కన్నీటి వీలునామా
Published Saturday, 3 December 2016నిజంగా మనం అనుకునేవేవీ
మనవి కాదు
ఆనందాలు ఆనందాలు కాదు
సుఖాలు సుఖాలు కాదు
దుఃఖపు వీచికలను
గుండె పేటికలో దాచుకుని
శ్వాసించే పాకులాటలు
భ్రమల వలయాలు
ఉల్లిపొరలను తొలుచుకుంటూ పోతే
రాలే కన్నీళ్లు
మిగిలే ఆవిరి ధారలు
మెరుపుల్ని పెనవేసుకున్న చినుకుల్లా
క్షణాలు మోసే కన్నీళ్లు
పొగిలిన గుండెను ప్రసవిస్తూ
పొరలిన భావనల్ని మృదుపరుస్తూ
దుఃఖాలు దుఃఖాలు కాదు
సుఖాల మలుపుల్లో అలుపును
తేలికపరిచే నీతి నురగల అలల్లాంటివే...
నిజంగా మనం అనుకునేవేవీ
మనవి కాదు
దుఃఖాలను మోసుకు తిరిగే సుఖాలు
సుఖాల వలయంలో తిరుగాడే వేదనలు
అంతిమంగా ఏవీ మనవి కాదు
వొలికిపోయిన ఆనందాలే మనవి
ఒడ్డున కొట్టుకులాడే చేపల్లాంటి
వేదనలే మనవి
కనుమూసిన కనులలో
కన్రెప్పల నీడల కింద
కొనఊపిరితో కదలాడే
జ్ఞాపకాలే మన అనంతర చిరునామా...
జీవించిన క్షణాలలో
కన్నీటి కలంతో
వ్రాసి ఉంచుకున్న వీలునామా.