S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భౌతిక దృష్టి (కథాసాగరం)

ప్రపంచాన్ని మనం పరిశీలిస్తే అందరూ దైవచింతన వున్నవాళ్లే మనకు కనిపించరు. మనం ఈ సృష్టిలో నాగమని, అనంతశక్తి మనల్ని నడిపిస్తోందని, దానికి మనం అవనతం కావాలని కొంతమందే భావిస్తారు. జీవితంలో జనన మరణాలు దైవ ప్రసాదాలుగానే వాళ్లు స్వీకరిస్తారు.
మరి కొంతమంది ఈ ప్రపంచం వున్నది పరుగు పందెం కోసం అనుకుంటారు. వీలయినంత డబ్బు సంపాదించి సుఖపడాలనుకుంటారు. ఇంకొంతమంది సంపాదించడానికే ఈ ప్రపంచం ఉందని భావిస్తారు. సంపాదిస్తూనే జీవితాన్ని ముగిస్తారు. వాళ్లకు పాపం పుణ్యం వంటి వాటితో నిమిత్తం లేదు.
ఒక వ్యాపారస్థుడు అంతులేనంత ధనం సంపాదించాడు. కాకికి కూడా చేయి విదిలించి ఎరుగడు. అతను బతుకంతా లోభిగానే గడిపాడు. ఏ రోజూ దానధర్మాలు చేసి ఎరుగడు. ఊరంతా అతన్ని ఛీకొట్టేవారు. ఎవరికీ అతని మీద సదభిప్రాయం లేదు.
అతనికి ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారన్న చింత ఎప్పుడూ లేదు. తనకు ఆ రోజు ఎంత ఆదాయం వచ్చింది. తన ఆస్తికి ఆ రోజు ఎంత అదనంగా చేర్చాను అన్నదానిపైనే అతని దృష్టి.
అతనికి నలుగురు కొడుకులు. వాళ్లని కూడా డబ్బు సంపాదించే యంత్రాలుగా తయారుచేశాడు. వాళ్లు తండ్రి పేరు నిలుపుకుంటూ వచ్చారు. వీలయినంత డబ్బు సంపాదించారు.
పశువులు వాళ్లకంటే నయం. ఎందుకంటే అవి సాధు జంతువులు. ఆ పూట గడ్డితో కడుపు నింపుకోవడం ఒక్కటే వాటికి అవసరం.
అట్లా తండ్రీ కొడుకులు తరతరాలకు తరగని ఆస్తిపాస్తులు కూడబెట్టారు. నాస్తికులయినా, ఆస్తికులయినా మరణం తప్పదు కదా!
వ్యాపారస్థుడికి చివరి గడియలు వచ్చాయి. ఒక గదిలో మంచం వేసి అతన్ని మంచం మీద పడుకోబెట్టారు. అతని భార్యకు ఎక్కడో ఏ మూలో దైవభక్తి ఉంది. ఆమె భర్త చివరి గడియల్లో ప్రశాంతంగా కన్నుమూయాలని నారాయణ మంత్రం, పవిత్ర వాక్యాలు చెప్పడానికి పూజారిని ఇంటికి పిలిచింది. సంభావన పెద్ద ఖర్చు అని వ్యాపారస్థుడు మనసులో అనుకున్నాడు. కానీ అతనికి మాటలు రావు. సైగలు మాత్రం చేస్తున్నాడు.
పూజారి, ‘నారాయణ, నారాయణ’ అంటూ నారాయణ మంత్రం పఠిస్తున్నాడు.
మంచం దగ్గర నలుగురు కొడుకులు వౌనంగా నిల్చున్నారు.
వ్యాపారస్థుడు సైగలు చేస్తున్నాడు. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. బలవంతంగా మాటలు కూడదీసుకుంటున్నాడు.
కొడుకులకు సందేహం కలిగింది. తమకు తెలియకుండా తమ తండ్రి ఎక్కడన్నా డబ్బు దాచాడేమో, ఆ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడేమో అన్న ఆతృత వాళ్లకి కలిగింది. నలుగురు కొడుకులూ తండ్రి దగ్గరికి వచ్చి ఏం చెపుతున్నాడా అని విన్నారు.
వ్యాపారస్థుడికి ఎదురుగా కిటికీ ఉంది. ఆ కిటికీలోంచీ బయట ఏముందో కనిపిస్తుంది. వ్యాపారస్థుని కళ్లు కిటికీ గుండా చూస్తున్నాయి.
కొడుకులు ‘నాన్నా! చెప్పు, చెప్పు’ అన్నారు.
వ్యాపారస్థుడు మాటలు కూడదీసుకుని కిటికీ బయటకు చూస్తూ ‘ఎవరిదో దూడ మన గడ్డివాములో గడ్డి మేస్తోంది. దాన్ని తరమండి’ అని చెప్పి కన్నుమూశాడు.
అంటే అతని చివరి శ్వాసలో కూడా ఆశ వుంది. భౌతిక దృష్టి తప్ప మరేమీ లేదు. అటువంటి వాళ్లకు అర్థం, పరమార్థం ధనమొక్కటే. అటువంటి జీవితాలు వ్యర్థం. హీనమయిన జీవితాలంటే అవే.

- సౌభాగ్య, 9848157909