S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త జిల్లాలను స్వాగతిస్తున్నాం

ఖమ్మం(కల్చరల్), మే 30: పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక రాజ్‌పథ్ ఫంక్షన్‌హాల్‌లో జరుగుతున్న రాజకీయ శిక్షణా తరగతుల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఆదివారం విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 14,15 కొత్త జిల్లాలను ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రకటన చేయాలనుకోవడం సంతోషించదగిన విషయమన్నారు.

మిషన్ కాకతీయ పనులపై మంత్రి తుమ్మల అసంతృప్తి

దమ్మపేట, మే 30: మిషన్ కాకతీయలో భాగంగా మరమ్మతులు చేస్తున్న చెరువు పనులపై రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గుండుగులపల్లిలోని ఆయన స్వగృహంలో సోమవారం అధికారులతో మంత్రి మాట్లాడారు. మిషన్ కాకతీయ రెండవ విడత పనుల్లో నాణ్యత ఏమాత్రం లేదన్నారు. అధికారులు దగ్గరుండి పర్యవేక్షించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు అంగీకరిస్తేనే బిల్లులు చెల్లించాలి తప్ప బిల్లులు మంజూరు చేస్తే సహించేది లేదన్నారు. వర్షాకాలం ముంచుకొస్తున్నా పనులు జరగకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. తొలి విడత చెరువు పనులు బిల్లులు ఎందుకు మంజూరు చేశారని ప్రశ్నించారు.

ప్రజాపాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

ఖమ్మం(ఖిల్లా), మే 30: ప్రజాపాలన అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాల పాలనలో చేయనివి చేసినట్లుగా గొప్పలు చెబుతూ ఆశ, అడియాశల మధ్య అభూత కల్పనలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు పూర్తి అవుతాయో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బిజెపి, టిఆర్‌ఎస్ రహస్య ఎజెండాను ప్రజలకు తెలియజేయాల్సి ఉందన్నారు.

జెబిసిసిఐ నుండి సింగరేణిని తప్పించే ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తాం

కొత్తగూడెం, మే 30: జెబిసిసిఐ పరిధి నుండి సింగరేణిని వేరుచేసే ఆలోచన చేస్తే కార్మికవర్గం నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లారుూస్ యూనియన్ కొత్తగూడెం బ్రాంచి అధ్యక్షుడు జి రాజారావు హెచ్చరించారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సింగరేణిని జెబిసిసిఐ పరిధి నుండి తప్పించే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు ప్రచారం జరుగుతోందని, ఇదే నిజమైతే సింగరేణి కార్మికులకు ఇంతకంటే పెద్ద దుర్వార్తవుండదని అన్నారు.

రామయ్యకు ముత్తంగి సేవ

భద్రాచలం, మే 30: శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ నిర్వహించారు. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి ముత్యాలతో పొదిగిన వస్త్రాలను ధరింప చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామికి కూడా ముత్యాల దుస్తులు ధరింపచేశారు. ఈ సందర్భంగా స్వామికి విష్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన నిర్వహించి బాలభోగం సమర్పించారు. అనంతరం బేలమండపంలో నిత్యకల్యాణం నిర్వహించారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నేడు హనుమజ్జయంతి

పర్ణశాలలో పోటెత్తిన హనుమాన్ భక్తులు

దుమ్ముగూడెం, మే 30: ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాలలో సోమవారం హనుమాన్ భక్తులు పోటెత్తారు. ఈ నెల 31న హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ మాల వేసుకున్న భక్తులు భారీ సంఖ్యలో పర్ణశాలకు వచ్చారు. పర్ణశాలలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. పక్కనే పంచవటి కుటీరం, సీతమ్మ నారచీరల ప్రదేశాలను తిలకించి పులకించారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ సిబ్బంది భక్తులకు పులిహార ప్రసాదాన్ని పంపిణీ చేశారు. గ్రామ పంచాయితీ సర్పంచి వాగే లక్ష్మీదేవి, కార్యదర్శి ఖాదర్‌మీయా శానిటేషన్ పనులు, తాగునీటి సౌకర్యాలను కల్పించారు.

నిత్యవసరాల ధరలను నియంత్రించాలి

ఖమ్మం(జమ్మిబండ), మే 30: రాష్ట్ర ప్రభుత్వం నిత్యవసర ధరలు నియంత్రించడంలో విఫలమైందని, దీనికి తోడు బ్లాక్ మార్కెటర్లతో కుమ్మకై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మహ్మద్ సలాం ఆరోపించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో చామకూరి అధ్యక్షతన జరిగిన ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. పేదవారికి అందించే రేషన్ షాపులలో కూడా సక్రమంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో ఇచ్చే పప్పు్ధన్యాలు, నూనెనో కోతపెట్టిందన్నారు.

కన్నీరు పెట్టిన ఆంజనేయుడు

వైరా, మే 30: స్థానిక బ్రాహ్మణపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్న ఆంజనేయ విగ్రహానికి కన్నీరు కారుతున్న దృశ్యం సోమవారం పట్టణమంతా వ్యాపించింది. గత 3సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా నిర్వహించాలని ఆలయ పూజారి సతీష్‌శర్మ ఆలయ పాలకమండలిలో ఒక సభ్యుడిని అడిగినందుకు ఆయన పూజారిపై గొడవకు దిగడంతో పూజారి గత రెండు రోజులుగా ఆలయం మూసివేయడం జరిగింది. దీంతో దిగివచ్చిన పాలకమండలి సభ్యుడు అందరితో కలసి తిరిగి తన పొరపాటును అందరిముందు ఒప్పుకున్నారు. మళ్లీ పూజారి అందరి సమక్షంలో ఆలయ ద్వారాలు తెరిచారు.

పోడుభూములకు పట్టాలివ్వాలి

కామేపల్లి, మే 30: సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ అనుబంధ అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కామేపల్లిలో ప్రదర్శన అనంతరం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కుపత్రాలందించాలని, ఉపాధిహామీ వేతనం 300పెంచాలని, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు మంజూరు చేయాలని, జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బండి యాదగిరి, రాంసింగ్, రెడ్యానాయక్ పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

ఖమ్మం(ఖిల్లా), మే 30: ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్(న్యూడెమోక్రసి) జిల్లా కార్యదర్శి ఎస్‌కె ముక్తార్‌పాషా డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసి), అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లాలోని 16మండల కేంద్రాలలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పోడు భూములు ప్రభుత్వం లాక్కోవద్దు అంటూ, దళితులకు 3ఎకరాల భూమి వాగ్దానం అమలు చేయాలని సీతారామసాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని అవసరాలకు సాగు నీరు ఇవ్వాలని, రైతులకు విత్తనాలు, ఎరువులు, ఋణాలు సకాలంలో అందించాలని పలు డిమాండ్‌లతో ధర్నా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

Pages