ప్రజాదర్బారుకు కొత్తరూపు?
Published Thursday, 14 January 2016దిల్లీ నగరం నడిబొడ్డున పార్లమెంట్ భవనాన్ని చూస్తే
ప్రతి భారతీయుడి మనసు ఉప్పొంగిపోతుంది...
ఠీవిగా, దర్పం ఒలకబోస్తూ పరిఢవిల్లిన ప్రజాస్వామ్య
స్ఫూర్తికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది...
గతానికి గుర్తుగా, వర్తమాన కాలానికి సాక్షిగా నిలిచిన ఈ అత్యుత్తమ పార్లమెంట్ భవనం భవిష్యత్ అవసరాలను తీర్చగలదా? అన్న సంశయం ఇపుడు సరికొత్త చర్చకు తెరలేపింది. ఆధునిక సొబగులు, సౌకర్యాలతో ఇప్పటి అవసరాలకు తగ్గట్టు సరికొత్త పార్లమెంట్ భవనం అవసరమని కొందరు వాదిస్తున్నారు. అసలు ఇప్పుడున్న భవనం రూపురేఖలు, ఘనత, వైశిష్ట్యం, నిర్మాణశైలి తదితర అంశాలు ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి.
* * *
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న భారత్‌లో ఆధునిక దేవాలయం లాంటిది మన పార్లమెంటు భవనం. దీనిని కూల్చి, అదే చోట కొత్తగా అధునాతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఎనిమిది దశాబ్దాలకు పైబడి చట్టసభలకు ఆతిథ్యమిస్తున్న అపురూప కట్టడం ఈ భవనం. భారత రాజ్యాంగ నిర్మాణానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన చారిత్రక సౌధం ఇది. నేటి అవసరాలకు ఇది సరిపోవడం లేదని, అత్యాధునిక సదుపాయాలతో మరో భవంతి కావాలని ఇప్పటికే సభాపతులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరుకుందన్నది మరో వాదన. అందువల్ల కొత్త భవనం కోసం గత యుపిఎ ప్రభుత్వంలోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇపుడు అవి మరింత వేగాన్ని అందుకున్నాయి. నూతన భవన నిర్మాణం పట్ల నాయకులు, నిపుణుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత భవనం అందిస్తున్న సేవలను తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని, పెరిగిన అవసరాలకు తగినట్టు మార్పులు, చేర్పులు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరో వందేళ్లపాటు ‘సంసద్ భవన్’కు తిరుగులేదని ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. పెరిగిన సిబ్బంది కోసం పార్లమెంటు సమీపంలో కొన్ని కార్యాలయాలను నిర్మించుకోవడం మంచిదేమో అని వారు సూచిస్తున్నారు.
స్పీకర్ ఏం ప్రతిపాదించారు?
పార్లమెంటుకు నూతన ప్రాంగణం అవసరాన్ని ప్రస్తావిస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రభుత్వానికి ఇటీవల ఓ నివేదిక పంపించారు. అందులో రెండు కీలక అంశాలున్నాయి. 88 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరుకుందని, ప్రస్తుత అవసరాలకు స్థలం అందుబాటులో లేదన్నది మొదటిది. భవనం పాతదైపోతుండటం, కార్యాలయాలు విస్తరించడం, సిబ్బంది పెరిగిపోవడం, భవనంపై భారం పెరగడం వల్ల ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనేది మరో కారణం.
ఎందుకీ ఆలోచన?
1927లో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. అప్పట్లో సిబ్బంది, భద్రతా బలగాలు, సందర్శకులు, పార్లమెంటరీ కార్యకలాపాలు పరిమితంగా ఉండేవి. రాజ్యాంగంలోని ప్రకరణ -3 ఆర్టికల్ -81 మార్గదర్శకాల ప్రకారం 2026 నాటికి లోక్‌సభ సభ్యులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎంపీల సంఖ్య పెరిగితే అందుకు తగ్గట్టుగా సిబ్బంది, కార్యాలయాల సంఖ్య కూడా పెరగనుంది. నూతన భవనాల నిర్మాణం విషయమై చొరవ చూపాలని స్పీకర్ సుమత్రా మహాజన్ ఇటీవల కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాలు, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడును కోరారు. నూతన భవనం కోసం పార్లమెంటు పరిసరాల్లోని ఓ ప్రదేశాన్ని, రాజ్‌పథ్ మార్గంలోని మరో స్థలాన్ని కూడా చూశారు.
