్క విత్తనం కూడా భూమిలో పడకపోవడం అందరినీ బాధిస్తోంది. ఖరీఫ్‌లో అంతంతమాత్రంగా సాగైన పంటలకు చివరిలో తగిన వర్షాలు లేకపోవడం వలన ఆ పంటలు కూడా చేతికందక రైతులు నిండా నష్టాల్లో మునిగిపోయారు. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం జరిగింది. రబీలోనైనా వరుణదేవుడు కరుణిస్తే అప్పుల్లో ఉన్న తమ బ్రతుకులు బాగుపడుతాయని ఆశించిన రైతాంగానికి నిరాశే ఎదురవుతోంది. రెండురోజులుగా చాపాడు, మైదుకూరు, ఖాజీపేట, చెన్నూరు, కడప, రాజంపేట, పుల్లంపేట, రైల్వేకోడూరు ప్రాంతాలలో తేలికపాటి చినుకులు రాలినప్పటికీ భూములు పదునెక్కలేదని రైతులు పేర్కొంటున్నారు. ఫలితంగా పంటలసాగుకు ఏమాత్రం ఆ వర్షం అనుకూలించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక పడమటి భాగంలోని ప్రొద్దుటూరు, రాజుపాళెం, జమ్మలమడుగు, పులివెందుల, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం తదితర ప్రాంతాల్లో వర్షం జాడే లేకపోవడంతో ఆ ప్రాంతపు రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూడడం తప్ప వర్షంపై వారి ఆశలు చావడం లేదు. నవంబర్‌నెల చివరలోనైనా వర్షాలు కురుస్తాయని ఆశిస్తూ రైతులు కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను రైతులకు అందివ్వగా మరికొంతమంది రైతులు ప్రైవేటుగా ఇతర ప్రాంతాల నుంచి విత్తనాలను సేకరించి పంటసాగుకు సంసిద్ధంగా ఉన్నా వరుణదేవుడు కరుణించకపోవడంతో ఎదురుచూడడం తప్ప చేసేదేమీ లేక అన్నదాత దిగాలుగా ఉన్నారు. ఏది ఏమైనా గత ఏడాది కంటే ఈసారి వర్షాలు తక్కువగా కురవడంతో ఒకపక్క కరువు ఛాయలు పూర్తిగా కమ్ముకుంటున్నాయి. అందుకనుగుణంగా ప్రభుత్వం కరువు మండలాలను గుర్తించి ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ప్రయత్నాలు చేస్తున్నా రైతులకు మాత్రం అవేవీ రుచించడం లేదు.
పల్లెపల్లెకూ విస్తరిస్తున్న ఎయిడ్స్!
సుండుపల్లె, నవంబర్ 20: మంచీ చెడులను ఆలోచించలేని క్షణికావేశం ప్రాణాలను బలిగొంటున్నది. పేదరికం వలన స్వీకరించిన కడుపు వృత్తి మరెంతో కాలం భూమిమీద నిలువ నీడాలేకుండా చేస్తోంది. మితిమీరిన శృంగారం, హద్దు మీరిన భోగలాలతత్వానికి భారీగానే జీవితం అనే మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఆశ, నిరాశల మధ్య ఊగిసలాడే జీవచ్ఛవాలను నరకాన్ని చూపిస్తూ తన జోలికి వస్తే మరణం తప్పితే మరో మార్గం లేదని శాసించేది ప్రపంచాన్ని గడగడలాడించే ఏకైక మహమ్మారి ఎయిడ్స్. ఎక్కడో పాశ్చాత్య దేశాలలో జీవం పోసుకున్న మందులేని ఈ భయంకరమైన మహమ్మారి వ్యాధి మన దేశంలోని అన్ని పల్లెలకు ఎగబాగుతోంది. నగరాలు, పట్టణాలు దాటుకొని పైరు పంటలతో సాయం, సంధ్య వేళల్లో పక్షుల కిలకిల రాగాలతో ప్రశాంతతకు మారుపేరైన పల్లెసీమలకు ఎయిడ్స్ వ్యాధి వ్యాపించడం ఆందోళన కలిగించే విషయం. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం అన్న నినాదం నేడు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద ప్రైవేటు సంస్థల సభలు, సమావేశాలలో సైతం ఈ రకమైన వివాదాలు చోటు చేసుకోవడం ఎయిడ్స్ వ్యాధి విశ్వరూపాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రపంచం, దేశం, రాష్ట్రం, కడప జిల్లా ఎయిడ్స్ వ్యాధితో గడగడలాడుతోంది. ఇటీవల వ్యాధి లక్షణాలు ఉన్న వారు అధిక సంఖ్యలో భయపడుతున్న నేపథ్యంలో మరికొంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మండల కేంద్రమైన సుండుపల్లెతో పాటు వానరాచపల్లె బిడికి, కొలిమిమిట్ట, చిన్నబిడికి, పెద్దబిడికి, మాచిరెడ్డిగారిపల్లె, వివి బిడికి, పరికలబండబిడికి, కటారుముడుకు, రాయవరం, పింఛా తిమ్మసముద్రం మొదలగు గ్రామాలతో పాటు ఇంకా అనేక పల్లెల్లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రాయవరం గ్రామం జంగంపల్లెకు చెందిన ఒక వ్యక్తి కొంత కాలం క్రితం ఎయిడ్స్ వ్యాధితో చనిపోగా ఆయన భార్యకు కూడా ఎయిడ్స్ మహమ్మారితో కొన్ని నెలలు పోరాడి మరణించింది. ఇదే విధంగా రాయవరం గ్రామం జూబాలదినె్నకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్షణికావేశంలో చేసిన చీకటి తప్పుకు ఎయిడ్స్‌వ్యాధి కబలించింది. సుండుపల్లె మండలానికి చెందిన కొందరు పూణే, ముంబై నగరాలలో వ్యభిచార గృహాలను నడిపేవారని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. చిన్నబిడికి కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దులోని జిల్లేలమంద బిడికికి చెందిన రాజేశ్వరి, రాధాభారుూలు అక్కడే పెద్ద పెద్ద వ్యభిచార గృహాలను నడిపి కోట్ల రూపాయలకు పడగలెత్తారని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విధంగా పై వ్యభిచార గృహాలకు వెళ్లి తమకు తెలియకుండానే ఎయిడ్స్ వ్యాధిబారినపడి స్వగ్రామాలకు వచ్చి నరకయాతన అనుభవించి ఎయిడ్స్ వ్యాధి కోరలు చాపి ఆ కోరల్లో చిక్కుకుని మరణిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజల దృష్టికి, పత్రికల దృష్టికి తెచ్చిన మరణాలు కొన్ని అయితే తెలియని ఎయిడ్స్ వ్యాధి మృతులు అంతకు పది రెట్లు ఒక్క సుండుపల్లె మండలంలోనే గత పది సంవత్సరాలలో దాదాపు 750 మంది ఎయిడ్స్ వ్యాధితో మరణించారని అనధికార లెక్కలు ముఖ్యంగా గిరిజన ఏజెన్సీలతో పాటు రాయవరం తిమ్మసముద్రం మండల కేంద్రంలో కూడా ఎయిడ్స్ బారిన పడి మరణించారు. వారైతే దాదాపు అనధికార లెక్కల ప్రకారం 1,100 మంది వ్యాధిగ్రస్థులు మండలంలో ఉన్నారని సమాచారం. అదేవ్యాధితో ఎంతోమంది జీవచ్ఛాలుగా బతుకుతున్నారు. భర్తలు చేసిన చీకటి తప్పులకు భార్యలు, భార్యలు చేసిన తప్పులకు భర్తలు బలైన సంఘటనలు కోకొల్లలు. భార్యా భర్తలు చనిపోవడంతో అనాధలుగా మారిన పసిపిల్లలు అనేకం. కొందరు వైద్యులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పొట్టకూటి కోసం వ్యభిచార గృహాలలో ఉంటూ ఎయిడ్స్ వ్యాధిబారిన పడుతున్న వారు అక్కడజరిగే విచ్చలవిడి శృంగారం కారణంగా ఎయిడ్స్ సోకుతోంది. అనంతరం మనిషిలో మార్పు వస్తున్నా దృష్ట్యా నీరసిస్తూ రోగనిరోధకశక్తి క్రమంగా నశిస్తూ చివరిదశలో మంచానే్న ఆశ్రయిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు ఎయిడ్స్‌పై అవగాహన కలిగించి యువకుల, యువతుల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వేంపల్లె విద్యార్థినికి దక్షిణ భారతదేశ స్థాయిలో గుర్తింపు
