S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లాకు మరో 1.5టిఎంసిల నీరు కావాలి

ఒంగోలు,నవంబర్ 20:జిల్లాకు మరో 1.5టిఎంసిల నాగార్జున సాగర్‌నీరు కావాలని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కోరనున్నట్లు రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. ఆదివారం రాత్రి స్థానిక సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశం అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఈ నీటిని విడుదల చేసేందుకు కృషిచేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు జిల్లాలోని రైతాంగాన్ని అన్నివిధాల ఆదుకునేందుకు కృషిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో పెసర పంటను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో లక్ష ఎకరాలకు నాగార్జున సాగర్ నీటితో తడి అందాల్సి ఉందన్నారు. జిల్లాలోని ప్రతిగ్రామంలోని ప్రజలకు తాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లాకలెక్టర్ సుజాతశర్మ, ఇరిగేషన్ సిఇ వీర్రాజు, ఎస్‌ఇ శారద, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పాల్గొన్నారు.

చివరి భూములకు నీరు అందక
కంటతడి పెడుతున్న కర్షకులు
* పట్టించుకోని సాగర్ అధికారులు
* ఆరుతడి పంటలకైనా నీరు అందించండి
మార్కాపురం, నవంబర్ 20: సాగర్ ఆయకట్టు పరిధిలో సాగునీరు అందక రైతులు కంటతడి పెట్టే పరిస్థితి ఏర్పడింది. గత మూడు సంవత్సరాలుగా సాగర్ నీరు సక్రమంగా అందక పంటలు పండక కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడంతో చివరి ప్రాంత రైతులు సాగునీటి కోసం కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా త్రిపురాంతకం సబ్ డివిజన్ పరిధిలోని గుట్టల ఉమ్మడివరం, మిరియంపల్లి తదితర మేజర్ల పరిధిలో రైతులు పంటలు సాగు చేయగా నీరు అందడం లేదు. పైభాగాన ఉన్న రైతులకు కొద్దిపాటి నీరు అందుతుండగా చివర ప్రాంతాలకు మాత్రం నీరు అందడం లేదు. ఇందుకు కారణం గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా ప్రారంభయ్యే 85/3వ మైలు వద్ద జిల్లాకు 3640 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా, కేవలం 1700కు మించి నీరు రాకపోవడంతో ప్రకాశం జిల్లా రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని నల్లవాగు, కండ్లేరు వాగులకు నీరు అక్రమంగా విడుదల చేయడం వలనే జిల్లా రైతులకు ఈ పరిస్థితి ఏర్పడిందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కిందిస్థాయి అధికారులు నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు ప్రయత్నించినప్పటికీ గుంటూరుజిల్లా అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళను తట్టుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన సాగర్ ఆయకట్టు రైతులు ప్రభుత్వం ఇచ్చిన కొద్దిపాటి నీటిని కూడా దక్కించుకునే పరిస్థితి లేదు. సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం లేనందున ఆరుతడి పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు మిరప, కంది లాంటి పంటలు సాగు చేశారు. ఆ పంటలకు కూడా నీరు అందక రైతుల కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల జనచైతన్య యాత్రల సందర్భంగా గ్రామాల్లో పర్యటించిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు దృష్టికి తీసుకువెళ్ళారు. కాగా, ఈనెల 25వ తేదీతో సాగర్‌నీటి సరఫరాను నిలపివేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల్లో మరింత ఆందోళన పెరిగింది. ఇప్పటికైనా సాగర్ అధికారులు గుంటూరు జిల్లాలో జరుగుతున్న నీటిచౌర్యాన్ని ఆపి ప్రకాశం జిల్లాలో రైతులు నష్టపోకుండా ఆరుతడి పంటలకైనా నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని జిల్లాకు రావాల్సిన నీటివాటాను సక్రమంగా రాబట్టి జిల్లాలో రైతులు సాగుచేసిన ఆరుతడి పంటలకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
రాష్ట్రంలో దోపిడీ పాలన
* పిసిసి అధ్యక్షులు రఘువీరా ధ్వజం
