S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం రోజుల్లో నూతన భవనాల్లోకి విఎస్‌యు

వేదాయపాళెం, డిసెంబర్ 2: నాగార్జున యూనివర్శిటీలో జరిగిన వర్శిటీ అభివృద్ధి పాలకమండలి కమిటీ సమావేశాల్లో విక్రమ సింహపురి యూనివర్శిటీ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వీసీ ఆచార్య వి.వీరయ్య తెలిపారు. నగరంలోని వర్శిటీ అడ్మిన్ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్శిటీని నూతన భవనాల్లోకి వారం రోజుల్లో తరలించే అవకాశం ఉందన్నారు. మంత్రి నారాయణ ఇటీవల డిసెంబర్ నెల మొదటి వారంలో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉందని ఆయన పర్యటనలో భాగంగా వర్శిటీ నూతన భవనాలను ప్రారంభించవచ్చని తెలిపారన్నారు. పాలకమండలి సమావేశంలో నూతన భవనానికి సంబంధించి కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన రూ.2.56 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించామన్నారు. జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఉన్నత విద్యావంతులు వర్శిటీలో పిహెచ్‌డీ అనుమతులు పొందేందుకు అనుమతించామన్నారు. వర్శిటీలో పనిచేస్తున్న మహిళ, శాశ్వత ఉద్యోగులు తమ పిల్లల ఆలనా పాలనా చూసుకునేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెంబరు 132 అమలుకు ఆమోదించామన్నారు. వర్శిటీ కళాశాల, పిజి కళాశాలలకు ఫిజికల్ డైరెక్టర్లు, కోచ్‌లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు అనుమతులు వచ్చాయన్నారు. వర్శిటీలో ఇంజనీర్ నియామకం, 18 నాన్‌టీచింగ్ ఉద్యోగుల నియామకం ప్రభుత్వ అనుమతితో, వర్శిటీలో అసిస్టెంట్ ప్రమోషన్ల పోస్టులకు అంగీకారం ఇలా పలు రకాల కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం వర్శిటీ కళాశాలలో యాంటి ర్యాగింగ్ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈసదస్సుకు ప్రముఖులు విచ్చేస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో రిజిస్ట్రార్ పిఆర్ శివశంకర్ పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా సాధించే వరకూ కాంగ్రెస్ పోరాటం
మాజీ మంత్రి శైలజానాథ్ స్పష్టం
నెల్లూరుసిటీ, డిసెంబర్ 2: ప్రత్యేక హోదా సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి శైలజానాధ్ తెలిపారు. శుక్రవారం ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన బ్యాలెట్ కార్యక్రమాన్ని నగరంలోని కృష్ణచైతన్య డిగ్రీ కళాశాలలోని సెమీనార్ హాల్‌లో ఏర్పాటు చేశారు. ముందుగా ఇందిరాభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్ నాయకులు వివిధ బృందాలుగా ఏర్పడి ఒక్కొక్క బృందం రోజుకు సుమారు 10 విద్యాసంస్థలలో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. డిసెంబర్ 31వ తేదీలోపు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలలో విద్యార్థి బ్యాలెట్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేస్తామని చెప్పిన నరేంద్రమోదీ 5 కోట్ల ఆంధ్రులను రెండున్నర సంవత్సరాలు మభ్యపెట్టి మోసం చేశారన్నారు. 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని ఎన్నికల ప్రచార సభలలో కోరిన చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిసి కూడా ప్రత్యేక ప్యాకేజిని స్వాగతించడం సిగ్గుచేటన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అన్ని పరిశ్రమలు వస్తాయని 90 శాతం కేంద్ర ప్రభుత్వ పన్నులు మినహాయింపు ఉంటుందన్నారు. అంతేకాకుండా రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కార్యదర్శి షంషీర్ అన్సారీ ఖాన్, ఎన్‌ఎస్‌యుఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాజన్త్రన్, ఎల్ రామారావు, పిసిసి ఉపాధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి, సివి శేషారెడ్డి, పిసిసి ప్రధానకార్యదర్శి చెంచలబాబుయాదవ్, కేశవనారాయణ, మల్లి బాలకృష్ణ, ఉడతా వెంకట్రావు, భవానీనాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పక్షుల పండుగ సందర్శకులకు అన్ని వసతులు
సూళ్లూరుపేట, డిసెంబర్ 2: సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానం వేదికగా ఈనెల 27 నుండి 29వ తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే పక్షుల పండుగకు వచ్చే సందర్శకులకు వసతులు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ పాయసం వెంకటేశ్వరావు తెలిపారు. శుక్రవారం ఆయన తహశీల్దార్ చొప్పా రవీంద్రబాబుతో కలసి జూనియర్ కళాశాల మైదానంతోపాటు పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఎక్కడెక్కడ తాగునీటి వసతి, మరుగుడొడ్లు తదితర వసతులు కల్పించాలో పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు, హోలిక్రాస్ సర్కిల్, చెంగాళమ్మ ఆలయం, రైల్వేస్టేషన్, షార్ వై జంక్షన్ తదితర ప్రాంతాల్లో తాగునీటితో అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అటకానితిప్ప వద్ద తాగునీటితో పాటు ఆహారపొట్లాలు కూడా అందిస్తే బాగుంటుందన్నారు. మూడు రోజులపాటు వచ్చే పక్షి ప్రేమికులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.