సరిపోదా..?
బ్రిటిష్ కాలంలో ప్రస్తుత మన పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. నేడు సభ్యులు సంఖ్య పెరిగింది, అందుకు అవసరమైన సిబ్బంది కూడా భారీగా పెరిగారు. అవసరాలు మూడు నాలుగు రెట్లు పెరిగాయి, అవన్నీ తీరాలంటే కొత్త భవనం నిర్మించాల్సిందే అంటూ గత ఏడాది ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ కెవి థామస్ అన్నారు. మరో వందేళ్ల అవసరాలకు సరిపడా కొత్త భవనం నిర్మించాలని కూడా ఆయన సూచించారు. మన పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సంఖ్య కలిపి 790 , అంటే బ్రిటిష్ పార్లమెంటు సభ్యుల సంఖ్య కంటే తక్కువే. అయినా ప్రస్తుత భవనం సరిపోవడం లేదు, మనకంటే ఎంతో ముందు పార్లమెంటు భవనాలు నిర్మించుకున్న దేశాలు ఇప్పటికీ వాటితోనే సరిపెట్టుకుంటున్నాయి, అద్భుతంగా సభలను నిర్వహించుకుంటున్నాయి. వందేళ్లు నిండక ముందే భవనానికి వందేళ్లు నిండేలా చేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.
హెర్బర్ట్ బేకర్ ఎవరు?
దిల్లీలోని అద్భుత కట్టడాల్లో పార్లమెంటు భవనం ఒకటి. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని ఇద్దరు ఆర్కిటెక్టులు డిజైన్ చేశారు. వారిలో ఒకరు సర్ ఎడ్విన్ లుటియన్స్, మరొకరు బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెర్బర్ట్ బేకర్. దీనికి 1912-13లో డిజైన్ చేశారు. 1921 ఫిబ్రవరి 12న ఢిల్లీలోని కన్నాట్ ప్యాలస్ రాజు శంకుస్థాపన చేశారు. ఆరేళ్ల నిర్మాణం అనంతరం 1927 జనవరి 18న ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీనిని ప్రారంభించారు. అప్పట్లో దీని నిర్మాణ వ్యయం 83 లక్షలు.
భవనం అర్ధవృత్తం వ్యాసం 570 అడుగులు. అంటే దాదాపు 170.69 మీటర్లు. దీని చుట్టుకొలత దాదాపు మూడోవంతు మైలు దూరం ఉంటుంది. 27 అడుగులు ఎత్తున్న 144 ఇసుకరాయి స్తంభాలు వరండాను శోభాయమానం చేశాయి. 257 గ్రానైట్ స్తంభాలను పై కప్పునకు ఆధారంగా నిర్మించారు. భవనం చుట్టూ 12 గేట్లు ఉన్నాయి. సంసద్ మార్గ్‌లోని గేట్ నెంబర్ 1ను ప్రధాన మార్గంగా వినియోగిస్తున్నారు. భవనంలో ప్రధానమైనది సెంట్రల్ హాల్. దీనిలో మూడు ఛాంబర్లున్నాయి. ఈ మూడింటి మధ్యలోని ఖాళీ స్థలాల్లో చిన్నపాటి తోటలున్నాయి. ఈ మూడు చాంబర్లను కలుపుతూ వృత్తాకారంలో నాలుగు అంతస్తులుగా భవనం నిర్మితమైంది.
