S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాత నోట్లు పనికిరావ్!

శ్రీకాకుళం, డిసెంబర్ 2: రద్దయిన 500, 1000 నోట్లును ఉపయోగించడానికి గడువు ముగిసింది. ఇకపై ఆ నోట్లు మార్కెట్‌లో చలామణీకి నోచుకోవు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి రద్దయైన నోట్లు ఉంటే, బయట ఉపయోగించాలనుకుంటే అవి తీసుకోరు! పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు, ఆసుపత్రులకు, ప్రభుత్వ కార్యాలయాలు, తదితర చోట్ల రద్దయైన 500, 1000 నోట్లు ఈ నెల 2వ తేదీ వరకూ ప్రభుత్వం అనుమతించింది. అంటే శుక్రవారం రాత్రి వరకే ఆయా చోట్ల ఆ నోట్లను తీసుకుంటారు. ఆ తర్వాత తీసుకోరు. శుక్రవారం దాటితే, మీ వద్ద ఉన్న రద్దయిన నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేయడమే. బయట మాత్రం వాటిని ఎవరూ తీసుకోరు. డిసెంబరు 30 వరకూ బ్యాంకుల్లో రద్దయిన నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. 500, 1000 నోట్లను ప్రభుత్వం నవంబర్ 8న రద్దు చేసిన విషయం తెలిసిందే. మోదీ ఆ రోజు రాత్రి ప్రకటించి, ఆ మరుసటి రోజు నుంచి వాటిని ఎవరూ తీసుకోవడం లేదు. అయితే, ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోలు బంకులు వంటి చోట తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటి దాకా పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, రేల్వే టిక్కెట్టు కౌంటర్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, ఎయిర్‌పోర్టు, పాల బూత్‌లు, శ్మశానాలు తదితర చోట్ల తీసుకున్నారు. తొలుత పై ప్రాంతాల్లో 72 గంటల పాటు తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దానిని నవంబర్ 24వ తేదీ వరకూ పొడిగించింది. మళ్లీ డిసెంబర్ 2వ తారీఖు వరకూ అదనంగా గ్రేసురోజులు అందించింది. అలాగే, టోల్ ఫీజులు, మెడిసిన్స్ కొనేందుకు, ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్, రైల్వే కేటరింగ్, ఎలక్ట్రిసిటీ, వాటల్ బిల్లులు తదితర చోట్ల రద్దయిన నోట్లను వినియోగించుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. తొలుత 72 గంటలు నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకూ పొడిగించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ సామాన్యులు ఆర్థిక అక్షరాస్యతకు ఇంకా చేరువకాలేదని, పాతనోట్లు వినియోగం మరికొద్దిరోజులు పెంచాలంటూ విజ్ఞప్తులు చేసినా మోదీ సర్కార్ కటాఫ్ టైం శుక్రవారం అర్ధరాత్రిగా వెల్లడించింది.
నేటి నుంచి టోల్ ఫీజులు..
నోట్లరద్దయిన అనంతరం టోల్ ఫీజు వసూలును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి తిరిగి టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు ఆంక్షలు తొలగించింది. అన్ని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై మరల టోల్ ఫీజులు వసూలు ఆరంభించారు. నవంబర్ 8న పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత చిల్లర కష్టాలు తెలుసుకుని టోల్ ఫీజులు తాత్కలికంగా కేంద్రం నిలిపివేసిన విషయం తెలిసిందే. తొలుత నవంబర్ 11 వరకూ టోల్ ఫీజు నిలిపివేశారు. అనంతరం రెండుమూడుసార్లు పొడిగించారు. చివరగా డిసెంబర్ 2వ తేదీ వరకూ పొడిగించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ టోల్ ట్యాక్స్ వసూళ్లు ఆరంభం కానున్నాయి. టోల్‌ప్లాజాల వద్ద 2000 నోట్లుకు చిల్లర సమస్య వస్తుందని భావించిన ప్రభుత్వం తప్పనిసరిగా స్వేపింగ్ మెషీన్లు అందుబాటులోకి తెస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా టోల్ ప్లాజా నిర్వాహకులు మైకులు ద్వారా 2000 నోట్లకు చిల్లర లభ్యంకాదంటూ హెచ్చరికలు కూడా ఆరంభించారు. ఇటువంటి చిల్లర కష్టాలు వాహనదారులకు లేకుండా చేయాలని జిల్లా కలెక్టర్ ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఇబ్బందులు కొంతవరకూ ఉండే అవకాశాలు ఉంటాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో చెప్పినట్టు తెలిసింది. ఎటిఎంల నుంచి ఎక్కువగా 2000 నోట్లు మాత్రమే వస్తున్నాయన్న విషయాన్ని సిఎంకు కలెక్టర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.హెచ్.65 శ్రీకాకుళం - తడ వరకూ గల టోల్ ప్లాజాల్లో చిల్లరి సమస్య తప్పనిసరి అంటూ జిల్లా కలెక్టర్లు భావించడంతో ఆయా టోల్ ప్లాజాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు కోసం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికీ - శుక్రవారం అర్ధరాత్రి నుంచి పాత నోట్లుకు మార్కెట్‌లో విలువ లేనట్టే!!

నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాక
* గిరిజన చట్టాలు, హక్కులు అమలుపై సదస్సు
పాతశ్రీకాకుళం, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవా సాధికారిత చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జస్టిస్ రమేష్ రంగనాథ్ శనివారం జిల్లాకు వస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలాగీతాంబ ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో గిరిజనుల రక్షణ చట్టాలు, అమలుపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొంటారని వివరించారు. సాయంత్రం వరకూ కొనసాగే ఈ సదస్సులో పాల్గొన్న అనంతరం విశాఖపట్నం బయలుదేరి వెళ్తారని తెలిపారు. ఈ సదస్సులో నిష్ణాతులైన నిపుణులు, పరిశోధకులు పాల్గొని గిరిజన చట్టాలు, హక్కులు, అమలు జరుగుతున్న ప్రభుత్వ పథకాలు తదితర విషయాలను వివరిస్తారని చెప్పారు. జాతీయ సేవా సాధికారిత సంస్థ ప్రవేశపెట్టిన పథకాలలో భాగంగా గిరిజన చట్టాల పరిరక్షణ అమలుపై సదస్సు శ్రీకాకుళంలో జరపడం ముదావహమన్నారు. తొమ్మిది గంటలకు సదస్సులో పాల్గొనే వ్యక్తులు నమోదు కార్యక్రమం, 9.30 గంటలకు సదస్సు ప్రారంభం ఉంటుందని చెప్పారు. పది గంటలకు భూ బదిలీ చట్టం (ల్యాండ్ రెగ్యులేషన్ చట్టం, 1959), గిరిజనులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఎల్.శివశంకర్ వివరిస్తారని చెప్పారు. 11.15 గంటలకు జాతీయ సేవాసాధికరిత సంస్థ పథం 2015 కింద గిరిజన హక్కుల పరిరక్షణ, అమలుపై ప్రధానమై శాసన అంశాలపై ట్రైబల్ రిసెర్చ్ సంస్థ మాజీ సంచాలకులు డాక్టరఇ వ.ఎన్.వి.కె.శాస్ర్తీ వివరిస్తారని చెప్పారు. 12.30 గంటలకు ఎ.పీ గిరిజనులు వారి సమస్యలపై ఒడిషా కేంద్రీయ విద్యాలయం సహాయ ఆచార్యులు నెహ్రూ తెలియజేస్తారని, భోజన విరామం తర్వాత 2.15 గంటలకు గిరిజనలు భూ హక్కులపై భూ వ్యవహారాల జాతీయ సంచాలకులు ప్రొఫిసెర్ ఎం.సునీల్‌కుమార్, ఎ.పీ. పంచాయతీ సవరణ చట్టం 1998 ఎ.పీ. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం 2013పై న్యావాది త్రినాధరావు వివరిస్తారని తెలిపారు. సదస్సులో కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహంతోపాటు ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులు, ఉత్తరాంధ్ర జిల్లాల న్యాసేవాసాధికారిత సంస్థల కార్యదర్శులు పాల్గొంటారని వివరించారు.

నేటి నుంచిటోల్ రుసుము
* కలెక్టర్ లక్ష్మీనృసింహం

శ్రీకాకుళం, డిసెంబర్ 2: జిల్లాలో గల టోల్ గేట్ల వద్ద టోల్ రుసుము శుక్రవారం అర్ధరాత్రి నుంచి వసూలు చేస్తారని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి టోల్‌గేట్లు సిబ్బందికి సహకరించాలని కోరారు. టోల్‌గేట్ల వద్ద నగదురహిత విధానం త్వరలో ప్రవేశపెడతామన్నారు.

