S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌష్టికాహార లోపంతో గర్భిణుల మరణాలు ఉండకూడదు

ఏలూరు, మే 30: జిల్లాలో పౌష్టికాహారం లోపం కారణంగా ఏ గర్భిణీ అయినా మరణిస్తే సంబంధిత ఐసిడిఎస్ సిబ్బందిని బాధ్యులను చేసి ఉద్యోగం నుండి తొలగిస్తానని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం ఐసిడిఎస్ కార్యక్రమాలను అధికారులతో ఆయన సమీక్షించారు. పోలవరం మండలం పెదరాల గ్రామానికి చెందిన అన్నికి బేబి అనే గర్భిణీ మృతి చెందడంపై కలెక్టరు స్పందిస్తూ సంబంధిత అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గర్భిణీ మృతిపై సరైన వివరణ లేకపోవటం, రికార్డుల్లో ఉన్న వివరాలకు, సిబ్బంది చెప్పిన కారణాలకు పొంతనలేకపోవటంతో పోలవరం సిడిపిఓపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆటోను ఢీకొని బోదెలోకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు

ద్వారకాతిరుమల, మే 30: ఒంటిమిట్ట రామాలయానికి వెళుతున్న ఓ టూరిస్టు బస్సు రాష్ట్రీయ రహదారిపై ఆగి ఉన్న ఒక ట్రక్కు ఆటోను ఢీకొట్టి బోదెలోకి దూసుకు వెళ్లింది. దీంతో టూరిస్టు బస్సులో ఉన్న హనుమాన్ దీక్షాధారులు, భక్తులు భయాందోళనలతో హాహాకారాలు చేశారు. మండలంలోని బుట్టాయగూడెం కాలనీ వద్ద సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం..విజయనగరానికి చెందిన ఒక టూరిస్టు బస్సు 70 మంది యాత్రీకులతో ఒంటిమిట్ట రామాలయానికి బయల్దేరి వెళుతోంది.

కాపులను బిసిల్లో చేర్చడం ఖాయం

ఏలూరు, మే 30: రాష్ట్రంలో కాపులను బిసిల్లో చేర్చడం ఖాయమని, దీని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని టిడిపి నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ముద్రగడ పద్మనాభం గ్రహించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2004 ఎన్నికల సమయంలో వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లోని కాపు నాయకులను ఢిల్లీ తీసుకువెళ్లి బిసిల్లో చేరుస్తామని సోనియా గాంధీతో హామీ ఇప్పించినా ఫలితం లేదన్నారు. 1994లో దీనిపై జీవో వచ్చినా ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు.

2 నుండి నవనిర్మాణ దీక్ష

ఏలూరు, మే 30: జిల్లాలో జూన్ 2వ తేదీ నుండి 7వ తేదీవరకు నవ నిర్మాణ దీక్షా కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలుచేయాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ నుండి సోమవారం తహసిల్దార్లు, ఎంపిడిఓలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. జూన్ 2వ తేదీ ఉదయం 7.30గంటలకు ఏలూరులోని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది స్ధానిక పోలీసుపెరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకోవాలని, అక్కడ నుండి ర్యాలీగా ఫైర్‌స్టేషన్ సెంటరులో జరిగే సభకు హాజరుకావాలన్నారు.

4న పొగాకు రైతు సదస్సు

జంగారెడ్డిగూడెం, మే 30: జూన్ 4న స్థానిక పొగాకు వేలం కేంద్రాల ఆవరణలో వర్జీనియా పొగాకు రైతు సదస్సు నిర్వహిస్తున్నట్టు పిసిసి అధికార ప్రతినిధి జెట్టి గురునాధరావు తెలిపారు. సోమవారం స్థానిక పాతబస్టాండువద్ద జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించక తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ పరిస్థితులలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న సదస్సులో పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపి కెవిపి రామచంద్రరావు, మాజీ మంత్రులు పల్లంరాజు, వట్టి వసంతకుమార్ తదితరులు పాల్గొంటారని తెలిపారు

ఆరు కిలోల భారీ పండుకప్ప!