లబ్.. డబ్బు
నగదు కోసం అంతులేని అగచాట్లు
బ్యాంక్‌లు, ఎటిఎంల వద్ద జనం పడిగాపులు

నెల్లూరు, డిసెంబర్ 2: ఇప్పటికే చాలామంది ప్రజలు నగదు కోసం బ్యాంకులు, ఎటిఎంల వద్ద పడిగాపులు కాస్తుండగా వీరికితోడుగా పింఛన్ల కోసం వృద్ధులు, వేతనాల కోసం వేతనజీవులు జత కలవడంతో శుక్రవారం బ్యాంకులు, ఎటిఎంల వద్ద భారీగా బారులు తీరారు. తమతమ ప్రాంతాల్లో సిబ్బంది ద్వారా పింఛన్లు అందుకునే వారంతా ఒక్కసారిగా బ్యాంకులకు రావడం, వచ్చినా అక్కడ నగదు లేకపోవడం, మరికొందరికి ఖాతాల్లో పడకపోవడం తదితర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం 70 శాతం మందికి ఖాతాల్లో నగదు వేసినా బ్యాంకుల్లో కరెన్సీ లేక ఇవ్వలేని పరిస్థితి ఎదురయింది. ఇక చేతికి డబ్బు చిక్కుతుందో లేదోనన్న టెన్షన్ పెరిగిపోతోంది. ఈనేపథ్యంలో వత్తిళ్లకు గురయ్యే వారి గుండెలు లబ్.. డబ్బు అంటు కొట్టుకుంటున్నాయ. జిల్లాలో పలుచోట్ల బ్యాంకుల్లో నగదు కొరతతో గంటల తరబడి జనం నిరీక్షించాల్సి వచ్చింది. పెద్దనోట్లను రద్దు చేసినప్పటి నుంచి జిల్లాలో కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఎటిఎంలను అసలు తెరవడం లేదు. బ్యాంకుల నుంచి నగదు చెల్లించపులకు సంబంధించి సమగ్ర విధానాన్ని పాటించకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. కొన్ని బ్యాంకుల్లో ఖాతాదారులకు గరిష్టంగా పదివేలు, మరికొన్నిచోట్ల రెండు, మూడువేల వంతున అందజేస్తున్నారు. దీంతో తక్కువ మొత్తం ఇస్తున్న బ్యాంకర్లపై ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో నగదు కొరతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండోరోజు కూడా అవస్థలు పడ్డారు. ఒక్కొక్క ఉద్యోగికి పదివేలు చొప్పున నగదు అందించేలా ఏర్పాటు చేశామని బ్యాంకర్లు చెప్పినా చాలాచోట్ల ఉద్యోగులకు చుక్కెదురయ్యింది. నగదు కొరత పేరుతో ఐదు, ఏడువేలు మాత్రమే చెల్లించారు. బ్యాంక్ ఖాతాలో వేతనం జమ అయినట్లు సమాచారం అందిన ఉద్యోగులు శుక్రవారం నగరంలోని ఎస్‌బిఐ, ఆంధ్రాబ్యాంకు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు పరుగులు తీశారు. రద్దీ తీవ్రంగా ఉండడం ఆపై ఎక్కువ మంది తరలిరావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొదట కొందరికి పదివేల చొప్పున చెల్లించి తరువాత నగదు కొరత బోర్డులు పెట్టి నగదు చెల్లింపులు కుదించారు. దీంతో చాలామంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పింఛనుదారులు, విశ్రాంత ఉద్యోగులు సైతం బారులుతీరారు.