మన కార్మికులే నిర్మించిన ఈ భవనంలో ప్రతి గదిలోనూ భారతీయ ఛాయలు నిండి ఉంటాయి. భారతీయ పురాతన కళ ఉట్టిపడేలా జాలీలు, పాలరాతి గోడలు, కిటీకీలు, ఫౌంటేన్లతో, ఆధునిక శాస్ర్తియ ధ్వని ఆలాపనతో గాలి, వెలుతురు పూర్తిగా భవనంలోకి వచ్చేలా నిర్మించారు. భవనం మధ్యలో వృత్తాకారంలో సెంట్రల్ హాల్ ఉంది. ఈ హాల్ నుండి ఒక వైపు లోక్‌సభకు, మరోవైపు రాజ్యసభకు ఇంకోవైపు సెంట్రల్ లైబ్రరీ హాల్‌కు వెళ్లేందుకు మార్గం ఉంది. ఈ మూడు హాల్స్ సమీపంలోనే మంత్రుల కార్యాలయాలు, పార్లమెంటు కమిటీలు, వివిధ కమిటీల చైర్మన్ల కార్యాలయాలు ఉన్నాయి. లోక్‌సభ, రాజ్యసభ సచివాలయం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కూడా అక్కడే పనిచేస్తోంది. నాలుగు అంతస్తుల్లో మొదటి అంతస్తులో మూడు కమిటీ రూములు పార్లమెంటు కమిటీల సమావేశాల కోసం వినియోగిస్తున్నారు. ఒకే అంతస్తులో మూడు ఇతర గదులు రాజ్యసభ, లోక్‌సభ కవరేజీకి వచ్చే మీడియా ప్రతినిధులు వినియోగిస్తున్నారు. సెంట్రల్ హాల్‌లో ఎయిర్ కూలింగ్ సదుపాయం , మిగిలిన గదులన్నింటికి ఎయిర్ కండిషనింగ్ సదుపాయం కల్పించారు. ఒక గది నుండి మరో గదికి వెళ్లేందుకు ఆరు లిఫ్టులు పనిచేస్తున్నాయి. భవంతి గ్రౌండ్ ఫ్లోర్‌లోని కారిడార్ బయటి గోడలపై భారత్ చారిత్రక విశేషాలతోపాటు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలను వివరించే ఫలకాలను అలంకరించారు.
ఇవీ ప్రత్యేకతలు...
పార్లమెంటు హౌస్‌లో భారత్‌కు ప్రతీకగా మిగిలిన 30 మంది మంది రాజులు, రాజకీయ నేతలు,రాజ్యాంగ నిపుణుల విగ్రహాలు, ఫొటోలు ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీ, విశాలమైన ఆహార కేంద్రం, అధునాతన కంప్యూటర్ వ్యవస్థతో పార్లమెంటు భవనం పనిచేస్తోంది. ఈ భవనం జనపథ్ రోడ్డులో రాష్టప్రతి భవన్‌కు చాలాసమీపంలో ఉంది.
సెంట్రల్‌హాల్ స్పెషాలిటీ...
పార్లమెంటు భవన్‌లో సెంట్రల్ హాల్ చాలా ముఖ్యమైనది. సెంట్రల్ హాల్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన అద్భుతమైన గోపురాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. సెంట్రల్ హాల్ గుమ్మటం 98 అడుగులు. సెంట్రల్ హాల్ చారిత్రక ఘట్టాలకు నెలవు. ఇది అత్యంత ముఖ్యమైన చారిత్రక ప్రదేశం. 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఈ హాలులోనే మన చేతుల్లో పెట్టింది. మన రాజ్యాంగాన్ని కూడా సెంట్రల్ హాల్‌లోనే తయారుచేశారు. స్వాతంత్య్రానికి పూర్వం సెంట్రల్ హాల్‌ను లైబ్రరీగా వినియోగించేవారు. రాజ్యాంగ సభ హాలుగా తర్వాత దీనిని మార్చారు. అక్కడే 1946 డిసెంబర్ 9 నుండి రాజ్యాంగ సభ సమావేశాలు జరిగేవి. ప్రస్తుతం సెంట్రల్ హాల్‌ను ఉభయ సభల సంయుక్త సమావేశాల కోసం వినియోగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు జరిగాక కొత్త ప్రభుత్వం రాగానే ఉభయ సభలను ఉద్దేశించి రాష్టప్రతి ప్రసంగం ఈ హాలులోనే జరుగుతోంది. ఆస్వాల్డు బిర్లీ చిత్రించిన మహాత్మాగాంధీ ఫోటో సెంట్రల్ హాల్‌లో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది. అవిభక్త భారతదేశంలోని 12 ప్రావిన్సులకు సంబంధించిన 12 చిత్రరాజాలు అక్కడ మనకు దర్శనం ఇస్తాయి. సెంట్రల్ హాల్‌లో ఆరు లాబీలున్నాయి. ఒకటి మహిళల కోసం, ఒకటి ప్రథమ చికిత్స కోసం, లోక్‌సభ ప్యానల్ చైర్మన్ల కోసం ఒకటి, మరొకటి కంప్యూటర్ల సంబంధమైన వివరణ కోసం ఏర్పాటు చేశారు. 4800 అడుగుల విస్తీర్ణంలో అర్ధ వృత్తాకారంలో లోక్‌సభ స్పీకర్ ఛాంబర్ ఉంటుంది. సభ్యుల కోసం ఆరు బ్లాక్‌లు 11 వరుసల్లో సీట్లు ఏర్పాటు చేశారు.