పోర్టు భూములు పరిశీలించినమత్స్య శాఖ కమిషనర్
గార, నవంబర్ 2: మండలం కళింగపట్నం, తోణంగి రెవెన్యూ ప్రాంతాల్లోని పోర్టు భూములను మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నయల్ శుక్రవారం పరిశీలించారు. ఈ క్రమంలోనే మత్స్యశాఖ ద్వారా రాయితీ ధరపై ప్రభుత్వం అందజేసిన ఫైబర్ తెప్పలను బందరువానిపేటలో ఆయన పరిశీలించారు. ఈయన వెంట సంబంధిత శాఖ జెడి వెంకటేశ్వరరావు, డిడి క్రిష్ణమూర్తి, ఇన్‌చార్జ్ తహశీల్దార్ చక్రవర్తి, ఆర్‌ఐ రామక్రిష్ణ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని, మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

సబ్‌ట్రెజరీ కార్యాలయాలకు మహర్దశ
* 9 భవనాలకు రూ.8కోట్లు మంజూరు
నరసన్నపేట, డిసెంబర్ 2: జిల్లాలో ఉన్న సబ్‌ట్రెజరీ కార్యాలయాలు ప్రస్తుతం కొన్ని శిథిలావస్థకు చేరుకోగా మరికొన్ని కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవోనెం.2167 ప్రకారం 9 సబ్‌ట్రెజరీ కార్యాలయాలకు నూతన భవన నిర్మాణాలకు గాను నిధులు మంజూరు చేసింది. ఈమేరకు మండల కేంద్రంలోని సబ్‌ట్రెజరీ కార్యాలయానికి (మిగతా 2వ పేజీలో) రూ.75లక్షలు నిధులు మంజూరయ్యాయని స్థానిక సబ్‌ట్రెజరీ అధికారి పైడి శంకరరావు తెలిపారు. అలాగే జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, పొందూరు, కొత్తూరు, పలాస, రాజాం, రణస్థలం, కోటబొమ్మాళి కార్యాలయాలకు కూడా నూతన భవనాలు ఒక్కొక్కదానికి రూ.75లక్షల నిధులు మంజరయ్యాయని ఆయన వివరించారు. అయితే నరసన్నపేటలో స్థల సమస్య ఉన్న కారణంగా తహశీల్దార్ కార్యాలయం వద్ద స్థలాన్ని పరిశీలించాల్సిందిగా తహశీల్దార్ జె రామారావును కోరినట్లు ఆయన తెలిపారు.