నగదు రహిత లావాదేవీలపై అవగాహన
ఓవైపు బ్యాంకుల్లో నగదు కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా నగదు రహిత లావాదేవీలపై రెవెన్యూ, పోలీస్ ఇతర శాఖల అధికారులు అవగాహన కార్యక్రమం ముమ్మరం చేశారు. ఈ-పాస్ యంత్రాల వినియోగంపై ప్రాంతాలవారీగా వ్యాపారులకు వాణిజ్య పన్నులశాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. దీంతోపాటు విద్యాసంస్థలు, రైతుబజార్లు తదితర ప్రాంతాల్లోను మొబైల్ అప్లికేషన్లు, బ్యాంక్ ఖాతాలు తెరవడం, డెబిట్ కార్డుల వినియోగం, ఈ-పాస్ యంత్రాల లావాదేవీల గురించి వివరిస్తున్నారు. గతంతో పోలిస్తే అన్ని వర్గాల్లోను నగదు రహిత లావాదేవీలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బుకింగ్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలకు క్రమేపి ఆదరణ పెరుగుతోంది.

ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటాం
* జమ్మిపాళెం గ్రామస్థుల హెచ్చరిక
కోవూరు, డిసెంబర్ 2: ఇసుక రీచ్‌లో తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని, ఎట్టి పరిస్థితుల్లోను ఇసుక ట్రాక్టర్లను తిరగనివ్వమని కోవూరు మండలం జమ్మిపాళెం గ్రామస్థులు శుక్రవారం కోవూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట భీష్మించారు. ఎన్నిసార్లు తమ సమస్యను తహశీల్దార్, పోలీసులకు తెలియజేసినా స్పందిచడం లేదని ఈరోజు ఏదోఒక గట్టి హామీతోనే వెనుతిరగాలని నిర్ణయించుకున్నామని వారు తేల్చి చెప్పారు. దీంతో తహశీల్దార్ మత్యం నరసింహులు జమ్మిపాళెం గ్రామ పెద్దలు, పోలీసులు, స్థానిక జెట్పీటిసి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తహశీల్దార్ గ్రామస్థులతో మాట్లాడుతూ ఇసుక రీచ్‌లను ఎక్కడ ఏర్పాటు చేయాలి, రీచ్‌లను కొనసాగించడం, తొలగించడం మైన్స్, జియాలజి విభాగం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని గ్రామస్థులకు నచ్చజెప్పారు. ప్రధాన సమస్య అయిన ఇసుక ట్రాక్టర్ల దూకుడు, అధిక లోడు తదితర అంశాలపై పోలీసులు చొరవ చూపించే విధంగా తాను ఆదేశాలు జారీ చేస్తానని తహశీల్దార్ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఇందుకు గ్రామస్థులు అంగీకరించకపోవడంతో ఈ సమస్యను కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి పంపారు. అనంతరం జమ్మిపాళెం గ్రామస్థులు పత్రికా విలేఖర్లతో మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్సులు లేని కుర్రకారు పెద్దపెద్ద శబ్దాలతో టేప్ రికార్డర్లలో పాటలు వింటూ ట్రాక్టర్లలో అధిక లోడు తీసుకుని అపరిమితమైన వేగంతో తమ గ్రామం పైనుంచి తిరుగుతున్నారని తెలిపారు. రోజుకు 250కి పైగా ట్రాక్టర్లు తిరుగుతూ భయానక వాతావరణ సృష్టిస్తున్నాయన్నారు. వీటితో ఎప్పటికైనా తమ గ్రామంలోని పిల్లలకు, వృద్ధులకు ప్రాణహాని ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇసుకను ఉచితంగా అందిస్తుందని ఒక రీచ్‌ను నిలిపి వేయడంవల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం రాదని అవసరమైతే జిల్లాకలెక్టర్ కార్యాలయం ముందు దీక్షకు కూర్చుంటామని వారు తెలిపారు. ఈసమావేశంలో కోవూరు జెడ్పీటిసి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, కోవూరు ఎస్సై అళహరి వెంకటరావు, డిప్యూటి తహశీల్దార్ డానియేలు పీటరు, శ్యామలమ్మ, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, అనూరాధ, సీనియర్ సహాయకులు జమీర్, ప్రసన్న, విఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
మా కడుపు కొట్టకండి సారూ..