వేంపల్లె, నవంబర్ 20: ఉషాకిరణ్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఆలూరు దేవకిసునంద దక్షిణభారత స్థాయిలో బంగారు పతకాన్ని సాధించినట్లు కరెస్పాండెంట్ డిఎస్ రమణారెడ్డి తెలిపారు. దేవకిసునంద దక్షిణ భారత హిందీ ప్రచారసభ చెన్నై వారు 2016 ఫిబ్రవరిలో నిర్వహించిన విషారద ఉత్తరార్త పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధమ ర్యాంకును సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. 19వ తేదీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ మరియు చెన్నైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో శ్రీరామచంద్ర యూనివర్శిటీ ఉపకులపతి డాక్టర్ జే ఎస్ ఎన్ మూర్తి చేతుల మీదుగా బంగారు పతకాన్ని, ప్రశంసాపత్రాన్ని అందుకున్నట్లు ఆయన తెలిపారు. తమ పాఠశాల విద్యార్థిని దక్షిణ భారత స్థాయిలో రాణించడం పట్ల కరెస్పాండెంట్ రమణారెడ్డి హిందీ ఉపాధ్యాయులు సీఎస్ గౌస్‌మొహిద్దీన్, జరీనాబేగం, బాబ్జాన్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.

రాయలసీమ పొలికేకకు తరలిరండి
కమలాపురం, నవంబర్ 20: ఈనెల 25వ తేదిన ప్రత్యేక రాయలసీమ సాధనకోసం కడపలో నిర్వహించనున్న సీమ పొలికేక మహాధర్నాకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం పొలికేకకు సంబందించిన గోడపత్రాలను విడుదల చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాతో పాటు సీమలోని ఇతర జిల్లాల ప్రజలు కూడా మహాధర్నాకు స్వచ్ఛంధంగా తరలిరావాలని కోరారు. దశాబ్దాలుగా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. అన్ని పార్టీలకు చెందిన ఈ ప్రాంతానికి చెందిన నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి అన్యాయం చేసారన్నారు. సీమ అభివృద్ది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ప్రస్థుత పాలకులు అమరావతిని రాజధానిగా చేస్తుంటే నోరు మెదపలేకపోయారని విమర్శించారు.
సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ను రెండుముక్కలు చేయగా కేంద్రంలోని మంత్రులు నవగ్రహాలుగా ఉన్నారే తప్ప ఎవ్వరూ ఆక్షేపణ చేయలేకపోవడంతో రాయలసీమకు మరింత అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా అద్యక్షుడు అన్వర్‌బాష తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయ పఠనంతో మేధాశక్తి పెంపు
గాలివీడు, నవంబర్ 20: గ్రామీణ ప్రాంతాలలోని గ్రంథాలయాలలో పఠనం చేయడం ద్వారా విద్యార్థులలో మేధాశక్తి పెంపొందుతుందని సర్పంచ్ మహమ్మద్‌రియా పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా 49వ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా బాల, బాలికలకు వ్యాసరచన సాంస్కృతిక చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనపరిచిన వారి బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, మహబూబ్‌బాష, జిల్లా గిరిజన నాయకులు మిట్టేనాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పోటాపోటీగా గోడపత్రికల విడుదల
కమలాపురం, నవంబర్ 20: నవంబర్ 27న హైదరాబాదులో జరిగే ధర్మయుద్ద మహాసభలకు సంబందించిన గోడపత్రికలను ఎమ్మార్పీయస్‌కు చెందిన రెండువర్గాలు కమలాపురంలో పోటాపోటీగా విడుదల చేసారు. జిల్లా ఎమ్మార్పీయస్ ఉపాధ్యక్షుడు గుర్రప్ప, జిల్లా కార్యదర్శులు చంద్ర జయప్రతాప్, మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుడు బిసి కృష్ణయ్య, జయనరసిం హులు, ఉబ్బయ్యలతో కలసి విడుదలచేయగా ఆదివారం ఎమ్మార్పీయస్‌లోని మరోవర్గం నరసింహులు, చిన్నబ్బి, ఎంయస్‌యఫ్ నాయకులు శ్రీనివాసులు, లక్ష్మయ్య, శ్రీనులతో కలసి గోడపత్రాలను విడుదల చేశారు.