ఎందుకోసం..?
భారత ఫెడరల్ ప్రభుత్వ అత్యున్నత విధాన అంగం భారత పార్లమెంటు , ఇందులో రెండు సభలు పనిచేస్తున్నాయి. ఒకటి లోక్‌సభ, రెండోది రాజ్యసభ. ఇది భారత రాజధాని దిల్లీలోని సంసద్‌మార్గ్‌లో ఉంది. లోక్‌సభకు ప్రజాసభ లేదా దిగువ సభ అని వ్యవహరిస్తారు. ప్రస్తుత లోక్‌సభలో 545 మందిసభ్యులు ఉన్నారు. 530 మంది రాష్ట్రాల నుండి, 13 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుండి, ఇద్దరు నామినేటెడ్ (ఆంగ్లో ఇండియన్ సభ్యులు) ఉంటారు.
రాజ్యసభను రాజ్యాంగ పరిషత్ అని, ఎగువ సభ అని అంటారు. దీని సభ్యులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజాప్రతినిధులతో ఎన్నిక అవుతారు. రాజ్యసభలో 250 మంది సభ్యులున్నారు. ఈ సభ ఎప్పటికీ రద్దు కాదు, ప్రతి సభ్యుడూ ఆరేళ్ల కాలపరిమితికి ఎన్నిక అవుతారు. ఈ సభలో రెండేళ్లకోమారు మూడో వంతు సభ్యులు ఎన్నిక అవుతారు. హంగేరిలో పురాతన భవనం
భారత్‌లో పార్లమెంటు భవనాన్ని సంసద్ భవన్ అని వ్యవహరించినట్టే హంగేరిలో పార్లమెంటు భవనాన్ని ‘ఒర్సాకాజ్’ అంటారు. హంగేరిలో అతి పెద్దదైన, అతి ఎత్తయిన భవనం ఇదే. హంగేరి దేశం వెయ్యివ పుట్టిన రోజు ఉత్సవాల సందర్భంగా ఈ భవన నిర్మాణం మొదలైంది. హంగేరి పర్యాటక ప్రాంతమైన బుడాపెస్టులో డాన్యూబ్ నదికి సమీపంలో దీనిని 1885లో నిర్మాణం ప్రారంభించి, 1904లో పూర్తి చేశారు. ఇప్పటికీ హంగేరిలో ఈ భవనానికి మించింది లేదు, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది యూరోపియన్ దేశాల్లో అతి పెద్ద పార్లమెంటు భవనం. నగరానికి అత్యంత శోభను తెస్తున్న ఈ భవనాన్ని ఎప్పటికపుడు మరమ్మతులు చేస్తూ నిర్వహణ సక్రమంగా చేయడం వల్ల నేటికీ అందంగా ఉంది.
బ్రిటన్ పార్లమెంటు
బ్రిటన్ పార్లమెంటు భవనాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. 1512లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కొంత మేర ధ్వంసం అయ్యింది. అప్పటి వరకూ ఇది బ్రిటిష్ రాజుల నివాసంగా ఉండేది తర్వాత దీనికి మరమ్మతులు చేపట్టి పార్లమెంటు భవనంగా వినియోగించడం మొదలుపెట్టారు. 1934లో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో పార్లమెంటు భవనం ప్రధాన భవంతులు అన్నీ ధ్వంసం అయ్యాయి. 1840-70 మధ్య మళ్లీ దీనిని పునరుద్ధరించి పార్లమెంటు భవనంగా వినియోగిస్తున్నారు. 1987లో యునెస్కో వారసత్వ కట్టడంగా దీనికి గుర్తింపు కూడా వచ్చింది.