పర్యావరణాన్ని కాపాడాలి
* కలెక్టర్ లక్ష్మీనృసింహం

శ్రీకాకుళం, డిసెంబర్ 2: పర్యావరణ పరిరక్షణలో భావితరాలదే కీలక పాత్ర అని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. భావితరాలు ముందుకు వచ్చి పర్యావరణం కాపాడటంలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కాలుష్య వ్యతిరేక దినోత్సవంలో భాగంగా రెడ్‌క్రాస్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి శుక్రవారం ఇక్కడ రెడ్‌క్రాస్ సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రస్తుత తరాలు పర్యావరణాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసిందన్నారు. మానవుడు, చెట్లు కలిసి జీవించినప్పుడే మానవునికి మనుగడ ఉంటుందన్నారు. అయితే, మానవుడు తన జనాభాను పెంచుకుంటూనే చెట్ల జనాభాను పూర్తిగా తగ్గిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా పర్యావరణ అసమతౌల్యత వస్తోందన్నారు. జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో చెట్లు ఉండాలన్నారు. చెట్లు అధిక మొత్తంలో ఉండటం వల్ల కాలుష్య కారకాలను పూర్తిగా స్వీకరించి స్వచ్ఛమైన గాలి అందిస్తాయని, దానిని ప్రజలు గ్రహించడం లేదన్నారు. మానవుడు చేసే చర్యల వల్ల కర్భన ఉద్గారాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. తద్వారా భూతాపం పెరుగుతుందని, హిమాలయాలు, ధృవాల వద్ద ఉన్న మంచుగడ్డలు కరిగిపోతున్నాయని చెప్పారు. ఘన స్థితిలో ఉన్న నీరు ద్రవస్థితిలోకి రావడం వల్ల భూమిపై ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాలు నీటిలో కుంగిపోయే స్థితికి చేరుకుంటాయని హెచ్చరించారు. వీటిని నివారించటకు పెద్దఎత్తున అటవీ శాతం పెంచాలని, అనాలోచితంగా చెట్లను నరకరాదని, పర్యావరణ కలుషితం జరిగే పనులు చేపట్టరాదన్నారు. వీటన్నింటి వల్ల వాతావరణం పూర్తిగా కలుషితమై ఆమ్లజనిత వర్షాలు కూడా కరుస్తున్నాయని చెప్పారు. వాహనాలు, కార్మాగారాల వలన వస్తున్న కాలుష్య నియంత్రణకు తగిన విధంగా చర్యలు చేపట్టాలన్నారు. భగవంతుడు అందమైన అద్భుతమైన ప్రకృతిని అందించగా మానవుడు దానిని పూర్తిగా నాశనం చేస్తున్నాడన్నారు ప్రకృతి మాత గుండెకు గాయాలు చేస్తున్నామని అన్నారు. అందుకు ఇప్పటికే అనేక సమస్యలలో కూరుకుపోయామని దీనిపై ఇప్పటికైనా స్పందించకపోతే మరిన్ని తీవ్ర సమస్యలు ఉత్పన్న మవుతాయన్నారు. సేంద్రియ వ్యవసా విధానాలను అవలంభించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్ధులు విజ్ఞాన శాస్త్రాన్ని తమ రోజువారీ జీవనంలో అనుసంధానించి అధ్యయనం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. పుస్తక పఠనం అలవాటు పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందించారు. గార జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొన్నాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీకాకుళం పి.ఎస్.ఎన్.ఎం.పాఠశాల, న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్ధులు బహుమతులు గెలుచుకున్నారు. రెడ్‌క్రాస్ శాంతాకల్యాణ్ అనురాగ నిలయం విద్యార్ధులు సైతం మేము ఎందులోనూ తీసుపోవమని నిరూపిస్తూ బహుమతులు పొందినవారిలో ఉన్నారు. అనంతరం జరిగిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణపై సంధ్యారాణి కళాజాత బృందం ప్రదర్శించిన ప్రదర్శన ఆహుతులను ఆలరించింది. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్‌రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సనపల తిరుపతిరావు, నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి డాక్టర్ దవళ భాస్కరరావు, సెట్‌శ్రీ సీఈవో మూర్తి, బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ప్రసాదరావు, స్వీప్ సంస్థ డైరక్టర్ కె.వి.రమణమూర్తి, రెడ్‌క్రాస్ ప్రతినిధులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

వినియోగదారుల లబ్ధికే అరువు అమ్మకాలు
* జెసి చక్రధరబాబు
పొందూరు, డిసెంబర్ 2: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో నగదుకై సతమతవౌతున్న వినియోగదారులను ఆదుకునేందుకై రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల పాటు చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరకులను అరువు ప్రాతిపదికన అందిస్తామని జెసి చక్రధరబాబు స్పష్టంచేశారు. ఆయన పొందూరు 1టవ రేషన్ డిపోను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. డీలర్లు వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా సరుకులు అందేలా అమ్మకాలు సాగించాలన్నారు. ఏ ఒక్క వినియోగదారుడి నుంచైనా సరుకులకు పైకము తీసుకున్నట్లు ఆరోపణలు వస్తే తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్‌డిపోల వద్ద ధరల, సరుకుల నిల్వ పట్టికలు విధిగా ఉంచాలని సరకులను అరువు ప్రాతిపదికన ఇస్తున్నట్లు ప్రతీ వినియోగదారునికీ అర్థమయ్యేలా బోర్డులు డిపోల వద్ద వేలాడదీయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న ప్రక్రియవలన కలిగే లాభనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ వరప్రసాదరావు, డిటి ప్రసాదరావు, ఆర్‌ఐలు మధుసూధనరావు, ఈశ్వరరావు పాల్గొన్నారు.