పెద్దనోట్ల రద్దుతో...
సామాన్యులకు ఇబ్బందులు

రాయచోటి, నవంబర్ 20: ధనవంతులు దాచుకోవడానికి వీలుగా ఉండేందుకు ఖాళీగా ఉన్న బ్యాంకులను నింపేందుకు సామాన్యుడిని ముప్పతిప్పలు పెట్టేందుకే పీ ఎం నరేంద్రమోదీ ఉన్నఫలంగా కరెన్సీ నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సీపీ ఐ ఏరియా కార్యదర్శి విశ్వనాధ అన్నారు. స్థానిక ఎన్జీవో హోం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.80 లక్షల కోట్ల నల్లధనాన్ని విదేశీ బ్యాంకుల నుంచి స్వదేశానికి రప్పిస్తానని చెప్పిన మోడీ మూడు సంవతసరాలు గడుస్తున్నా తేలేకపోయాడన్నారు. ప్రజలకు జబావు చెప్పలేని పరిస్థితుల్లో సరికొత్త నాటకానికి తెరలేపారని, ఇదే నల్లధనాన్ని బయటికీ తీయడమని బీజేపీ నాయకులు ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. నల్లదొరలు ఎక్కువ డబ్బులు నిల్వ చేసుకోవడానికి రూ.2 వేల నోట్లు అనుకూలంగా ఉంటాయని, అలాంటి వారికి సహాయపడేందుకే ఇలాంటి పెద్దనోట్లు ముద్రణ, పాతనోట్ల రద్దు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, రెండు నెలలకు ముందే బీజేపీ దానికి అనుకూలంగా ఉన్న పార్టీల పెద్దలకు, కార్పొరేట్ గిద్దలకు సమాచారాన్ని ఇచ్చి బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చుకునేలా చేశారన్నారు. సామాన్య ప్రజలు తమ అవసరాల కోసం కూడా పెట్టుకున్న డబ్బు మీద మోడీ తన యుద్ధాన్ని ప్రారంభించి ఇదే ధర్మయుద్ధం అంటున్నారని, పేదోళ్లు ఎదగడం మోదీకి ఇష్టం లేదని, ఆయన కార్పొరేట్ రక్షకుడని ఆయన దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఏ ఐవై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జక్కల వెంకటేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వెంకటేసు, రమణ పాల్గొన్నారు.
వాస్తుకోసం పీఆర్ రోడ్డు తొలగింపు!