అమెరికా ‘క్యాపిటల్ భవనం’
అమెరికాలో పార్లమెంటు భవనాన్ని క్యాపిటల్ భవనంగా వ్యవహరిస్తారు. దీని నిర్మాణం 1793లో ప్రారంభించి ఏడేళ్లలో పూర్తి చేశారు. జర్మనీ లో పార్లమెంటు భవనాన్ని 1994లో నిర్మించారు. 120 ఏళ్ల చరిత్రలో ఈ భవనం అనేక చేతులు మారింది. 1999 నుండి ఆ భవనంలో జర్మనీ పార్లమెంటు నడుస్తోంది. కెనడాలో పార్లమెంటును సెంటర్ బ్లాక్గా అని వ్యవహరిస్తారు. ఈభవనాన్ని 1912లో ప్రారంభించారు. ఒటావా వేదికగా ఇది అప్పటి నుండి పనిచేస్తోంది. అత్యంత పురాతనమైన భవంతుల్లో ఒకటి నెదర్లాండ్స్ పార్లమెంట్ భవనం. ఇది నేటికీ సురక్షితంగా వినియోగంలో ఉంది. 13వ శతాబ్దంలో నిర్మితమైన ఈభవనం 1584 నుండి డచ్ రిపబ్లిక్ రాజకీయ కేంద్రంగా మారింది. న్యూజిలాండ్ పార్లమెంటు భవనం 1969లో నిర్మితమైంది. రొమేనియా పార్లమెంటు భవనం 1984లో నిర్మితమైంది. ఇవన్నీ తర్వాతకాలంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుని విజయవంతంగా వాటిలో పార్లమెంటు నిర్వహిస్తూ వస్తున్నాయి.
ఇదీ మన సమస్య..
మన దేశంలో ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించినా నాలుగైదేళ్లు దాటేసరికి అవి పాత భవనాల్లా మారిపోవడం మామూలే. దానికి కారణం భవనాల నిర్వహణకు సరిపడా నిధులను కేటాయించకపోవడమే. నిరంతరం పరిశుభ్రంగా ఉంచడం, మొక్కలను పెంచడం, మరుగుదొడ్ల నిర్వహణకు అవసరమయ్యే కనీస నిధులను కూడా ప్రభుత్వపరంగా కేటాయించకపోవడం వల్ల భవనాల మరమ్మతులు జరగక కొద్ది కాలానికే పాతబడిపోతుంటాయి. అదే పరిస్థితి పార్లమెంటు భవన్‌కు కూడా వచ్చింది. ఫలితంగా సీలింగ్‌లు ఊడి పడటం, చెట్లు పడిపోవడం, కొన్ని గదుల్లో పెచ్చులు ఊడిపోవడం వంటి ఘటనలను సిబ్బంది ప్రస్తావిస్తున్నారు. 2009లో అప్పటి పెట్రోలియం శాఖా మంత్రి మురళీదేవర గదిలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఆ సమయంలో ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పే తప్పింది. దానికి కారణం పరిశీలిస్తే ఆ గదికి పైన వంటగ్యాస్ సిలిండర్లు పోగుపడి ఉన్నట్టు గుర్తించారు. దీంతో అప్పటి నుండి పార్లమెంటు భవన్‌లో వంట చేయడాన్ని నిషేధించారు. 2012లో ఒక డ్రెయిన్ నుండి గ్యాస్ వాసన రావడంతో అప్పుడు కూడా ఉలిక్కి పడ్డారు. మరోసారి తీవ్రమైన దుర్గంధం రావడంతో పార్లమెంటు భవనాన్ని మార్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి.
