S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బద్దకం తెచ్చిన ముప్పు (సిసింద్రి కథ)

అనగనగా అడవిలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కాకి తన ముగ్గురు పిల్లలతో కలసి నివసించసాగింది. కొంతకాలానికి ఆ మూడు కాకి పిల్లల్లో రెండు కాకులు ఉదయానే్న బయటికి పోయి వేటి ఆహారం అవే సంపాదించుకునేవి. మూడవది మాత్రం ఎగరగలిగినా బయటికి వెళ్లకుండా గూట్లోనే ఉండిపోయేది. పోనీలే చిన్నపిల్ల కదా అని తల్లి కాకి దానికి ఆహారం తెచ్చి ఇచ్చేది. క్రమేణా దానికి బద్దకం ఎక్కువని గ్రహించింది తల్లి కాకి.
దాని బద్దకం పోగొట్టాలని తల్లి కాకి ఎంతో ప్రయత్నించింది. అయినా అది మారలేదు. ఎంతకీ మారని పిల్లకాకిని చూచి విసుగొచ్చిన తల్లికాకి దానికి ఆహారం తెచ్చి ఇవ్వటం మానేసింది. దాంతో పిల్లకాకికి ఆకలి ఎక్కువైంది. ఒకనాడు ఆ దారిన పోతూ ఎవరో బాటసారి ఆ చెట్టు కింద కూర్చుని తన కూడా తెచ్చుకున్న ఆహారపు మూట విప్పుకుని తినసాగాడు. సరిగ్గా అదే సమయానికి అనుకోకుండా పిల్ల కాకి రెట్ట వేసింది. అది తిన్నగా వెళ్లి బాటసారి తినే ఆహారపు మూటలో పడింది. దాంతో అతడు దానిని తినకుండా అక్కడే వదిలేసి తన దారిన తాను వెళ్లిపోయాడు.
ఇదంతా పైనుంచి పిల్ల కాకి గమనిస్తూనే ఉంది. ఎంతసేపు చూసినా అతను తిరిగి రాలేదు. దాంతో తాను రెట్ట వెయ్యటం వల్ల అతను తినకుండా వదిలేసి వెళ్లిపోయాడని పిల్ల కాకికి అర్థం అయ్యింది. మరి కాసేపు చూసి ఆ ఆహారాన్ని పిల్ల కాకి తినేసింది.
అయితే ఇదేదో బాగుందనుకుంది పిల్లకాకి. అప్పట్నించీ ఆ చెట్టు కింద ఎవరు ఆహారం తింటున్నా కావాలని రెట్ట వెయ్యటం, అలా రెట్ట వెయ్యగా బాటసారులు వదిలేసిన ఆహారాన్ని కడుపునిండా తినెయ్యటం చేయసాగింది.
కొంతకాలానికి దీని దుష్ట పన్నాగాన్ని గమనించాయి మిగతా కాకులు. అవి వాళ్ల అమ్మతో చెప్పాయి.
తల్లికాకి పిల్ల కాకిని పిలిచి ఇలా అంది.
‘చూడు..! నీకు రెక్కలున్నవి ఎగరటానికి. ఎగరాలి, ఆహారాన్ని వెతుక్కోవాలి. అంతే తప్ప ఆహారం సంపాదించటం కోసం నువ్వు చేసే ఈ పని చాలా తప్పు. వాళ్లు ఎంతో దూరం నుంచి వస్తారు. మరెంతో దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఆకలేసినప్పుడు తినటానికి కూడా ఆహారాన్ని తెచ్చుకుంటారు. తినేతినే ఆహారంలో రెట్ట వేసి వాళ్లు తినకుండా కాళీ కడుపుతో వెళ్లిపోయేలా చేస్తున్నావు. నువ్విలా చెయ్యటం మంచిది కాదు. పైగా వాళ్లకి మరెక్కడా ఆహారం దొరకక ఆకలితో బాధపడుతూ నిన్ను తిట్టుకుంటారు.. కాబట్టి ఇంకెప్పుడూ ఇలాంటి చెడ్డ పనులు చెయ్యకు’ అని చెప్పింది.
కానీ కాళ్ల దగ్గరికి వస్తున్న ఆహారాన్ని వదులుకోవటానికి పిల్ల కాకి ఇష్టపడలేదు.
‘ఇంక దీన్ని ఆ భగవంతుడే మార్చాలి’ అనుకున్న తల్లి కాకి తన పిల్లల్ని తీసుకుని వేరే చెట్టు మీదకి వెళ్లిపోయింది.
రోజులు గడుస్తున్నాయి. పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదు.
కొంతకాలానికి ఒక మునీశ్వరుడు తన శిష్యులతో కలిసి ఆ దారిన వెళుతూ ఆ చెట్టుకింద కాసేపు విశ్రమించాడు. మిగతా వాళ్లంతా అక్కడికి దూరంగా ఉన్న చెట్ల కింద విశ్రమించారు. కాసేపటికి శిష్యులు నిష్ఠగా ఆహారం తయారుచేసి గురువుగారికని ఆకులో పెట్టి తీసుకుని వచ్చారు.
సరిగ్గా దాన్ని మునీశ్వరుడు తినబోతూండగా పైనుంచి కాకి రెట్ట వచ్చి ఆహారంలో పడింది. దాంతో మునీశ్వరుడికి కోపం వచ్చి తలెత్తి పైకి చూశాడు. అదే సమయంలో కాకి రెట్ట వేసిన ఆనందంలో కొమ్మల మీద గెంతసాగింది.
అది చూచి ‘నా శిష్యులు ఎంతో కష్టపడి తయారుచేసిన ఆహారం ఇది. ఆకలిగా ఉన్న నేను తినబోతుంటే రెట్ట వేసి ఎంగిలి చేసావు. కాబట్టి ఇక నుంచీ నీకు ఎంగిలి కూడు మాత్రమే ఆహారంగా లభించుగాక’ అని శపించాడు.
అక్కడికి దగ్గర్లోని చెట్టు మీదున్న తల్లి కాకి ఇది విని గబగబా కిందకు వెళ్లి మునీశ్వరుడి కాళ్ల మీద పడి మన్నించమని వేడుకుంది.
దాంతో చల్లబడిన మునీశ్వరుడు ‘పిల్లకాకికి బద్దకం ఎక్కువై అది ఎంతమంది బాటసారులను వేధించిందో మేము దివ్య దృష్టితో గ్రహించాము. ఎంతోమంది దీనివల్ల ఆకలితో ఇబ్బందులు పడ్డారో. కాబట్టి నా శాపము అనుభవించక తప్పదు. మీ జాతి యావత్తూ ఎప్పటికీ ఎంగిలి గూడు తిని బ్రతకవలసిందే. కాకపోతే మన్నించమని అడిగావు కాబట్టి మీకొక వరము ఇస్తున్నాను. మానవులు చనిపోయిన తమ పితృదేవతలకు పెట్టే ఆహారం మాత్రం మీరు ముడితేనే వారి ఆత్మకి ముక్తి. ఆ ఒక్క సమయంలో మాత్రమే మానవులు మీకు గౌరవం ఇస్తారు. తాజాగా వండి పెడతారు’ అన్నాడు.
ఇదంతా పైనుంచి వింటున్న పిల్లకాకి తన వల్ల తన వంశానికి తగిలిన శాపానికి చింతించి ఆ రోజు నుండీ కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుని తినటం మొదలుపెట్టింది.

- కనె్నగంటి అనసూయ