క్రీడలను ప్రోత్సహించాలి
* ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 2: క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ఖేలో ఇండియా క్రీడాపోటీల్లో భాగంగా రూరల్ మండలానికి సంబంధించి క్రీడాపోటీలను శుక్రవారం స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికి తీసేందుకే ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి వరకు ఎదగాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులకు నిలయమని క్రీడాస్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ ప్రదర్శించాలన్నారు. గెలుపు ఓటములు సహజమని క్రీడాస్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ ప్రదర్శించాలన్నారు. ఎంపిపి గొండు జగన్నాధరావు మాట్లాడుతూ విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచి మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. 100మీటర్ల పరుగు పందెం విభాగాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగుపురం జెడ్పి ఉన్నత పాఠశాల హెచ్ ఎం జి.చంద్రశేఖర్‌శర్మ, ఎంపిడివో బొడ్డేపల్లి శైలజ, ఇవో ఆర్డి నిశ్చల, చిట్టి నాగభూషణం, డిఎస్‌డివో బి.శ్రీనివాసరావు, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు పి.సుందరరావు, కె.రాజారావు, ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్‌తోపాటు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడలను ప్రారంభించారు.

అనుమానాస్పద స్థితిలో
కంచిలి విఆర్‌ఓ మృతి
ఆమదాలవలస, డిసెంబర్ 2: మండలంలోగల కొల్లివలస పంచాయతీ శ్రీహరిపురం గ్రామంలో అలికాం బత్తిలి రోడ్డు వద్ద శుక్రవారం జిల్లాలోగల కంచిలి మండలం జోగులుకాడ విఆర్‌వో ముకుంధరావు పట్నాయక్(58) అనుమాన స్పందంగా మృతిచెందారు. మృతుడు తన విధులు ముగించుకొని ఇక్కడి రైలు దిగి తమ స్వగ్రామమైన కొత్తూరు మండలం కుంటిభద్ర వెళ్లేందుకు సంసిద్ధతై ఇక్కడ అనుమాన స్పందంగా మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వేస్టేషన్‌కు సుమారు కిలోమీటరు దూరంలో విఆర్‌వో మృతదేహం కనిపించడంతో పలు అనుమానాలకు తావిస్తున్నట్లు ఎస్‌ఐ డి.వాసుదేవరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

క్రీడలతో ఆరోగ్యకరమైన సమాజం
* ఎమ్మెల్యే రమణమూర్తి
సారవకోట, డిసెంబర్ 2: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పగలమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టంచేశారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి ఖేలో ఇండియా క్రీడా పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటమిలు సమానమని క్రీడాకారులు నిరుత్సాహ పడకుండా నిరంతరం క్రీడలను ప్రోత్సహించాలన్నారు. విద్యలో క్రీడలు ఒక భాగమని తెలిపారు. సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు క్రీడాకారులకు మాత్రమే ఉంటాయని క్రీడల ద్వారా మానసిక వికాసంతోపాటు శారీరక ధృడత్వం కూడా కలుగుతుందని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అవిభక్తరాష్ట్రంలో బడ్జెట్‌లో రూ.23కోట్లు మాత్రమే కేటాయించగా 13 జిల్లాలతో ఏర్పాటైన నవ్యాంధ్రప్రదేశ్‌లో క్రీడలకు రూ.250 కోట్లు కేటాయించినట్లు సోదాహరణంగా వివరించారు. స్థానిక పాఠశాల హెచ్‌ఎం అంగూరు గణపతి అధ్యక్షతన ఏర్పాటైన ఈకార్యక్రమంలో ఎంపిడివో లవరాజు, స్థానిక ఎంపిటీసీ కోనా వెంకటేష్, పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు టి.నాగరాజు, సర్పంచ్ ప్రతినిధి డోకి భరణి, మండల టిడిపి అధ్యక్షుడు సాధు కృష్ణారావు, పార్టీ అధికార ప్రతినిధి కత్తిరి వెంకటరమణ, మండల క్రీడల కమిటీ సభ్యుడు సురవరపు తిరుపతిరావు, పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రమణమూర్తి లాంఛనంగా క్రీడలను ప్రారంభించారు.

