S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్ బాగాయత్ రైతుల సమస్యలపై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీతో ఎమ్మెల్యే భేటీ

ఉప్పల్, జూన్ 7: ఉప్పల్ బాగాయత్ రైతుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ మీనాను ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ కోరారు. మంగళవారం రైతులతో స్వయంగా కలిసి ఇట్టి భూములకు సీలింగ్ వర్తించదని, సంబంధించిన పత్రాలను అందజేశారు. గతంలో స్వాధీనం చేసుకున్న భూములకు ఎకరానికి వెయ్యి గజాల చొప్పున అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అకస్మాత్తుగా జీవో నెంబర్ 98ని తెరపైకి తెచ్చి 64 ఎకరాల సీలింగ్ భూముల రైతులకు అన్యాయం చేయడం మంచిదికాదని అన్నారు. భూములకు సీలింగ్ వర్తించదని గతంలో జిల్లా అధికారులే ప్రకటించారని గుర్తుచేశారు.

కోదండరామ్‌ను విమర్శించే హక్కు తెరాస మంత్రులకు లేదు

అల్వాల్, జూన్ 7: తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసరు కోదండరామ్‌ను విమర్షించే హక్కు తెరాస ప్రభుత్వానికి, మంత్రులకు లేదని అల్వాల్ జెఎసి కన్వీనర్ పట్లోళ్ల సురేందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం అల్వాల్‌లో జెఎసి ధర్నా చౌక్ ముందు మంత్రుల వాఖ్యాలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. పేద బడుగు వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహవ్యక్తి కోదండరామ్ అని, ఆయనపై అవగాహన లేని నాయకులు, ఉద్యమంతో సంబంధంలేని మంత్రులు.. వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కోదండరామ్‌కు మంత్రులు, ఎంపిలు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

పాలనా యంత్రాంగం వైఫల్యంతో దిగజారిన విద్యాప్రమాణాలు

హైదరాబాద్, జూన్ 7: పాలనా యంత్రాంగం వైఫల్యంలో విద్యాప్రమాణాలు దిగజారాయని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పబ్లిక్ పాఠశాలలుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు గురుపూజా కార్యక్రమం మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. రామయ్య మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించడంతో విద్య వ్యాపారంగా మారిందని అన్నారు. గతంలో ఉపాధ్యాయుడిని దైవంతో సమానమైన గౌరవం ఉండేదని చెప్పారు. ఉపాధ్యాయుల ఎంపికను పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇవ్వడం మంచిదేనని తెలిపారు.

ఉద్యమ నాయకులపై వివక్ష

ఎల్‌బినగర్, జూన్ 7: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన నాయకులు, కార్యకర్తల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రత్యేక రాష్ట్రం సాధించిన అనంతరం స్వరాష్ట్రంలో తాము చేపట్టిన ఉద్యమాలు, ఆందోళనలను గుర్తించి తమకు మంచి భవిష్యత్తును అందిస్తుందని ఎదురుచూస్తున్న ఉద్యమ నేతలకు నిరాశే మిగులుతోంది. మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్‌లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేసిన వందలాదిమంది కార్యకర్తలు ఉండగా వారిని విస్మరించి ఇటీవల జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఉద్యమ ఊసే తెలియని ఓ వ్యాపారవేత్త సతీమణికి పార్టీ టికెట్టు కట్టబెట్టింది.

నిజమైన పేదలకే ఇళ్ల కేటాయింపు

హైదరాబాద్, జూన్ 7: నిజమైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోనున్నట్లు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్‌లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులతో హౌసింగ్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాలో సుమారు 60వేల ఇళ్లు వివిధ నియోజకవర్గాల్లో పేదల కోసం నిర్మించగా దాదాపు 53వేల ఇళ్లు ఇప్పటికే కేటాయించామని మిగిలిన 7వేల ఇళ్ల కేటాయింపులపై చర్యలు తీసుకుంటామన్నారు. సుమారు 2700 ఇళ్లు స్లాబ్‌లవరకు పూర్తి చేసారని, ఇవి పూర్తవడానికి నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు.

