S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనిషి జ్ఞాపకమే మధురం

తెరుచుకున్న ఉదయపు గొంతులోంచి
ఓ ఏడుపు శబ్దం
మా ఇంటి ముందరి బూబమ్మ
మరణ వార్తను మోసుకొచ్చింది
నిన్న పలకరింపులతో కదలాడిన ముఖం
వౌనముద్రలోకి వెళ్లిపోయంది
కాలపు రెక్క క్రింద ఒరిగిపోయంది

అయ్యో అంటూనే అందరితోపాటుగా
ఆ ముఖాన్నిచూసి వచ్చాను
ఇకముందు ఎప్పుడూ ఆ ముఖం కనపడదు
ఆ మాటా వినపడదు
ఒక తోటి మనిషి ఉనికి
మాయమవుతున్న సందర్భాన
జ్ఞాపకాల అలలపై ఆలోచన కదిలిపోయంది!

ఆ ఇంటి ముందరి సిమెంటు గద్దెలు
వీధిలోని పేదమ్మలకూ పెద్దక్కలకూ
వెతల ఇంటింటి కతల వొలకబోతలకు వేదికలయ్యేది
ఎవరిల్లు కావాలన్నా
బూబమ్మ తన చేతుల్ని చిరునామాలు చేసేది!
తండ్రి లేని కొడుకును
తన రెక్కలపైనే పక్షిలా మోసుకు వచ్చింది
కొడుక్కు రెక్కలు వచ్చినా
రెప్పలార్పకుండా
కళ్ళు మూసేంతవరకూ
కాపలా కాస్తూనే వుంది
తాళాలేసిన మా ఇండ్లకూ ఆమే కాపలాదారు!

నాలుగేండ్లయనా
బూబమ్మ ముఖాన్ని కళ్లనిండా చూడనే లేదు నేను
మనిషి పోయంతర్వాతనే కదా
వాళ్లను నిజంగా చూస్తాం మనం
మాట ఆగి పోయంతర్వాతనే మాట్లాడుతాం మనం

మన అవసరాల రీత్యానే
సంభాషిస్తాం ఎవ్వరితోనయనా
కులమో మతమో, ఆడో మగో
పేదరికమో, లేమితనమో, కలిమి బలమో
రంగూ రంగం ఏదో ఒకటి
మన చూపు కొలతను నిర్థారిస్తూనే ఉంటుంది

మనిషిని మనిషిగా చూసే
చూపును పోగొట్టుకున్నాం మనం!
మనుషుల్లో మనుషులుగా బ్రతకటం
మానేసాం మనం

ఇప్పుడు
బూబమ్మ లేదు
మాటా, పలకరింపూ లేదు
ఆమెకు స్థలమూ కాలమూ ఏదీ లేదు
ఉన్నదల్లా ఆ మనిషి తాలూకు జ్ఞాపకాలు
జ్ఞాపకాలే కదా నిజంగా
మనిషిని మనిషిగా నిలబెట్టే శాశ్వితాలు

- కె. ఆనందాచారి, 9948787660