మార్కాపురం, నవంబర్ 20: రాష్ట్రంలో ప్రజాపాలన లేదని, దోపిడీ పాలన సాగుతోందని ఎపి పిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక పంచాయతీరాజ్ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులను ప్రారంభించినట్లు, ఆయన మరణం అనంతరం ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరిగిందని, అయితే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంపార్టీ ప్రాజెక్టు నిర్మాణాన్ని మరచి అదనపు ధరలతో ప్రణాళికలు తయారుచేసి దండుకుంటున్నారని ఆరోపించారు. టిడిపి నాయకులు గత రెండేళ్ళ కిందట 50లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని, ఈ పర్యాయం కోటి మంది పార్టీ సభ్యత్వం తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారని, ఆ సభ్యుల వివరాలను బహిర్గతం చేయాలని, ఆ పార్టీ నేతలందరూ అబద్దాలు చెప్పడంలో ముందుంటారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పేదప్రజలకు చేరవని, పచ్చచొక్కా వేసుకున్న వారికే అందుతున్నాయని అన్నారు. 2019లో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటుందని, కాంగ్రెస్ సముద్రంలో అలల లాంటిదని, పడటం, లేవడం రాజకీయాల్లో సహజమేనని అన్నారు. ప్రణాళిక లేకుండా ప్రధానమంత్రి పెద్దనోట్లను రద్దుచేయడంతో ధనవంతులు బాగానే ఉన్నారని పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోయారని, ఒక విషయాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు అందులో వచ్చే మంచిచెడులను గుర్తించి ప్రణాళిక ప్రకారం ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని బిజెపిపై మండిపడ్డారు. ఈ పాత్రికేయుల సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రామచంద్రారెడ్డి, తిరుమలశెట్టి రామయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో 23 రకాల రవాణా సేవలు
రాష్ట్రంలో అవినీతికి తావులేకుండా
నగదు రహిత చెల్లింపులు
రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం

ఒంగోలు,నవంబర్ 20 : దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు అన్ని జిల్లాల్లో 23 రకాల రవాణా సేవలను ఆన్‌లైన్ ద్వారా పొందే ఏర్పాట్లు చేశామని, దీంతో ఇంటిదగ్గర నుండే రవాణాశాఖ సేవలు ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చునని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. ఆదివారం ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని వెంగముక్కలపాలెంలో రహదారిలో 2.33కోట్లరూపాయల వ్యయంతో నిర్మించిన ఉపరవాణా కమిషనర్ కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి శిద్దా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖర్లసమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రవాణాశాఖలో కావాల్సిన సదుపాయాలు కల్పించలేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండున్నర సంవత్సరాలుగా రవాణాశాఖాభివృద్ధికి, ఆదాయం పెంచుకునేందుకు అవసరమైన మార్గనిర్ధేశం చేస్తున్నారన్నారు.రవాణాశాఖను పటిష్టపరిచేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నామన్నారు. అందులో భాగంగానే వాహనాల డ్రైవర్ల ఆధార్ నెంబర్ల అనుసంధానం జరుగుతుందన్నారు. రవాణాశాఖ భద్రతపై ఏర్పాటైన మంత్రుల బృందంలో తాను సభ్యుడిగా ఉంటూ ఉత్తరాధి, కర్నాటక తదితర రాష్ట్రాల్లో పర్యటించి నూతన పద్ధతులకు శ్రీకారం చుట్టామన్నారు. రవాణాశాఖలో గత సంవత్సరంలో రెవిన్యూలో 21శాతం వృద్ధి సాధించామన్నారు. నిర్ణీత లక్ష్యంకన్నా మంచి ఫలితాలు సాధించి ఆదాయం పెంచేందుకు కృషిచేస్తున్నామన్నారు. రాబోయేరోజుల్లో మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అన్ని రకాల సేవలను అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రధానంగా అవినీతికి తావులేకుండా రవాణాశాఖను పటిష్టపరుస్తామన్నారు. ఇకపై అన్ని రవాణాశాఖ కార్యాలయంలో నగదురహిత చెల్లింపులు చేసుకునే ఏర్పాట్లు చేశామన్నారు. చెక్‌పోస్టుల్లో కూడా నగదు రహిత చెల్లింపు చేసేవిధంగా ఏర్పాట్లు పూర్తిఅయ్యాయన్నారు. అదేవిధంగా అన్నిచోట్ల సిసికెమెరాలను ఏర్పాటుచేశామన్నారు. వినియోగదారుల ఇబ్బందులను తొలగించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటామన్నారు. మంచిసలహాలు ఎవ్వరు ఇచ్చినా అవసరమైన మార్పులు చేస్తామన్నారు. రాష్టమ్రుఖ్యమంత్రి పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు విదేశాలకు వెళ్తున్నారని పరిశ్రమలు వస్తేనే రెవిన్యూపెరుగుతుందని గత రెండున్నర సంవత్సరాలుగా కఠోరంగా శ్రమించటం వలన దేశంలో మన రాష్ట్రం రెండెంకెల వృద్ధిసాధించిందన్నారు. నేడు