జమ్మిపాలెం గ్రామస్థులు బయట గ్రామాల నుంచి జనాలను తీసుకునివచ్చి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు చేపట్టి అకారణంగా తమ కడుపుకొడుతున్నారని ఇసుక తవ్వే కూలీలు వాపోయారు. ఇసుక రీచ్‌ల తవ్వకాలు ఆపివేస్తే తామంతా ఎలా బతకాలని, సంవత్సరాలుగా ఇసుకరీచ్‌ల్లో ఇసుక తవ్వి జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు తమ జీవనాధారాన్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు వాపోయారు.

డెల్టాకు మోదం.. మెట్టకు ఖేదం
* ఒకరోజు వర్షంతో తొలి పంటకు మేలు
* బంగాళాఖాతంలో మరో వాయుగుండం

నెల్లూరు, డిసెంబర్ 2: జిల్లాలో నాడా తుఫాన్ ప్రభావంతో గురువారంనాడు కురిసిన వర్షంతో జిల్లాలో తొలి పంట సాగు చేపట్టిన రైతులకు ఎంతో మేలు చేకూరింది. తీవ్ర నీటి ఎద్దడిలోనే తొలి పంటను చేపట్టిన రైతులు నవంబర్ నెలలో జిల్లాలో తరచూ వచ్చే తుఫాన్ల ప్రభావంపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే నవంబర్ నెల మొత్తం చిన్న చినుకు కూడా కురవకుండానే గడచిపోవడంతో భారం భగవంతుడిపై వేసిన అన్నదాతను డిసెంబర్ ఆదుకుంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ నాడా తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. కేవలం ఒక్కరోజు మాత్రమే వర్షం కురిసినప్పటికీ సరాసరి 30 సెంమీ మేర వర్షపాతం నమోదు కావడంతో డెల్టాతో పాటు పలు ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆనందంతో ఉన్నారు. అత్యధికంగా గూడూరులో 91.8 మిమీ వర్షపాతం నమోదు కాగా వరికుంటపాడు మండలంలో ఎటువంటి వర్షపాతం నమోదు కాకపోవడం గమనార్హం. గూడూరు డివిజన్ పరిధిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. వరికుంటపాడు, కొండాపురం, ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వింజమూరు, ఎఎస్ పేట వంటి మెట్ట ప్రాంత మండలాల్లో వర్షం తక్కువగా కురిసింది. కేవలం వర్షం ఆధారంగా సాగుకు ఉపక్రమించే పైమండలాల్లో ఈ వర్షం కాస్త ఆశలను రేపిందనే చెప్పాలి. ఇక గూడూరు డివిజన్ విషయానికొస్తే కండలేరు కింద తొలిపంటకు జిల్లా యంత్రాంగం అవకాశం ఇవ్వకపోవడంతో నిరుత్సాహంతో ఉన్న ఈ ప్రాంతవాసులు తాగునీటి అవసరాలకైనా నీటిని విడుదల చేయాలని గత ఐఏబి సమావేశంలో ఇక్కడి ప్రజాప్రతినిధుల ద్వారా ప్రస్తావించుకున్నారు. అయితే ప్రస్తుతం కురిసిన వర్షంతో చెరువుల్లో కొద్దిపాటి నీరు చేరడంతో కనీసం పశువులకు తాగునీరు అందే అవకాశం ఉంది. ఇదే క్రమంలో డెల్టా పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, నెల్లూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా ఒకరోజు పాటు కురిసిన వాన పుణ్యమాని తొలి పంటకు నీటి విడుదలను కొన్ని రోజులపాటు అధికారులు వాయిదా వేసుకోవచ్చనే ధీమాతో ఉన్నారు. ప్రస్తుత వర్షం వల్ల నార్లకు నీరు సరిపోతుందని, కొద్ది రోజుల తర్వాత నీటిని విడుదల చేయవచ్చనే ఆలోచనలో జల వనరుల శాఖ అధికారులు ఉన్నారు. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిందనే వార్తల నేపథ్యంలో జిల్లాలోని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడ్డ ఈ వాయుగుండం తుపాన్‌గా మారే అవకాశం ఉందని, దీని ప్రభావం కోస్తాంధ్రపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయనే ఆశతో జిల్లా వాసులు, ముఖ్యంగా మెట్టప్రాంత రైతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

నగదు సమస్య అధిగమించేందుకు చర్యలు
జిల్లాలోని బ్యాంక్‌లకు 160 కోట్ల నగదు రాక
నేటి నుండి టోల్ రుసుం వసూలు
పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ వెల్లడి