తెలంగాణ ద్రోహులు.. మీరా కోదండరామ్‌ను విమర్శించేది?

సికింద్రాబాద్, జూన్ 7: తెరాస పార్టీ పూర్తిగా తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిపోయిందని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ జెఎసి చైర్మెన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్.కోదండరామ్‌ను క్యాబినెట్ మంత్రులు విమర్శించడాన్ని నిరసిస్తూ ఓయులో ఐదుగురు మంత్రుల దిష్టిబొమ్మలను ఊరేగించి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్ మాట్లాడుతూ నిస్వార్థంగా ఉద్యమాన్ని కొనసాగించి ఎలాంటి పదవులు ఆశించని తెలంగాణ గాంధీ కోదండరామ్‌ను తెలంగాణ ద్రోహులు విమర్శిస్తారా? అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఒకే రోజు 25లక్షల మొక్కలు నాటనున్న గ్రేటర్

హైదరాబాద్, జూన్ 7: మహానగరంలో మరింత పచ్ఛదనాన్ని పెంపొందించి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు మహానగర పాలక సంస్థ వచ్చే నెల 11వ తేదీన పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.
గ్రీన్ డేగా పిలుచుకునే ఈ ఒక్కరోజే సుమారు 25లక్షల మొక్కలను నాటి, గిన్నీస్ రికార్డును సాధించనున్నట్లు తెలిపారు. ఐటి కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, శ్మశానవాటికలు, ఖాళీ స్థలాలు, రహదారులతో పాటు ఖాళీగా ఉన్న ప్రతి చోట మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

కోదండరామ్‌పై టిఆర్‌ఎస్ వ్యాఖ్యలకు నిరసన

హైదరాబాద్, జూన్ 7: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన టిజేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై టిఆర్‌ఎస్ మంత్రులు, ఎంపిలు, నాయకులు చేసిన అనుచిత విమర్శలకు నిరసనగా మంగళవారం మల్కాజిగిరి టిజేఏసి ఆధ్వర్యంలో మల్కాజిగిరి చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసిఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ టిజేఏసి కో-ఆర్టినేటర్ రామగిరి ప్రకాష్, మల్కాజిగిరి టిజేఏసి కో-చైర్మన్ నహీమ్‌ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్న ఉద్యమ నాయకులపై టిఆర్‌ఎస్ దళారీ నాయకత్వం దండయాత్రకు దిగితే ఉద్యమ చైతన్యం ఉన్న తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలిపారు.

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

గచ్చిబౌలి, జూన్ 7: గచ్చిబౌలిలో మంగళవారం సాయంత్రం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 15 నిముషాలలోపే మూచు చోట్ల చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు మహిళలకు చెందిన సుమారు 5 తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లారు. విప్రోలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అశ్విని విధులు ముగించుకొని కాలినడకన మెయిన్ రోడ్డుకు వస్తుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి మెడలోని చైన్‌ను లాక్కెళ్లారు. ఒ ఫర్లాంగ్ దూరంలోనే మరో మహిళ కార్వి ఆఫీసు ముందు నుంచి వస్తున్న మరో మహిళ కల్పనాలత మెడలోని గొలుసును లాక్కెళ్లారు. అంతటితోనే ఆగకుండా మళ్లీ గచ్చిబౌలి వైపు వస్తూ మరో మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లారు.

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

హైదరాబాద్, జూన్ 7: మృగశిరకార్తెను పురస్కరించుకుని ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు సర్వం సిద్దమైంది. నేడు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మరుసటి రోజైన బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు సుమారు ఇరవై నాలుగు గంటల పాటు ప్రసాదాన్ని నిరాటంకంగా పంపిణీ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. బత్తిని కటుంబీకులు సుమారు అయిదు లక్షల మందికి అందేలా ప్రసాదం తయారు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే గాక, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా ఈ ప్రసాదం కోసం జనం వచ్చే అవకాశముండటంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ విభాగాలు భారీగా ఏర్పాట్లు చేశారు.

Pages