గాలివీడు, నవంబర్ 20: మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని గోపనపల్లెకు వెళ్లు పంచాయతీరాజ్ ప్రధాన రహదారిని రియల్ ఎస్టేట్ స్థలాల వాస్తుకోసం తొలగిస్తుండటంతో ఆదివారం గోపనపల్లె గ్రామస్థులు ఎస్‌ఐ మంజునాధ్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల కథనంమేరకు గోరాన్‌చెరువు గ్రామ పంచాయతీ పరిధిలోని కరిమిరెడ్డిగారిపల్లె రాయచోటి-కదిరి ప్రధాన రహదారి నుంచి గోపనపల్లెకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు తారురోడ్డును ఏర్పాటు చేశారు. మండల కేంద్రానికి ప్రైవేటు వైద్యులు డాక్టర్ హరిప్రసాద్ కరిమిరెడ్డిగారిపల్లె వద్ద ఇంటి స్థలాలకోసం కళ్యాణ మండపం నిర్మాణంకోసం కొంత భూమిని కొనుగోలు చేశారు. అయితే భూమి రోడ్డుకంటే దిగువ భాగంలో ఉండటంతో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏకంగా రోడ్డునే యంత్రాలతో తొలగిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు గోపనపల్లెరోడ్డును 20 మీటర్ల పొడవు మేర యంత్రాలతో చదును చేయడం జరిగింది. పరిస్థితి గమనించిన గ్రామస్థులు వెంటనే ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు తొలగింపుపై లక్కిరెడ్డిపల్లె పీఆర్‌ఏ రమణారెడ్డిని వివరణ కోరగా గోపనపల్లె రోడ్డు తొలగింపుపై ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. రోడ్డు తొలగింపుపై విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదేవిధంగా ఎస్‌ఐను వివరణ కోరగా స్వలాభం కోసం రోడ్డును తొలగించిన వారిపై గ్రామస్థుల ఫిర్యాదుమేరకు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ మంజునాధ్ తెలిపారు. గోపనపల్లె గ్రామంలోని దాదాపు 20 పల్లెలకు, గాలివీడుకు రింగురోడ్డు లాంటి తారురోడ్డును తొలగించడం దారుణమని గోపనపల్లె గ్రామస్షుథలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీషు కాలం నాటి రోడ్డు ధ్వంసం చేయడంపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
శాటిలైట్ సిటీ వద్ద
మహిళ దహనం కేసులో ఆచూకీ లభ్యం
చెన్నూరు, నవంబర్ 20: మండల పరిధిలోని శాటిలైట్ సిటీ పరిధిలో అగ్రిగోల్డ్ రియల్‌ఎస్టేట్ ఆవరణంలో అక్టోబర్ 19వ తేదిన మహిళను పెట్రోలుపోసి దహనం చేసిన సంఘటనకు సంబంధించి పోలీసులు ఆచూకీ తెలుసుకున్నారు. కడప రాజారెడ్డి వీధికి చెందిన దీనజ్యోతి (62) ఈమె సాంఘిక సంక్షేమశాఖ హాస్టలో పనిచేస్తూ రిటైర్ట్ అయ్యారు. ఈమె భర్త కొంతకాలం కిందట మృతిచెందారు. ఈమెకు పిల్లలు లేరు. ఈమె ఒక్కరు మాత్రమే ఇంటిలో నివాసం ఉండేవారు. అదేవీధిలో బ్యూటీపార్లర్‌కు వెళ్తుండేది. బ్యూటీపార్లర్‌లో ఇద్దరు మహిళలకు వడ్డీకి రూ.2లక్షలు పైబడి అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. అక్టోబర్ 19న శాటిలైట్ సిటీవద్ద మహిళ దహనమైన రోజునే దీనజ్యోతి కన్పించడం లేదంటూ పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. చాలారోజుల తర్వాత ఈకేసును పోలీసులు పురోగతిసాధించారు. బ్యూటీపార్లర్ నడుపుతున్న మహిళతోపాటు ఆమె అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మరో మహిళ ఈమెభర్త ముగ్గురు కలిసి బ్యూటీపార్లర్‌లోనే హత్యచేసి ఆమె వద్దవున్న బంగారునగలు, నగదును తీసుకున్నారు. ఒక ఆటోడ్రైవర్ సహకారంతో రాత్రి మహిళను ఆటోలో తీసుకుని కమలాపురం రోడ్డులోని శాటిలైట్ సిటీ వద్దవున్న అగ్రిగోల్డ్ రియల్ ఎస్టేట్ ప్రాంతంలో మృతిచెందిన మహిళపై పెట్రోల్‌పోసి తగులబెట్టారు. పోలీసులు అక్కడ లభించిన కళ్లజోడు, పలు ఆధారాలు కారణంగా కన్పించకుండాపోయిన దీనజ్యోతిగా గుర్తించారు. పోలీసులు బ్యూటీపార్లర్ నడుపుతున్న మహిళతోపాటు ఆమె అసిస్టెంట్‌ను, మరో వ్యక్తిని, ఆటోడ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసు విషయంపై చెన్నూరు ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా రెండు మూడు రోజుల్లో నిందితులను అరెస్టుచూపి కోర్టుకు హాజరుపర్చడం జరుగుతుందన్నారు.