మొగల్తూరు, మే 30: మొగల్తూరు మండలం మోడి గ్రామంలో మనే్న దొరయ్యకు చెందిన పండుకప్పల చేపల చెరువులో సోమవారం చేపల పట్టుబడి జరిగింది. ఈ పట్టుబడిలో ఆరు కేజీల బరువు గల పండుకప్ప చేప పడటంతో రైతులకు ఆశ్చర్యం కల్గించింది. ఈ పండుకప్ప సుమారు 1200 రూపాయలు ఖరీదు వుంటుందని చేపల చెరువు రైతు దొరయ్య స్థానిక విలేఖరులకు తెలిపారు. చుట్టూ చేపల చెరువులు గల రైతులు ఈ పండుకప్పను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

రేపటి నుండి ఆటో మ్యుటేషన్

ఏలూరు, మే 30 : ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందించే దిశగా రెవిన్యూ శాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా జూన్ 1 నుండి ఆటోమ్యూటేషన్ విధానం అమల్లోకి రానున్నట్లు ఏలూరు ఆర్‌డివో తేజ్‌భరత్ చెప్పారు. స్థానిక ఆర్‌డివో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై వినతులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో మ్యూటేషన్ వలన భూక్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే సంబంధిత పేరు మార్పు రెవిన్యూ రికార్డుల్లో ఆన్‌లైన్ ద్వారా మార్పు చెందుతుందన్నారు.

పారదర్శకంగా పనులు

నెల్లూరు, మే 29: జిల్లాలో ఉన్న 5 రవాణా శాఖ కార్యాలయాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పనులు చేపడుతున్నట్లు ఉప రవాణా కమిషనర్ ఎన్.శివరాంప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఈ విలేఖరితో మాట్లాడుతూ కార్యాలయంలో ఏ పని ఉన్నా మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, అవసరమైన సమాచారాన్ని తమ ఉద్యోగుల వద్ద పొందవచ్చని భరోసా ఇచ్చారు. మే నెలాఖరు వరకు చేపట్టిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కార కార్యక్రమంలో మొత్తం 632 దరఖాస్తులకు గాను కేవలం 24 దరఖాస్తులు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, మిగతావన్నీ పరిష్కరించినట్లు తెలిపారు.

రహదారులను శుభ్రపరచే వాహన యంత్రం ప్రారంభం

నెల్లూరు కలెక్టరేట్, మే 30: అభివృద్ధి చెందిన నగరాలకు దీటుగా రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలను సుందరీకరించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ధి, పురపాలక మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని వనంతోటలో సోమవారం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన రోడ్ వాక్యూమ్ స్వీపర్ మిషన్ (రహదారులను శుభ్రపరచే వాహన యంత్రం)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ ఆంధ్ర శుభ్రత నిర్వహణకోసం ఆధునిక యంత్రాలను వినియోగించటం జరుగుతుందన్నారు. పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో నడిచే ఈ వాహనానికి రానున్న మూడేళ్లలో 1.67 కోట్లు వినియోగించనున్నామన్నారు.

ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

వేదాయపాళెం, మే 30: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ముగిసాయి. సోమవారం జరిగిన ప్రథమ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షకు మొత్తం 14,248 మంది విద్యార్ధులకు గాను 13,324 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 924 మంది గైర్హాజరయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 1,632 మంది విద్యార్థులకు గాను 1,505 మంది విద్యార్థులు హాజరుకాగా 127 మంది గైర్హాజరయ్యారు. మాల్‌ప్రాక్టీస్ కేసులు ఎక్కడా నమోదు కాలేదు. మొత్తం 24 పరీక్షా కేంద్రాలను ఆర్‌ఐఓ బాబు జాకబ్‌తోపాటు డిఇసి, హెచ్‌పిసి, డివిఇఓ, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు.

Pages