రోజురోజుకూ ప్రాంతీయపార్టీలు పెరిగిపోవడం, చిన్న చిన్న పార్టీల ప్రతినిధులు పార్లమెంటులో అడుగుపెడుతుండటంతో వారందరికీ కార్యాలయాలు ఏర్పాటు చేయడం పెనుభారంగా మారింది. ప్రాచీన వారసత్వ భవనంగా గుర్తింపు ఉండటంతో భవనంలో చేర్పులు, మార్పులు, మరమ్మతులు చేయాలన్నా దానికి పెద్ద ప్రక్రియ ఉండటంతో సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. పాత ఫైళ్ల కోసం, సామగ్రికోసం కొన్ని గదులు ఉపయోగిస్తూనే మరో పక్క మీడియా, క్యాంటీన్లు, ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల సంఖ్యను కూడా 24 నుండి 48 కి పెంచారు. నిర్వహణ సమస్య కాకపోతున్నా, స్థలా భావమే సమస్యగామారిందని సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుత కాంప్లెక్స్‌లోనే కొత్త భవనం నిర్మించి కొన్ని సౌకర్యాలను, సేవలను అందులోకి మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనపై కూడా చర్చ జరుగుతోంది. రాజ్‌పథ్‌కు మరో వైపు అవసరాలకు తగ్గట్టు ఎక్కువగానే స్థలం ఉంది. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని రాజ్‌పథ్ ప్రతిపాదిత కాంప్లెక్స్‌ను అనుసంథానం చేస్తూ భూగర్భ మార్గంలో నిర్మించవచ్చనే సూచనలు కూడా వస్తున్నాయి. రాజ్‌పథ్ మార్గాన్ని ఆనుకుని ఉన్న దిల్లీ పోలీసు భద్రతా కార్యాలయం ఉన్న ప్రాంతాలోనైనా కొత్త భవనాన్ని నిర్మించాలనే ఆలోచన కూడా ఉంది. అలాగే కొత్త భవనం పూర్తిగా ఐసిటి ఆధారంగా కాగితం లేని కార్యాలయంగా పనిచేయాలనేది మరో ఆలోచన. కొత్త భవనానికి స్పీకర్, ప్రభుత్వం ఆమోదించడంతో కొత్త భవనం సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
విమర్శలూ లేకపోలేదు
కొత్త్భవనం నిర్మించాలన్న ప్రతిపాదనను కొంతమంది నేతలు విమర్శిస్తున్నారు. జెడియు అధినేత శరద్ యాదవ్ వంటివారు దీన్ని వ్యతిరేకించారు. పురాతన భవనాన్ని కూల్చి, కొత్తగా నిర్మించాలనుకోవడం విడ్డూరంగా ఉందని వారంటున్నారు. ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని నేలమట్టం చేయకుండా దానికి మెరుగులు దిద్దడం లేదా, కొత్తప్రాంతంలో సరికొత్త భవనాన్ని నిర్మించడం అన్న అంశాలపైనే ఎక్కువమంది మొగ్గచూపుతున్నారు. ఇప్పుడున్న భవనం తాజా అవసరాలను తీర్చలేకపోతే లేకపోవచ్చుగానీ, జనహృదిలో దానికి ఎప్పుడూ శాశ్వతస్థానమే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న చాలాతరాలు చూసినది దీనినే. ఇది అంత తొందరగా మన హృదయాల్లోంచి చెరిగిపోదు.
******************
డిజిటల్ హౌస్ కావాల్సిందే...
ప్రస్తుత పార్లమెంట్ భవనం కళాత్మకంగా ఉంది. గ్రేడ్-1 హెరిటేజ్ భవంతికూడా. కానీ పెరిగిన అవసరాలు, 2026నాటికి పెరగనున్న పార్లమెంట్ సభ్యుల సంఖ్య రీత్యా అత్యాధునిక ఏర్పాట్లు, భద్రతా సౌకర్యాలతో కొత్త పార్లమెంట్ భవనం అవసరం చాలా ఉంది. ఇప్పుడున్న భవనాన్ని కూల్చకుండా విదేశాలనుంచి వచ్చే అతిధులకోసం విడిదిగా ఉపయోగించుకోవచ్చు. పేపర్ అవసరం లేకుండా అంతా హైటెక్ సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించడం తప్పనిసరి. ఇప్పుడున్న భవనంలో చిన్నపాటి మార్పులుకూడా చేయలేని స్థితిలో ఉంది. కొత్త భవంతిని నిర్మిస్తే భారతీయుల సెంటిమెంట్, ఇప్పుడున్న భవనంలో కళాత్మకత ఉట్టిపడేలా ఉండాలి.
-కె.రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎం.పి.
**********************
స్మార్ట్ పార్లమెంట్ అవసరం
ఇప్పుడున్న పార్లమెంట్ భవనాన్ని పూర్తిగా కూల్చాల్సిన అవసరం లేదు. ఎన్నో దేశాల్లో వందల సంవత్సరాలనాటి భవంతులనే ఇప్పటికీ వాడుతున్నారు. మన పార్లమెంట్ భవనానికి ఆధునిక హంగులు, సొబగులు కల్పిస్తే సరిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్మార్ట్ పార్లమెంట్‌కు తగ్గ భవనంగా దీనిని తీర్చిదిద్దాలి.