నెల్లూరు కలెక్టరేట్, డిసెంబర్ 2: నగదు సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం 160 కోట్ల నగదును జిల్లాకు అందజేసినట్లు కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం ఆయన వివిధ అంశాలకు సంబంధించి పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ బ్యాంక్‌లలో 2310 కోట్ల పాత నోట్ల ధరావతులు జరిగాయన్నారు. శుక్రవారం అర్థరాత్రి నుండి టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుం వసూలు చేస్తారని, ఇందుకోసం ఇ-పాస్ (స్వైపింగ్) యంత్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిల్లర సమస్యను అధిగమించడానికి వివిధ ఆలయాల నుండి చిల్లర సేకరించి టోల్‌ప్లాజాలకు పంపించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. వాహన, టోల్‌ప్లాజా యాజమాన్యాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. నగదు సమస్యలు అధిగమించేందుకు నగదురహిత లావాదేవీలు నిర్వహించుకోవాలన్నారు. జిల్లాలోని 46 మండలాలలో నగదురహిత లావాదేవీలు నిర్వహించేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారన్నారు. నగదురహిత లావాదేవీలు నిర్వహించిన గ్రామాలకు ప్రత్యేక ఇనె్సంటివ్‌లు అందజేస్తామన్నారు. నగదురహిత లావాదేవీలు నిర్వహించేందుకు విద్యార్థులకు అధికారులతో శిక్షణ ఏర్పాట్లు చేశామన్నారు. మొబైల్ ఖాతాలు, లావాదేవీలు నిర్వహించేందుకు యువతకు శిక్షణ అందజేయనున్నామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు రోజుకు 70 లక్షల నగదు అందజేస్తున్నామన్నారు. ఇందుకోసం రాష్టవ్య్రాప్తంగా 23 కోట్లు పంపిణీ చేయగా, జిల్లాలో 30 శాతం లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశామన్నారు.
తుఫాన్ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ తుపాన్ హెచ్చరిక చేసిన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో జెసి ఎ మహ్మద్ ఇంతియాజ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నిత్యావసరాలు పంపిణీ రుణంతో అందజేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 698 కోట్ల రూపాయల నూతన కరెన్సీ పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని 35 మండలాల్లో వర్షపాతం నమోదవటంతో రైతు సాగునీటి పరిస్థితులు మెరుగయ్యాయన్నారు. ఈ వర్షంతో రైతులకు మేలు చేకూరుతుందని బ్యాంక్‌లు రైతులకు రీషెడ్యూల్, తాజా రుణాలు అందజేయాలన్నారు.

నగదు కోసం ప్రజల ఆందోళన
మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు కలెక్టరేట్, డిసెంబర్ 2: బ్యాంక్‌లో నగదు లేదనడంతో గంటలకొద్దీ నగదు కోసం వేచి ప్రజలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని వేదాయపాళెం ఎస్‌బిఐ శాఖ వద్ద నగదు కోసం వచ్చిన ఖాతాదారులు, వినియోగదారులు నగదు కోసం వేచి ఉన్నారు. బ్యాంక్ అధికారులు నగదు లేదని చెప్పటంతో ఆగ్రహంతో ఆందోళనకు ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దతు ప్రకటించి ఆందోళనకారులతో కలిసి నిరసన వ్యక్తం చేయటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బ్యాంక్ అధికారులు పరిస్థితులు వివరించి మూడు రోజుల్లో నగదు సర్దుబాటు చేస్తామని హామీనివ్వటంతో ఆందోళనను విరమించారు.
బ్యాంకర్లపై చిందులు వేయడం తగదు
నగదు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవటం మాని చంద్రబాబు బ్యాంకర్లపై చిందులు వేయటం తగదని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ఆక్షేపించారు. జిల్లా కేంద్రంలోని భారతీయ స్టేట్‌బ్యాంక్ వద్ద శుక్రవారం నగదు కోసం బ్యాంక్ వినియోగ, ఖాతాదారులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అవసరాల మేర నగదు తీసుకురావటం మాని బ్యాంకర్లపై ఆగ్రహం వెళ్లగక్కటం చంద్రబాబుకే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆయన తన పలుకుబడిని ఉపయోగించి ప్రజల అవసరాల మేర నగదు తేవాలని, లేదంటే పాత నోట్లు మరో మూడు నెలలు వినియోగంలో ఉండేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట బూడిద పురుషోత్తం, రాజేష్, సాయి, సునీల్, హరికుమార్ తదితరులు ఉన్నారు.