నగదురహిత లావాదేవీలపై అవగాహన
* ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో నగదురహిత పాలన కొనసాగించాలన్న ఆశయంతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు గాను ప్రత్యేకంగా సదస్సులు ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు. శుక్రవారం మండలంలోని తామరాపల్లి పంచాయతీలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్వకాలంలో వస్తు వినియమ మార్పుడులు ఉండేవని ఆ పద్ధతి ప్రకారమే నేడు నగదు రహిత పాలనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తున్నారని వివరించారు. కేవలం ఆయా ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు ఉంటే సరిపోతుందని రుపే కార్డులు, డెబిట్, ఏటిఎం కార్డుల ద్వారా నగదురహితంగా లావాదేవీలు చేపట్టవచ్చని వివరించారు. మొదటిలో కాస్త ఇబ్బందిగా ఉన్నా తర్వాత కాలంలో ఇది ఎంతో సులువవుతుందని పేర్కొన్నారు. ఎంపిడివో విద్యాసాగర్, తహశీల్దార్ జె.రామారావు, ఏపిఎం గోవిందరాజులు పాల్గొన్నారు.

దేశ అభివృద్ధే బిజెపి లక్ష్యం
* యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 2: అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే బీజేపి లక్ష్యమని యువమోర్చా రాష్ట్ర అద్యక్షుడు ఎన్.విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు. బీజేపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన పండిట్ దీన్‌ధయాల్ ఉపాధ్యాయ జిల్లా స్థాయి ప్రశిక్షణా మహాభియాన్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోడానికి గత ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి కారణాలమన్నారు. ఎన్నో పథకాల ద్వారా సమాజంలో అసమానతలు తొలగిస్తున్నారనేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ పనితీరే నిర్లక్ష్యమన్నారు. జిల్లా బీజేపి ఇంఛార్జ్ పివిఎన్ మాదవ్ పార్టీ చరిత్ర, సిద్ధాంతాలను వివరించారు. యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి బెండి రవికాంత్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, పూడి తిరుపతిరావు, కణితి విశ్వనాధం, కోటగిరి నారాయణరావు, చల్లావెంకటేశ్వరరావు, అట్టాడ రవిబాబ్జీ, సంపతరావు నాగేశ్వరరావు, రెడ్డినారాయణరావు, రెడ్డ్భిగ్యలక్ష్మీ, బత్తుల పవన్‌సాయి, సువ్వారి వెంకటసన్యాసిరావు, శవ్వాన ఉమామహేశ్వరి, సంపతిరావు రమణమూర్తి, కద్దాల ఈశ్వరమ్మ, పాతిన గడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణికులకు లిఫ్ట్‌సౌకర్యం
* డిఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ
ఆమదాలవలస, డిసెంబర్ 2: వృద్ధులు వికలాంగులైన రైల్వే ప్రయాణికులు ప్లాట్‌ఫారానికి సులువుగా వెళ్లేందుకు గాను ఇక్కడి రైల్వే స్టేషన్‌కు ఉన్న ఫుట్ బ్రిడ్జిని ఆనుకొని లిఫ్ట్ నిర్మాణం చేపడుతున్న ఈ.కో డిఆర్ ఎం చంద్రలేఖముఖర్జీ తెలిపారు. శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకే విచ్చేసిన సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ ఇక్కడ నిర్మాణం జరుగుతున్న ఈ పనులను ఈ నెలాఖరు లోగా పూర్తి చేసి వచ్చేనెలలో దీన్ని ప్రారంభిస్తామని డిఆర్‌ఎం పేర్కొన్నారు. ఇక్కడి రైల్వేగేటు సమీపంలో ట్రాక్ కింద నుండి సబ్‌వే నిర్మాణానికి అన్ని అనుమతులు పూర్తి అయ్యాయని అత్యధిక సాంకేతిక టెక్నాలజీతో ఈ పనులను ప్రారంభించి 48గంటల్లో పూర్తి చేస్తామని డిఆర్‌ఎం పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రైల్వేట్రాక్ క్రాస్‌లెవిల్ పాయింట్లు పరిశీలించామని పురాతన రైల్వే వంతెనల వద్ద కొంచెం బలహీనతగా ఉన్నాయని వీటి రాకపోకల్లో స్పీడు తగ్గించి ట్రాక్ మరామ్మతు చర్యలు చేపడతామని డిఆర్‌ఎం పేర్కొన్నారు. శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ ఈ పరిసరాలు మరింత అందంగా తీర్చిదిద్దేందుకే చర్యలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. రైల్వే ప్రయాణికులు వివిధ వాహనాల ద్వారా స్టేషన్‌కు చేరుకోవడానికి అనుకూలంగా ఉండేందుకే కొత్తగా ప్లాట్‌ఫారాలు నిర్మాణం వంటి పనులకు ప్రతిపాదనలు చేస్తున్నామని డిఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ వివరించారు.