S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీస్ వ్యాన్ దిగేది లేదు:ముద్రగడ

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టేంత వరకూ తాను పోలీస్ వ్యాన్ దిగేది లేదని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్టువీడక పోవడంతో కిర్లంపూడిలో ఉద్రిక్తత ఏర్పడింది. అమలాపురం నుంచి ఆయనను సిఐడి పోలీసులు కిర్లంపూడికి వ్యాన్‌లో తీసుకుని వచ్చారు. ఇంటి వద్ద ఆయనను విడిచిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నించినా వ్యాన్ దిగేందుకు ముద్రగడ నిరాకరించారు. ఆయన ఇంటికి తాళం వేసి గేటు వద్ద వాహనాలను అడ్డంగా నిలిపారు. దీంతో ఏం చేయాలో తోచక పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు.

తుని ఘటనలో నిందితులపై కఠిన చర్యలు

గుంటూరు: తుని విధ్వంసకాండలో నిందితులందరిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండేందుకే కేసులు పెడుతున్నామని ఎపి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. తుని ఘటనలో నిందితులంతా నేరచరిత్ర ఉన్నవారేనని అన్నారు. రౌడీషీటర్లు, వైకాపాతో సంబంధాలున్నవారు తుని వద్ద విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు కఠిన చర్యలు తీసుకోకుంటే పరిస్థితులు ముందు ముందు అదుపుతప్పుతాయన్నారు. నేరస్థులెవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తగిన సాక్ష్యాధారాలున్నందునే నిందితులను సిఐడి పోలీసులు అరెస్టు చేస్తున్నారని వివరించారు.

మంత్రుల వ్యాఖ్యలపై నిరుద్యోగ జేఏసీ ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై తెరాస మంత్రులు ఇష్టానుసారం మాట్లాడడం తగదని నిరుద్యోగ జెఎసి విమర్శించింది. మంత్రులు ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని జెఎసి డిమాండ్ చేసింది. ఓయులోని ఆర్ట్సు కళాశాల వద్ద నిరుద్యోగ జెఎసి మంగళవారం ఆందోళన చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

భద్రత కోసం రేవంత్ పిటిషన్

హైదరాబాద్: తెలంగాణ సర్కారు నుంచి తనకు ముప్పు ఉన్నందున భద్రత పెంచాలని టి.టిడిపి నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయమై నివేదిక ఇచ్చేందుకు వారం రోజుల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. రేవంత్‌కు భద్రత కల్పించేందుకు ఉన్న అభ్యంతరాలేమిటో తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

మథుర ఘటనపై ‘పిల్’ కొట్టివేత

దిల్లీ: యుపిలోని మథుర వద్ద ఇటీవల జరిగిన హింసాకాండపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీం కోర్టు మంగళవారం త్రోసిపుచ్చింది. అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలోని వెకేషన్ బెంచి న్యాయమూర్తులు విచారణ జరిపారు. ఈ విషయం ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు పరిధిలో ఉన్నందున సిబిఐ విచారణకు తాము ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది. మథుర వద్ద ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలో ఐపిఎస్ అధికారి సహా 29 మంది మరణించిన సంగతి తెలిసిందే.

త్రిపురలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ

అగర్తలా: త్రిపురలో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుదీప్‌ రాయ్‌ బర్మన్‌, ఆశిష్‌ కుమార్‌ సాహా, బిశ్వ బంధుసేన్‌, దిబా చంద్రన్‌ హర్వాంకర్‌లు తమ సంతకాలతో కూడిన రాజీనామా పత్రాన్ని మంగళవారం స్పీకర్‌కు సమర్పించగా, దిలీప్‌ సర్కార్‌, పరంజిత్‌ సింఘ ఎక్కడా కన్పించలేదు.

తుని ఘటనలో నిందితులు కోర్టుకు..

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో అరెస్టు చేసిన అయిదుగురి వివరాలను సిఐడి పోలీసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. వీరిని కాకినాడ కోర్టులో హాజరు పరిచారు. నిందితుల పేర్లు: దూడల మహేంద్ర(అమలాపురం) , కూరాకుల దొరబాబు(పిఠాపురం) , మహేష్‌ (గుంటూరు), పవన్‌కుమార్‌(గుంటూరు) , నక్కా సాయి(తూర్పుగోదావరి).

జలవనరుల శాఖ కార్యదర్శితో హరీష్ భేటీ

దిల్లీ: తెలంగాణ ఇరిగేషన్ శాఖా మంత్రి హరీష్‌రావు మంగళవారం ఇక్కడ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఆయన వెంట తెరాస ఎంపీలు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇరిగేషన్ అధికారులున్నారు. కృష్ణా రివర్ బోర్డు నిర్ణయాలు, తెలంగాణకు నీటి వాటా తదితర విషయాలపై హరీష్ చర్చించారు.

కిర్లంపూడికి ముద్రగడ తరలింపు

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి ఆరుగురిని అమలాపురం పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్‌లో బైఠాయించిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను పోలీసులు కిర్లంపూడికి తరలించారు. కేసులు రైల్వేశాఖ పరిధిలో ఉన్నాయని చెబుతున్న స్థానిక పోలీసులు అరెస్టులు ఎలా చేస్తారని ముద్రగడ స్థానిక డిఎస్పీతో వాదనకు దిగారు. అరెస్టు చేసినవారిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనను కూడా అరెస్టు చేయాలంటూ ఆయన పట్టుబట్టడంతో పోలీసులు ముద్రగడను బలవంతంగా వ్యాన్ ఎక్కించి కిర్లంపూడిలోని ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు.

జెఎసి అంతం తెరాస లక్ష్యం: రేవంత్

హైదరాబాద్: తెలంగాణలో జెఎసిని అంతం చేయడమే తెరాస లక్ష్యంగా కనిపిస్తోందని టిటిడిపి నేత రేవంత్‌రెడ్డి మంగళవారం మీడియాతో చెప్పారు. రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయడంతో తెలంగాణ మంత్రులు చిత్తకార్తె కుక్కల్లా ఆయనపై దాడి చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలు, కరవు వంటి విషయాలపై కోదండరామ్ యాత్రలు చేశాకే కెసిఆర్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు ప్రారంభించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో లేని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి వంటి వారు సైతం కోదండరామ్‌ను విమర్శిస్తున్నారంటే అది కేవలం కెసిఆర్ మెప్పు కోసమేనని రేవంత్ అన్నారు.

Pages