ప్రపంచదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. పరిమితికి మించి అధికలోడ్లతో రవాణాచేస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టేదిలేదని అది ఆక్వా, గ్రానైట్‌పైనా అపరాధరుసుం రాసి కేసు నమోదుచేసి పోలీసుస్టేషన్‌లో అప్పగిస్తామని, తనిఖీలు ముమ్మరంగా చేపడ్తామన్నారు. రాష్ట్రంలో రవాణాశాఖ రెవిన్యూలో ప్రకాశం జిల్లా మూడవస్థానంలో ఉందన్నారు. ప్రకాశం జిల్లాలోని దర్శిలో 18.51కోట్లరూపాయల వ్యయంతో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ ట్రాకింగ్ పరిశోధన సంస్థకు శంకుస్థాపన చేశామని టెండర్లను పిలవాల్సి ఉందన్నారు. రెండునెలల్లో నిర్మాణ పనులు చేపడ్తామన్నారు. ఆ సంస్థ ద్వారా డ్రైవింగ్ ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చునని తెలిపారు. ఉపరవాణా కార్యాలయ నూతన భవనానికి 2.33కోట్లరూపాయలు ఖర్చు అయిందని టెస్టింగ్ ట్రాక్ కోసం ఇంకా 2.5కోట్లరూపాయలు అవసరం ఉందని ఆనిధులను త్వరలో మంజూరుచేసి ట్రాక్ పూర్తిచేస్తామన్నారు. కరెన్సీనోట్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్టమ్రుఖ్యమంత్రి ప్రతిరోజు భారతీయ రిజర్వు బ్యాంకు అధికారులు, జిల్లాకలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియోకాన్ఫరెన్స్‌లు నిర్వహించి సమీక్షలు చేస్తున్నారని పదివేల కోట్లరూపాయలవరకు వందరూపాయలు, 50రూపాయలనోట్లను పంపించాలని కోరారన్నారు. రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ తన కార్పోరేషన్‌ద్వారా పదివేల మందికి డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 91 ఇన్నోవాలను, రెండువందల క్యాబ్‌లను, టాటాట్రక్కులను కలుపుకుని మొత్తం ఐదువందల వాహనాలను లబ్ధిదారులకు ఇస్తున్నామన్నారు. వారికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, బ్యాడ్జీలు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. చాలా మంది ఎస్‌సి యువకులు చదువుకుని డ్రైవింగ్‌లో శిక్షణపొందేందుకు ఆశక్తిగా ఉన్నారని, రాబోయే రోజుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. విదేశాల్లో మాదిరిగా మనదేశంలో కూడా తాగి వాహనాలను నడపకుండా నియంత్రించేందుకు,ప్రమాదాలు నివారించేందుకు ప్రజలను ట్రాఫిక్ నియామకాల పట్ల చైతన్యపర్చాల్సిన అవసరం ఉందన్నారు. వేగంకన్నా ప్రాణం మిన్నా అని డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ ఉప రవాణా కమిషనర్ కార్యాలయంతోపాటు టెస్టింగ్ ట్రాక్ ఒకేచోట ఏడు ఏకరాల్లో ఏర్పాటుకావటం చాలా సంతోషదాయకమన్నారు. కరెన్సీ నోట్ల కొరతను ప్రస్తుతం అధిగమించేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం పటిష్టంగా చర్యలు తీసుకుందన్నారు. ఈనెలాఖరు నాటికి కరెన్సీనోట్ల సమస్య తీరుతుందన్నారు. అంతకుముందు మంత్రి శిద్దా, కార్పొరేషన్ చైర్మన్ జూపూడి, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల గణపతి పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆ ముగ్గుర్ని రవాణాశాఖాధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు డిటిసి రాజారత్నం, ఇన్‌చార్జి సుబ్బారావు, నెల్లూరు డిటిసి శివరాంప్రసాదు, ఒంగోలు ఆర్‌టిసి ఆర్‌ఎం ఆదాంసాహెబ్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రమేష్‌కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పెద్దనోట్ల రద్దుపై కేంద్రప్రభుత్వానిది అనాలోచిత చర్య
- పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి

ఒంగోలు,నవంబర్ 20:కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను అనాలోచితంగా రద్దుచేసిందని పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లాపర్యటనలో భాగంగా ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ఉన్న ఎటిఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎటిఎంల వద్ద ఉన్న ప్రజలను తమ సాధకబాధలను అడిగితెలుసుకున్నారు. మోదీ నిర్ణయంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన తల్లిని క్యూలో నిలబెట్టాడు కాని బడాబాబులను ఎక్కడైనా నిల్చున్నారా అని ఆయన ప్రశ్నించారు. నోట్లను రెడీగా ఉంచకుండా పెద్దనోట్లను రద్దుచేయటం ఏమిటని ధ్వజమెత్తారు. అనంతరం ఒంగోలులోని విఐపి రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.