-గల్లా జయదేవ్,
గుంటూరు ఎంపి
******************
మార్పు మంచిదే కానీ...
ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని మార్చడం అవసరమే అయినా..ఇప్పటికిప్పుడు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంటులోని నార్త్‌బ్లాక్, సౌత్‌బ్లాక్‌లకు ఎంతో పేరుప్రతిష్టలు ఉన్నాయి. ఇది వారసత్వ సంపద. పర్యాటకులకు ఇదో ఆకర్షణ. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొత్త పార్లమెంట్ భవనం అవసరం. కానీ దీనిని కూల్చాల్సిన అవసరం లేదు. సాంకేతిక నిపుణుల అభిప్రాయాలతో సర్వేచేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. కొత్త పార్లమెంట్ కోసం ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ ఆలోచన ఆహ్వానించదగినదే. కానీ ఇప్పుడున్న భవనం మరీ అంత పాడైపోలేదు.
-నిమ్మల కిష్టప్ప, హిందూపురం ఎం.పి
************************
కొత్త్భవనం కావాలి
అత్యాధునిక భద్రత, సంపూర్ణ సౌకర్యాలతో కూడిన ఆధునిక పార్లమెంట్ భవనం అవసరం ఉంది. ఇప్పుడున్న భవనం ఇరుకుగా ఉంది. అప్పటి అవసరాలకు అనుగుణంగా దీనిని నిర్మించారు. మరో పదేళ్లలో సభ్యుల సంఖ్య భారీగా పెరగబోతోంది. దానికి తగ్గట్లు, అద్భుతమైన భద్రతా వ్యవస్థ, సాంకేతిక వ్యవస్థతోకూడిన భవనం అవసరం ఉంది. ఇది పార్టీలతో సంబంధం లేని వ్యవహారం. దేశ ప్రతిష్ఠకు సంకేతం.
-గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ ఎం.పి.
********************************
ఈ భవనం సరిపోవడం లేదు
ఇప్పుడున్న పార్లమెంట్ భవనం చాలా ఇరుకు గా ఉంది. ఇప్పటి అవస
రాలకే సరిపోవడం లేదు. మున్ముందు అసలు సరిపోదు. ప్రస్తుత సీటింగ్ అరేంజ్‌మెంట్‌కూడా సౌకర్యవంతంగా లేదు. భద్రత దృష్ట్యాకూడా ఈ భవనం అనుకూలంగా లేదు. దీనిని ఒక జ్ఞాపకచిహ్నంగా తీర్చిదిద్ది, కొత్త సాంకేతికతతో నూతన పార్లమెంట్ భవనం అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ నిర్మాణం భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉండాలి.
-కె.హరిబాబు,
విశాఖ ఎం.పి.
****************************
కూల్చాల్సిన అవసరం లేదు
ఇప్పుడున్న పార్లమెంట్ భవనాన్ని కూల్చాల్సిన అవసరం లేదు. దీనినే మెరుగులు దిద్దాలి. ఆ అధికారంకూడా ఎవరికీ లేదు.
-మధు యాష్కి,
నిజామాబాద్ మాజీ ఎంపి
**************************
ఆ దాడితో అప్రమత్తం
భారత పార్లమెంట్ భవనంపై 2001 డిసెంబర్ 13న తీవ్రవాదులు చేసిన దాడి అక్కడి భద్రతావైఫల్యాలను వెలుగులోకి తెచ్చింది. వందమంది సభ్యులు సభలో ఉండగా జరిగిన దాడిని భద్రతాసిబ్బంది తిప్పికొట్టగలిగినా దేశం నిర్ఘాంతపోయింది. అప్పటినుంచి పార్లమెంట్ భవనం భద్రత, సౌకర్యాలపై చర్చ మొదలైంది. కొత్త్భవనం అవసరాలను ఆ సంఘటన గుర్తుచేసింది. ఆ దాడిలో ఐదుగురు తీవ్రవాదులు, ఆరుగురు దిల్లీ పోలీసులు, ఆరుగురు పార్లమెంట్ భద్రతాసిబ్బంది మరణించారు. తీవ్రవాదులు ఓ కారులో నేరుగా పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చి కాల్పులు జరపడం అప్పట్లో అందరినీ నిశే్చష్టుల్ని చేసింది.